3, మే 2013, శుక్రవారం

పద్య రచన - 330 (చలన చిత్రములు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“చలన చిత్రములు”
(నేటితో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు వంద సంవత్సరములు నిండిన సందర్భంగా..)

13 కామెంట్‌లు:

  1. రంగుల చిత్రము లమరెను
    బంగరు యుగమది మారెను పాటలు వినగా
    సంగీతము "హాల్ టైం హిట్స్"
    హంగుగ మరి లేవు గాద "ఆల్ టైం హిట్సే "

    రిప్లయితొలగించండి
  2. ధరయే నాటకవేది, సంచలన చిత్రాలా పయిన్ జీవులే
    కరమానందము నొందు నందు వివిధాకారమ్ములన్ పాత్రలన్
    చిరకాలమ్ము ధరించు, చాలవనుచున్ సిన్మాలపై మోజుతో
    పరితోషమ్మును గాంచు వెండితెరపై వర్తిల్లు దృశ్యాలతో

    రిప్లయితొలగించండి
  3. వేషములఁ గట్టి జనులకు వేడుకలనుఁ
    జూపుచుండు నటన, నాట్యశోభ తోడ
    నాటకములను గాంచు నాట నేడు
    చలన చిత్రపు రాజ్యము జరుగుచుండె.

    రిప్లయితొలగించండి
  4. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. 3వ పాదములో చిన్న టైపు పొరపాటు వలె నున్నది; గాంచుకి బదులుగా గాంచెడు అంటే గణ భంగము ఉండదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. చలన చిత్రము లనునవి సర్వులకును
    సంతసంబును గలిగించు నెంత యోను
    చూడ గోరిన మంచివి చూసి బాల !
    అనుసరించిన సుఖమును హాయి గలుగు .

    రిప్లయితొలగించండి
  6. మన్నించండి.

    వేషములఁ గట్టి జనులకు వేడుకలనుఁ
    జూపుచుండు నటన, నాట్యశోభ తోడ
    నాటకములను గాంచెడు నాట నేడు
    చలన చిత్రపు రాజ్యము జరుగుచుండె.

    రిప్లయితొలగించండి
  7. ఒకనాడు దేశాన రకరకంబుల మూక
    ..........చిత్రంబు కనువిందు చేసియుండె,
    తదుపరి చూడంగ ముదముతో మాట్లాడు
    ..........బొమ్మ లెన్నెన్నియో పుడమిలోన
    చలనచిత్రంబులై యలరించి ప్రేక్షక
    ..........హృదయంబులను దోచు టది నిజంబు
    మారెడు కాలాన మార్పులు చేర్పులు
    ..........చిత్రనిర్మాణాన చేరుచుండె
    చలనచిత్ర మిపుడు శతవసంతంబుల
    పాటిదయ్యె కనగ భారతాన
    తెలుగు చలనచిత్ర మిలలోన నన్నింట
    శ్రేష్ఠమనుచు పొందె స్థిరయశంబు.

    రఘుపతివెంకయ్య రమ్యంబుగా నాడు
    ..........మూకాభినయమున మొదట ప్రతిన
    భీష్ముతో జేయించె పిదప ప్రహ్లాదుండు
    ..........మాటాడి యలరించె మేటియగుచు
    ఎందరో దర్శకుల్ వందలసంఖ్యలో
    ..........నలుపు తెలుపులుగా మలచినారు
    చక్కని చిత్రాలు సరదాలకేకాక
    ..........విప్లవాత్మకమౌచు వివిధగతుల
    సంఘసంస్కారదృష్టితో జగతి కింత
    బోధ చేసెడు భావంబు పూని సతము
    నిష్ఠ గైకొని నిర్మించి నిలిచినారు
    ధన్యు లవ్వార లెందైన మాన్యు లికను.

    తరువాత కాలాన సరణులు మారంగ
    ..........రంగుల చిత్రాలు రయముతోడ
    వచ్చి నిల్చెను చూడ వర్ణింప తరమౌనె
    ..........వర్తమానములోని వైభవంబు
    రంగురంగులె కాదు రమ్యాతిరమ్యమౌ
    ..........సాంకేతికాఢ్యత సర్వజగతి
    చిత్రసీమను జేరి శ్రీప్రదంబుగ మారి
    ..........సర్వసౌఖ్యంబుల స్థానమయ్యె
    ఇందు గాంచెడు దానినిం కెచ్చటైన
    కాంచవచ్చును లేనిది కాంక్షయుండి
    వెదకినను లేదు సత్యంబు విశ్వమందు
    తెలియు డంచును జగతికి తెలుపు చుండె.

    పుల్లయ్యవర్యుండు పూజ్యుడా నరసింహు
    ..........డటపైని బాబు తా నరయవలయు
    నారాయణార్యుండు నవ్యాంతరంగుండు
    ..........రాఘవయ్యయు జూడ రమ్యగుణుడు
    విశ్వనాథుడు, బాపు విజ్ఞులై వీరంద
    ..........రెన్నియో చిత్రాల నున్నతముగ
    దర్శకాగ్రణులౌచు ధరవారి కందించి
    ..........యశము గాంచినవార లనుపమముగ
    తెలుగుసీమను నిత్యంబు వెలుగులీను
    చిత్రరాజంబు లెన్నియో చెప్ప గలమె
    అకట! యొకదాని మించిన దొకటి యగుచు
    ఖ్యాతి గడియించి యున్నవి క్రమముగాను.

    నాటినుండియు జూడ నటవర్గమందున
    ..........తెలుగుదేశమునందు బలువురు గద!
    ఈలపాటలవాడు, రేలంగి , నాగయ్య
    ..........యాంజనేయార్యుడా యక్కినేని
    నందమూరియు నింక నందాల బరిణయౌ
    ..........అంజలీదేవ్యాదులతివలున్ను
    ఖ్యాతినందినయట్టి ఘనులు తామెందరో
    ..........తారలై వెలుగొందువార లవని
    శతవసంతాలు నిండిన సమయమందు
    ఘంటసాలాది ముఖ్యుల, కవుల, నటుల,
    దర్శకులను, నిర్మాతలన్, ధన్యజనుల
    నిండు మనమున స్మరియించ రండు నేడు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారికి శుభాశీస్సులు. ఏ వస్తువును గైకొనినా మీరొక ఖండికను వ్రాయుచున్నారు. అమోఘము. మీ ప్రతిభకు విజ్ఞాన సంపదకు జోహారులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. చలనము గలిగిన చిత్రమది
    చలియింతురు గాంచి నంత చాప ల్యమునన్
    వల విసరి మభ్య బెట్టగ
    కల చెదిరి యిహము నందు కలవర మొందన్ !

    రిప్లయితొలగించండి
  10. ఆర్యా!
    మీ ఆశీ:పూర్వక అభినందనలకు ధన్యవాదములు. మీవంటి పెద్దల మార్గదర్శనలో ఇటువంటి ప్రయత్నము చేయుటకు సాహసించుచున్నాను. సర్వదా మీనుండి అందుతున్న ఆశీస్సులకు కృతజ్ఞతలు. నమస్కారములు.

    రిప్లయితొలగించండి


  11. 1.
    చలన చిత్రమ్ములకు నేడు శతజయంతి.
    సకల కళల సమాహార సంఘటితము
    చలన చిత్రమ్ములకు సాటి,జగతిలోన
    జనుల కానంద మీయంగ జాలునొక్కొ.

    2.
    సత్యహరిచంద్రుతో భరత చలనచిత్ర
    చరితమారంభమాయెను,మురిపెముగను,
    ' ఆలమార ' తో నారంభ మాయె,బిదప,
    మాటలాడెడు బొమ్మల మాయలాట.

    3.నాటి నుండి నేటి వరకనావరతము
    జనులకు వినోద విజ్ఞాన సాధనమ్ము,
    చలనచిత్రమే ,దానికి సంతతియెగ
    టీ.వి. యను బుల్లితెర కాదె తెలిసి చూడ.

    రిప్లయితొలగించండి
  12. తోలు బొమ్మ లాట కూలె తెలుగు నాట
    చలన చిత్ర బాట తెలుగు పట్ట
    ఆద రించ వలెను నభివృద్ది నందరూ
    వేయ కున్న నవియు వెఱ్ఱి తలలు !

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారు ‘ఈ ప్రపంచమే ఒక నాటకరంగం’ అంటూ చెప్పిన పద్యం మనోహరంగా ఉంది.
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆరంభ వికాసాల గురించి, అందులో మహామహుల గురించి సవివరంగా ఖండకృతి రచించి ఆనందింపజేసారు.
    కమనీయం గారు భారతీయ చిత్ర పరిశ్రమ గురించి వివరిస్తూ ముచ్చటైన మూడు పద్యాలను రచించారు.
    ఇంకా గోలి హనుమచ్ఛాస్త్రి గారు, లక్ష్మీదేవి గారు, సుబ్బారావు గారు, రాజేశ్వరి అక్కయ్య, సహదేవుడు గారు చక్కని పద్యాలు చెప్పు అలరించారు.
    అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి