15, జూన్ 2014, ఆదివారం

సమస్యా పూరణం - 1445 (భూతప్రేతముల పూజ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్.

33 కామెంట్‌లు:

  1. వ్రాతలను మార్చుచుండును
    భూత ప్రేతముల పూజ, ముక్తి నొసంగున్
    భూత గణాధీశుని సు
    ప్రీతిగ నొనరించు పూజ వినయమ్మెసగన్

    రిప్లయితొలగించండి
  2. చేతబడి క్షుద్ర విద్యలు
    భూత ప్రేతముల పూజ , మోక్షము నొసగున్
    భూతేశుని భక్తి గొలిచిన
    కేతనమున శాంతి దొరికి కీడులు తొలగున్

    రిప్లయితొలగించండి
  3. ప్రేతవనమునకు బంపును
    భూత ప్రేతముల పూజ, మోక్షము నొసగున్
    పీతాంబరు సంస్మరణము ,
    భూతేశుని నిత్య పూజ పోకార్చఘముల్

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. అక్కడ ‘భూతేశు భక్తి గొలువ ని/కేతనమున...’ అనండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పోకార్చు నఘముల్’ అనవలసింది. కానీ గణదోష మవుతుంది. కనుక ‘పోకార్చు వెతల్’ అందామా?

    రిప్లయితొలగించండి
  5. రోత గలిగింప జేయును
    భూత ప్రేతముల పూజ, ముక్తి నొసంగున్
    భూతదయ, నీతి వర్తన,
    మాతాపితల కిడుసేవ మనుజుల కెల్లన్!

    రిప్లయితొలగించండి
  6. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవిపండితమిత్రులందఱికిని సుమనస్సుమాంజలులు!

    చైతన్య మిడదు విడువుఁడు
    భూతప్రేతముల పూజ! ముక్తి నొసంగున్
    జైతన్యమిడియుఁ దేర్చును
    బ్రీతిని దైవంపుఁ బూజ వినయముఁ బెంచున్!

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. చేతురు నిత్తము గుంజగ
    భూతప్రేతముల పూజ ; మోక్షము నొసఁగున్
    చేతోమోదమ్మలరగ
    గీతాచార్యుని స్మరించ కించిద్భక్తిన్

    రిప్లయితొలగించండి
  10. కాతరము గలుగ జేయును
    భూత ప్రేతముల పూజ ,మోక్షము నొసగున్
    భూ తే శుని పూజించిన
    భూతేశు డె యింక నిచ్చు భూరిగ శ్రీ లన్

    రిప్లయితొలగించండి
  11. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
    సవరణ సూచించిన మీకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  12. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నిత్తము గుంజన’....?
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    నా వ్యాఖ్య మిమ్మల్ని బాధించి ఉంటే క్షమించండి. అంతేకాని బ్లాగుకు దూరం కావద్దు. మీ లోటు కనిపిస్తున్నది.

    రిప్లయితొలగించండి
  14. భూతము లభూత కల్పన,
    లేతీరుగ లేనివాని నెంచి కొలుతువో!
    హేతువు లే, దేవిధముగ
    భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్?

    రిప్లయితొలగించండి
  15. నేతితొ నిప్పార్పెడి హఠ
    జాతమదేం మాంసమద్య ఝషముద్ర విధిన్?
    ఆతత్త్వమసి ఫలమదేం?
    భూత ప్రేతముల పూజ; ముక్తి నొసంగున్

    రిప్లయితొలగించండి
  16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ...

    చేతబడి యని తెగడుదురు
    భూతప్రేతముల పూజ; మోక్షము నొసఁగున్
    భూతపతి శివునిఁ గొలువన్
    జాతకమే మారు నపుడు శంకరు దయతోన్.

    రిప్లయితొలగించండి
  17. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    యం.ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నేతితొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ ‘నేతిని’ అని తృతీయార్థంలో ద్వితీయను ప్రయోగించవచ్చు. ‘అదేం’ అని రెండుసార్లు వ్యావహారికాన్ని ప్రయోగించారు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. చంద్రమౌళి రామారావు గారి పూరణ :

    భూతాదులవాస్తవములు
    భీతావహ భావజనిత వికృతాకృతు, లా
    హూతము గావించిన త
    ద్భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్
    (యద్భావమ్ తద్భవతి)

    రిప్లయితొలగించండి
  19. చంద్రమౌళి రామారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శంకరయ్య గారు,
    పద్య పద శుద్ధికి ప్రణామములు. మీ సూచనలను గమనించి మార్చాను.

    నేతిని నిప్పార్పెడి హఠ
    జాతవిధానంబదేది విధి పంచ ’మ’లన్?
    ఆతత్త్వమసి ఫలంబెది?
    భూత ప్రేతముల పూజ; ముక్తి నొసంగున్

    పంచ ’మ’లు = పంచ ’మ’కారప్రక్రియలు

    రిప్లయితొలగించండి
  21. చంద్రమౌళి గారూ,
    సవరించిన పూరణ బాగున్నది.
    కాని రెండవ పాదంలో యతి తప్పింది.
    ‘జాత విధానం బదేది సరి పంచ‘మ’లన్’ అంటే?

    రిప్లయితొలగించండి
  22. చంద్రమౌళి గారూ,
    సత్పంచ‘మ’లన్... అని కూడ అనవచ్చు.

    రిప్లయితొలగించండి
  23. వాతాత్మజు నమ్మి కొలువ
    భీతిని తొలగించి బలము పెంపొనరించున్
    పాతర వేయును పట్టిన
    భూత ప్రేతముల,పూజ మోక్షము నొసగున్

    రిప్లయితొలగించండి
  24. సహదేవుడు గారూ ! బాగుంది...నేనూ మీ బాటలోనే

    ప్రీతిగ మనసున దలచుచు
    చేతులనే మోడ్చి గొల్వ జేజే లనుచున్
    వాతాత్మజు, తొలగించును
    భూతప్రేతముల, పూజ మోక్షము నొసఁగున్.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ శంకరయ్యగారు,
    అవును.
    నేను సమ పంచ ’మ’లన్ అనే వ్రాసి, అర్థవంతంగా చేయబోయి పొరపాటున విధి పోస్ట్ ఐనది. క్షమించాలి.

    రిప్లయితొలగించండి
  26. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. మల్లెల సోమనాధశాస్త్రి గారి పూరణలు

    భూతములన్నియు వెలిగెడు
    పూతమ్మగునాత్మ దైవముగనుక,వానిన్,
    ప్రేతమ్మది శుద్ధినిగన
    భూత ప్రేతములపూజ మోక్షము నొసగున్

    భూతల మందున శాక్తే
    యుల్,తంత్రముగను బలిహరయుతమౌ పూజల్,
    వే తలప,గొప్పటండ్రా (గొప్ప+అట+అండ్రు+ఆ)
    భూత ప్రేతములపూజ మోక్షము నొసగున్

    రిప్లయితొలగించండి
  28. పాతక మందురు సలిపిన
    భూత పిశాచముల పూజ, మోక్షము నొసగున్
    భూతేశుడు గావున జేతుము
    సంతత పరమేశనామ సంకీర్తనమున్

    రిప్లయితొలగించండి
  29. మాతకు ప్రీతిగ నొకరుడు
    భూతమ్ముల బలిని యిచ్చిమోదము నీయన్
    చేతో తృప్తి, మసన సం
    భూత,ప్రేతముల పూజమోక్షము నొసగున్

    రిప్లయితొలగించండి
  30. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణ రెండవ పాదంలో ప్రాస తప్పింది. నా సవరణ... ‘భూతలమున శాక్తేయు లే/వో తంత్రముగను ....’
    *
    ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘భూతేశుఁ డనుచుఁ జేతుము’ అనండి.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. భూతమ్ములు వోటరులై
    ప్రేతమ్మై నల్లధనము ప్రేయసులవగా
    చాతబడి చేయు నేతకు
    భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్

    రిప్లయితొలగించండి


  32. గోతాము లోన కట్టెడు
    భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్,
    చేతము రారండి జిలే
    బీ, తరముగనిప్పుడే విభిన్నపు జోతల్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. నేతా! దిగ్విజయుండా!
    తాతా! నా మాట వినుము తడబడకుండన్!
    ప్రీతిగ క్షవరమ్మౌచును
    భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్

    రిప్లయితొలగించండి