12, అక్టోబర్ 2014, ఆదివారం

దత్తపది - 48 (ఆది, సోమ, మంగళ, బుధ)

కవిమిత్రులారా
ఆది - సోమ - మంగళ - బుధ
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

32 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    శమంతకోపాఖ్యానములో :

    01)
    _____________________________

    ఆది సోమ మంగళ బుధ - యనక, నేడు
    వారముల యందు స్వచ్ఛ సు - వర్ణకంబు
    నిచ్చు నీ శమంతక మణి - నిస్తివేని
    ప్రజల పాలన కొఱకు నే - పదిలపరతు
    ననిన కృష్ణున కీయక - నాగ్రహమున
    సాగనంపెను దూషించి - సత్రజిత్తు !
    _____________________________

    రిప్లయితొలగించండి
  2. అక్షయపాత్ర :

    02)
    _____________________________

    ఆదు కొనుమంచు "నాది"త్యు - నర్చ జేయ
    సోమమిడినట్టి ధర్మజు - బాము నెరిగి
    మంగళము నొంద దీవించి - మర్కుడిడెను
    అక్షయంబిది బుధ జన ,- యాశ్రితులకు
    వలయు నన్నము నిచ్చెడి - పాత్ర యనుచు !
    _____________________________
    అర్చ = పూజ
    సోమము = నీళ్ళు(అర్ఘ్యము)
    బాము = సంకటము

    రిప్లయితొలగించండి
  3. అరుణ కిరణా ల యాదిత్యు నాద రించి
    సోమ మీయగ దనకుగా సూర్యు డపుడు
    మంగ ళం బును నక్షయ మ యని దలచి
    బుధజ నుల గార వించెడు బుధుడు నైన
    ధర్మ జున కిచ్చె నాపాత్ర ధర్మ మరసి

    రిప్లయితొలగించండి
  4. ఆది మధ్యాంత రహితునౌ నాదు యండ
    సోమ శేఖరు నస్త్రమె సొమ్ము కాగ
    మంగళముఁ గూర్చు ఫల్గుణా! మదన పడకు
    బుధ జనులు మెచ్చు విజయమ్ముఁ బొంద గలవు.

    రిప్లయితొలగించండి
  5. ఆదినకరుని గొలిచి నేనమ్మ నైతి
    సోమమందున వదలితి సూర్యసుతుని
    మంగళమ్ముగ వీనిని గంగమాత!
    బుధజనుల ప్రాపు జేర్చుమా పొలుపుగాను!

    రిప్లయితొలగించండి
  6. ఆదిక్పాలకదేవతాగణసమూహంబుల్ దిగంతంబులున్
    వేదార్థంబులు సోమసూర్యులు మహా విశ్వాంతరాళంబులున్
    గోదేవీమయమంగళప్రకటసాద్గుణ్యంబులున్ ఋష్యసం
    వాదంబుల్ బుధమౌనివర్య తతవిభ్రాజిష్ణుఁడై వెల్గగాన్.

    రిప్లయితొలగించండి
  7. శ్రీకృష్ణపరమాత్ముడు తన విశ్వరూపసందర్శన ఘట్టములో.......

    రిప్లయితొలగించండి
  8. ఆదిశేష శయనుడు మీ యండ నుండ
    సోమమును జూపి వైరుల స్రుక్కఁ జేసి
    మంగళమ్మును పొందుడు మాన్యు లార
    కలుగు బుధవర్గ దీవెనల్ వెలుగు భవిత

    రిప్లయితొలగించండి
  9. ఆది దేవుని యవతార మాతడౌను
    బుధజనమ్ములు మెచ్చగా బోధ జేసె
    మంగళమ్మగు సంధిని మనసునొప్ప
    భీమరణమింక జరుగును సోమరింప.

    రిప్లయితొలగించండి
  10. సంపత్ కుమార శాస్త్రి గారు,
    మీపద్యం బహు సుందరంగా ఉన్నది.
    మొదటి రెండు పాదాలలో - విశ్వరూపంలో వారంతా కనిపిస్తున్నారనుకుంటున్నా, చివరి రెండుపాదములు
    మీ పద్యం కొద్దిగా అర్థమైతూ ఉన్నా దయచేసి వివరించమని మనవి.
    తెలుసుకొని ఆనందిద్దామని ఎదురుచూస్తున్నా.

    రిప్లయితొలగించండి
  11. వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపూరణలో ‘ఇస్తివి’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘మణి నిత్తువేని’ అంటే సరి!
    రెండవ పూరణలో ‘బుధజన + ఆశ్రితు’లన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘బుధులకు నాశ్రితులకు’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. ఆది కాలమునున్న వేదంపు ప్రతిరూప
    మై వెల్గును జయము మహిని యెపుడు,
    సోమార్క నక్షత్ర సురనదులు గతులు
    తప్పక నడయాడు దనుక నిలుచు.
    మంగళమగు పఠింపగ నిత్యమిన్నిల
    ధర్మ జయమ్మది తథ్యమనుచు
    బుధవరులెల్లరు పుడమిజనాళికి
    చెప్పి యుండగలేదె శిష్టులార!

    దీని సాటినిలుచు దివ్యగాథలనంగ
    నే బృహత్కథలిక నెందు లేవు,
    దీనియందునున్న దియెనుండునిలలోన
    దీనిలోని లేనిదెందుగలదు?

    రిప్లయితొలగించండి
  13. లక్ష్మీదేవి గారూ,
    ‘దీనిలోని లేని దెందుగలదు’ అంటూ చక్కని సీసపద్యంతో భారతప్రాశస్త్యాన్ని వర్ణించారు. బాగుంది. అభినందలు.
    ‘నిత్యమిన్నిల’?

    రిప్లయితొలగించండి
  14. సోమ వంశంపు కధ యిది సొగసుగాను
    ఆదిధర్మము నిలబడె నవని నిందు
    మంగళంబును గాంచిన మహిత బోధ
    బుధతతిన్ పాండుల వరించె పూర్తి జయము

    ఆదిదాయ లసూయను నమరె నిదియె
    సోమ వంశాన రారాజు శూరుడనని
    మంగళంబులు కోరక మాయజేసె
    బుధ నుతులునౌచు,పాండులు పొంద శుభము

    బుధనికరములు పొగడనా పొల్పు కధయె
    సోమవంశంపు రాజుల శూరచరిత
    మగళంబిడు ధర్మంపు మాన్యజయము
    ఆది యంతంబు వేదాల నమరు సూక్తి

    ఆది నుండియు వేదాల యాత్మగాగ
    సోమ వంశంపు కధలను సూక్ష్మ గతిని
    మంగళంబుగ గూర్చిన మాన్య గాధ
    బుధ జనాళికి భారత భూమి గాధ

    బుధ జనులునైన పాండవ పూజ్యచరిత
    సోమవంశంపు శూరులై శుభముగనిరి
    ఆదిదేవుండు కృష్ణుండు నండనుండ
    మంగళంబుల నందిరి మహితకీర్తి

    రిప్లయితొలగించండి
  15. ఆంద్ర మహాభారత రచనార్ధంలో
    ఆది కవి యైన న్నన్నయ్య ననుసరించి
    సోమయాజుడౌ తిక్కన్న సొబగులద్ద
    మంగళ ము గ పూరించె తా మరగు పడిన
    యర్ధ పర్వంబు ధన్యు డెర్రన్న వ్రాసి

    రిప్లయితొలగించండి
  16. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కోరెను + ఆర్యుడు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘కోరగ నార్యుడు’ అందామా?
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదుపూరణలు బాగున్నవి. అభినందనలు.
    కొన్ని చోట్ల విసంధిగా వ్రాశారు. ‘సొగసుగాను ఆది.., జయము ఆది, కనిరి ఆదిదేవుండు..’

    రిప్లయితొలగించండి
  17. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. ఆదిమ జాతి వీరు గురు దక్షిణ కోరగ నార్యు డౌర సం
    వాదము సేయకన్ గదిలి వాక్కు ను నిల్పెను సోమ పాత్రుడున్,
    మాదము మాన్యు లార యిక మంగళ మౌనట,పాండు మధ్యమున్
    వేదన దీర గన్ విబుధ వీరులు బల్కిరి హెచ్చుతగ్గులన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  19. ఆదిజు డయ్యెడ న్నగము నల్లన నెత్తిన చిన్న దేవునిన్
    ' మేదిని నీకు నీవె సరి! మీనమ వై కడ దేర్చి సోమకున్
    వేదము లిచ్చినావు మును, వింతయె మంగళ రూప! శైలమున్
    దూదిగ నెత్తుటల్ విబుధ! దోయిలి యొగ్గి నుతింతు ' నిన్ననెన్.

    రిప్లయితొలగించండి
  20. శ్రీగురుభ్యోనమ:
    శ్రీకృష్ణ రాయభార సందర్భమున

    ఆదిమధ్యాంతరహితుడై యవతరించె
    మంగళమ్ములు గూర్చగ మాధవుండు
    బుధవరేణ్యులు మెచ్చగా బుద్ధి జెప్పె
    భీమసోమము వర్ణించె వివరముగను.

    రిప్లయితొలగించండి
  21. సోమనాథ శాస్త్రిగారు ఎన్నిరకాలుగా చెప్పినారు!!
    మిస్సన్న గారి,శ్రీపతిశాస్త్రిగారి పద్యాలూ బాగున్నాయి.

    గురువుగారు,
    నిత్యము+ఈ యిల = నిత్యమియ్యిల అనవచ్చునా? నేను ప్రయోగించిన రూపం తప్పనుకుంటా.

    భారతాన్ని నిత్యము ఈ ధరణిలో నున్నవారు పఠించినచో ధర్మము దాని ప్రాముఖ్యత తెలిసి ధర్మజయము గలుగుతుందని నా భావన.

    రిప్లయితొలగించండి
  22. శ్రీమతి లక్ష్మిదేవిగారికి వందనములు.

    విశ్వరూపములో కేవలము మనుష్యదేవతలు ఋషిమునిశ్రేష్టులే కాక జంతు పశుపక్ష్యాదులు కూడాఉంటాయనే ఉద్దేశ్యముతో గోదేవీ మయ ( గోదేవీసహిత ) అంటూ గోమాత -- మంగళప్రదమైనదనే మాటను స్ఫురింపజేస్తూ ( ప్రకట ) -- సద్గుణాములకు నెలవై -- అనిచెప్పే ప్రయత్నము చేసినాను.

    ఎంతవరకూ అతికిందో తెలీదు.

    గురువుగారేమో tick mark కొట్టినారు.

    గురువుగారూ ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  23. శ్రీమతి లక్ష్మిదేవిగారికి వందనములు.

    పద్యాన్ని మెచ్చుకున్నందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  24. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కానీ మీ పద్యం భారతార్థానికి కాక భాగవతార్థానికి సరిగ్గా సరిపోతుంది. ఇంతకూ కృష్ణుణ్ణి స్తుతించిన ‘ఆదిజు’ డెవరు?
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ ప్రయోగం సరియైనదే. నేనే సరిగా అవగాహన చేసికొనలేదు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  25. గురువుగారు,
    ధన్యవాదాలు.

    సంపత్ కుమారశాస్త్రిగారు,

    నా సందేహం- మొదట వ్యక్తుల్ని ప్రస్తావించి అందులోనే సాద్గుణ్యంబులు, సంవాదంబులు అని రావడం తో అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  26. దశావతారి శ్రీహరి పాద పంకజములకు ప్రణతులిడుచూ…

    శ్రీ రఘు రామ భక్త నిజ చిహ్న సశస్ర సుఘోటికాది మిం
    చారు సువర్ణ దివ్యరథ సారథి దిగ్గన కోటికోటి సో
    మారున భాసమాన ఘన మంగళ సుందర విశ్వరూపమున్
    ధారణి యందు చూపె విబుధాధిప సూనకు సుప్రసన్నుడై

    రిప్లయితొలగించండి
  27. మారుపాక రఘుకిశోర్ శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మించారు’...?

    రిప్లయితొలగించండి
  28. గోవర్ధనోధ్ధరణ సమయంలో బ్రహ్మ శ్రీకృష్ణుణ్ణి నుతించినట్లు ఊహించాను గురువుగారూ.

    లక్ష్మీ దేవిగారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. కంది శంకరయ్య గారూ,
    మీ వ్యాఖ్యానము నకు ధన్యవాదములు
    మించు + ఆరు = మించారు => ప్రకాశించు
    (ఉకార సంధి)

    --మారుపాక రఘుకిశోర్ శర్మ

    రిప్లయితొలగించండి