8, జూన్ 2014, ఆదివారం

పద్యరచన - 584

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. గురుకులము నందు శిష్యులు
    గురువుల యెడభక్తి తోన కూరిమి చదువన్
    వరముల నందుచు దక్షిణ
    పరిపరి విధములు గనిచ్చె పరమ ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  2. అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. ముని యాశ్రమంపు బోధలు
    వినుటది శిష్యులకె గాదు వేడుక తోడన్
    తినుటను మరచియు ప్రాణులు
    కనులారగ యతుల గాంచ, కమనీయంబౌ!

    రిప్లయితొలగించండి
  4. శిష్య వర్గము దోడన చెన్ను గాను
    చెట్టు క్రిందన గురువునా శీ ను డయ్యి
    చేయు చుండెను బోధన సీ త ! గనుము
    గురుకు లములేను బూర్వము గురుతరములు

    రిప్లయితొలగించండి
  5. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. వేద విద్యల గురువులు ప్రీతితోడ
    చెప్పు చుండగ వనమున చెట్టుక్రింద
    వినుచు నుండెను మృగములు వేడ్క తోడ
    వింత దృశ్యము కనులకు విందు జేసె


    రిప్లయితొలగించండి
  7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ప్రకృతి యొడిలోన విద్యల బడయు వారు
    యోగి పుంగవు లౌచును సాగినారు
    కరకు భవనాల విద్యల గాంచి నేడు
    విలువ లేనట్టి చదువులన్ తులువ లైరి

    రిప్లయితొలగించండి
  9. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. అది వేదభూమిగా ఖ్యాతిని గాంచుచు
    ....పరగుచు నున్నట్టి భరత భూమి
    యందతి పావనమైనట్టి నైమిశా
    ....రణ్య మా కమనీయ ప్రాంతమందు
    వేద శాస్త్ర పురాణ విజ్ఞాన వేత్తయౌ
    ....నట్టి సూతర్షి పుణ్యాశ్రమమ్ము
    నయ్యాశ్రమమ్ములో నహరహమ్మును గడు
    ....శ్రద్దాళులైన శిష్యవర గణము
    పరమ భక్తితో గొలువుగ భద్రశీలి
    యపర పద్మాసనుండయి యలరుచుండి
    శౌనకాదుల కెల్ల వాత్సల్య మలర
    నఖిల విద్యల నేర్పు నిరంతరమ్ము

    రిప్లయితొలగించండి
  11. నేమాని పండితార్యా! చిత్రాన్ని సూతర్షి ఆశ్రమముగా భావించి అందమైన సీసంలొ వర్ణించిన మీకు జోహార్లు.

    రిప్లయితొలగించండి
  12. చిక్కని అరణ్యమందున
    చక్కని ప్రకృతి ఒడిలోన చదువులు సాగెన్
    ఋక్కులను వల్లె వేయగ
    నక్కడ లేళ్ళును నెమళ్ళు నాడుచు నుండెన్

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    మిస్సన్న గారు ప్రశంసించినట్టు మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. వదలక శిష్యు లందరును వైభవ మొప్పగ నీతి శాస్త్రముల్
    ముదముగ యుద్ధవిద్యలును బోధన చేయగ చెట్టునీడలో
    పదిలముగాను నేర్చుకొనుచు ప్రజ్ఞత నొందిరి, నాశ్రమమ్ములో
    కుదురుగ నున్న జంతువుల కూరిమి గాంచుచు స్నేహశీలురై!

    రిప్లయితొలగించండి
  15. హరిత వృక్షమ్ముల యాశ్రమ పరిధిలో
    .....పచ్చని పచ్చిక బయలు నందు
    హరిణమ్ము లొక వంక హాయిగా తిరుగాడ
    .....నెమిలి జంటలు ప్రేమ నిండి యాడ
    నైమిశారణ్యమునన్ మునిపుంగవుల్
    .....శౌనకాదులు జేరి శ్రద్ధ తోడ
    సూత పౌరాణికు సూక్తుల వినగోరి
    .....పరివేష్టితులు గాగ నరుగు చెంత

    వేద శాస్త్ర పురాణాల వివిధ కథల
    శిష్యులకు సంతసమ్మున చెప్ప నతడు
    ప్రకృతి పరవశ చిత్తయై పరిఢవిల్లె
    భరత ధాత్రి విభూతులు పావనములు.

    (నేమాని పండితులు చూపిన బాటలో)



    రిప్లయితొలగించండి
  16. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో ‘నేర్చుకొనుచు’ అన్నచోట గణభంగం. అక్కడ ‘నేర్చుచును’ అంటే సరి.
    ‘వైభవ మొప్పగ’ అన్నది ‘భక్తి దలిర్పగ’ అయితే?
    *
    మిస్సన్న గారూ,
    పావనమైన భారత విభూతిని వర్ణిస్తూ మీరు చెప్పిన పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. ప్రకృతి యొడిలో గురుకులము
    లకుంఠితంబైన దీక్ష లలవడ జేయన్
    శుక శౌనకాదు లెల్లరు
    సకలంబును నేర్చి రచట సాత్విక పగిదిన్

    రిప్లయితొలగించండి
  18. సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. ప్రకృతి యొడిలో గురుకులము
    లకుంఠితంబైన దీక్ష లలవడ జేయన్
    శుక శౌనకాదు లెల్లరు
    సకలంబును నేర్చి రచట సాత్విక పగిదిన్

    రిప్లయితొలగించండి
  20. గురుదేవులకు నమస్సులు, సవరణకు ధన్యవాదములు, సవరణతో....

    వదలక శిష్యు లందరును భక్తి దలిర్పగ నీతి శాస్త్రముల్
    ముదముగ యుద్ధవిద్యలును బోధన చేయగ చెట్టునీడలో
    పదిలముగాను నేర్చుచును ప్రజ్ఞత నొందిరి, నాశ్రమమ్ములో
    కుదురుగ నున్న జంతువుల కూరిమి గాంచుచు స్నేహశీలురై!

    రిప్లయితొలగించండి
  21. శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
    మీరు నాయందు అభిమానముతో ప్రశంస జేసేరు.
    నిజానికి ఇంకా ఎక్కువ పద్యములతో ఒక మంచి ఖండిక వ్రాసి యుంటే బాగుగ నుండును. కాని నేను ఇంకా తేరుకో లేకపోతున్నాను. శారీరిక స్వస్థతతోనే మానసిక స్వస్థత బాగు పడును కదా.
    మీ పద్యము కూదా మనోహరముగ నున్నది. ప్రకృతి వర్ణనకి ప్రాముఖ్యము నిచ్చేరు కదా. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. పండిత నేమాని వారూ,
    మీరు సత్వరమే కోలుకుని నూతనోత్సాహంతో బ్లాగు కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. నేమాని పండితార్యా మీకు శీఘ్రముగా శారీరక స్వాస్థ్యము చేకూరి మరింత మనోఙ్ఞమైన పద్య ఖండికల నందించగలరని అభిలషిస్తున్నాను.

    రిప్లయితొలగించండి