14, మే 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1052 (ఆలింగన సుఖము దక్కు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఆలింగన సుఖము దక్కునా? మిస్సన్నా!
ఈ సమస్యకు స్ఫూర్తి నిచ్చిన పింగళి శశిధర్ గారికి ధన్యవాదములు.

31 కామెంట్‌లు:

  1. బేలనె నీ ప్రియురాలనె
    యేల ననున్ దూరముంచి యీ కవ్వింతల్
    చేలము పట్టక తాకక
    నాలింగన సుఖము దక్కునా? మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారూ ...

    కూలిన కాపుర మేమని
    మేలుగ పిల్లలకు ప్రేమ నీయక వారిన్
    గాలికి వదలుచు తిరిగెడు
    నాలింగన సుఖము దక్కునా? మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  3. మిస్సన్న గారూ,
    మన్నించాలి!
    ముందు అక్కడ అనుకున్నది వెంకన్నా, లేదా విస్సన్నా అని. విస్సన్నకు బదులు మిస్సన్నను పెడితే బాగుంటుంది కదా అనిపించింది.

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. అక్కడ ‘మేలుగ పిల్లలకు ప్రేమ మృగ్యము కాగన్’ అందామా?

    రిప్లయితొలగించండి
  5. గేలము వేయకు ప్రేమని
    లాలసలకు లొంగ రెవరు రాగము విరియన్
    లీలగ జూచిన మాత్రమె
    ఆలింగన సుఖము దక్కునా మిస్సన్నా !

    రిప్లయితొలగించండి
  6. లాలన జేయక బిడ్డల
    నాలన పాలనల జూచు నమ్మయె గాకన్
    వేలకు వేలను దెచ్చిడు
    నాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  7. మేలైన సేవఁ జేసిన
    మాలిన్యము లేని హనుమ మాదిరి మనకున్
    పాలించు వారి నిర్మల
    యాలింగన సుఖము దక్కునా? మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసింప దగినది.
    ‘ప్రేమ + అని = ప్రేమ యని’ అవుతుంది. సంధి లేదు.
    రెండవ పాదంలో ర-ల లకు యతిమైత్రి లేదు.
    *
    మిస్సన్న గారూ,
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘తెచ్చి + ఇడు’ ... క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు... కనుక అక్కడ యడాగమం వచ్చి ‘తెచ్చి యిడు’ అవుతుంది.
    *
    సహదేవుడు గారూ,
    శ్రీరామ పరిష్వంగ సుఖాన్ని తెలియజేస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. తేలిక భవుడిని మెప్పుట
    మాలికలను దెచ్చి వైతు మా లింగడుకున్
    గీలుకొని నిలిచి కొలిచిన
    నాలింగన సుఖము దక్కునా? మిస్సన్నా!

    గీలుకొను = అభిముఖముగా

    రిప్లయితొలగించండి
  10. లింగన , మిస్సన్న అనే జ్యోతిషికులతో ఓ బడుగు::

    బాలావస్థయె మొదలుగ
    చాలా కష్టములు బడితి, శనిదశ పోవన్
    మేలగునా? మీపలుకౌ
    నా లింగన? సుఖము దక్కునా? మిస్సన్నా?

    రిప్లయితొలగించండి
  11. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘తేలిక హరు మెప్పించుట
    మాలికలను దెచ్చి వైతు మా లింగనికిన్...’ అంటే బాగుంటుందేమో!

    రిప్లయితొలగించండి
  12. రామకృష్ణ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా, అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారూ ధన్యవాదములు. మీ సూచన చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  14. మాస్టరు గారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
    మిత్రులందరూ కలిస్తే మిస్సన్న శతకం తయారయ్యేట్లుంది...

    కూలిన కాపుర మేమని
    మేలుగ పిల్లలకు ప్రేమ మృగ్యము కాగా
    గాలికి వదలుచు తిరిగెడు
    నాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  15. ఆలియె యిచ్చును గదమఱి
    ఆలింగన సుఖము, దక్కునా ? మిస్సన్నా !
    పాలకుల కిచ్చు ధనములు
    జాల రులకు , సరిగ లేని జనులకు ధర లోన్ .

    రిప్లయితొలగించండి
  16. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    నమస్కృతులతో,

    శ్రీ లొసఁగెడు దల్లిని వి
    ద్యాలోలుర హృదయరాజ్ఞియై రాజిలు గో
    పాలికనుం జదువుల జవ
    రాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము చాల బాగుగ నున్నది. 3వ పాదము చివర నిర్మల అను పదముతో 4వ పాదములోని ఆలింగన అను పదము కలిసి సంధి యగును -- సవర్ణ దీర్ఘ సంధి. అంతే కాని యడాగమము రాదు. కాస్త పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము "లాలన జేయుచు బిడ్డల........." బాగుగ నున్నది. 2వ పాదము చివర గాకన్ అనే ప్రయోగము బాగులేదు. వ్యతిరేకార్థకముల చివర ద్రుతము రాదు కదా! స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారికి, నేమాని పండితులకూ వందనాలతో సవరించిన పూరణ:

    లాలన జేయక బిడ్డల
    నాలన పాలనల జూచు నాత్రము లేకన్
    వేలకు వేలను దెచ్చెడు
    నాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  20. సహదేవుడు గారూ,
    నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా! అది నా దృష్టికి రాలేదు.
    ‘హితమగు/నాలింగన సుఖము...’ అందామా?
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    చివరి రెండు పాదాల భావం కొంచెం సందిగ్ధంగా ఉంది.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    నేమాని వ్యాఖ్యను గమనించారు కదా! అక్కడ ‘నాలన పాలనల జూచు నవసరమందున్’ అందామా?
    *
    పండిత నేమాని వారూ,
    నా పూరణ సార్వజనీనం కాదనీ, దాన్ని వ్రాస్తున్నప్పుడు కేవలం మా ఆవిడ మాత్రమే నా దృష్టిలో ఉందని గమనించ మనవి.

    రిప్లయితొలగించండి
  21. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! మీరు వ్యతిరేకార్థక పదమునే మళ్ళీ వాడినారు కదా. అందుచేత దోషము తొలగలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. మఱొక పూరణ ...

    ఆలిం గనఁ, దనయా తన
    యాలిం గనఁ గోర్కెలగమి యడఁగని తమి రో
    యాలిం గన నిర్వృతికాం
    తాలింగనసుఖము దక్కునా? మిస్సన్నా!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  23. నాదొక చిన్న ప్రయత్నము:
    ఆలి హృదయ మమృతమయం
    బాలి విలాసము శుభాఢ్య మగును గదన్నా!
    ఏలా! శంకించెద విటు
    లాలిం గన సుఖము దక్కు, నా మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  24. మిస్సు కస్సు మన్నబుస్సున
    బస్సెక్కి అల్లుడు అత్తారింటికి పోయె !
    బావా నీ మిస్సు నిను మిస్సయ్యే అంటే,
    ఆలింగన సుఖము దక్కునా? 'మిస్సన్నా'!

    అన్నాడంట వెనకటికెవడో !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. ఆలిని ద్యజించి వేశ్యా
    లోలుపుడై కామమునకు లోబడి విటుడై
    బాలిశుడొక్కడు తమి వెల
    యాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  26. శ్రీ గురుభ్యోనమః
    గురువర్యులిర్వురకూ ధన్యవాదములు.తమరి సూచనానుసారము సవరించిన పద్యం:

    మేలైన సేవఁ జేసిన
    మాలిన్యము లేని హనుమ మాదిరి మనకున్
    పాలించు వారి వాత్స
    ల్యాలింగనా సుఖము దక్కునా? మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  27. మేలగు జీవనమునకై
    యాలిని నే వదిలి పోతి యంబుధులను దా
    టేలీల మరలి వత్తును?
    ఆలింగన సుఖము దక్కునా? మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  28. సవరణకు ధన్య వాదములు
    సవరించిన పద్యము

    గేలము వేయకు ప్రియమని
    మేలను కొని లొంగ రెవరు మోహించి మదిన్ !
    లీలగ జూచిన మాత్రమె
    యాలింగన సుఖము దక్కునా మిస్సన్నా !
    --------------------------------------
    గోలను జేసెడి తనయుని
    లాలనగా బిలిచి తల్లి లౌక్యము గానే
    పాలను త్రాగించి మురిసి
    యాలింగన సుఖము దక్కునా మిస్సన్నా !

    రిప్లయితొలగించండి
  29. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    యమకాలంకార భూషితమైన మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ప్రశ్ననే సమాధానంగా చూపిన మీ ప్రతభకు నమోవాకాలు. మీ పూరణ చాలా బాగుంది.
    *
    డా. విష్ణునందన్ గారూ,
    వెలయాలిపై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘దాటి + ఏలీల’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘పోతి నా పరదేశం/ బేలీల...’ అందాం.

    రిప్లయితొలగించండి
  30. గురువుగారికి, నేమాని పండితులకూ వందనాలతో సవరించిన పూరణ:

    లాలన జేయక బిడ్డల
    నాలన పాలనల జూచు నాత్రము కరవై
    వేలకు వేలను దెచ్చెడు
    నాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా!

    రిప్లయితొలగించండి