24, జూన్ 2014, మంగళవారం

సమస్యా పూరణం - 1454 (రామ యనిన నోరు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
రామ యనిన నోరు ఱాతిరోలు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

 1. పరమ పావనమగుఁ భక్తి శ్రద్ధలతోడ
  రామ యనిన నోరు, ఱాతిరోలు
  గాదె రామ నామ గానము చేయక
  పాపపంకిలమగు పాడు నోరు

  రిప్లయితొలగించండి


 2. రామ యనని నోరు రాతి రోలు
  వోలె ఒక్క ఇంద్రియము మాత్రమె
  రామ యనిన నోరు రాతి రోలు
  వోలె సత్యమైన ఇరుసు చక్రమే !!

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపము....

  రామ యనని నోరు ఱాతిరో లటంచు
  నొక్క యింద్రియమునె నుడువ నేల?
  రామ యనిన నోరు ఱాతి రో లనుమాట
  సత్యమైన నిరుసు చక్రమె కద!

  రిప్లయితొలగించండి
 4. రామ యనని నోరు రౌక్షతజెందుచు
  లుప్తమౌను మౌన రోధనమున
  రామ యనిన నోరు, రాతిరోలుమాని
  వాణి నాట్యమాడు వాకిటౌను

  రోలు= బాధ, విలాపన

  రిప్లయితొలగించండి
 5. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
  పావనమ్ము జేయు పాపమ్ములను దంచి
  రామ యనిన నోరు రాతి రోలు
  మరల మరల డంచ మడురామృతమె యగు
  రామ రసపు చవిని రసనే యెరుగు

  రిప్లయితొలగించండి
 6. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
  నాపద్యనులో నాల్గవ పాదములో'రసనె 'యనుటకు బదు లు రసనే యని టై పయినది
  మీరు జిలేబీ గారిభావానికివ్రాసినపద్యములో మొదటి పా దమును పరిశీలించ వలెను యిలా వ్రాసినందుకు
  క్షమార్హుణ్ణి

  రిప్లయితొలగించండి
 7. రామ యనిన నోరు రాతి రోలెట్లౌను
  రామ నామ జపమె రౌరవాది
  పాప పంకిలమును బ్రక్షాళనము జేసి
  ముక్తి నొసగు మిగుల శక్తి నొసగు

  రిప్లయితొలగించండి
 8. యం. ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రాతిరోలు మాని’ అన్నచోట గణదోషం. సవరించండి.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  నా పద్యంలో గణదోషాన్ని గుర్తించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.
  *
  జిలేబీ గారికి వ్రాసిన పద్యంలో మొదటి పాదంలో ‘ఱాతిరోలె యటంచు’ అని చదువుకొనండి.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్యగారు,
  ధన్యవాదాలు. సవరించన పద్యం:

  రామ యనని నోరు రౌక్షతజెందుచు
  లుప్తమౌను మౌన రోధనమున
  రామ యనిన నోరు, రాతిరోలునుమాని
  వాణి నాట్యమాడు వాకిటౌను

  రిప్లయితొలగించండి
 10. రక్కసు లనుచుండ రావణుం డనియెను
  రామ యనిన నోరు ఱాతిరోలు!
  కర్కశుడగు నట్టి కంసుడు బలికెను
  కృష్ణ యనిన నోట క్రిములు రాలు!

  రిప్లయితొలగించండి
 11. యం. ఆర్. చంద్రమౌళి గారూ,
  మీ సవరణ బాగుంది. సంతోషం!
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 12. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

  మల్లెల వారి పూరణ: భక్తిగల్గి తాను పరవశత్వముజెంది
  రామ యనిన, నోరు రమ్యమగును
  చెడ్డబుద్ధి తోడ చెలువల గోర్కె తో
  రామ యనిన నోరు రాతి రోలు
  రామ భక్తురాలు రమ్యమ్ము గా తాను
  రామ యనిన నోరు. రాతి రోలు
  కరగి నీర మాయె కమనీయ నామాన
  తారకమ్ము నదియె ధన్య తిచ్చు

  రిప్లయితొలగించండి
 13. అతివ సీత మాత నగ్ని పునీతను
  సత్య మెరుగ నట్టి చాకలొకడు
  పట్టితి వెటు లయ్య పాడియౌ నీకేను
  రామ! యనిన, నోరు ఱాతిరోలు!

  రిప్లయితొలగించండి
 14. రామ యనిన నోరు ఱా తి రోలు
  నాను డువుదురు గదమఱి నాస్తికులట
  వారు చూతురు దేవుని వైరిగాను
  దూర ముంచగ వలయును దురితులనిక

  రిప్లయితొలగించండి
 15. పశు ప్రవృత్తి తోడ బలమైన వాంఛతో
  వావి వరుస మరచి వనితజూడ
  మదన తాపమొదవి మర్యాద లేక రా!
  రామ! యనిన నోరు ఱాతిరోలు

  రిప్లయితొలగించండి
 16. గురువు శిష్యునకును గుణియింతములు చెప్పి
  రామ "యనని" నోరు ఱాతి రోలు
  యనుచు వ్రాయమనిన నాతురతో వ్రాసె
  రామ "యనిన" నోరు ఱాతి రోలు.

  రిప్లయితొలగించండి
 17. రావణుడు ఆంజనేయునితో...

  రావణుండ నేను రాక్షస రాజును
  చెప్పుచుంటి వినుము చెవినియొగ్గి
  కోతివీవు నరుని గొప్పలు చెప్పకు
  రామ యనిన నోరు ఱాతిరోలు.

  రిప్లయితొలగించండి
 18. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....

  రామ రామ యనుచు రాగాలు తీయుచు
  భామ భామ యనుచు పరుగు లెత్తు
  నట్టి వారి గూడి హారామ దశరథ
  రామ యనిన నోరు ఱాతి రోలు.

  రిప్లయితొలగించండి
 19. ఈనాటి సమస్య గతంలో ఇచ్చినదే అని అన్నపరెడ్డి వారు చెప్పారు. మతిమరుపు మరీ ఎక్కువైపోతున్నది. క్షంతవ్యుణ్ణి.
  *
  ఈనాటి సమస్యకు చక్కని పూరణ లందించిన కవిమిత్రులు....
  మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
  సహదేవుడు గారికి,
  సుబ్బారావు గారికి,
  మిస్సన్న గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి