28, అక్టోబర్ 2014, మంగళవారం

న్యస్తాక్షరి - 12

అంశం- శాంతము లేక సౌఖ్యము లేదు.
ఛందస్సు- ఆటవెలఁది.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా ‘త్యా - గ - రా - జు’ ఉండాలి.

27 కామెంట్‌లు:

  1. త్యాజ్యములగు కోపతాపముల విడిచి
    గహ్వరిఁ బెరుగవలె క్షాంతమతులు
    రాదు శాంతి లేక రవ్వంత సౌఖ్యమ్ము
    జువ్వరించవలెను శుభములిలను

    రిప్లయితొలగించండి
  2. త్యాగరాజు కృతులు ధరణిని మఱి విన
    గదగు నెల్ల వారు ,కాని యెడల
    రాదు సౌఖ్య మునిక రా దుశాంత ముమను
    జునకు నెపుడు నిదియ సుమ్ము నిజము

    రిప్లయితొలగించండి
  3. త్యాగ భావము మది దాల్చెడి వానికి
    హన మార్గమైనఁ గలుగు సుఖము
    రాగమందు శాంతరహితుడైన సురరా
    జునకునైన చూడ సుఖము గలదె?

    రిప్లయితొలగించండి
  4. పాపకు పుట్టిన దినమని
    దీపపు హారతులనిచ్చితెలిపిరి శుభముల్
    మాపటి వేళకు కొవ్వుల
    దీప మ్మార్ప (గ గృహమున (దేజమ్మేసగెన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు
    గురువు గారికి నమస్కారములు నిన్నటి సమస్య ఇవాళ పోస్ట్ చేశాను చిత్త గించ గలరు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  5. కవిమిత్రులకు మనవి...
    నేనీరోజు ‘జడశతకం’ ఆవిష్కరణ సభకు పోతున్నాను. సెల్‍ఫోన్‍లో ఎప్పటికప్పుడు మీ పూరణలను చూసూ ఉంటాను కాని ఆ ఫోన్ నుండి వ్యాఖ్యలు పెట్టే అవకాశం లేదు. కనుక దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
    ఎందుకైనా మంచిదని రేపటి సమస్యను కూడ షెడ్యూల్ చేశాను.
    ఈరోజు, రేపు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు.

    రిప్లయితొలగించండి
  6. త్యాగ రాగములవి వీగిపో కున్నను,
    గతము మరువ కున్న కష్టముండు
    రామ నామ సుధల నీమముఁ దప్పకన్
    జుర్రుమోయి శాంతి, సుఖముఁ గలుగు

    రిప్లయితొలగించండి
  7. త్యాగ రాజు పలికె తానట్లు శాంతితో
    గడుప గాను సౌఖ్య గామి యనెడు
    రాజితంపు సూక్తి రాగము లందున
    జుమ్మననెడి రీతి, నిమ్ము గాను

    త్యాగ బుద్ధి తోడ తనరుచు శాంతితోఁ
    గనగ వచ్చు సుఖము. కాంతి దెచ్చు
    రాము కొలుచుచుండ రమణియ భక్తి తో
    జుమ్మటంచు నాద సొబగులమర

    త్యాగ మెంతొ జేసి తనదు నౌస్వార్థంబు,
    గడుప వలయు బ్రతుకు. కలుగు శాంతి;
    రాజితంపు సుఖము, రాజిల్లు నప్పుడే
    జుంటి తేనె యట్లు సొగసు గాను

    త్యాగ యెపుడు నిధుల తావీడి ఘనముగా
    గడిపె భక్తి తోడ, కాంచె శాంతి
    రాజితముగ సుఖము, రాముడిడుగద మం
    జులమునైన ముక్తి సొగసు ననెను

    త్యాజ్యమైన కినుక తానొంద శాంతంబుఁ
    గనగ వీలు సుఖము. కలిగి భక్తి
    రామ నామ మనెడు రాగాన్ని చిందింప
    జుమ్మననెడి నాద సుఖము గనరె

    రిప్లయితొలగించండి
  8. కె.ఈశ్వరప్ప గారి పూరణలు
    1 త్యాగరాజ కృతుల తత్వంబున స్వర
    గతులు శాంత సౌఖ్య గతులు దొప్పు
    రాగ మందు ననురాగమే పంచు మో
    జునిడు లోకనీతి జుట్టి యుండు
    2.త్యాగధనుల శా౦తి తర తరాలక్రాంతి
    గతముహితమె సౌఖ్య గమన మగును
    రాజబిడ్డ కైన రాక్ష సత్వమున్న
    జులుము పనికి రాదు విలువ లేదు

    రిప్లయితొలగించండి
  9. పూజ్యుఉలు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    త్యాగి,యోగి,యైన త్యజియింప శాంతమ్ము
    గలుగ బోదు సుఖము జలజనయన
    రామ శాంతుడవయి రక్షించు త్యాగరా
    జుని విబీషణుని వలెను కరుణను

    రిప్లయితొలగించండి
  10. త్యాగ బుద్ధి తోడ తనయుచు వసియింప
    గలుగు శాంతి సతము ఖాయ ముగను
    రాత్రి, దినము స్వంత లాభమే కను మను
    జుల కశాంతి తోడ సుఖము కల్ల

    రిప్లయితొలగించండి
  11. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారిపూరణ
    త్యాగివై పరులకు నందించు మొక కృతి
    గర్వము,కినుక,విడి కదలు నెపుడు
    రాగిలును సుఖము పరమ శాంతమున మను
    జునకు శాంతి లేక ధనము లేల?

    రిప్లయితొలగించండి
  12. త్యాగరాజు దెలిపె థరణి జనులకెల్ల
    మము శాంతమైన గలుగు సుఖము!
    రామనామ మెపుడు రాజిల్లు మనముల
    జువ్వరించు శాంతి జోక నొసగు!!!

    రిప్లయితొలగించండి
  13. చంద్రమౌళి సూర్యనారాయణగారి పద్యం త్యాజ్యములగు కోపతాపముల విడిచి....
    గహ్వరి అంటే నేల. క్షాంతము అంటే ఓరిమి. జువ్వరించు అంటే విజృంభించు. ఇవన్నీ బాగున్నాయి, హెచ్చుగా నిఘంటుపదాలే ఐనా. ఈ పద్యానికి

    దండాన్వయం చూస్తే క్షాంతమతులు త్యాజ్యములగు కోపతాపముల విడిచి గహ్వరిఁ బెరుగవలె(ను). శాంతి లేక రవ్వంత సౌఖ్యమ్ము(ను) రాదు. ఇక్కడికి

    మొదటి మూడుపాదాలు అన్వయం అయ్యాయి కాని నాలుగవపాదం "జువ్వరించవలెను శుభములిలను" అన్నది విడిగా ఉండిపోతోంది. గమనించగలరు.

    కొంచెం సరిచేదాం. "జువ్వరించునపుడు శుభములిలను" అని. ఈ పాదంలోని అపుడు కు సమాధానంగా పై మూడు పాదాలు నిలుస్తాయన్నమాట.

    చక్కని భావం, పద్యం.

    సుబ్బారావుగారి పద్యం త్యాగరాజు కృతులు ధరణిని....
    అక్షరాలా అక్షరాలు నాలుగున్నూ పాదాద్యక్షరాలుగా కిట్టించేసారు. బాగుంది. కాని ఈ కిట్టింపు వలన ధార లేదు. ఫరవాలేదు పూరణమే కదా.

    జిగురు సత్యనారాయణగారి పద్యం త్యాగ భావము మది దాల్చెడి వానికి.....
    పద్యంలో ధార బాగుంది. కాని "రాగమందు శాంతరహితుడైన" అన్నది కొంచెం కృతకంగా ఉంది. వీలైతే మార్చండి.

    గుండా వేం. సహదేవుడుగారి పద్యం త్యాగ రాగములవి వీగిపో కున్నను.....
    మంచిధారతో కూడిన పద్యం. తప్పకన్ అన్నది దృతరహితంగా ఉన్నా సరిపోతుంది. మంచి భావయుక్తమైన పద్యం.

    మల్లెల సోమనాథశాస్త్రిగారి పూరణలు
    * త్యాగ రాజు పలికె తానట్లు శాంతితో
    నాకు సరిగా అన్వయం కావటం లేదు. కొంచెం పరిశీలించగలరు.

    * త్యాగ బుద్ధి తోడ తనరుచు శాంతితోఁ
    కాంతిగలుగు అంటే మరింత సుగమంగా ఉంటుంది అన్వయానికి. నాదసొబగు అన్నది సాధుప్రయోగం కాదనుకుంటాను.

    * త్యాగ మెంతొ జేసి తనదు నౌస్వార్థంబు,
    తనర నిస్వార్థత గడుపు దేని బ్రతుకు గలుగు శాంతి అంటే మరింత బాగుంటుందనుకుంటాను

    * త్యాగ యెపుడు నిధుల తావీడి ఘనముగా
    త్యాగయెపుడు అంత సుభగం కాదనుకుంటాను. త్యాగరాజెపుడు అంటే బాగుంటుంది. గణావసరంగ త్యాగరాజు అంటే చాలును. ముక్తిసొగసు కొత్తమాట.

    యత్యావశ్యకత అనుకుంటాను. బాగుంది పద్యం.

    * త్యాజ్యమైన కినుక తానొంద శాంతంబుఁ
    రాగాన్ని అన్న పదం మార్చి రాగంబు అందాము. జుమ్మననెడి అంత ఒప్పదు. జుమ్మనెడి అన్నదే ఉచితం. జుమ్మనెడి సునాద సుఖము అందామా?

    కెంబాయి తిమ్మాజీరావుగారందిచిన ఈశ్వరప్పగారి పద్యద్వయం
    1 త్యాగరాజ కృతుల తత్వంబున
    గతులు అన్న పదం పునరుక్తి. సౌఖ్యసరళి నొప్పు అంటే బాగుంటుందేమో చూడండి. "రాగ మందు ననురాగమే" అన్నచో గణభంగం కాబట్టి "రాగ మందున ననురాగమే" అని మారుద్దాము. ముద్రారాక్షసం కావచ్చును. "మోజునిడు లోకనీతి జుట్టి యుండు" అన్నది పూరణాయసమే కాని అన్వయసుభగంగా లేదు.
    2.త్యాగధనుల శా౦తి తర తరాలక్రాంతి .
    తరతరంబుల అనండి. పద్యం కొంచెం నిర్మాణదశలోనే ఉన్నట్లున్నది. అన్వయం ఇంకా సరిగా రావాలండి.

    ఎ. సూర్యనారాయణరెడ్డిగారి పద్యం త్యాగ బుద్ధి తోడ తనయుచు....
    ధారబాగానే వచ్చింది. పద్యం బాగుంది. ఖాయం అన్యదేశ్యం. రాత్రి దినము అన్నది బాగా ఉండదు రాత్రి పవలు అంటే? మనుజుల కశాంతి తోడ సుఖము కల్ల అన్నారు. బాగుంది కాని తోడ బదులుగా వలన వర్ణకం వాడండి.

    తిమ్మాజీరావుగారు పంపిన గురుమూర్తి గారి పద్యం త్యాగివై పరులకు నందించు....
    "త్యాగివై పరులకు నందించుము" బదులుగా "త్యాగివగుచు పరుల కందించుము" అనండి. మొదటి పాదంలో అందించుము అన్నాక రెండవపాదంలో "కదలు నెపుడు" కాక "కదలు మెపుడు" అని రావాలి కదా. ఈ పాదాన్ని ఇంకా చిత్రిక పట్టాలి. "గర్వమీసు విడిచి కదలు మెపుడు" అని మార్చవలసి ఉంది.
    మిగిలిన పాదాలూ అపరిపక్వంగానే ఉన్నట్లున్నాయి నా కంటికి. మూడోపాదానికి అనుసంధానించాలంటే రెండవపాదం మరింత మార్చి కదలు దేని అని ముగించవలసి ఉంది. పరమశాంతమున కాదు పరమశాంతమును అని ఉండాలి. దాదాపు తిరిగి వ్రాసినట్లున్నామే! భావం బాగుంది కాని మరింత పరిశ్రమ అవసరం ఐనదన్నమాట.

    శైలజగారి పద్యం త్యాగరాజు దెలిపె థరణి జనులకెల్ల....
    నిఘంటువు తిరగేసి గమము అన్నమాట పట్టారు. బాగుంది. రెండవపాదంలో శాంతమైన బదులు సవ్యమైన అంటే అన్వయం బాగుంటుంది. వీరూ జువ్వరించారు శబాసు. జోక అన్నపదమూ తెచ్చారు. కాని జోక అన్నది దృతప్రకృతికం కాకపోతే జోక యెసగు అనవలసి ఉంటుంది. ధార బాగుంది.

    రిప్లయితొలగించండి
  14. శ్యామలీయం గారికి ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    త్యాగ రాగములవి వీగిపో కున్నను,
    గతము మరువ కున్న కష్టముండు
    రామ నామ సుధల నీమముఁ దప్పక
    జుర్రుమోయి శాంతి, సుఖముఁ గలుగు

    రిప్లయితొలగించండి
  15. త్యాగ రాజు చాటె రాగాల శాంతము
    గరిమ నెరిగి మనము గడుపు దాము
    రాష్ట్ర ప్రజల నడుమ రంజిల్ల శాంతము
    జుర్రు కొనుము శాంతి చొరవ జూపి
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  16. గురుతుల్యులు, మార్గదర్శకులు శ్రీ శ్యామలీయం గారికి ధన్యవాదములు..

    రిప్లయితొలగించండి
  17. మిత్రులందఱకు నమస్కారములు!

    త్యాగరాౙు సెప్పె నానాఁడు శాంతమ్ముఁ
    నక సౌఖ్య మెౘటఁ గనరటంచు;
    రామునకును నిదె నిరంతర వినతి యౌఁ
    ౙుమ్ము కనఁగ లోక సూత్ర మగుౘు!

    రిప్లయితొలగించండి
  18. గురుతుల్యులు, మార్గదర్శకులు శ్రీ శ్యామలీయం గారికి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  19. శ్యామలీయం గారికి తమరి సవరణలకు సూచనలకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  20. త్యాగ రాజ నుతుని ధ్యానించుచును సదా
    గనుల జూచుచు నిజ జ్ఞాన మెరిగి
    రాగ యుక్తముగను రచియించె త్యాగరా
    జు "శమము గలుగనిచొ సుఖము లేదు"

    రిప్లయితొలగించండి
  21. నిన్నటి న్యస్తాక్షరికి చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు...
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారికి,
    శైలజ గారికి
    అభినందనలు. శ్యామలీయం గారు వీరి పూరణల సమీక్ష చేశారు కనుక నేను అదనంగా వ్యాఖ్యానించ నవసరం లేదని భావిస్తున్నాను.
    *
    శ్యామల రావు గారూ,
    నా అనుపస్థితిని అర్థం చేసికొని సానుభూతితో, భాషాభిమానంతో మిత్రుల పూరణ సమీక్షించి, గుణదోషాలను తెలిపి, సవరణలను సూచించినందుకు ధన్యవాదాలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మొన్నటి సమస్యకు, నిన్నటి న్యస్తాక్షరికి మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    దంత్య చజలు ఎలా టైపు చేశారో తెలియజేయవలసిందిగా మనవి.
    *
    మాజేటి సుమలత గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సదా + కనుల’ అన్నప్పుడు గసడదవాదేశం కానీ, సరళాదేశం కాని రాదు. ‘వానిఁ/ గనుల జూచుచు..’ అనండి. నిజజ్ఞానము అన్నప్పుడు జ గురువై గణదోషం. ‘చో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాయరాదు.

    రిప్లయితొలగించండి
  22. త్యాగ రాజ నుతుని ధ్యానించుచును వాని
    గనుల జూచుచు నిజ కావ్య మెరిగి
    రాగ యుక్తముగను రచియించె త్యాగరా
    జు "శమమలర కున్న సుఖము లేదు"

    ధన్యవాదములు గురువు గారు. ఇప్పుడు సరిపోయిందనుకుంటున్నాను. కావ్యము అంటె సుఖము అని నిఘంటువులో చూసి ఆ అర్థంలో వ్రాసినాను. తప్పులున్న తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  23. సుమలత గారూ,
    సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కావ్య’మన్న శబ్దానికి ఆంధ్రభారతిలోని ఏ నిఘంటువూ ‘సుఖ’మన్న అర్థాన్ని ఇవ్వలేదు. కేవలం పర్యాయపద నిఘంటువులో మాత్రం సుఖానికి కావ్యము పర్యయపదమని ఇచ్చారు. ‘కనుల జూచుచును సుఖమ్ము నెఱిగి’ అంటే బాగుంటుందేమో!

    రిప్లయితొలగించండి
  24. త్యాగనిరతి పెరిగి ధనపు మోహము వీడు
    గతినిఁ దెలిసికొన్న గరిమ మిగులు
    రామనామముల నరయ శాంతి సౌఖ్యము
    జుంటితేనె రుచినిఁ జూపునీకు.

    రిప్లయితొలగించండి
  25. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. ధన్యవాదాలండి. గురువుగారు, ఓపికగా అన్ని పూరణలను పరిశీలించినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి