3, జూన్ 2014, మంగళవారం

సమస్యాపూరణం – 1432 (రావణాసురుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రావణాసురుండు రాము బంటు.

23 కామెంట్‌లు:

 1. సీత నపహ రించి పాతకుం డయెనంట
  రావ ణాసు రుండు , రామ బంటు
  హనుమ భక్తి మీర గనుచు జానకిమ్రొక్కి
  వసము జేసి లంక యశము నొందె

  రిప్లయితొలగించండి
 2. శర్వు సంతతంబు జపియించు భక్తుడు
  రావణాసురుండు, రామబంటు
  రామ జపము జేసి రంజిల్లు మారుతి
  యన్ని విద్యలందు నున్న తుండు

  రిప్లయితొలగించండి
 3. రావణాసురుండు రామ బంటును జూచి
  శిక్ష వేసె నంత చిచ్చు తోడ
  బూదిగా నొనర్చె పూర్తిగా లంకను
  రామ రామ యనుచు రామ బంటు

  రిప్లయితొలగించండి
 4. శ్రీ కంది శంకరయ్య గారు: శుభాశీస్సులు.
  సమస్యలో రామ బంటుకి బదులుగా రాము బంటు అంటే అన్వయ సౌలభ్యము ఎక్కువ కదా.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి

 5. రావనాసురుండు,రామబంటు
  వేచి ఉండిరి రాముని ఆగమునకై
  ఒకరు హోరాహోరి పోరి రాముని పొందే
  మరొకరు హృదయం లో బంధించి పొందే !!


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. రావణాసురుండు రామబంటును జూచి
  పట్టి కట్టు డంచు బలికినంత
  వాని తోక గాల్చి వదలిన , హనుమంతు
  డగ్ని గాల్చ లంక భగ్నమయ్యె

  రిప్లయితొలగించండి
 7. అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వసము జేసి’కి బదులు ‘అగ్గిబెట్టి లంక’ అంటే బాగుంటుందేమో?
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మీ సూచన ననుసరించి రామబంటును రాము బంటుగా సవరించాను. ధన్యవాదాలు.
  *
  జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపం....

  రావణాసురుండు, రాము బంటు హనుమ
  వేచియుండిరి రఘువిభుని కొఱకు
  నొకరు వైరమూని యొకరు దాసుండయి
  పదిలపఱచుకొనిరి యెదలలోన.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. జిత్తు లెన్నొ చేసి సీత నపహరించె
  రావ ణాసు రుండు , రామ బంటు
  హనుమలంకకేగి అవనిజ కనుగొని
  ఆమె జాడతెలిపె రామునకును

  రిప్లయితొలగించండి
 9. లంక కధిపతి రఘురాము ప్రతిద్వంద్వి
  రావణాసురుండు; రాము బంటు
  పవనసుతుడు రామ వాక్కును పాలించి
  సీతజాడ నెరుక జేసెనతడు!

  రిప్లయితొలగించండి
 10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. వైర భక్తి తోడ శ్రీరాము జేరెను
  రావణాసురుండు, రామ బంటు
  భక్త మారుతి నవ భక్తలతో గొల్చి
  రామచంద్రు నందె ప్రేమ బడసి
  రిప్లయితొలగించండి
 12. పరమ భక్తి తోడ భవునిబూ జించెను
  రావణా సురుండు, రాము బంటు
  అంజనీసు తుండు యాంజ నే యుడుగద
  వేరు చెప్ప నేల విపుల ముగను

  రిప్లయితొలగించండి
 13. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ సుబ్బా రావు గారు! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  హనుమంతుని తల్లి పేరు: "అంజన" - అంజనీ కాదు.

  స్వస్తి.


  రిప్లయితొలగించండి
 15. పంకజాక్ష్కు ద్వారపాలక బంటులు
  శాపజన్ములైరి జయ విజయులు
  బంటు శత్రువు పరమాత్ముని జేరగ
  రావణాసురుండు, రామబంటు

  రిప్లయితొలగించండి
 16. గురువులకు ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి నమస్కారములు.

  అల్ప వానరమని అలతిగా తలచెను
  రావణాసురుండు రాముబంటుని జూచి.
  లంక గాల్చె హనుమ లంకేశు శోకింప
  పరులు నెపుడు హీనపరచరాదని దెల్పె

  రిప్లయితొలగించండి
 17. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

  జయ విజయ బంట్లె శాపాన నౌటచే
  రావణుండు మరియు రాజి తాను
  జుండు,బంటు లేను,జూడగా నతనికి
  రావణాసురుండు రాము బంటు

  ఆంజనేయుడాతడాలంక జేరంగ
  రావణాసురుండు;రాము బంటు
  కాల్చతోక నట్లు కాలెనాలంక యే
  చెడ్డ వారి చేష్ట చెరచు తమనె

  రిప్లయితొలగించండి
 18. భూమిపుత్రిసీత కామియౌచును దాచె
  రావణాసురుండు; రాముబంటు,
  వెడలి లంకజేరి వెదకె నాల్గుదెసలు
  అభయమిచ్చి నిలచె విభునిచెంత

  రిప్లయితొలగించండి
 19. Sree P.S.R.Moorti Garu! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. ఒక క్రొత్త ఛందస్సును ఆవిష్కరించేరు.
  4 పాదములలోను సమాన గణములు కలిగిన పద్యము. ఇది ఆటవెలది కాదు.
  మంచి పేరును మీరే నిర్ణయించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. సుబ్బారావు గారూ,
  మీ పూరణలో నేమాని వారు చెప్పినట్లు ‘అంజని’ అనడం దోషమే. అలాగే ‘సుతుండు + ఆంజనేయుడు’ అన్నప్పుడు యడాగమం రాదు.. ఆ పాదానికి నా సవరణ...“అంజనాసుపత్రుఁ డాంజనేయుఁడు గద”.
  *
  చంద్రమౌళి గారూ,
  మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
  ‘ద్వారపాలక బంటులు’ అనడం దుష్టసమాసమే.. మూడవ పాదంలో (బ-మ లకు) యతిదోషం.. నా సవరణలతో మీ పూరణ....
  పంకజాక్షు ద్వారపాలకు లిద్దరు
  శాపజన్ములైరి జయ విజయులు
  బంటు శత్రువయ్యె పరమాత్ముఁ జేరగ
  రావణాసురుండు, రామబంటు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శ్రీరామచంద్రమూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  కాని మీరు ఏ ఛందంలో పూరించారో అర్థం కాలేదు. మాత్రాఛందమా?
  *
  మల్లెల సోమనాధ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటిపాదంలో ఒక లఘువు తక్కువయింది. టైపాటు కావచ్చు. ‘జయవిజయులు బంట్లె’ అనికదా ఉండవలసింది?
  *
  రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సీతఁ గామియౌచును’ అంటే యుక్తంగా ఉంటుంది.
  *
  పండిత నేమాని వారూ,
  మిత్రుల పూరణలను, పద్యాలను సమీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు.
  వృద్ధాశ్రమంలో చేరినప్పటినుండి ఇలా చేరడానికి కారణమైన పరిస్థితులు మాటిమాటికి గుర్తుకు వస్తూ ఏకాగ్రత లేకుండా చేస్తున్నాయి. అందువల్ల మిత్రుల పద్యాలలోని లోపాలను గమనించలేకపోతున్నాను. తొందరలోనే సంపూర్ణ మానసికారోగ్యాన్ని పొందగలనని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 21. రామభద్రు కీర్తి రాణింప జగమెల్ల -
  వైర వృత్తి దాల్చి, వ్యాప్తి జేసె!
  నిఖిల జగములందు, నిజముగా తలపోయ -
  రావణాసురుండు రాము బంటు!

  రిప్లయితొలగించండి
 22. సంపూర్ణ రామాయణం సినిమాలో సింహాసంపై యస్వీఆర్ (రావణాసురుండు) తోక చుట్టపై ఆర్జా జనార్దనరావ్ (రాము బంటు)...మాధవపెద్ది, ఘంటసాల పద్యాలు గుర్తుకొచ్చాయి...


  ఎదురు కెదురు నిలచి యెన్నెన్నొ పద్యాలు
  పాడ వినగ మనకు పండుగేను
  తెనుగు చిత్రమందు తిలకించుచుండగా
  రావణాసురుండు;రాము బంటు

  రిప్లయితొలగించండి
 23. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి