4, ఆగస్టు 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1133 (శ్రీశ్రీ కవి యనఁగఁ దగఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
శ్రీశ్రీ కవి యనఁగఁ దగఁడు సిరిసిరిమువ్వా!

42 కామెంట్‌లు:

  1. శ్రీశ్రీయే కవి, కవియే
    శ్రీశ్రీ, కవి యనగ దగడు సిరిసిరిమువ్వా!
    అశ్రాంతము కువిమర్శల
    కై శ్రమియించెడు నతండు కనకపు బొమ్మా!

    రిప్లయితొలగించండి
  2. శ్రీరాముల శ్రీధరుఁ డను నూతన కవి, తనను శ్రీశ్రీగా బ్రకటించుకొని, తనను గూర్చి గర్వముతో నిటులు పలుకుచున్నాఁడు...

    "నే శ్రేష్ఠుఁడనగు సుకవిని
    రా! శ్రమ యిసుమంత లేక వ్రాసెదఁ గవితల్!
    శ్మశ్రువులఁ దీతు జరుగమి;
    శ్రీశ్రీ కవి యనఁగఁ దగఁడు సిరిసిరిమువ్వా!"

    రిప్లయితొలగించండి
  3. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఐదు రోజుల తీర్థయాత్ర ముగించుకుని గతరాత్రి ఇల్లు చేరాను.
    వెంటనే బ్లాగు తెరచి ఈ అయిదు రోజుల్లో మిత్రుల పూరణలను, పద్యాలను, వ్యాఖ్యను చూసాను (ఇంకా చదవలేదు). నా అనుపస్థితిలోనూ బ్లాగు సక్రమంగా నిర్వహింపబడినందుకు ఆనందం కలిగింది.
    రాష్ట్ర సరిహద్దు దాటాక నా ఫోన్‌లో నెట్ ఓపెన్ కాలేదు. ప్రయాణంలో ఎక్కడా ఇంటర్ నెట్ సెంటర్ వెళ్ళే అవకాశం దొరకలేదు.
    పద్యరచన శీర్షికలో ‘మయసభ’ రెండు రోజులు వచ్చింది. నేను వేరు వేరు అంశాలు నిర్దేశించినా అది రెండవ రోజు ఎలా పునరావృతం అయిందో అర్థం కాలేదు. ‘షెడ్యూల్’ అన్న ఆప్షన్ కారణంగా అయిదు రోజులూ సమయానికి పోస్టులు ప్రకటింపబడ్డాయి.
    ముఖ్యంగా ఇన్ని రోజులూ ఓపికగా, శిష్యవాత్సల్యంతో మిత్రుల పూరణల గుణదోష విచారణ చేసిన పూజ్యులు శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదాలు.
    మంచి పూరణలు, చక్కని పద్యాలను రచించిన మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ...మిత్రులు కంది శంకరయ్యగారికి తీర్థయాత్ర దిగ్విజయముగఁ బూర్తిచేసుకొని వచ్చిన సందర్భముగా శుభాభినందనలు.
    ...పూజ్యులు పండిత నేమానివారి పూరణము చాల బాగుగ నున్నది.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
    మీరు తీర్థ యాత్రలను ఆనందముగా ముగించుకొని వచ్చినందులకు చాలా సంతోషము. మీరు లేని ఈ 5 దినములలో మన బ్లాగు మిత్రులందరూ చాలా బాగుగా సహకరించి బ్లాగును చక్కగా నడిపించేరు. అందరి ఆదరాభిమానములకు ఎంతో హాయిగా నున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గుండు మధుసూదన్ గారికి శుభాశీస్సులు.
    మీ ప్రశంసలకు సంతోషము. మీ క్రొత్త శ్రీ శ్రీకి అభినందనలు. పద్యము బాగుగ నున్నది.

    రిప్లయితొలగించండి
  7. శ్రీశ్రీ రంగముశ్రీనే
    శ్రీశ్రీ; కవియనదగడు సిరిసిరిమువ్వా
    శ్రీశ్రీ నెఱుగనివాడిల,
    శ్రీశ్రీ నవయుగ కవికులశిఖరమెమువ్వా!!!

    రిప్లయితొలగించండి
  8. శ్రీ సాయినాథుని దర్శించి వచ్చిన మాస్టరుగారికి శుభాభినందనలు
    సాంకేతికతను ఉపయోగించి మీ పరోక్షములో కూడా బ్లాగును నిరాటంకముగా నడిపిన మీ తపన (తపస్సు) కు నమోవాకములు

    శ్రీశ్రీ కవియే నిజమిది
    శ్రీశ్రీ పేరేమొ వెట్ట శ్రీశ్రీ యౌనా
    శ్రీ శ్రీశ్రీ యనినా యా
    శ్రీశ్రీ కవియనగ దగడు సిరిసిరిమువ్వా

    రిప్లయితొలగించండి

  9. అగ్గి పెట్ట కుక్క పిల్ల సబ్బు బిళ్ళ
    అంటూ మూడు ముక్కల మాటల తో
    తెలుగు కవిత కి మరో ప్రపంచాన్ని ఇచ్చిన
    శ్రీశ్రీకవి యనగ దగడు? సిరిసిరిమువ్వా ?

    రిప్లయితొలగించండి


  10. మా శ్రామికులకు హితుడై
    అశ్రాంతము కవిత వెలుగు నారని జ్యోతై !
    అశ్రుకణ జ్వలిత శిఖియె ,
    శ్రీశ్రీ !! కవి యనగ దగడు సిరిసిరిమువ్వా!!!

    రిప్లయితొలగించండి
  11. శ్రీగురుదేవుల దిగ్విజయ తీర్థయాత్ర మాకు మిగుల ముదావహము.

    విశ్రాంతిలేకఁ గుకవులు
    నశ్రాంతము దెప్పిపొడతురనయమసూయన్
    శ్రీశ్రీని తిట్టురీవిధి
    "శ్రీశ్రీ కవి యనఁగఁ దగఁడు సిరిసిరిమువ్వా"!!

    పొడుతురు + అనయము + అసూయన్

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము 2వ పాదములో ప్రాసను మరచిపోయేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. నేమాని పండితార్యా! మీ పూరణ మనోహరంగా ఉంది.

    గురువుగారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీశ్రీ సత్తా తెలియక
    నే శ్రేయము గోరి చేతు రిట్టి విమర్శల్?
    మీ శ్రమ వృథయౌ, తగదన
    'శ్రీ శ్రీ కవి యనగ దగడు సిరి సిరి మువ్వా'

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ ప్రశంసలకు సంతోషము. మీ పద్యములో తెలియకనే అన్నారు కదా -- తెలియకయే అనుట సాధువు అనుకొంటాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. శ్రీశ్రీ యగును మహాకవి
    మిశ్రమమై రెండు శ్రీలు మెప్పును బడసెన్
    ప్రశ్రయము నెవరి నోటను
    శ్రీశ్రీ కవి యనగ దగడు !? సిరిసిరిమువ్వా !




    రిప్లయితొలగించండి
  18. శ్రీ శ్రీ కవితల నరయగ
    నాశువుగా నుండి మనకు హాయిని గూర్చున్
    శ్రీ శ్రీ యన నా కిష్టము
    శ్రీ శ్రీ కవి యనగ దగడు? సిరి సిరి మువ్వా !

    రిప్లయితొలగించండి
  19. శ్రీశ్రీ విప్లవ కైతలు
    ఆ శ్రామిక వర్గచయము కాశ్రయమాయెన్
    శ్రీశ్రీ యన యుగ పురుషుడె
    శ్రీశ్రీ కవి యనగ దగడు సిరిసిరి మువ్వా

    రిప్లయితొలగించండి
  20. శ్రీశ్రీ యని నన్నయ ఇడె
    సు శ్రీకారమ్ము తెనుగు సుకవిత్వముకున్
    శ్రీశ్రీ విభేద నడకల
    శ్రీశ్రీ కవి యనగ దగడు సిరిసిరి మువ్వా

    మొదటి పాదములో శ్రీశ్రీ యనగ 'మంగళము'

    రిప్లయితొలగించండి
  21. శ్రీ కంది శంకరయ్య మరియు శ్రీ పండిత నేమాని గురువర్యులకు నమస్సులు. తెలుగు
    భాషాభి వృద్ధికై ప్రత్యేకముగా పద్య రచనా భి వృద్ధికై మీరు చేయుచున్న సేవ శ్లాఘనీయము.
    ధన్యవాదములు


    శ్రీ శ్రీ వలె సామాజిక
    శ్రీ శ్రీ వలె రాజకీయ జీవన గతులన్
    శ్రీ శ్రీ వలె వ్రాసిన కవి
    శ్రీ శ్రీ కవి యనగ తగడు సిరి సిరి మువ్వా !

    రిప్లయితొలగించండి
  22. శ్రీశ్రీ నూతన యొరవడి
    ఆశ్రయమయ్యెను యువతకు నల్లగ కవితల్
    శ్రీశ్రీ మహాకవి గదా!
    శ్రీశ్రీ కవి యనఁగఁ దగఁడు సిరిసిరిమువ్వా!

    శ్రీశ్రీ కవితా ధోరణి
    విశ్రాంతిని గలుగజేయు పేదలకెల్లన్
    శ్రీశ్రీ మహా కవి కదా!
    శ్రీశ్రీ కవి యనఁగఁ దగఁడు సిరిసిరిమువ్వా!

    రిప్లయితొలగించండి
  23. అయ్యా!బొడ్డు శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మీ 2 పద్యములు బాగుగ నున్నవి. 1వ పద్యములో చేసిన సమాసము "నూతన యొరవడి" సాధువు కాదు. సమాసములో పూర్వ పదము సంస్కృతము అయితే ఉత్తర పదమును తెలుగు చేయరాదు. సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. అయ్యా!శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో సుకవిత్వముకున్ అని వాడేరు. కవిత్వము అను పదము చివర ఉకారము ఉన్నది కదా. వ్యాకరణము ప్రకారము ఉకార ఋకారముల తరువాత కు వచ్చినచో నకు అని వాడవలెను. అందుచేత మీరు సుకవిత్వమునకున్ అనుట సాధు ప్రయోగము అగును. కొంచెము చూచి సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  25. నేమాని పండితార్యా! ధన్యవాదములు.
    తెలియకను ఏ శ్రేయమును అని సంధిగా వాడేను.
    దోషముందంటారా?

    రిప్లయితొలగించండి
  26. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    తెలియక అనేది వ్యతిరేకార్థక మైన పదము కాబట్టి అది కళయే కాని దృతప్రకృతికము కాదని నా భావము. అందుచేత ను అని చేర్చరాదు అనుకొంటాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  27. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ధన్యవాదాలు.
    నేమాని వారు ప్రశంసించినట్లు మీ క్రొత్త శ్రీశ్రీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అన్నట్టు నా యాత్రలో అజంతా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్నప్పుడు, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో తిరిగివస్తున్నప్పుడు మీ ‘కామారెడ్డి’ తగిలింది. మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అనినా’ అన్న ప్రయోగం సాధువు కాదు. అక్కడ ‘శ్రీ శ్రీశ్రీ యన్నంతనె/యన్నంతట’ అందామా?
    *
    జిలేబీ గారూ,
    మీ భావం బాగుంది. ఎవరైనా మిత్రులు దీనిని ఛందోబద్ధం చేస్తారేమో చూద్దాం. (నేనే చేసేవాణ్ణి కాని, ప్రయాణపు అలసట ఇంకా పోలేదు)
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘జ్యోతియై’ అని యడాగమం రావాలి. ఆ పాదాన్ని ‘అశ్రాంతం బాంధ్రకవిత కారని వెలుఁగై’ అందామా?
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘తిట్టు రీవిధి’ అనడం సరి కాదు. ‘తిట్టుదు రీవిధి’ అనాలి కదా. ఆ పాదాన్ని ‘శ్రీశ్రీని తిట్టుదు రిటుల’ అందాం.
    *
    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘తెలియకయే’ అని నేమాని వారి సవరణను గమనించారు కదా!
    ‘అక ప్రత్యయంతో అంతమయ్యే అవ్యయము కళ’ అని ప్రౌఢవ్యాకరణంలో చెప్పబడింది. ‘తినక, చూడక, వినక’ అని ఉండాలి తప్ప ‘తినకన్, చూడకన్, వినకన్’ అని ఉండరాదు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు.
    సవరించిన తరువాత కూడా ప్రాసదోషం తొలగిపోలేదు. నా సవరణ.... ‘శ్రీ శ్రీ కవితలు నవతకు/నాశ్రయమై యుండి...."
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘కైతలు + ఆ’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. విసంధిగా వ్రాయకూడదు. అలాగే ‘చయముకాశ్రయము’ అనరాదు. ‘చయమున కాశ్రయము’ అనాలి. నా సవరణలతో మీ పూరణ....
    శ్రీశ్రీ విప్లవ కవితలె
    యా శ్రామిక వర్గమునకు నాశ్రయమాయెన్
    శ్రీశ్రీ యన యుగ పురుషుడె
    శ్రీశ్రీ కవి యనగ దగడు సిరిసిరి మువ్వా
    రెండవ పూరణలో నేమాని వారి అభ్యంతరమే కాక, ‘విభేద నడకల’ అనే సమాసమూ సాధువు కాదు. నా సవరణలతో ఆ పూరణ....
    శ్రీశ్రీ యని నన్నయ యిడె
    సుశ్రీకారమ్ము తెనుగు సుకవితకుఁ దా
    శ్రీశ్రీ విభేద గతులకు
    శ్రీశ్రీ కవి యనగ దగడు సిరిసిరి మువ్వా
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మీ మొదటి పూరణను ‘శ్రీశ్రీ నూత్నపు టొరవడి/ కాశ్రయ మయ్యెను....’ అని సవరిద్దాం.

    రిప్లయితొలగించండి
  28. ఏ శ్రీ నైనను పోల్చగ
    శ్రీ శ్రీ కిల సాటి లేరు సేద్యపు రచనల్ !
    శ్రీ శ్రీ బహుముఖ ప్రాజ్ఞుడు
    శ్రీ శ్రీ కవియఁ నగఁ దగదు సిరి సిరి మువ్వా !

    సోదరులు శ్రీ సంకరయ్య గురువులు షిరిడీ యాత్ర ముగించుకుని బ్లాగును దర్సించి నందుకు ముదావహం ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  29. క్షమించాలి ' శంకరయ్య గురువులకు
    అక్షర దోషం ...శ ...కి బదులు ...స ...

    రిప్లయితొలగించండి
  30. మాస్టరు గారూ! ధన్యవాదములు.
    మీసూచనతో.. చిన్న సవరణ తో....


    శ్రీశ్రీ కవియే ! యొరులకు
    శ్రీశ్రీ యని పేరు వెట్ట శ్రీశ్రీ యౌనా ?
    శ్రీ శ్రీశ్రీ యన వానిని
    శ్రీశ్రీ కవియనగ దగడు సిరిసిరిమువ్వా !

    రిప్లయితొలగించండి
  31. గురువుగారూ నమస్సులు.మీ సవరణ అద్భుతం. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  32. గురువు గారూ నా పూరణ నిట్లు సవరించాను.

    మా శ్రామికులకు హితుడు
    న్నశ్రాంతం బాంధ్ర కవిత కారని వెలుగున్ !
    అశ్రుకణ జ్వలిత శిఖియు ,
    శ్రీశ్రీ !! కవి యనగ దగడు సిరిసిరి మువ్వా!!!

    రిప్లయితొలగించండి
  33. రాజేశ్వరి అక్కయ్యా,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు వారూ,
    సంతోషం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    శ్రీమతి జిలేబి గారి భావమునకు మీరు పద్యరూపము నిచ్చేరు. బాగుగ నున్నది. అది ఏ ఛందస్సో ఏ పద్యముతో మొదలు పెట్టేరో ఏ పద్యముతో ముగించారో తెలియుట లేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  35. శ్రీ నేమాని గారికి నమస్కారములు.
    జిలేబి గారి గారి భావానికి ఇచ్చిన పద్యరూపము.. తొందరపాటు వలన చందస్సు గమనించలేదు . క్షమించండి

    రిప్లయితొలగించండి
  36. నేమాని పండితులకు, గురువుగారికి
    సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  37. మా"శ్రీనాథుడు" కొమరుం
    డాశ్రయమిడు "శ్రీనివాసు" డాతని పేరై
    "శ్రీశ్రీ" తన చిరునామము;
    శ్రీశ్రీ కవి యనఁగఁ దగఁడు సిరిసిరిమువ్వా!

    https://in.linkedin.com/in/sreenivasshreenath

    రిప్లయితొలగించండి


  38. ఆశ్రయము లేదు! మీదు స
    మాశ్రయ మసలే శుభాంగి మాకు తెలియద
    మ్మా! శ్రీ మతీ ! జిలేబీ
    శ్రీశ్రీ కవి యనఁగఁ దగఁడు సిరిసిరిమువ్వా ?

    జిలేబి

    రిప్లయితొలగించండి