8, మే 2013, బుధవారం

సమస్యాపూరణం – 1046 (వదినను బెండ్లాడెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వదినను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్.
ఈ సమస్యను సూచించిన గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. కదనమున వాలి కూలగ
    వదినెకు దుఃఖమును బాపి వానర ధర్మం
    బదియని సుగ్రీవుడు తన
    వదినెను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్

    (ఒక పంజాబీ - సిక్కు మతస్థుడు - చెప్పగా వింటిని - వారి సంప్రదాయములో అన్న గతించిన తరువాత తమ్ముడు వదినెను బెండ్లాడుట సమ్మతమేనని)
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. పదియార్లు గడచినందున
    సుదినంబని షష్టి పూర్తి శోభిల చేయన్
    మదిఁ బొంగుచు మా అన్నయ
    వదినను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్

    రిప్లయితొలగించండి

  3. అర్జునుడు కుంతితో.....
    “ఎదఁ బౌరుష ముప్పొంగగ
    ముదమున నా మత్స్యయంత్రమును భేదింపన్
    మదిఁ బొంగుచు వధువగు ద్రో
    వది నను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్”

    రిప్లయితొలగించండి
  4. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    నా యొద్ద నున్న శబ్ద రత్నాకరములో వదిన అనే పదమునీయలేదు. వదినియ అనే రూపము వదినె అయినదని యిచ్చెను. అందుచేత సందేహ నివృత్తి చేయగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. ఆహా ! ముగ్గురు గురు వర్యులు వరుసగా వైవిధ్య మైన పూరణలు చేయటం మహదానందం...

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    మీ పూరణ చూసిన తర్వాత నాకూ ‘వదిన’ శబ్దం యొక్క సాధుత్వం గురించి సందేహం వచ్చి నిఘంటువులను చూసాను.
    శ్రీ సూర్యరాయాంధ్రనిఘంటువులో వదిన - వదినె - నదినియ అన్న రూపాంతరాలు ఇవ్వబడ్డాయి.
    వదిన శబ్దానికి ఆ నిఘంటువులో ఇచ్చిన పూర్వకవి ప్రయోగాలు....
    1. ఉ. నావుడు సంతసిల్లి వదినం దగులాగుల బుజ్జగించి లీ
    లావతితో... (విక్ర. 8-93)
    (పై ఉదాహరణంలో వదిన శబ్దంలోని నకారం యతిస్థానంలో ఉండడం గమనించండి)
    2. ఉ. అన్నయశాలి వాని హృదయం బలరంగ బహూకరించి మా
    యన్నకు సేమమే వదిన హర్షముఁ గాంచునె పుత్రులెల్ల సౌ
    ఖ్యోన్నతులే కదా.... (ఉ.రా. 2-301)

    రిప్లయితొలగించండి
  7. పది తలల వాని గూల్చగ
    ముదమారగ సతిని గాంచి మురియుచు రాముం
    డెదపొంగున నేటేటన మా
    వదినను బెండ్లా డెను బుధ వర్యులు మెచ్చన్ !

    రిప్లయితొలగించండి
  8. మదిలో ప్రేమను చెప్పెను
    వదిలేదిక లేదననుచు బాసలు చేసెన్
    పదపడి చెల్లెలి నిమ్మని
    వదినను, బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  9. పండిత వర్యులు మువ్వురూ వరుసగా పూరణలు చేసి ఈరోజు శుభారంభము గావించినారు.

    మది నిండెను సంతోషము
    పదియింతలుగా పెరిగెను పందిట నేడే
    పెదతండ్రి కొడుకు సుందరి
    వదినను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని వారూ,
    సుగ్రీవుడు తారను పెండ్లాడిన సందర్భంతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ఈ సంప్రదాయం కొన్ని ఆటవిక తెగలలోనూ ఉన్నది.
    ‘వదిన’ శబ్దానికి సంబంధించిన సందేహం నివృత్తి అయింది కదా!
    *
    చింతా రామకృష్ణా రావు గారూ,
    అన్నయ్య షష్టి పూర్తి సందర్భం ప్రశస్తంగా ఉంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం...
    ‘రాముం/ డిదె యేటేట గుడిని మా/ వదినను...’ అందాం.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వదిన చెల్లెల్ని పెండ్లాడిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీదేవి గారూ,
    వరసలు కలపడంలో ఆడబిడ్డలదే అగ్రతాంబూలం. మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. ముదమున నప్సరసలకో
    వది నను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్
    సుదతుల్ విందున కిప్పుడు
    కదలుండనిపల్కె నొకడు కలలోని కథన్.

    రిప్లయితొలగించండి
  13. మదిలో "దిన"యను పేరున
    మదనుని బాణమొకటి తన మరదలి రూపై
    వదలక గ్రుచ్చుకొనిన బా
    "దిన"ను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  14. చదువును సంస్కారము సం
    పదలును పదవులును లేత పరువముగల చి
    న్నది నా మది దోచిన యర
    వది నను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  15. మది దోచెను పార్థుండను!
    ముదమున నొక కోల మత్స్యమును వేసెననున్!
    సుదతీ పేరేమన ద్రో-
    వది నను! బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. మదినిండ నాద రించుము
    వదినను , బెండ్లాడెను బుధ వర్యులు మెచ్చన్
    ముదమున లక్ష్మిని గోరుచు
    చదువులలో మేటి యైన చావలి శివుడున్ .

    రిప్లయితొలగించండి
  18. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ ‘కోవ’కు చెందినదన్న పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    ‘దిన’ అన్నది ముద్దుపేరా? చక్కని ఊహతో మంచి పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    తాజా పూరణలో మీరు ‘అరవ పిల్ల’ పెండ్లి చేసారు. అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ద్రోవది పేరు చెప్పించి అర్జునునితో పెండ్లి జరిపించారు. మంచి పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములు జేయుచూ,

    ఈ సంవత్సరము నా పద్యములు మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనుకకు పోవుచున్నవి.ఆ పైసినిమా కష్టములు .
    వయసులో పెద్దదైన మామ కూతురు వదిన యగును. ఆమెమనసును గెలిచిన మరది
    ========*=======
    వదిన విసరిన సమస్యను
    పది విధముల పూరణలను వరుసగ జేయన్
    వదిన సుమమాల వేసేన్,
    వదినను బెండ్లా డెను బుధవర్యులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  20. పది వత్సరముల నుండియు
    మదిలో నెలకొన్న మగువ మమతల రాశిన్
    ముదమున మా యన్నయ ఈ
    వదినను పెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్ .

    రిప్లయితొలగించండి
  21. చదువును ముగియించు కొనిన
    నుదయు డనెడి వాడొకండు యుద్యోగము జే
    యు దయిత యగు తన చెల్లెలి
    వదినను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్

    ఉదయుడనే వాడు వివాహిత యైన తన చెల్లెలు భర్త సోదరిని పెండ్లాడి నాడని భావం.

    రిప్లయితొలగించండి
  22. వరప్రసాద్ గారూ,
    చాలాకాలం తర్వాత పునర్దర్శనం. సంతోషం.
    వయసులో పెద్దదైనా వరస కలిసింది కదా! బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    అన్నా వదినలకు పెళ్ళి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చెల్లెలికి సంపాదించే వదినను తెచ్చారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి



  23. మదినాశ్చర్యంబందుట
    యది యేలను కొన్నికులములందాచారం
    బది,యన్న మృతినిమరదియె
    వదినెను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  24. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. మది దోచిన మగువైనను
    వదినమ్మకు నచ్చ కుండ వద్దను వాడై
    యదునున్ గని మెప్పించుచు వదినను, బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్!

    రిప్లయితొలగించండి
  26. పదునారు వేల తరుణులు
    పదిలముగా సత్యభామ పన్నుగ మరియా
    పది మణుగుల బంగరు విలు
    వది, నను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  27. అదివో చూడర రుక్మిణి!
    పదుగురిలో మెలగుచుండె బాలిక వోలెన్
    పది మణుగుల బంగరు విలు
    వది, నను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్

    రిప్లయితొలగించండి