7, మే 2013, మంగళవారం

దత్తపది - 32 (కంది - పెసర - సెనగ - మినుము)

కవిమిత్రులారా!
కంది - పెసర - సెనగ - మినుము
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
పార్వతీకళ్యాణము గురించి పద్యం వ్రాయండి.

54 కామెంట్‌లు:

  1. శ్రీ శంకరయ్య గారికి శుభాశీస్సులు.

    ఈ పద్యమును చదివి అన్యథా భావించకండి:

    కంది శంకరయ్య గారింటి పేరునే
    మొదటి పదము చేసి మురిసిరౌర!
    శంకరయ్య పెండ్లి సంబరమ్ముల గూర్చి
    చెప్పమనిరి పద్య మొప్పు మీర

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  2. కంది తపము జేసి వధువు గౌరి మిగుల
    నొప్పె సరసిజముఖి; వివాహోత్సవమ్ము
    మెరసె నగశిఖరాగ్రాన; హరుడు వరుడు
    సంబరమ్ములు మినుముట్టె జగము లలర

    రిప్లయితొలగించండి
  3. చూసె నగ తనయ శివుని శిరమునెత్తి
    వేసె విరి దండ తనకంది వేల్పు రాగ
    చూపె సరసిజ లోచనాల్ సోయగమున
    సంబరమ్ములు మినుముట్టె నంబరమున

    రిప్లయితొలగించండి
  4. అటవి దపమున కందిన యాడు బిడ్డ
    పిలుపె సరసము రంజింప ప్రీతి నొంది
    కవిసె నగజాత నప్పుడు శివుడు మెచ్చి
    మిను మురజముల్ మొరయ సగ మేను నిచ్చె

    మురజము= మృదంగము

    రిప్లయితొలగించండి
  5. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. 2 సూచనలు:
    1. 1వ పాదములో యతి మైత్రి కుదరలేదు.
    2. 4వ పాదములో: మినుముట్టె అంటే ఆకాశమును తాకెను అని అర్థము - ఆ తరువాత అంబరమున అని ఉపయోగించుట ఉచితము కాదేమో.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. వేపు కందిపప్పు, బెల్లంబుతో గూడ,
    బూరి పెసర, మినుము గారెలమర,
    వాయనంబులయ్యె హాయిగా సెనగలు-
    పార్వతీ లతాంగి పరిణయమున!!

    రిప్లయితొలగించండి
  7. చి. దిలీప్ (రాంభట్ల అవధాని) పార్వతీ పరిణయ విధానమును వాయనముతోనే సరిపెట్టెను కదా. ఇంకా బ్రహ్మచారి కాబట్టి వివాహము గురించి అవగాహన ఉండదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
    మీ సూచనలననుసరించి సవరణలతో...

    చూసె నగ తనయ శివుని వేసె దండ
    వేడ్క మీరగ తనకంది వేల్పు రాగ
    చూపె సరసిజ లోచనాల్ సోయగమున
    సంబరమ్ములు మినుముట్టె సాంబు జతగ .

    రిప్లయితొలగించండి
  9. అవధానిగారు ఓ ప్రక్కన కనులకు పార్వతీ కల్యాణం చూపిస్తూ జిహ్వకు మంచి రుచులు కూడా చూపించారు.

    రిప్లయితొలగించండి
  10. కాంత ముఖమది సిగ్గున కందియుండ
    నందరాపె సరణులకు నబ్బురపడ
    శివుడు ముడివేసె నగజాత శిరసువంచె
    వరుస మినుముట్టె జయజయ ధ్వానమపుడు.

    గిరిజ పెండ్లి నాడు ధరణీధరుండంత
    కంది పెసర సెనగ లందముగను
    మినుములాదు లింక మేలైన పప్పులన్
    వంటలందు గూర్చె వైభవముగ.

    రిప్లయితొలగించండి
  11. ఈశునకు పూలు చేతికందించువేళ
    పూసె నగజకు మోమెల్ల మోహమొప్ప!
    చూపె సరసపు పథమును జూపె; ప్రమధ
    జన గణంబులు మినుముట్ట జయము పలికె!!



    రిప్లయితొలగించండి
  12. మొదటి వ్యాఖ్యలోనె ముచ్చటగా చమ
    త్కార మొలికి ముదముఁ గలుఁగఁజేసి
    నేర్పుఁ జూపినట్టి నేమాని వారికి
    వందనశతమ్ము లందఁజేతు.

    రిప్లయితొలగించండి
  13. సిగ్గుతో కందిన చెలి బుగ్గలను జూచి
    ...................చిరునవ్వు చిందించె శివుని మోము!
    ఈశుని నవ్వులింపెసరగ తనపైన
    ..................తిలకించి పులకించె లలన గిరిజ!
    సన్నముత్తియపు సేసల దీసె నగజాత
    ..................తలవంచె శంభుడు నెలత ముందు!
    మినుముట్టె మంగళ ధ్వనులు తాళిని గట్ట
    .................సర్వ మంగళ మెడన్ శర్వు డపుడు!

    తల్లిదండ్రుల పెళ్లి సంతతి ఘటించి
    తనువులెల్లను కన్నులై తరచి చూచె!
    శుభ శకునములు పొడసూపె సురుల కంత!
    తారకుని రాతి గుండెలో దడ జనించె!

    రిప్లయితొలగించండి
  14. ఈనాటి దత్తపదికి ఇంత వేగంగా ఇన్ని మనోహరమైన పద్యాలను మిత్రులు అందిస్తారని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ దత్తపది చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నేమాని వారి సూచనతో సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    దత్త పదాలను స్వార్థంలోను, పరార్థంలోను ప్రయోగిస్తూ చెప్పిన మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీరు కూడా స్వార్థంలో, పరార్థంలో దత్త పదాలను వినియోగించి రెండు పద్యాలు చెప్పారు. బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ మిస్సన్న గారూ!
    శుభాశీస్సులు. చాలా మంచి సీసములో వర్ణించేరు చక్కగా. అభినందనలు. సురులు అనుట సాధువు కాదు; సురలు అనాలి దేవతలను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. నేమాని పండితార్యా! ధన్యవాదములు.
    పొరబాటును సరిదిద్దుకొంటాను.

    రిప్లయితొలగించండి
  18. గిరిజ పెండ్లి నాడు ధరణీశు యింటన
    కంది పెసర మొదలు గాగ మఱియు
    సెనగ మినుము తోడ చేసి న వేడివి
    పలు రకముల పిండి వంట లమరె .


    రిప్లయితొలగించండి
  19. vsnmhari గారూ వర్ణన చాలా బాగుంది.

    కాంత ముఖమది సిగ్గున కందియుండ

    శివుడు ముడివేసె నగజాత శిరసువంచె
    వరుస మినుముట్టె జయజయ ధ్వానమపుడు.

    రిప్లయితొలగించండి
  20. పండితనేమాని వారి చమత్కారము భలే అనిపించింది
    మిస్సన్న గారి పద్యము మనోహరంగా ఉంది.

    కందిన చెక్కిళుల్ గలిగి గౌరి మనోహరిగా చెలంగ నా
    యందము గాంచి యింపెసర నా హరు మానసమూగె డోల, కన్
    విందుగ పెండ్లి జేసె నగపెన్మిటి ; పల్కిరి దేవతల్ "భళా!
    ముందెటు గానలేదు, మిను ముంగట నైనను నిట్టి వేడుకల్."

    రిప్లయితొలగించండి
  21. నగజాత శిరసు వంచిందని హరి గారు,
    శంభుడు శిరసువంచాడని మిస్సన్న గారు వర్ణించారు.
    వీరిద్దరూ పెళ్ళికూతురి, పెళ్ళికొడుకు తరఫున మాట్లాడినట్టు ఉన్నది. బాగున్నది.

    రిప్లయితొలగించండి
  22. సెనగ కంది పెసర మినుముల కెంతటి
    భాగ్యమో చెలగె భవాని పెండ్లి
    యందు కవులు శంకరాభరణమ్ములో
    మంచి పదములిడి స్తుతించిరికద

    రిప్లయితొలగించండి
  23. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీరు ఉత్పలమాలను సమర్పించుకొన్నారు. సంతోషము. "నగపెన్మిటి" అనే సమాసమునకు బదులుగా నగ నేతయు అంటే బాగుంటుంది. యతి కూడా సరిపోతుంది(ముందు పాదము చివరలో న్ ఉన్నది కదా). స్వస్తి

    రిప్లయితొలగించండి
  24. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి నమస్కృతులతో,

    కనుఁబాటొంది నభశ్చరావళులు మ్రొక్కం దివ్యగంధర్వగా
    యనగీతీనటనంబు లొప్పె; సరవిన్ యాదోధినాథుండు చే
    తనసమ్మోహనరీతి మ్రోసె; నగకోదండుండు కాత్యాయనిన్
    మనువాడెన్ దివిజర్షు లెల్ల మినుమున్వాఁకన్ దరింపన్ సవిన్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  25. డా. ఏల్చూరి మురళీధర రావు గారికి శుభాశీస్సులు.

    జనసంస్త్యుత్యము భద్రలక్షణ ప్రశస్తంబైన మత్తేభమున్
    బొనరించెన్ నయమొప్ప కానుకగ సంపూజించి గౌరీశులన్
    ఘను డేల్చూరి కులోద్వహుండు గిరిజా కళ్యాణ పర్వంబునన్
    వినుతింతున్ మనసార తత్ ప్రతిభ దీవింతున్ కవిశ్రేష్ఠునిన్

    రిప్లయితొలగించండి
  26. అయ్యా, మీరు చెప్పిన సవరణ ఎంతోబాగున్నది. నేను యతి కై సవరణ ఈ విధంగా చేయలేకపోయేదాన్ని.
    మీ సవరణతో నా పద్యము.

    కందిన చెక్కిళుల్ గలిగి గౌరి మనోహరిగా చెలంగ నా
    యందము గాంచి యింపెసర నా హరు మానసమూగె డోల, కన్
    విందుగ పెండ్లి జేసె నగనేతయు ; పల్కిరి దేవతల్ "భళా!
    ముందెటు గానలేదు, మిను ముంగట నైనను నిట్టి వేడుకల్."

    కానీ మీరు మన్నించితే, నా చాపల్యము కొద్దీ తెలుగు సమాసమే సవరణకు వాడాలంటే ఈ సవరణ వాడవచ్చునని తోచింది.

    కందిన చెక్కిళుల్ గలిగి గౌరి మనోహరిగా చెలంగ నా
    యందము గాంచి యింపెసర నా హరు మానసమూగె డోల, కన్
    విందుగ పెండ్లిఁ గొండగుమిపెన్మిటి చేయగ పల్కిరెల్లరున్-
    "ముందెటు గానలేదు, మిను ముంగట నైనను నిట్టి వేడుకల్."

    రిప్లయితొలగించండి
  27. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ కృషి అభినందనీయము. మీ చివరి పద్యములో "సెనగ" అనే పదము నాకు కనుపట్ట లేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  29. లక్కరాజు వారూ,
    ఆసక్తితో కవిమిత్రుల పూరణలను, పద్యాలను చదివి ఆనందించడమే కాక, వారిని ప్రశంసిస్తూ మీరు చేసే వ్యాఖ్యలు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ‘కొండగుమిపెన్మిటి’ చాలా మంచి ప్రయోగం.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ఈనాటి మీ దత్తపది పూరణ అత్యద్భుతం, అత్యుత్తమం అనడంలో అతిశయోక్తి లేదు. నేమాని వారి ప్రశంసలను, ఆశీస్సులను పొందిన మీరు ధన్యులు. మీకు నా నమస్కృతులు.

    రిప్లయితొలగించండి
  30. లక్ష్మీదేవి గారూ,
    నేమాని వారు చెప్పింది నిజమే.. నేను గమనించలేదు. ‘కొండగుమి పెన్మిటి’ సెనగను మింగేసాడు....

    రిప్లయితొలగించండి
  31. మరొక ప్రయత్నము:

    కందర్పు దర్పమ్ము కరగె నాతని యత్న
    ....మునకందినవి ఫలమును జయమ్ము
    వడకు గుబ్బలి కూతు ప్రణయమ్ము చివురించె
    ....నాపె సరణి మెచ్చె త్ర్యంబకుండు
    నయమార సుతను దానము చేసె నగరాజు
    ....పురహరు పదపద్మములను గడిగి
    సకల లోకమ్ములు సంతోషమున నొప్పె
    ....మినుముట్టె మంగళధ్వనుల హోరు
    వేద మంత్రముల్ వీనుల విందు గూర్చె
    ప్రకృతి పురుషుల కళ్యాణ వైభవమ్ము
    సకల సన్మంగళకరమ్ము సౌఖ్యదమ్ము
    స్వస్తిరస్తంచు పొంగిరి సాధుతతులు

    రిప్లయితొలగించండి
  32. గురువుగారికి
    నేమాని వారికి
    అనేక ధన్యవాదములు. పెండ్లిలో హఠాత్తుగా వస్తువులు తక్కువ పడినట్లయింది.
    కానీ ఇక్కడ పెండ్లి హిమవంతుని యింట కదా! లోటు కనిపించకుండా ఏర్పాటు చేసినారు.
    చిత్తగించండి.

    కందిన చెక్కిళుల్ గలిగి గౌరి మనోహరిగా చెలంగ నా
    యందము గాంచి యింపెసర నా హరు మానసమూగె డోల, కన్
    విందగు వేళ కొండగుమిపెన్మిటి యిచ్చె నగల్ కుమార్తెకున్,
    ముందెటు గానలేదు, మిను ముంగట నైనను నట్టి వేడుకల్.

    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  33. మాన్యులు- శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి పద్యం ఈనాటి పద్యాలలో తలమానికంగా నిలిచింది , వారికి అభినందనలు .
    శ్రీ పండిత నేమాని గారి సీస పద్యం రామణీయకముగా , తీరైన పదాల పోహళింపుతో అందంగా ఉన్నది . ఎత్తుగీతి చిట్టచివరి పాదములో " స్వస్తిరస్తంచు పొంగెను సాధుగణము " అని కానీ "స్వస్తిరస్తంచు పొంగిరి సాధువులును " అని కానీ సవరిస్తే "క్రియా రూపం" సాధువవుతుందనిపిస్తోంది .
    సాధు తతులు పొంగినవి అని కానీ , సాధువులు పొంగిరి అని కానీ అంటామే కానీ సాధు తతులు పొంగిరి అనము కదా !

    శ్రీ మిస్సన్నగారి దృశ్యమాన గిరిజా శంకర కల్యాణ వర్ణనము - ఆ పెళ్లికి - వారేమైనా సాక్షీభూతులైనారా అనునట్టు దివ్యంగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  34. పెంపెసర పద్య సౌరుల పెండ్లి జేసి
    కవులు కావ్యము లల్లిరి ఘనము గాను
    వంట కంబులు మినుముట్ట వండి రంత
    మురిసె నగజాత సిగ్గుల మొగ్గ యనగ
    కంది పోయెను కలలందు బంది యగుచు !

    అందరి పద్యములు మనో రంజకము గా నున్నవి

    రిప్లయితొలగించండి
  35. @లక్ష్మీదేవి గాఅరూ --- వావ్

    కందిన చెక్కిళుల్ గలిగి గౌరి మనోహరిగా చెలంగ నా
    యందము గాంచి యింపెసర నా హరు మానసమూగె డోల, కన్

    రిప్లయితొలగించండి
  36. డా. విష్ణునందనుల వార్కి ధన్యవాదములు.
    మీ బోటి విద్వత్కవుల ప్రోత్సాహమే నా ప్రయత్నం.

    రిప్లయితొలగించండి
  37. పండిత నేమాని వారూ,
    ఆహా! ఎంత మధురంగా చెప్పారు. ఇది దత్తపది పూరణ వలె కన్పించడం లేదు. రసవంతమైన ఒక కావ్యంలోనుండి ఎత్తి తీసిన పద్యరత్నంవలె ఉంది. ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ఇప్పటికీ అది చెనగ అవుతుందే కాని సెనగ కాదు కాదా!
    *
    డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మినుముట్టినవి వంటకాలా లేక వంటకాల ఘుమఘుమలా?
    *
    కవిమిత్రులారా!

    దత్తపదముల యానవా లిత్తెఱఁగున
    వెదకి చూచినఁ దోచని విధముగా మ
    నోహరమ్మైన పద్యముల్ నుడివి జనుల
    కెల్లరకు మోదమును గూర్చి, రీ దినమున
    ‘శంకరాభరణము’ సుంత వంక లేని
    శోభనందెను, మీ కిదే శుభము గలుగ
    వలెనటంచుఁ దెల్పెద ధన్యవాదములను.

    రిప్లయితొలగించండి
  38. డా. విష్ణునందన్ గారికి నమస్కారములు.
    మీ ప్రశంసలకు కృతజ్ఞతలు. తొందరలో ఆఖరి పాదమును ముగించుటలో పొరపాటు దొరలినది. స్వస్తిరస్తంచు పొంగెను సాధు తతులు అని ఆఖరి పాదమును మార్చుదాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  39. మిత్రులారా!
    వివాహ పర్వములో సప్తపదముల ద్రొక్కుట యొక వైభవమే కదా. శ్రీ శంకరయ్య గారు ఒక సప్తపదితో మిత్రులెల్లరకు ధన్యవాదములు తెలిపేరు. పరమశివుడు అష్టమూర్తి కదా. అందుచేత నేను సప్తపదికి మరొక పదమును చేర్చేను - అష్టపదిని జేసేను. తిలకించండి:

    దత్తపదముల యానవా లిత్తెరగున
    వెదకి జూచిన దోచని విధముగా మ
    నోహరమ్మైన పద్యముల్ నుడివి జనుల
    కెల్లరకు మోదమును గూర్చి రీదినమున
    శంకరాభరణము సుంత వంకలేని
    శోభనందెను మీకిదే శుభము గలుగ
    వలెనటంచు దెల్పెద ధన్యవాదములను
    మిత్రులార! వాణీకృపా పాత్రులార!

    రిప్లయితొలగించండి
  40. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి,
    విద్వత్సుకవివరేణ్యులు శ్రీ విష్ణునందనార్యులకు
    నమస్కృతులతో,

    సతతాశీర్మయవాగ్విలాసవిలసత్సౌజన్యమూర్తిన్ మహా
    ద్భుతకావ్యార్థకృతార్థజీవను శ్రితస్తోత్రాతిపాత్రున్ మనీ
    షితవాణీచరణారవిందయుగళీశ్రీసన్నిధానాత్ముఁ బం
    డిత నేమాని మహోదయున్ బొగడెదన్ శిష్యుండనై భక్తితోన్.

    "కంది" శంకరార్య కమనీయ వాక్పుష్ప
    మందగిం "పెసర" నమందశోభ
    విరి"సె నగ"రి విబుధవరమనఃకంజముల్
    భక్తిని "మినుము"ట్టె పఠితృసంఖ్య.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  41. గురువుగారు,
    మా రాయలసీమలో కర్నాటక సరిహద్దులు దగ్గర కావడంవల్లనేమో , చెనగ సెనగ రెండూ సమానార్థాల్లో
    విరివిగానే వాడతాము.
    ఇక నేనింతటితో నా పద్యాన్ని సమర్థించుకోవడం ఆపాలనుకుంటాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి




  42. మోము కందిన లజ్జతో ముదము దాచి
    చూసె నగజాత శివుని బెంపెసర ,ప్రేమ,
    కాంతుడును గూడ క్రీగంట గాంచె నుమను
    దనరి,మినుముట్టె జయజయ ధ్వనులు చెలగి.

    రిప్లయితొలగించండి




  43. ముదము దాచి అనుటకు కారణం ,లోపల ఆనందంగా ఉన్నా ,పైకి కనిపించకుండా దాచుకొని అని భావం.

    రిప్లయితొలగించండి
  44. శ్రీమతి లక్ష్మీదేవి గారికి నమస్కృతులతో,

    “చణకో హరిమన్థకే” అని నిఘంటువు. “చణక” శబ్దం తెలుగులో (చనగ >) “చెనగ” అయింది. అదే సరైన రూపం. అయితే, వ్యవహారంలో “సెనగ”, “శనగ” ప్రచారంలోకి వచ్చాయి.

    దత్తపదిలో “సెనగ” ఇవ్వబడినందున దానిని మాత్రమే ప్రయోగించాలన్నది ఉద్దిష్టార్థం.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  45. శ్రీ రాంభట్ల పార్వతీశ శర్మ గాఉ మొదలు పెట్టిన చెనగల వాయనాన్ని మిత్రులు,అన్నయ్య గారు,మిస్సన్న మిత్రులు,శ్రీ ఏల్చేరు మురళీధర రావు గారు ,లక్ష్మీ దేవి గారు తమ తమ మనోహరమైన పూరణాలతో అలా కొనసాగించారు. మా చెల్లెమ్మ లక్ష్మీ దేవి గారి చేతి చలవ మంచిదై ఉంటుంది. ఆవిడ వడ్డిస్తున్న చనగలను సెనగలను,శనగలను పెద్దలు మారు వడ్డన అడుగుతూ పంక్తిలో నున్న మాకు కూడా వడ్డింప జేసారు.
    ఒక పర్యాయము శ్రీశైలములో భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనము తర్వాత ప్రసాదంగా వేయించిన సెనగలను యిస్తే బాగా నచ్చడం వలన మళ్ళీ మళ్ళీ వరుసలో నిలబడి ' నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు ' అనుకొని చాలా సార్లు స్వీకరించాను. ఆ అనుభూతిని మరల కలిపించారు లక్ష్మీ దేవి గారు. పద్యాలన్నీ కరకర లాడుతూ చాలా బాగున్నాయి. తీరికగా మరో సారి చదువుకొంటాను.

    రిప్లయితొలగించండి
  46. మురళీధరరావు గారు,
    సందేహ నివృత్తి చేసిన మీకు ధన్యవాదములు. చెనగ సరైన రూపమని తెలిసి సంతోషమూ కలిగినది.

    కందిన చెక్కిళుల్ గలిగి గౌరి మనోహరిగా చెలంగ నా
    యందము గాంచి యింపెసర నా హరు మానసమూగె డోల, కన్
    విందుగ జేసి కొండగుమిపెన్మిటి డస్సెన, గంగ ద్రావగా?
    ముందెటు గానలేదు, మిను ముంగట నైనను నట్టి వేడుకల్.

    మొత్తంమీద సెనగలు అరగడం కష్టమే.
    లక్కరాజు వారూ, ధన్యవాదాలండి.

    మూర్తిగారి సహృదయవ్యాఖ్య సంతోషం కలిగించింది.ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  47. లక్ష్మీ దేవి గారూ! మీ వ్యాఖ్య
    " ఇక నేనింతటితో నా పద్యాన్ని సమర్థించుకోవడం ఆపాలనుకుంటాను.
    ధన్యవాదాలు."
    బలే నవ్వు తెప్పించింది.

    రిప్లయితొలగించండి