15, జూన్ 2014, ఆదివారం

చమత్కార పద్యాలు - 208 (భారత గర్భ రామాయణము)

నిర్వచన భారత గర్భ రామాయణము
రావిపాటి లక్ష్మీనారాయణ
మనకు పింగళి సూరన రచించిన రాఘవపాండవీయము, రామరాజభూషణుని  హరిశ్చంద్రనలోపాఖ్యానము, పిండిప్రోలు లక్ష్మణకవి రావణదమ్మీయము మొదలైన ద్వ్యర్థికావ్యాలు, అయ్యగారి వీరభద్రకవి రాఘవపాండవయాదవీయము, భట్టర బాలసరస్వతి రచించిన  రాఘవయాదవపాండవీయము మొదలైన త్ర్యర్థికావ్యాలు ఉన్నాయి.
నిర్వచనకావ్యాలు తిక్కననాటినుండి లెక్కకు మించి ఉన్నాయి.
చతుర్విధకవిత్వంలో గర్భకవిత్వం ఒకటి. ఒక పద్యంలో పెక్కుపద్యాలను ఇముడ్చడం గర్భకవిత్వం. ఇటువంటి గర్భకవిత్వం పూర్వకవుల కావ్యాలలో అక్కడక్కడ కనిపిస్తున్నది. గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వరవిలాసంలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఆధునికులలో చింతా రామకృష్ణారావు గారు గర్భకవిత్వంలో నిష్ణాతులు.
భారతగర్భరామాయణములో ఆద్యంతం గర్భకవిత్వమే. అందులోనూ ద్వ్యర్థి. పైగా నిర్వచనకావ్యం. గ్రంథంలో ప్రతిపద్యంలోను మరొక పద్యం గర్భస్థమై ఉంటుంది. మూలపద్యం రామాయణార్థం, గర్భస్థపద్యం భారతార్థం. ఇటువంటి కావ్యాలలో ఇదే మొదటిది, ఇప్పటివరకు ఇదే చివరిది.
దీనిని రచించిన కవి రావిపాటి లక్ష్మీనారాయణ. ఇతని స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా రావిపాడు గ్రామం. గురిజాల డిస్ట్రిక్ట్ మున్సిఫ్ కోర్టులో గుమాస్తాగా ఉద్యోగం చేసేవాడు. తన ఇరవైమూడవ ఏట గ్రంథాన్ని రచించాడు. కావ్యం 1931లో రచింపబడింది.
మొత్తం 126 పద్యాలలో 16 పద్యాలు ఇష్టదేవతాప్రార్థన, సుకవిస్తుతి, కుకవినిరసన, కవిపరిచయము, కావ్యప్రసక్తి, షష్ఠ్యంతాలు పోను మిగిలిన 110 పద్యాలు నిర్వచన భారతగర్భరామాయణం.

రేపు పీఠిక. ఎల్లుండినుండి రోజుకొక పద్యం చొప్పున పరిచయం చేసుకుందాం. పద్యం చివర కవి ఇచ్చిన లఘు టీకా కూడా ఉంటుంది.

5 కామెంట్‌లు:

  1. శుభవార్త. ఇలాంటి కావ్య పరిచయం మన బ్లాగుకు మరింత వన్నె తెస్తుంది. ధన్యవాదాలు, మాస్టారూ.

    రిప్లయితొలగించండి
  2. అసలిలాటి కావ్యామృతం ఉన్నదని కూడా తెలియని మాకు రోజూ ఉగ్గు గిన్నెతో (మొత్తం ఒకేసారి అరిగించుకోలేము కాబట్టి) కొంచెం కొంచెం పడతామంటే ...మహదానందంగాఉన్నది..మీ వాత్సల్యమునకు నమో వాకములు.

    రిప్లయితొలగించండి
  3. రచన గావించె మెప్పుగ రావి పాటి
    పద్యమొక్కటే యర్ధముల్ హృద్య ముగను
    భార తంబును రామాయ ణా ర్ధము లవి
    యెంత నేర్పది ? పొగడగ సుంత యైన
    జాల నేనార్య !నతులను జాల సేతు

    రిప్లయితొలగించండి
  4. గురువులకు ప్రణామములు
    శ్రమ అనుకోకుండా పద్యాలను నేర్పడమే గాక ఇంత మంచి గ్రంధాలను తెలియ జెప్పగల మీ సహృదయానికి కృతజ్ఞతలు అసలివి ఉన్నాయని తెలియని నావంటి అజ్ఞానికి మరింత ఆనందంగా ఉంది

    రిప్లయితొలగించండి