2, జూన్ 2014, సోమవారం

సమస్యాపూరణం – 1431 (సాహితీసంపదకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సాహితీసంపదకు విభజనము గలదె?

32 కామెంట్‌లు:

  1. కలసి యున్నట్టి మనసుల కలుములకును
    వియ్యమందిన బంధుత్వ విమల సిరికి
    తెలుగు పిలుపుల నెలకొన్న తీపి రుచికి
    సాహితీసంపదకు విభజనము గలదె?

    రిప్లయితొలగించండి
  2. ధనము ధాన్యము వనములింధనములకును
    జలము పలువిధ సాయుధ బలములకును
    విభజనము సాధ్యమగు రాష్ట్ర విభజనమున
    సాహితీసంపదకు విభజనము గలదె?

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. ప్రజల కోరికతో పెద్ద రాష్ట్రములను
    చిన్న రాష్ట్రములుగ విభజింపవచ్చు
    పైకమును సోదరుల మధ్య పంచవచ్చు
    సాహితీ సంపదకు విభజనముగలదె?

    రిప్లయితొలగించండి
  5. భేధ యోగము భూభోజ్య విత్తమందు
    బాగు, గాన భావరసాలు భాగమగునె
    గీత శిల్పాల చిత్రాల కేద్ది హద్దు
    సాహితీ సంపదకు విభజనముగలదె?

    రిప్లయితొలగించండి
  6. భౌతికంబైన వాటి విభజనము నొప్పు
    మనిషి మేధోజనిత పంచు మాన్యు డెవరె?
    పరవశించగ దొరలెడు భాగ్య మైన
    సాహితీ సంపదకు విభజనము గలదె?

    రిప్లయితొలగించండి
  7. సాహితీ సంపదకు విభజనము గలదె ?
    లేదు సరిగదా యుండదు ,నాదుమాట
    నిజము . మాట్లాడు భాషల పసను బట్టి
    వేరు వేరని యనిపించు వినుత శీల !

    రిప్లయితొలగించండి
  8. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మేధోజనిత..’ అని అసంపూర్తిగా ఉంది.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మీరటు వారిటు వేరుగా చనుడంచు
    .....కొలువుల పంచగ వలను చూడ
    భవనాల రహదార్ల ప్రవహించు జలముల
    .....వాటాల విభజించ వలను చూడ
    పట్నాల నగరాల పల్లెల తండాల
    .....పలు హద్దులను పంప వలను చూడ
    విద్యుత్తు వైద్యము విద్యల నిలయాల
    .....వారువీరికి నెంచ వలను చూడ

    తెలుగు కావ్యాల గ్రంథాల పలుకుబడుల
    పద్య గద్యాల నాటక ప్రహసనముల
    ప్రజల హృదయాల లోతుల పదిలమైన
    సాహితీసంపదకు విభజనము గలదె?

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్నగారూ! మీ పూరణము ప్రశస్తముగా నున్నది. అభినందనములు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారికీ, మిత్రులు మధుసూదను గారికీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, కవిపండితమిత్రులందఱికిని నమోవాకములు!

    ధనము భూములు వస్తువుల్ పెనఁగి పెనఁగి
    విభజనము సేయవచ్చును వేగిరముగ!
    మనమునందున నిబిడమై తనరునట్టి
    సాహితీసంపదకు విభజనము గలదె?

    రిప్లయితొలగించండి
  14. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. తెలుగు నేలను రెండుగా త్రెంప వచ్చు
    తెలుగు భాషను సంస్క్రుతిన్ త్రెంప తరమె?
    సాహితీ సంపదకు విభజనము గలదె?
    తెలుగు వెలుగును సతతము తీరుగాను

    రిప్లయితొలగించండి
  16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ అన్నపరెడ్డి సత్యనారయణ రెడ్డి గారు! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    టైపు పొరపాటు కావచ్చు - 2వ పాదములో "సంస్కృతి" అని ఉండాలి.
    సరిచేయండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ సుబ్బా రావు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    3వ పాదములో యతి మైత్రి లేదు. సరిచేయండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    విమల సిరి అను సమాసము సాధువు కాదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ చంద్రమౌళి గారు: శుభాశీస్సులు,
    మీ పద్యము బాగుగ నున్నది.
    3వ పాదమును ఇలాగ మార్చుదాము:
    గీత శిల్ప చిత్రాదుల కేది హద్దు?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    మీ ఆరోగ్యం ఎలా ఉంది? రెండు మూడు రోజులుగా మీ వ్యాఖ్యలు బ్లాగులో కనిపించకపోయే సరికి ఏదో చెప్పలేని లోటు అనిపించింది.
    నేను మళ్ళీ వృద్ధాశ్రమంలో చేరాను. మనస్సు కుదుటపడలేదు. అందువల్ల మిత్రుల పూరణలలోని లోపాలను గుర్తించలేకపోయాను.

    రిప్లయితొలగించండి
  22. పండిత నేమోనివారికి పాదాభివందనములు. సూచనకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  23. పండిత నేమోనివారికి పాదాభివందనములు. సూచనకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  24. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
    పండిత నేమాని గారూ ! ధన్యవాదములు.
    మీకు ఆరోగ్యము త్వరగా చేకూరాలని ఆకాంక్షించుచున్నాను.

    సవరణతో....నా పూరణ...

    కలసి యున్నట్టి మనసుల కలుములకును
    వియ్యమందిన బంధుత్వ వేడుకలకు
    తెలుగు పిలుపుల నెలకొన్న తీపి రుచికి
    సాహితీసంపదకు విభజనము గలదె?

    రిప్లయితొలగించండి
  25. తెలుగు రాష్ట్ర విభజనము సలిపె గాక!
    తెలుగు వారిని విడదీసి తీరె గాక !
    తెలుగు సాహిత్యము ప్రజల కలిపి యుంచు
    సాహితీసంపదకు విభజనము గలదె?

    రిప్లయితొలగించండి
  26. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు! శుభాశీస్సులు.
    మీ సవరణ బంధుత్వ వేడుకలు కూడా సాధువు కాదు.
    ఇలాగ మార్చుదము:
    వియ్య మందిన బంధుల వేడుకలకు - స్వస్తి.

    రిప్లయితొలగించండి
  27. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  28. గురువులకు ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి నమస్కారములు.

    వేరు కుంపటి సాధించి మురిసెనొకడు
    గుండెకోతకు దుఃఖించుచుండె నొకడు
    మనిషి దూరమైనను మంచి మనసు గలిగి
    మసలు కొనవలె నుభయులు మైత్రి తోడ

    తగవు లాడక సఖ్యత గలిగి యున్న యెడల
    తలపు హితుల మదిలోన తరుగ గలదె?
    ఆస్తులను పంచుకొన సాద్యమౌను గాని
    సాహితీ సంపదకు విభజనము గలదె?

    రిప్లయితొలగించండి
  29. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. Sree PSR Moorti garu! శుభాశీస్సులు.
    మీ 2 పద్యములును బాగుగ నున్నవి. అభినందనలు.
    1వ పద్యము 1వ పాదములో ప్రాస యతి నియమములు పాటింపబడ లేదు. వేరులో "రు"కు ముందు అక్షరము దీర్ఘము - కాని యతి స్థానములో మురిసెలో "రి"కి ముందు దీర్ఘ అక్షరము లేదు.
    2వ పద్యము 1వ పాదములో అక్షరములు ఎక్కువగా నున్నవి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  31. వెలుగు రేఖల కెచటైన కులము గలదె?
    గాలి, నీటికి రూపాల గోల గలదె ?
    ప్రతిభ కేనాడు ప్రాంతాల పరిది గలదె ?
    సాహితీ సంపదకు విభజనము గలదె ?

    రిప్లయితొలగించండి
  32. ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి గారూ,
    నేమాని వారి సూచనలను గమనించారు కదా!
    మొదటి పద్యం మొదటిపాదాన్ని ‘వేరు కుంపటి సాధించి వెలిగె నొకడు’ అనండి.
    రెండవ పద్యంలో మొదటిపాదం చివర ఉన్న ‘యెడల’ తొలగించండి. రెండవ పాదాన్ని ‘తలపు హితుల మనమ్ములో...’ అనండి.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి