24, ఆగస్టు 2013, శనివారం

పద్య రచన – 443 (బాంధవ్యములు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"బాంధవ్యములు"

17 కామెంట్‌లు:

  1. మమత బెంచును బాంధవ్య మహిమ దాని
    వలన జ్ఞానమ్ము ధర్మమ్ము ప్రక్క త్రోవ
    పట్టు నద్దాని వలన సర్వవిధ దుష్ట
    యోగములు సంభవించు నయ్యో! ధరిత్రి

    రిప్లయితొలగించండి
  2. పాలకుల నిర్ణయంబులు ప్రజల కు మఱి
    నష్ట మనిపించి యాందోళ న లు స లిపిరి
    ప్రభుత ప్రజల బాం ధవ్యపు పట్టు లేక
    జరుగు చున్నవి బందులు జగము నందు

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    బాంధవ్య పరిధిని, ఫలితాన్ని గురించి చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    పాలకులకు, పాలితులకు మధ్య బాంధవ్యాన్ని గురించి మంచి పద్యం చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. ఆర్జనంబుయున్న ఆప్తులనుచు
    బంధుజనము వచ్చి బవ్వళించు
    పేద యైన వాడి పేరైన దల్చునా
    బాంధ వ్యముల్ క్షణ భంగురములు

    రిప్లయితొలగించండి
  6. జననమందిన దాదిగా మనిషికమరు
    తల్లితండ్రులత్తలు మామ తాతమామ్మ
    పెండ్లియైనంత సతిపతుల్ పిల్లపాప
    బంధుజనమేర్పడును తాను బంధితుడగు
    ఒక్కడుగ వచ్చి పోవును ఒక్కడుగను
    బ్రతుకు బాటను సత్య ధర్మము లొకటియె
    తోడు నీడగ నిల్చి కాపాడి నీకు
    ముక్తి నిచ్చెడి బాంధవ్యములని యెరుగు

    రిప్లయితొలగించండి
  7. శైలజ గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    ‘ఆర్జనంబు + ఉన్న = ఆర్జనంబున్న’ అవుతుంది. యడాగమం రాదు. చివరి పాదంలో గణదోషం. నా సవరణ.....
    ఆర్జనంబు గలుగ నాప్తుల మనుచును
    బంధుజనము వచ్చిపడుదు రింట
    పేద యైన వాడి పేరైన దలపరు
    బంధనము లవి క్షణ భంగురములు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    చాలా మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
    ‘మనిషి’ అనే ప్రయోగం సాధువు కాదు. అక్కడ ‘మనుజునకును’ అందాం.
    ‘పోవును ఒక్కడుగను’ అని విసంధిగా వ్రాయరాదు. దానిని ‘పోవుఁ దా నొక్కడుగను’ అని మారుద్దామా?

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
    =====*========
    నీరు గలిగిన బంధము నిండు కుండ
    నీరు లేకున్న బంధము నిండు కొనును
    పుడమి పైగల బాంధవ్య ములను గొలువ
    పట్టు గలదే పరమ శివా!బయలు నందు?

    (నీరు = ధనము, పట్టు=తూనిక రాయి)

    రిప్లయితొలగించండి
  9. బలమై, సత్కృతులందుఁ బెద్ద గణమై, ప్రాబల్యమై, విశ్రుతా
    ఖిలమై, జీవపరంపరాన్విత మహా గేహంబునై, ప్రేమన
    గ్గలమై, కష్టములందు తోడునిలువన్ కాదే సుబంధుత్వమీ
    యిలలోనెవ్వరికైన బంధుగణమే యిచ్చున్ మనస్థైర్యముల్.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
    ======*======
    గురుశిష్యులకు మధ్య గలదు గొప్ప బంధము,ఆలి మగల
    పరితోషముల మధ్య గలదు పసిడి బంధము,ఆవు దూడ
    పరివారముల మధ్య గలదు పాల బంధము,రాత్రి పగల
    పరిమాణముల మధ్య గలదు వసుధ బంధము,రామ రామ!(గురువర్య)!

    రిప్లయితొలగించండి
  11. సిరులలరెడు వేళలలో
    పెరుగును బాంధవ్యములును ప్రేముడి హెచ్చున్
    సిరులే మృగ్యములగుచో
    హరి హరి బాంధవ్య సరణి హరియించు కదా!

    రిప్లయితొలగించండి
  12. బంధనములు బెంచిన యెడ
    నింధనమై మలగి పోవు నీ బాంధవ్యమ్ముల్
    బంధుర మగు దైవ ధ్యానము
    నందున మదినిల్పి నంత నాకము నొందన్ !

    రిప్లయితొలగించండి
  13. శ్రీ నేమాని గురుదేవులు అతి మధుర మైన కందము వ్రాసినారు.
    శ్రీ రాజేశ్వరి అక్కయ్య గారు మంచి గంధపు కందము వ్రాసినారు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ వరప్రసాద్ గారి భావమునకు సరియైన పద్యము:
    మధ్యాక్కర:
    గురు శిష్యులకు మద్య గలుగు గొప్ప బంధము విద్య యనగ
    సరసమౌ బంధమ్ము గలుగు సతికి పతికి కుటుంబమని
    పరిపోషణమను బంధమ్ము పశువు దూడల మధ్య గలుగు
    పరిపూరకమను బంధమ్ము పగలు రాత్రుల మధ్య గలుగు

    రిప్లయితొలగించండి
  15. బాంధవ్యమ్ములు ముద్దుముద్దని కుటుంబాలందు ప్రేమాది సౌ
    గంధాలన్ వెదజల్లుచున్ దనరు నా కాలంబులున్ జెల్లగా
    బాంధవ్యమ్ములు వద్దు వద్దనుచు నేవారెవ్వరో యంచు నే
    బంధంబుల్ కనరాని నేటి గతి నే భాగ్యంబుగా నెంచుటో?

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురుదేవులకు నమస్కారములు
    మీరు సూచించిన విధముగా వ్యాఖ్యను సవరించితిని.

    జననమందిన దాదిగా మనుజునకును
    తల్లితండ్రులత్తలు మామ తాతమామ్మ
    పెండ్లియైనంత సతిపతుల్ పిల్లపాప
    బంధుజనమేర్పడును తాను బంధి తుడగు
    ఒక్కడుగ వచ్చి పోవు దానొక్కడుగను
    బ్రతుకు బాటను సత్య ధర్మము లొకటియె
    తోడు నీడగ నిల్చి కాపాడి నీకు
    ముక్తి నిచ్చెడి బాంధవ్య ములని యెరుగు

    రిప్లయితొలగించండి
  17. వరప్రసాద్ గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    నేమాని వారి సవరణను గమనించారు కదా!
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం ప్రశస్తంగా, మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    శైలజగారు చెప్పినట్లే బాంధవ్యాలన్నీ ఆర్థికపరమైనవన్న మీ పద్యం మనోహరంగా ఉంది.
    నాటికి, నేటికి బాంధవ్యాలలో మార్పుని అభివర్ణించిన మీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి భావంతో పద్యం వ్రాసారు. అభినందనలు.
    2,3 పాదాల్లో గణభంగం. మరికొన్ని లోపాలున్నాయి. నా సవరణతో మీ పద్యం....
    బంధనములు బెంచిన యెడ
    నింధనమై మలగి పోవు నీ బంధనముల్
    బంధుర దైవ ధ్యానము
    నందున మదినిల్పి నంత నాకము దొరకున్.

    రిప్లయితొలగించండి