16, జూన్ 2014, సోమవారం

సమస్యా పూరణం - 1446 (కర్ణుఁ డెద్దు నెక్కి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
కర్ణుఁ డెద్దు నెక్కి కంసుఁ జంపె.

34 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

నాగరాజు రవీందర్ గారూ,
క్రమాలంకార పద్దతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కుంతి పెద్ద కొడుకు కోరికౌ రవుచెంత
కలసి మెలసి వారి చెలిమి జేసి
భర్గు కొలిచి నట్టి భార్గవ రాముడై
కర్ణు , డెద్దు నెక్కి కంసు జంపె

Pandita Nemani చెప్పారు...

కవిత లల్ల నెంచి గణముల మొదలిడి
ఆటవెలది వ్రాసె నయ్య యిటుల
వాలి గ్రద్ద నెక్కి కాలుతో బోరాడె
కర్ణు డెద్దు నెక్కి కంసు జంపె

కంది శంకరయ్య చెప్పారు...

అక్కయ్యా,
పద్యం వరకైతే బాగుంది. అభినందనలు.
కాని సమస్య సహేతుకంగా పూరింపబడలేదు.
*
పండిత నేమాని వారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
ఇటువంటి సమస్యల పూరణలో క్రమాలంకార పద్ధతి తప్ప మరో మార్గం లేదనుకుంటారు చాలామంది. మీరు అటువంటి వారికి సమస్యాపూరణకున్న వివిధోపాయలను తెలియజేస్తున్నారు. సంతోషం. ధన్యవాదాలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఇంతి కుంతి బట్ట ఇనసుతు డెవ్వడు
హరుడు దేనినెక్కి తిరుగునయ్య
వెన్నుడెవనిజంపె పిడికిలి తానెత్తి
కర్ణు - డెద్దు నెక్కి- కంసు జంపె

మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీ చెప్పారు...

చదివి చూచి వినుచు చర్చించి యవధాన
సభకు నవసమస్య సాగలేక
కలవరించె నిటుల గౌరవ పృచ్ఛకు
"కర్ణు డెద్దునెక్కి కంసు జంపె"

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
యం. ఆర్. చంద్రమౌళి గారూ, (మీ పూర్తి పేరేమిటి?)
అసమర్థుడైన పృచ్ఛకుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పృచ్ఛకు’ అని ప్రత్యయం లేకుండా వ్రాశారు. ‘కలవరించినాడు ఘనుడు పృచ్ఛకు డిట్లు’ అందామా?

Unknown చెప్పారు...

తనదు కవచ మడుగ దానమిచ్చె నెవండు
శివుడు తిరుగునెట్లు క్షితిని గావ
మామయింట నేమి మధుసూదనుడొనర్చె
కర్ణుఁ డెద్దు నెక్కి కంసుఁ జంపె.

కంది శంకరయ్య చెప్పారు...

భాగవతుల కృష్ణారావు గారూ,
క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీ చెప్పారు...

శ్రీ శంకరయ్య గారు,
సూక్తమైన సవరణకు ధన్యవాదాలు. నా పూర్తి పేరు:
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

ప్రాణ మిత్రు డెవడు రారాజు కత్యంత?
తిరుగు భువన కర్త దేని నెక్కి ?
తల్లి దండ్రుల వెత తప్పింప కృష్ణుడు
కర్ణు, డెద్దునెక్కి, కంసు జంపె


కంది శంకరయ్య చెప్పారు...

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఫ్యాక్షనిష్టులు నాటకంలో పాత్ర దారులు. వారి పైన వైరి వర్గము వారు దాడి
చేసిన సందర్భం విషయంగా....

వైరి వర్గముఁ గని పారెను నాటక
కర్ణుడెద్దు నెక్కి, కంసు జంపె
నొకడు కత్తి దూసి, యకటా! తగదె? ఫ్యాక్ష
నిష్టులు సరదాల నిష్ట పడుట!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

అక్రమార్థ మిచ్చి వక్రంబుగాఁ దోచు
పద్య పాద మొకటి పంపు మనగ
పోచి రాజు వారు పూరించ మని రిట్లు
"కర్ణుడెద్దు నెక్కి కంసు జంపె"

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

subbarao చెప్పారు...

కర్ణు డె ద్దు నెక్కి కంసు జంపెననుచు
జెప్పి రార్యు లుమఱి చిత్ర ముగను
కంసు జంపి నతడు కర్ణుడు కాదండి
వీరిరువురి యుగము వేరువేరు

vvvv చెప్పారు...

ఇంకా ఈ కాలంలో అవదానులు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మీ అందరికి ధన్యవాదాలు!
Telugu Friends Discussions Board. Promote your Website or Blog for free and increase traffic to your site at http://forum.telugushortfilmz.com/

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కర్ణకంసుల యుగం వేరు వేరు అన్నారు. ఇద్దరూ ద్వారపయుగంలోనివారే కదా!
*
విజేందర్ రెడ్డి గారూ,
ధన్యవాదాలు.

Unknown చెప్పారు...

శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారి పూరణ

తల్లి తండ్రి తోడ తాను కూడను శూర్ప
కర్ణుఁ డెద్దు నెక్కి; కంసుఁ జంపె
ననుచు కృష్ణు జూడ నరుదెంచె మధురకు
దీవెనలిడి దృష్టి తీసెతల్లి

కంది శంకరయ్య చెప్పారు...

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ఎంత వైవిధ్యంగా ఉంది మీ పూరణ. అందుకే మీ లోటు కనిపిస్తున్నది అన్నాను. ఇంత చక్కని పూరణ నందించినందుకు అభినందనలు, ధన్యవాదాలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
ధన్యవాదాలు.

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

సూర్యపుత్రుడెవరు? సోమసేఖరుడెట్లు
సంచరించుచుండు? సంహరించె
నెవని వాసుదేవు డెరుగుమీ క్రమమున
కర్ణుఁ డెద్దు నెక్కి కంసుఁ జంపె

కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
టైపాటు వల్ల శేఖరుడు సేఖరు డయ్యాడు!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కుంతి పెద్ద కొడుకు కూడికౌ రవుచెంత
వరము లెన్నొ పొంది వ్యర్ధ మవగ
వేణు గాన లోలు వేలుపు తానంచు
కర్ణు డెద్దు నెక్కి కంసు జంపె

కంది శంకరయ్య చెప్పారు...

అక్కయ్యా,
పద్యం సలక్షణంగా బాగుంది. అభినందనలు.
కానీ సమస్య సమర్థంగా పూరింపబడలేదు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమస్సుమాంజలులు.

దండి సహజ కవచ కుండలుం డెవఁడోయి?
హరుఁడు దేనినెక్కి తిరుగునోయి?
కృష్ణుఁ డెవనిఁ జంపి కెరలి రాజిలెనోయి?
కర్ణుఁ, డెద్దు నెక్కి, కంసుఁ జంపె!

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

చంద్రమౌళి రామారావు గారి పూరణ :
ఇచ్చెసహజభూషలెవ్వడు? త్ర్యంబకుం
డేమి వాహనంబునెక్కి తిరుగు ?
మామ మామఁ జంపె మామ నెవ్వని? నొగిన్
కర్ణుఁ- డెద్దు నెక్కి- కంసుఁ జంపె

బొడ్డు శంకర్ చెప్పారు...

కుంతికి జనించిన తొలి కొడుకెవండు?
పరమ శివుడే విధమ్మున తిరుగుచుండు?
కృష్ణు డెవరిని చంపెను కీలెరింగి?
కర్ణు, డెద్దు నెక్కి, కంసు జంపె.

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
చంద్రమౌళి రామారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘మామ మామ జంపె మామ నెవ్వని’... ఇది అర్థం కాలేదు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
సమస్య ఆటవెలది అయితే పై మూడు పాదాలు తేటగీతి వ్రాశారు. మీ పద్యానికి నా సవరణ...

కుంతికి జనియించు తొలి కొడు కెవ్వఁడు?
పరమశివుఁడు తాను తిరుగు నెట్లు?
కృష్ణుఁ డెవరిఁ జంపె కీలెఱింగి బలిమి?
కర్ణు, డెద్దు నెక్కి, కంసు జంపె.

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

మాస్టారూ !
‘మామ మామ జంపె మామ నెవ్వని’ అనిన రామారావు గారి వివరణ
విష్ణువు నకు మామ సముద్రుడు (లక్ష్మి క్షీరసాగర తనయ ) ... విష్ణు పాదోద్భవ గంగ( తనయ) . .. నదులకు సాగరుడు పతి ... కావున సముద్రునకు మామ విష్ణువు ... మామ కు మామ అయిన కృష్ణుడు (విష్ణువు) యేమామను చంపెను?

బొడ్డు శంకర్ చెప్పారు...

గురువు దేవులకు నమస్సులు, నిజమే చాల పెద్ద తప్పిదమే. సవరణకు ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పండి తుండ నంచు పామరు డొక్కండు
భార తంబు దెలుప భాగ్య మనుచు
కృష్ణు డోడి గెలిచె కురుక్షేత్ర మునందు
కర్ణు డెద్దు నెక్కి కంసు జంపె

ఇంత కంటె నింక నేమివ్రాయ రాదు
పామ రింతి నంచు పరమ పూజ్య

Unknown చెప్పారు...

మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

కంటి సాధువొకని గంజాయి పీల్చుచున్
మత్తులోనపల్కు మాటలివియ
కుంభ కర్ణుడతడు కూల్చెను రావణున్
కర్ణుడెద్దునెక్కి కంసు జంపె

పండితుండవీవు పరమంపు గురువుగా
తలతునేను.కానితలపనేను
పలుకుదిట్లుననుచు,పరగనెచ్చటెపుడు
కర్ణుడెద్దునెక్కి కంసు జంపె?

Unknown చెప్పారు...

మల్లెల వారిదే మరొకటి
క్రమాలంకారం లో

దానమందు తాను ధన్యుడౌ నెవ్వడో?
శివుడు దేనినెక్కిచెలగువాడు?
కృష్ణుడట్లు చంపెకిల్బిషు నెవరినో?
కర్ణు; డెద్దునెక్కి; కంసు జంపె.

కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రామారావు గారి వివరణతో సందేహం తొలగిపోయింది. ధన్యవాదాలు.
*
అక్కయ్యా,
ఈ పూరణ బాగుంది. అభినందనలు.
కాకుంటే కురుక్షేతము అన్నచోట గణదోషం.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి. చాలా బాగున్నవి. అభినందనలు.