26, జూన్ 2014, గురువారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 11

రామాయణము-
సీ.      రాజీవపత్రనేత్ర సుమిత్రయును (బాఢ
భవ్యతఁ గాంచెఁ బ్రభాయుతుని న)
తవిరోధి(కులుని నుతదివిజు ముదితకు
వలయు సహ)స్రాంశుభాసమాను
లక్ష్మణు, శత్రుఘ్ను, లాలితభూ(దేవు,
దివ్యరుచికలితు, ధృతిని నెన్ని)
కకు నెక్కు మోహనాకారులునౌ (స్వర్గ
వైద్యుల మాద్రి సుపర్వవినుత)
ఆ.వె.   లలితరూపులయిన లక్ష్మణ శత్రుఘ్ను
లుద్భవంబు నొంది రుర్విఁ బగలు;
వరుసఁ జక్రశేషపాంచజన్యములె త
గ భరతుఁడు సుమిత్ర కందులయ్యె. (౨౬)

భారతము-
తే. బాఢభవ్యతఁ గాంచెఁ బ్రభాయుతుని న
కులుని, నుతదివిజు ముదితకువలయు, సహ
దేవు, దివ్యరుచికలితు ధృతిని నెన్ని
స్వర్గవైద్యుల, మాద్రి సుపర్వవినుత. (౨౬)

టీక- (రా) నతవిరోధికులుని = వంగిన శత్రుసమూహము గలవానిని; సహస్రాంశు భాసమాను = సూర్యతేజస్సు గలవానిని; పాంచజన్యము = విష్ణుని శంఖము; స్వర్గవైద్యుల మాద్రి = అశ్వినులవలె. కందులు = కుమారులు.

(భా) మాద్రి = మాద్రీదేవి; స్వర్గవైద్యుల = అశ్వినులను; ఎన్ని = ప్రార్థించి.

1 కామెంట్‌:

  1. దినము నకునొక పద్యము దెలుపు చుండు
    నయ్య వారగు మాశంక రయ్య !గురువు
    గారికి మఱి సేతు నతులను గార వంబు
    తోడ సుబ్బరా వనునేను తుషితు నగుచు

    రిప్లయితొలగించండి