1, జూన్ 2014, ఆదివారం

పద్య రచన – 577

కవిమిత్రులారా,
 పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. వంట యింటిని మరచిన వనితలంత
    వేడి బజ్జీల దినుటకై వేచి యుండ్రి
    నూనె వస్తువుల తినుట మానకున్న
    కాయమునకు చేటు గలుగు ఖాయముగను

    శ్రేష్ట భోజనమ్ము తుష్టితో భుజియింప
    రోగ భారి పడరు రూడి గాను
    అడ్డ మైన గడ్డి యారోగ్యము చెఱచు
    చేటు మూడు ననుట చేదు నిజము

    కాచి యున్నారు కాంతలు కాంక్ష తోడ
    వేడి బజ్జీల దినుటకై వీధి యందు
    తల్లి దండ్రులు చిఱు తిండ్ల తనయు చుండ
    బాల లందరు పిజ్జాల పాలు పడిరి
    చిన్న తనపు సుగరునకు చిక్కు చుండ్రి

    రిప్లయితొలగించండి
  2. వేడి వేడి బజ్జీలను వేచుచున్న
    బండి దగ్గర నిలబడి బార్లుదీరి
    ఆకలిని దీర్చుకొనుటకై యాడువారు
    వేచి యున్నారు పట్టణ వీధులందు.

    రిప్లయితొలగించండి
  3. నోరూరించదె బజ్జీ
    దోరగ కాలగ తినుటకు తొందర కాదే?
    తరిగిన వుల్లీ తోడుగ
    పురుషోత్తముడైన తినగ భువికిన్ దిగడే!

    రిప్లయితొలగించండి
  4. సహదేవుడు గారూ ! బజ్జీలను బాగా వేయించారండీ...
    రెడ్డి గారూ చక్కగా చెప్పారు...
    శంకరయ్య గారూ ! బాగు బాగు..

    రిప్లయితొలగించండి
  5. బజ్జీలను తినగా సమ
    ఉజ్జీలే జేరిరిచట నూరగ నోరే !
    బుజ్జీ! త్వరగా వేయుము
    పిజ్జాలను మరచి నేడు పిల్లలు వచ్చెన్.

    రిప్లయితొలగించండి
  6. వేడివేడిగ బజ్జీలు వేగు చుండ
    నూని వంటకై యెగబడి నోరు చాపి
    కాచు కొనియుండి రచ్చట కాంతలు మఱి
    యెంత ఘోరమో యూహించు డింతు లార !

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రులు గోలి వారికి ధన్యవాదాలు. మీరు మాత్రం నోరూరించ లేదా?
    కాస్త గణ భంగంతో ఉప్పు కారం తక్కువయినట్లుంది.
    కలపనీయండి.

    మరి మరి నాలుక లూరెను
    సరి దోరగ కాలి బజ్జి సందడి చేయన్
    తరిగిన వుల్లీ తోడుగ
    పురుషోత్తముడైన తినగ భువికిన్ దిగడే!

    రిప్లయితొలగించండి
  8. ఎండకు కందిన లేమలు
    వండగ మీరింటి కేగి వైవిధ్యము గన్
    దండిగ జేసితి వేడిగ
    రండిక తినగోరి రుచుల రంజిల్ల మదిన్

    రిప్లయితొలగించండి
  9. సెనగ పిండిలోన చేరిచి కాస్తంత
    మెత్తనైన పిండి మేలు వరిది
    నీరు వంట సోడ నెమ్మదిగా పోసి
    గరిటె జారు రీతి కలుప వలయు.

    తురుము మాలు లేక యరటి కాయను దెచ్చి
    పలుచ నైన రీతి పదును గాను
    మంచి నూనె పోసి యెంచి మూకుడు లోన
    పొయ్యి రాజ జేయు మయ్య కాచ.

    పొంగు చుండ నూనె పొయ్యిపై సలసల
    నరటి ముక్క లిన్ని యదను జూచి
    పిండి లోన ముంచి విడువుము నూనెలో
    వేగ పదును గాను వెంటవెంట.

    కరకర లాడెడు బజ్జీ
    లరయగ పళ్ళెరము లోన నహహా నోటన్
    ఝరివలె నీరూరును గద
    సరిసరి జాగేల నింక చప్పున తినవో.

    చేత గాదేని నీవల్ల చెంతనున్న
    తిండి బండికి జేరుము తిన్నగాను
    వేగు చుండిన బజ్జీల వేడి సోక
    ముక్కు పుటముల కెన్నగా మురిపె మగును.

    రిప్లయితొలగించండి
  10. మల్లెల సోమవాధ శాస్త్రి గారి పూరణ

    ఇంపుగ వేడివి యనుచును
    సొంపుగ బజ్జీలు తినిన సుఖమది లేకన్
    నింపును"గాలి"ని(గ్యాసు)పొట్టను
    యింపది యౌనుగ తినగను నింటను టిఫినే

    రిప్లయితొలగించండి
  11. ఎక్కడ పడితే నక్కడ
    చక్కగ బజ్జీలబండ్లు సందడి జేయున్
    మక్కువ మీరగ నచ్చట
    పెక్కురు మరిజేరితినును ప్రీతిగ బజ్జీ!

    రిప్లయితొలగించండి
  12. కన్నుగోరుతిండి నెన్నడూతినరాదు
    ఒంటిమేలు జూచి తింట మేలు
    వీధులందు దొరకు వింతవింతలతిళ్ళు
    వందలాది క్రిముల పాత యిళ్ళు

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్చాస్త్రి గారికి ధన్యవాదాలు. మీరు, మిస్సన కవి గారు మాలాంటి క్రొత్తవారి రచనలకు అవసరమైన సవరణలు, సలహాలు (గురువుగారికి కుదరనప్పుడు)యిస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    ఖండికను పోలిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    అద్భుతమైన ఖండికను వ్రాశారు. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. చదువుల నుద్యోగంబుల
    ముదితలు అలసిసొలసిపోగ, ముక్కుకు సోకెన్
    అదిరెడు ఘుమఘుమ వాసన,
    మదియును బజ్జీ తినుటకు మక్కువ చూపెన్

    రిప్లయితొలగించండి
  16. సత్యనారాయణ రెడ్డిగారికి ధన్యవాదములు. నేనింకా విద్యార్థినే. సూచనల నిచ్చే సాధికారత లేదు నాకు. గురువుగారి పరోక్షంలో నేమాని పండితులు ఆ బాధ్యతను వహిస్తున్నారు కదా.

    రిప్లయితొలగించండి
  17. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ముదితలు అలసి’ అని విసంధిగా వ్రాశారు. దానివల్ల గణభంగం.“ముదిత లలసి సొలసిపోగ..” అనండి.
    *
    మిస్సన్న గారూ,
    దోషాన్ని గుర్తించి, సవరణ సూచించడానికి అర్హత అంటూ ఏమీ లేదు.. ఆసక్తి ఉంటే చాలు!

    రిప్లయితొలగించండి
  18. ధన్యవాదాలు మాస్టారు ... పద్యం సవరించాను
    చదువుల నుద్యోగంబుల
    ముదిత లలసి సొలసి నిలువ , ముక్కుకు సోకెన్
    అదిరెడు ఘుమఘుమ వాసన,
    మదియును బజ్జీ తినుటకు మక్కువ చూపెన్

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారు బజ్జీ
    లెస్సగనే వండు విధము లిట్టుల జెప్పెన్
    మిస్సవకుండా వండుడు
    అస్సలు వదలంగ బోరవన్నీ తినకన్.

    రిప్లయితొలగించండి
  20. గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి