29, జూన్ 2014, ఆదివారం

సమస్యా పూరణం - 1458 (సతతము బాధించునట్టి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
సతతము బాధించునట్టి స్వామికి జేజే.

33 కామెంట్‌లు:

  1. కతలను జెప్పుచు జనులను
    సతతము బాధించు నట్టి స్వామికి జేజే
    వెతలను బాపెద ననుచును
    నుతజల బావులను జూపి నోరూ రింపన్

    రిప్లయితొలగించండి
  2. అక్కయ్యా,
    పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని బాధించే స్వామికి జేజే అనడం ఏమిటి? వ్యంగ్యార్థమా? ‘నుతజల బావులను’ అని సమాసం చేయరాదు కదా! అక్కడ ‘నుతజల కూపముల’ అందాం.

    రిప్లయితొలగించండి
  3. గతకాలపు మగనాలులు
    సతతము బాధించు నట్టి స్వామికి జేజే
    లతి భీతిని యని రిప్పుడు
    సతులక జేజేలు జేయు స్వాములు లేరా !

    రిప్లయితొలగించండి
  4. హితవచనమ్ములు దెల్పుచు
    ప్రతికూలపుపని తగదని పలువిధములుగా
    బ్రతుకునకర్ధము జెప్పుచు
    సతతము భాధించునట్టి స్వామికి జేజే!

    రిప్లయితొలగించండి
  5. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. శ్రుతులన్ హేళనజేయుచు
    నతివల పరిహాసమాడి యానందించే
    దితిపుత్రజాతి జనులను
    సతతము బాధించునట్టి స్వామికి జేజే.

    రిప్లయితొలగించండి
  7. యతులున్ ప్రాసలలో పరి
    మితమగు జ్ఞానంబెమెచ్చి,మేలు కవితలన్
    ప్రతి దిన మల్లుడటంచును
    సతతము బాధించునట్టి స్వామికి జేజే.

    రిప్లయితొలగించండి
  8. క్రతువులు పూజలటంచు న
    మితముగ నార్జించు యతియె మిధ్యావాక్కుల్
    ఋతవాదిగబల్కి భువిని
    సతతము బాధించునట్టి స్వామికి జేజే

    రిప్లయితొలగించండి
  9. వెతలను బాపున కొలిచిన
    మితిమీరిన వేళనైన మిధ్యయె యగునా
    హతవిధి యను సందియమున
    సతతము బాధించు నట్టి స్వామికి జేజే !

    (అంటే అనుమానం వచ్చేలా పరీక్ష పెడుతుంటాడని నాభావం)

    రిప్లయితొలగించండి
  10. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....

    ​గతమైన పాపఫలమున
    సతతము బాధించునట్టి స్వామికి జేజే
    మతకరి చేష్టలను విడిచి
    యతి భక్తిని తనను కొలువ హరి రక్షించున్.​

    రిప్లయితొలగించండి
  11. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఆనందించే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘అలరెడి వారౌ’ అందామా?
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
    మీ రెండవ పూరణ కూడ బాగున్నది.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాలకృష్ణుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి రామారావు గారి పూరణ :
    అతనుండై సుమ శరముల
    మతిమంతుల యతుల యతుల (అతుల) మతులన్ ధృతులన్
    స్థితులన్ మార్చుచు, తీయగ
    సతతము బాధించు నట్టి స్వామికి జేజే !

    రిప్లయితొలగించండి
  13. వెతలను దీర్చగ వేడిన
    పతితుల కొక దారి జూపి పాతకములపై
    మతుల మరల్చుచు బోధల
    సతతము బాధించునట్టి స్వామికి జేజే

    రిప్లయితొలగించండి
  14. చంద్రమౌళి సూర్యనారాయణ గారి పూరణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  15. చతురత దురహంకారుల
    అతివల వేధించునట్టి అధమాధములన్
    బ్రతుకగ నీయక వారిని
    సతతము బాధించునట్టి స్వామి(పాలించుప్రభువు)కిజేజే!

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ! ధన్యవాదములు. అది మా అన్నయ్య గారి పూరణ

    రిప్లయితొలగించండి
  17. మల్లెల వారి పూరణలు

    ధ్రృతిగన విద్దెల, గురువదె
    వెతలను గూర్చుచునుతాను విద్యార్ధుల, నే
    ఋతువున యందున శిక్షణ
    సతతము బాధించునట్టి సామికి జేజే

    వ్రతముల భక్తిని నేమపు
    యతముగ, జేయగ ఫలితము, యోగమునిడుగా
    వెతలవి తొలగును ననుచును
    సతతము బాధించునట్టి సామికి జేజే

    రిప్లయితొలగించండి
  18. పథకంబుల యవినీతుల
    నుతికారేయగ దలంచి యొకడే యైనన్
    వ్యతిరేకించెడు పనిలో
    సతతము బాధించు నట్టి (శ్రీ సుబ్రమణ్య) సామికి జేజే!

    రిప్లయితొలగించండి
  19. శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశెస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    అతి మెల్లగ అను సమాసము సాధువు కాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ చంద్రమౌళి రామా రవు గారి పద్యము బాగుగ్ నున్నది.
    2వ పాదములో యతుల యతుల అనుచోట యడాగమము రాదు. నుగాగమము చేయవలెను కదా! స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. చంద్రమౌళి రామారావు గారూ,
    వృత్యనుప్రాసాలంకారంతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘త-థ’ ప్రాస ఆమోదయోగ్యం కాదేమో?

    రిప్లయితొలగించండి
  22. పండిత నేమాని వారూ,
    రవీందర్, రామారావు గారల పూరణలలో మీరు పేర్కొన్నవి దోషాలే. ధన్యవాదాలు.
    రవీందర్ గారి పద్యంలో నేనేదైనా సవరణ చేయగలనేమో అని ప్రయత్నించాను కాని విఫలుడనయ్యాను.

    రిప్లయితొలగించండి
  23. పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమస్సుమాంజలులు.

    వెతలను దీర్చుచు శిష్టుల
    హితమునుఁ బెంచుచును, వేద హిత దూరులునున్
    మతిహీన దుష్ట దితిజుల
    సతతము బాధించునట్టి స్వామికి జేజే!

    రిప్లయితొలగించండి
  24. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. అతివా !దగ్గర కాకుము
    సతతము బాధించు నట్టి స్వామికి, జేజే
    వితరణ బుద్ధిని గలిగిన
    నతులిత మగుసుగుణ శీ లు నతనికి నెపుడున్

    రిప్లయితొలగించండి
  26. శంకరయ్యగారూ, రవీందర్ గారి "అతి మెల్లఁగ"ను, "సుతి మెత్తఁగ" అంటేనో...?

    రిప్లయితొలగించండి
  27. నేమాని పండితులు అనారోగ్య తీవ్రతతో బాగా బాధ పడుచున్నట్లు తెలియుచున్నది. వారికి త్వరితముగా సంపూర్ణ ఆరోగ్యము కలగాలని అందరమూ కోరుకొందాము.

    రిప్లయితొలగించండి
  28. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ సూచన చాలా బాగుంది. ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    నేమాని వారికి శీఘ్రంగా స్వాస్థ్యాన్ని ప్రసాదించవలసిందిగా శ్రీరామచంద్రుని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  29. గురువుగారికి ధన్యవాదములు, సవరించిన పద్యం:
    గతి దప్పిన యవినీతుల
    నుతికారేయగ దలంచి యొకడే యైనన్
    వ్యతిరేకించెడు పనిలో
    సతతము బాధించు నట్టి (శ్రీ సుబ్రమణ్య) సామికి జేజే!

    రిప్లయితొలగించండి
  30. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    1,బ్రతుకున తమ కలలన్నియు
    నితముగ సత్యమ్మొనర్ప నేరక సతులన్
    వ్రతములు జేయు మటంచును
    సతతము బాధించు నట్టి స్వామికి జేజే
    2. గతమది వ్యర్ధము. భావిని
    వెతలను దీర్చెదమటంచు విధి పూర్వకమౌ
    నతిగా పన్నులు వైచుచు
    సతతము బాధించు నట్టి స్వామికి జేజే
    3.అతులిత రుచులను గోరుచు
    పతి యొక్కడు వంటకముల పస లేదనుచున్
    సతులకు యాతన వెట్టుచు
    సతతము బాధించు నట్టి స్వామికి జేజే

    రిప్లయితొలగించండి
  31. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. అతిగా కోరుచు కుడుములు
    వ్రతములతో నిరువది యొక పత్రులు ఫలముల్
    వెతలిడు గుంజిళ్ళిండని
    సతతము బాధించునట్టి స్వామికి జేజే!

    రిప్లయితొలగించండి
  33. గతుకుచు నైవేద్యమ్మును
    చతికిలబడి లోగిలందు చాదస్తమ్మౌ
    కతలను జెప్పుచు బోరుగ
    సతతము బాధించునట్టి స్వామికి జేజే

    రిప్లయితొలగించండి