27, జూన్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం - 1456 (మూగవాఁడు పాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
మూగవాఁడు పాడె మోహనముగ.

39 కామెంట్‌లు:

 1. మాట రాని వాడు మదిలోన తపియించి
  మురళి నేర్చు కొనెను ముదము జెంది
  సంత సంబు నతడు సభలోన వినిపింప
  మూగ వాడు పాడె మోహన మున

  రిప్లయితొలగించండి
 2. స రి గ ప ద స స ద ప గ రి స
  మధ్యమ నిషాద నిషిద్ధ ఔధవ జన్య
  మోహన రాగం మనంబున నెంచి
  మూగ వాడు పాడె మొహనముగ !!


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. క్షమించాలి
  చివరిపాదం " మోహనముగ " అని ఉండాలి

  రిప్లయితొలగించండి
 4. నాభి కంఠ రసన నాసాది సంధాన
  గానలీనమైన గాయకుండు
  నాదయోగి, భావనార్ద్ర రసహృదయ
  మూగ, వాడు పాడె మొహనముగ

  రిప్లయితొలగించండి
 5. మథుర మథుర రసము మరులు గొల్పుచునుండ
  శ్రావ్యమైన రీతి సరస గీతి
  లలిత భావ మలర రమణి మానస పద్మ
  మూగ వాడు పాడె మోహనముగ

  రిప్లయితొలగించండి
 6. మథుర గాయకుడొక మంచి కార్యక్రమ
  మందు పారవశ్యమొంది, గానకళల
  మిగుల నుత్సహించు మేటి జనము
  మూగ, వాడు పాడె మోహనముగ

  రిప్లయితొలగించండి
 7. అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  జిలేబీ గారూ,
  _/\_
  *
  యం. ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  చాలారోజుల తర్వాత మీ పూరణలను చదివే అదృష్టం దక్కింది. సంతోషం. మీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 8. పట్నమందు జేరి పలువురు దిరుగాడు
  వీధి నడుమ నొకడు వేడుకొనుచు
  డప్పుగొట్టి పిలువ చప్పున పదిమంది
  మూగ, వాడు పాడె మోహనముగ

  రిప్లయితొలగించండి
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. పండితనేమోనివారికి ప్రణామములు
  మీ చక్కని పూరణలకు మెప్పునందించే స్తోమతిగలవాడను కాను. రెండవ పద్యంయొక్క ద్వితీయ-తృతీయపాదలలో గణవ్యత్యయం టైపాటున్నట్లున్నది. నాకు తెలియని బంధరచనైతె, ఛందోవతంసులు అన్యథాభావించక మన్నించాలి.

  రిప్లయితొలగించండి
 11. చంద్రమౌళి గారూ,
  నిజమే.. మీరు గుర్తించింది సరియైనదే. అక్కడ గణదోషం ఉన్నది. ధన్యవాదాలు.
  *
  పండిత నేమాని వారూ,
  ‘గానకళల’ అన్నచోట కేవలం ‘కళల’ అని,‘మేటి జనము’ అన్నచోట ‘మేటి జన మచట’ అని అంటే సరిపోతుందనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 12. వేణుధరుని వోలె వేవేల రాగము
  లాలపించదలచె నలతి గతిని;
  రమ్యమైనరీతి రసములూరెడు రాగ
  మూగ, వాడు పాడె మోహనముగ

  రిప్లయితొలగించండి
 13. గానవిద్యయతని కాధార శక్తియై
  లౌక్యశూన్యుడగుచు రాగమాయె
  పదవి విత్త మాన భౌతిక విషయాన
  మూగవాడు, పాడె మొహనముగ

  రిప్లయితొలగించండి
 14. బధిరు డొకడు వచ్చి పాల్గొనె సభలోన
  గాన గార్దభములు గాయకులవ
  మూల్గుచున్న ప్రక్క మూగిని గని బల్కె
  మూగవాఁడు పాడె మోహనముగ.

  రిప్లయితొలగించండి
 15. కొద్దిగా సవరించాను.
  గానవిద్యయతని కాధార శక్తియై
  లౌక్యశూన్యుడగుచు రాగమాయె
  పదవి విత్త మాన భౌతపరిధులకు
  మూగవాడు, పాడె మొహనముగ

  రిప్లయితొలగించండి
 16. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  యం. ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు


  రాఘవేంద్రు భక్తీ శ్రద్ధల స్తుతియింప
  కుంటివాడు నడచె నంట వెసను
  అంధునకునుదృష్టి యబ్బె నబ్బురముగ
  మూగవాడు పాడె మోహనముగ
  2,గళము నెత్తి పాడగా జాలడాతడు
  మూగవాడు. పాడె మోహనముగ
  వేణు వూదు చుండు వీణను వాయించు
  వాయులీనమందు వాసి కెక్కె

  రిప్లయితొలగించండి
 18. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. మల్లెలవారి పూరణలు
  మనిషి మూగయైన మనసది మూగవున కృష్ణ శాస్త్రి తాను గీతికలను
  అక్షరాల యందు యందించె పాటగామూగవాడు పాడె మోహనముగ
  2.మూగవాడు యొకడు మొహనమౌ రీతి
  వంశ నాళ మందు పాట వెలుగ
  నేర్చి ఘనుడునయ్యె నేర్పది ముఖ్యమౌ
  మూగవాడు పాడె మోహనముగ
  3.కృష్ణు డతని నామ కీర్తనమ్ము జేయ
  గ్రుడ్డి వాడు తాను గొనెను జూపు
  పంగుడతడు లేచి పరుగును వెట్టడే
  మూగవాడు పాడె మోహనముగ

  రిప్లయితొలగించండి
 20. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు


  చేత త౦బురగొని చిత్తమ్ము హరి బొంద
  యన్నమయ్య పాడె నెన్నొ కృతులు
  తాళ బద్ధ ముగను తనువాడగ నడు
  మూగ, వాడు పాడె మోహనముగ

  రిప్లయితొలగించండి
 21. సంజ్ఞ జేయ నెఱు గు సంగతు లన్నియు
  మూగవాడు, పాడె మోహనముగ
  నిండు సభలోన నీరజ రమతోడ
  గాయకు లిరువురకు వేయి నతులు

  రిప్లయితొలగించండి
 22. సైగ తోడ నేర్చు శాస్త్రము లన్నియు
  మూగవాడు, పాడె మోహనముగ
  అంధుడైన వాడు నద్వితీయమ్ముగ
  గాన మాలపించి ఘనత కెక్కె

  రిప్లయితొలగించండి
 23. కళ్లు కరములఁ దగ కదిలించు సైగల
  బధిర జనులు మెచ్చు పాట గాడు
  సభకు వచ్చి నంత సరసుడై కనిపించు
  మూగ వాడు, వాడు పాడె మోహనముగ!

  రిప్లయితొలగించండి
 24. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘మూగవున’ అన్నచోట గణదోషం. ‘మూగదా’ అనండి. ‘గీతికలను + అక్షరాల’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘గీతసమితి/ నక్షరాలయందు నందించె...’ అనండి.
  మూగవాడు + ఒకడు అన్నప్పుడూ యడాగమం రాదు. మూగవా డొకండు.. అనండి.
  కీర్తనమ్మును జేయ.. అంటే గణదోషం ఉండదు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సభలలోన’ అంటే గణదోషం ఉండదు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. ముద్దు లొలుకు బుడత బుద్ధిమంతుడు గాడు,
  చిలిపి చేష్ట లెపుడు చేయు చుండు,
  పంచ దార డబ్బ పడదోసి యీగలు
  మూగ, వాడు పాడె మోహనముగ !!!

  రిప్లయితొలగించండి
 27. మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....

  స్వరపు పేటి మార్చ వాక్కు వెల్లివిరియ
  మూగవాఁడు పాడె మోహనముగ
  వైద్యవిద్యలోన వెజ్జుల ప్రతిభచే
  సాధ్యమయె గతపు టసాధ్యములును.

  రిప్లయితొలగించండి
 29. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. శ్రీ చంద్రమౌళి గారికి శుభాశీస్సులు. మీరు నా పద్యములోని వ్యస్త పాదములను గురించి ప్రస్తావించుట ముదావహము. నేను ఇంకను తేరుకొనలేదు. మనసు తనువు కూడా సుస్థితిలో లేవు. శ్రీ కంది శంకరయ్య గారు చేసిన సూచనలు చక్కగా నున్నవి - అలాగే పాటించుదాము. వారికి నా అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 31. శ్రీ సుబ్బా రావు గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అందులో ఒక పాదమును ఇలాగ మార్చుదాము:
  నిండు సదనమందు నీరజ రమతోడ.
  స్వస్తి.

  శ్రీ నాగరాజు రవీందర్ గారు శుభాశీస్సులు.
  మీరు నా యందు చూపుచున్న ఆదరణకు కృతజ్ఞుడను.
  స్వస్తి.

  శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. ఒక పాదమును ఇలాగ మార్చుదాము: (యతి మైత్రి కొరకు)
  వైద్య విద్యలోన వైద్యుల ప్రతిభచే.
  స్వస్తి.భినందనలు.

  రిప్లయితొలగించండి
 32. ఎవరైనా మూక పంచశతి పై పూరణ చేస్తే బాగుంటుందేమో

  రిప్లయితొలగించండి
 33. పండిత నేమానివారికి నమస్సులు,

  మీ ఆశీర్వచనం "నేను తొందరబడ్డానా" అన్న ఆతంకాన్ని నివారించింది. మీరు శీఘ్రంగా తేరుకోని సుస్థితి చేకూర్చాలని నా తలంపు. మీ సాహిత్యసేవ, సౌహార్దత సదా సుస్మరణీయము. మిమ్మల్ని మరియూ శ్రీ శంకరయ్యగారిని చూడాలని ఉంది. ఎప్పుడో ప్రాప్తి? ప్రయత్నిస్తాను.
  అంజలిః పరమా ముద్రా,
  చంద్రమౌళి

  రిప్లయితొలగించండి
 34. సరిగమల నెరుగడు సంగీత మందున
  వాడు సభను నేడు పాడు నెటుల
  పోయి చూత మంచు బోరన జనులట
  మూగ, వాడు పాడె మోహనముగ

  రిప్లయితొలగించండి
 35. భజన కీర్తనలను బాగుగా పాడెడు
  బాలుడొకడు వచ్చె భక్తితోడ
  గుడికి, భక్త జనులు గుమిగూడి తనచుట్టు
  మూగ, వాడు పాడె మోహనముగ

  రిప్లయితొలగించండి
 36. పరమ చెవిటివాడు, బాధపడుచు, నేడ్చు
  మూగ వాని చూసి, మురిసి పోయి
  యనెను "యేమిగాత్రమతనిది! తనశిర
  మూగ,వాఁడు పాడె మోహనముగ"

  రిప్లయితొలగించండి
 37. అంబ కరుణ కురయ నాశ్చర్య ములుగల్గె
  అక్షరములురాని యాటవికుడు
  కావ్య ములనువ్రాసి కాళిదాసుగ మారె
  మూగ వాడు పాడె మోహనముగ !!!

  రిప్లయితొలగించండి
 38. రమణ గారూ,
  మీరు కోరిన పూరణ....

  కరుణఁ జూపి కంచి కామాక్షి వాగ్విభ
  వమ్ము నొసఁగ మూకపంచశతిని
  తాను వ్రాసి పాడి ధన్యత నందెను
  మూగవాఁడు పాడె మోహనముగ.

  రిప్లయితొలగించండి
 39. పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి