19, జూన్ 2014, గురువారం

సమస్యా పూరణం - 1449 (చేతకానివాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
చేతకానివాఁడు శ్రీహరి యట. 
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

 1. పదవి గలిగి నట్టి పామరుం డైనను
  చేత కాని వాడు శ్రీహరి యట
  పరమ పూజ్యు డైన పండితుని గాంచి
  పరిహ సింతు రంత పాప మనక

  రిప్లయితొలగించండి
 2. కష్ట మైన పనుల గలనైన దలపని
  చేత కాని వాడు ' శ్రీహరి', యట
  మట పడి యతనికి మార్గ నిర్దేశమ్ము
  జేసె కన్న తండ్రి చేర దీసి.

  రిప్లయితొలగించండి
 3. అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘పండితుని గాంచి’ అన్నచోట గణభంగం. ‘పండితుఁ గనుఁగొని’ అనండి.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. ‘యట/మటపడుచు నతనికి...’ అంటే సరి.

  రిప్లయితొలగించండి
 4. ’బ్రహ్మ సత్యం’ బొకటె పరమాత్మతత్వంబు
  కరణ చిత్త దేహ కర్మలేక
  నిశ్చలముగనెల్ల నియమింప నైష్కర్మి
  చేత కాని వాడు శ్రీహరి యట

  రిప్లయితొలగించండి
 5. చీర పట్టి లాగ సిగ్గైన లేకుండా
  పెద్ద లుండి రేమొ గద్దె లెక్కి!
  యార్తి తోడ బిలువ నాదుకొనగ కుండ
  చేత కాని వాడు శ్రీహరి యట!

  రిప్లయితొలగించండి
 6. యం.ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘సత్యం బొకటె’ అన్నచోట గణదోషం. ‘సత్య మొకటె’ అంటే సరి.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘ఆదుకొనగ కుండ’...?

  రిప్లయితొలగించండి
 7. చిన్నిబాలుడనియె చిత్రము ! చూడగా
  కూయ రానివెన్నొ కూసి తుదకు
  దారుణమ్ము చేయ,దండింప నెరుగని
  చేతకానివాఁడు శ్రీహరి యట !

  రిప్లయితొలగించండి

 8. ధర్మ హాని జేయు దనుజుల పాలిటి
  సింహ స్వప్న మగుట చేత, వారి
  పనులు సాగనీక పరిమార్చు చుండుట
  చేత, కాని వాడు శ్రీహరి యట

  రిప్లయితొలగించండి
 9. ప్రబలశత్రువగు జరాసంధు నెదిరింప
  చేతకానివాఁడు శ్రీహరి యట
  రాజధాని మార్చె రండు కృష్ణుని పని
  పట్టవలె నని శిశుపాలుఁ డనెను.

  రిప్లయితొలగించండి
 10. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  రాక్షసులకు కానివాడైన శ్రీహరిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. గురువుగారికి ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  చీర పట్టి లాగ సిగ్గైన లేకుండా
  పెద్ద లుండి రేమొ గద్దె లెక్కి!
  యార్తి తోడ బిలువ నాదుకొ కుండగ
  చేత కాని వాడు శ్రీహరి యట!

  రిప్లయితొలగించండి
 12. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  ధార్త రాష్ట్ర పాండు తనయుల సంధికై
  శాంతి దూత కర్మసాక్షి యతడు
  తగవు వచ్చి నపు డధర్మ పక్షము జేర
  చేత కానివాడు శ్రీహరి యట

  రిప్లయితొలగించండి
 13. చెడ్డ పనులు చేసి శ్రీ హరినే తూలి
  ఘోర పాపములను కోరి చేసి
  యంత్యమందు గొలువ నదెచాలు నను కొన్న
  చేతకానివాఁడు శ్రీహరి యట.

  రిప్లయితొలగించండి
 14. పంక్తి లోన నిలువ భక్తులు వేవేలు
  పంక్తి దాటి చనెడి ప్రముఖు లంత
  పూజ లెన్నొ గొనగ బొమ్మయై గాంచెడి
  చేతగాని వాడు శ్రీహరి యట !


  రిప్లయితొలగించండి
 15. నటన రాని వారు నాటకమును వేయ
  ప్రేక్షకులది చూచి పెదవి విరిచె
  ఆంగికమును లేదు హావ భావాలైన
  చేతకానివాఁడు శ్రీహరి యట

  రిప్లయితొలగించండి
 16. మరియొక పూరణ
  పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  భక్తవరుల పూర్వ పాపమ్ములన్నియు
  రిక్త మైన గాని ముక్తి నిడడు
  శత్రు వైన గాని శరణన్న శిక్షింప
  చేతగాని వాడు శ్రీ హరి యట

  రిప్లయితొలగించండి
 17. తీవ్రతపమొనర్చి దీక్షాపరుండుగా
  చిత్తమందు విష్ణుసేవనెంచి
  భక్తిమీర కోరు వరములకాదన
  చేతకాని వాఁడు శ్రీహరియఁట.

  రిప్లయితొలగించండి
 18. సహదేవుడు గారూ,
  సవరించిన పద్యంలోనూ రెండు దోషాలు. లేకుండా, ఆదుకోకుండా అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘లేకుండ,ఆదుకొనుటకైన’ అనండి.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ఎన్నళ్ల కెన్నాళ్ళకు! మీ పునరాగమనం వల్ల బ్లాగు ధన్యమయింది. చాలా సంతోషం!
  దేవాలయాల్లో విఐపిల తాకిడిని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘పెదవి విరిచి/ రాంగికమును...’ అనండి.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  కొద్ది రోజులుగా మీ పూరణలు కనిపించడం లేదు..
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. ముందు సిద్ధ మగును మొగమాట మేలేక
  చేతకానివాడు, శ్రీ హరి యట
  భక్త రామ దాసు బాధలు దరిజేర్చి
  నతడు వింటి వీవ యగ్రజుండ !

  రిప్లయితొలగించండి
 20. కందిశంకరార్యులకు ప్రణామములు. మీ అభిమానానికి కృతజ్ఞుడిని. బ్లాగుకు దూరమైన మాట నిజమే, ఆ వెలితి నాకు ప్రతిరోజు కలుగుతున్నది. ఇకనుండి బ్లాగుకు దూరం కాబోను.

  మీరు అందిస్తున్న "నిర్వచన భారత గర్భ రామాయణము" చాలా బాగున్నది గురువుగారూ. ఈ రోజే మొదటిసారి చూశాను. చాలా సంతోషము.

  ధన్యోస్మి.

  రిప్లయితొలగించండి
 21. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....

  ​జగడమందు వైరి సంహరించుట తన
  చేతకానివాఁడు శ్రీహరి యట
  తుదకు భీము నండఁ దునిమె జరాసంధు
  కర్మఫలము హరియు కాంచినాఁడు.​

  రిప్లయితొలగించండి
 22. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  సంతోషం!
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. నాగరాజు రవీందర్ గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. ప్రణామములు గురువుగారు...

  పనులు చేయ బోయి పరిహసించబడును
  చేత కాని వాడు, శ్రీహరి యట
  భక్తి తోడ దలచు భక్తుల నెప్పుడు
  కరిని గాచు రీతి గాచు చుండు

  రిప్లయితొలగించండి
 25. శైలజ గారూ,
  కొద్దిరోజులుగా మీ పూరణలు, పద్యాలు కనిపించడం లేదు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. అవును గురువుగారు,..ఈ సమ్మర్ అంతా కేంపులు తిరగడంతో నెట్ కి అందుబాటులో లేను..అందుచే మన బ్లాగుని చాలా మిస్సయ్యాను..ఈరోజు మళ్ళీ బ్లాగుని చూడగానే ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను...ధన్యవాదములు...

  రిప్లయితొలగించండి
 27. ఎందు జూడ తానె యిందందు నననేల
  ననెద వీవు నాకు నగుపడంగ
  చేతకానివాఁడు శ్రీహరి, యట కంబ
  మందు నో కుమార! యతడు గలడె?

  రిప్లయితొలగించండి
 28. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం
  చీర పట్టి లాగ చెల్లదనక జూచి
  తలలు వంచి నారు తాత లుండి
  యార్తి తోడ బిలుచు నతివల వీడుట
  చేత కాని వాడు శ్రీహరి యట!


  రిప్లయితొలగించండి
 29. మిస్సన్న గారూ,
  హిరణ్యకశిపుని మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  సవరించిన పద్యంలా కాకుండా కొత్త పూరణలాగా ఉంది. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. చదువుకొన్నరాజుచతికిలబడుతుండు
  చేయుపనులతనికిచేతకాక
  తెలివిఉన్నపామరుడుమిన్నధరణిలో
  చేతకానివాఁడు శ్రీహరి యట

  రిప్లయితొలగించండి