21, జూన్ 2014, శనివారం

సమస్యా పూరణం - 1451 (పాలు త్యజించి నీరమును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
పాలు త్యజించి నీరమును పానమొనర్చును హంసలెప్పుడున్.
(ఒకానొక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

 1. నీలపు టాకశం బునను నీరము నింపిన దెవ్వరో గదా ?
  గాలికి నూయలూ గుచును గానము జేయగ కోకిలే ల గో
  పాలుని వింతలే యనగ ప్రాణుల కెంతటి భాగ్య మబ్బెనో
  పాలు త్యజించి నీరమును పాన మొనర్చును హంస లెప్పుడున్

  రిప్లయితొలగించండి
 2. అక్కయ్యా,
  ఉత్పలమాలను సలక్షణంగా నిర్దోషంగా మంచి ధారతో వ్రాశారు. బాగుంది. అభినందనలు.
  కాని హంస పాలను వదలి నీటిని త్రాగడం దైవలీల కాదు కదా!

  రిప్లయితొలగించండి
 3. నమస్కారములు
  కానీ పాలను నీటినీ వేరు చేయగల శక్తి మరి ఒక్క హంసకే ఉంది కదా ,అందుకని దైవ లీల అనుకున్నాను అదన్న మాట అసల్ సంగతి ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 4. పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమోవాకములు.

  వేలుపు గొప్ప యిద్దె! సుకవీశుల కిద్దియె సద్విశిష్టమౌ
  కీలకమైన యంశమయ కేవల నీరము శేషమౌనటుల్
  గ్రోలఁగ నెంచుచుంట! సుమ కోమల చంచువుచేతఁ ద్రావఁగన్
  బాలు, త్యజించి నీరమునుఁ, బాన మొనర్చును హంస లెప్పుడున్

  రిప్లయితొలగించండి
 5. గుండు మధుసూదన్ గారూ,
  వాహ్! చక్కని విరుపులతో అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. చాల విశేషమే వినగ సాధ్యమదెట్టులొ చూచినారటే
  పాలను నీటినే గలిపి ప్రక్కన నుంచిన చెంతజేరి లో
  పాలను చూపబోక తమపాలుగ ద్రావగ వేరుచేయుచున్
  పాలు, త్యజించి నీరమును, పాన మొనర్చును హంస లెప్పుడున్

  రిప్లయితొలగించండి
 7. నేనూ మధుసూదన్ గారిలాగానే పాలను విరిచాను.

  రిప్లయితొలగించండి
 8. చాలమి క్షీర సంపదకు సంస్థలు నీరము తోడుజేసి యా
  పాలను విక్రయించి తమ భాగ్యము నద్భుతరీతి పెంచ,తా
  మేలును గోరి క్షీరమును మ్రింగి ఋజన్మరణించ బోక నా
  పాలు త్యజించి నీరమును పానమొనర్చును హంసలెప్పుడున్

  రిప్లయితొలగించండి
 9. పాలకవర్గమందు తమవారికినిత్తురు మంత్రిమండలిన్
  చాలిక మీదుసేవలని సాగగఁజేతురు వైరివర్గమున్
  పోలిక మాకు పాలకని పొంగుచు నాధవళంపునీరమున్
  పాలు, త్యజించిన్ నీరమును, పానము జేయును హంసలెప్పుడున్.

  ఎవరైన తమవారిని దరిజేర్చి ఇతరులను దూరము పెడతారు కదా. హంసలు పాలు కూడ తెల్లగా ఉంటాయి అదే పోలిక అని ఉద్దేశ్యము.

  రిప్లయితొలగించండి
 10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఒకరిని అనుకరించామని చెప్పినా ఈ పూరణలో మీ ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది. చాలా బాగుంది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  కల్తీపాలను వదిలి నీటిని త్రాగిందా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  పూరణలో మీ లాజిక్ బాగుంది. చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 11. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  కోలను దెచ్చి యిచ్చె నొక కూరిమి శిష్యుడు.యోగి హంసకున్
  గ్రోలన టంచు బల్కనిడె కొద్దిగపాలను స్వాదు నీరమున్
  కీలలు జి౦దు వాతముల గ్రీష్మము మండెడి ఎండ వేళలన్
  పాలు త్యజించి నీరమును పాన మొనర్చును హoస లెప్పుడున్

  కోల :కోకాకోల

  రిప్లయితొలగించండి
 12. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ
  మేలును గూర్చ పోషణకు మేలగు పాలకు మించ వేవియున్
  చాలగ దాహ బాధలను చక్కగ దీర్చగ నీరునే కదా
  పాలను గోర రెవ్వరది బాపగ, గావున యె౦డ వేళలన్
  పాలు త్యజించి నీరమును పాన మొనర్చును హoస లెప్పుడున్

  రిప్లయితొలగించండి
 13. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ కోకాకోలా పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. మేలగు రావణా! వినుము, మిక్కిలి, జానకి నీ క్షణంబ నీ
  జాలిన రామచంద్రునకు, జాలిని చూపు నతండు, గాచు నిన్
  మాలిమి తప్పులెంచకను, మాన్యులు జెప్పరె ద్రావ బోయగా
  పాలు, త్యజించి నీరమును, పానమొనర్చును హంసలెప్పుడున్.

  రిప్లయితొలగించండి
 16. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. పాలు త్యజించి నీరమును పాన మొనర్చును హంస లెప్పుడున్
  గ్రోలును వెన్నలన్ కొసరి కోరికలూరిన చక్రవాకముల్
  వాలుచు చంద్రకాంతశిల పౌర్ణమి జ్యోత్స్నకు నీరగున్ సుమా
  లీల సుకావ్యధీసమయరీతి కవిప్రతిభావిశేషముల్

  రిప్లయితొలగించండి
 18. యం. ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. పాలను నేడు గల్పగల వారని వింత పదార్థముల్, కటా
  జాలినిఁ గొల్పు వార్తలను శ్రద్ధగ విన్న మరాళకూటముల్
  మేలది కాదటంచు మరి మిన్నగు యోచన చేసి యింకపై
  పాలు త్యజించి నీరమును పానమొనర్చును హంసలెప్పుడున్

  రిప్లయితొలగించండి
 20. పాలను నీరమున్ విరిచి పన్నుగ తీర్చుట కల్లయేననిన్
  పోలిక కోసమే కవులు ముచ్చట మీరగ పల్కినారనిన్
  చాలిక పాలటంచునవి చక్కగ దప్పిక తీర్చబోవనిన్
  పాలు త్యజించి నీరమును పానమొనర్చును హంసలెప్పుడున్

  రిప్లయితొలగించండి
 21. తేలుచు జాహ్నవీ యలల తీరిక మీరుచు బోరుకొట్టగా
  వీలుగ హైద్రబాదునను వేగమె రాగను దాహమొందగా
  కాలము మారగా మిగుల కల్మష మెచ్చగ నారబాబుదౌ
  పాలు త్యజించి నీరమును పానమొనర్చును హంసలెప్పుడున్

  రిప్లయితొలగించండి