24, అక్టోబర్ 2014, శుక్రవారం

దత్తపది - 50 (కటి-కిటి-తటి-నటి)

కవిమిత్రులారా!
కటి - కిటి - తటి - నటి
పైపదాలను ఉపయోగిస్తూ సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

37 కామెంట్‌లు:

  1. చీకటి జీల్చుచు తిన్నగ
    నా కిటికీలోన జొచ్చె నాదిత్య శిఖల్
    కోకిల యెంతటి సన్నటి
    కూకూ కూతలను మేలు కొలుపుల పాడెన్

    రిప్లయితొలగించండి
  2. కారు చీకటి దొలగించ గర్ణు తండ్రి
    కొండ తటి నుండి బయటకు కోరి రాగ
    వెలుగు లొం దగ వాకిటి తలము లన్ని
    సంతసంబున నటియించె జనము నపుడు

    రిప్లయితొలగించండి
  3. నిద్ర లేచితి చూచితి నింటి కిటికి
    బయట విచ్చెను నిన్నటి పద్మ మచట
    పారిపోయెను చీకటి పరచె వెలుగు
    దూర తటి పైకి సూర్యుండు చేరుచుండె.

    రిప్లయితొలగించండి
  4. చిన్నసవరణతో....

    నిద్ర లేచితి చూచితి నింటి కిటికి
    బయట విచ్చెను నిన్నటి పద్మ మచట
    పారిపోయెను చీకటి పరచె వెలుగు
    దూర తటి పైకి సూర్యుండు చేరియుండి .

    రిప్లయితొలగించండి
  5. తూర్పు తటియందు భానుడు తోచె నిపుడె
    వెలుగు కిటికీల లోనుండి వెల్లివిరిచె
    చక్కటి చెలువుతో వనజములు విచ్చె
    పెరటిలో ననటిగెల కన్విందు జేసె
    అనటిః అరటి

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమ:

    చీకటి పారిపోయినది చిన్మయమూర్తి దివాకరుండు ప్రా
    గ్వాకిటి లోన నిల్చె పలు వర్ణసుశోభలు వ్యాప్తి చెందగా
    నాకస మంతటిన్ వెలుగు హారతి పళ్ళెమనంగ విష్ణుకున్
    శ్రీకర కర్పురం బనగ జెల్లును నెన్నటికైన భానునిన్

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    నాట్యగాని భార్య :

    01)
    _________________________

    కటిక చీకటి తొలగెను - కాంతి వెలసె
    కిటికి తలుపుల లోవచ్చు - కిరణములకు !
    తటిని జేరెడి వేళాయె - తానమాడి
    నటితి సాధన జేయగా - నాట్యగాడ
    తూర్పు దిక్కున సూర్యుండు - తొంగి చూసె !
    _________________________
    నటితి = నాట్యము

    రిప్లయితొలగించండి
  8. చీకటినిఁ జీల్చి యర్కుడు చేరె తూర్పు
    చెక్కిటినిఁ గయిఁ జేర్చి నేఁ జిత్తరువుగ
    గంటిని, తటిత్పతి తెఱల గడచి వెలి వ
    డంగ- నర్తనమ్ము సలుపునటుల! నటియొ?

    రిప్లయితొలగించండి
  9. చీకటి జీల్చుక సూర్యుడు
    ప్రాకటముగ సంద్ర తటిన ప్రవిభాసిలుచున్
    లోకుల వాకిటి యందున
    నా కమలాప్తుడు నటించ నరుదెంచెనయా

    రిప్లయితొలగించండి
  10. చంద్రమౌళి సూర్యనారాయణగారి కంద పద్యం చీకటి జీల్చుచు తిన్నగ...
    ఇందులో‌ పూర్వార్థ తీయార్థాలు రెండూ విడివిడిగా ఉన్నాయి. కొంచెం అతుకు పెట్టండి.
    కోకిల గుంపులు సన్నగ... పాడన్ అంటే సరిపోతుంది. లేదా కోకిల లంతట... పాడెన్ అన్నా సరే.

    సుబ్బారావుగారి తేటగీతి కారుచీకటి...
    వాకిటి తలములు?
    నటియించె జనము?
    కొంచెం చిత్రికపట్టండి.

    గోలి హనుమఛ్ఛాస్త్రిగారి సవరించిన తేటగీతి పద్యం నిద్రలేచితి...
    నిన్నటి లో నటి ఉందా అని ఒక ప్రశ్న. శంకరయ్యగారి అభిప్రాయం వినాలి.

    సత్యనారాయణ రెడ్డిగారి తేటగీతి తూర్పుతటి యందు...
    వెల్లివిరిచె అన్న పదాన్ని వెల్లివిరిసె అని దిద్దండి.
    చక్కటి లో‌ కటి ఉందా? శంకరయ్యగారి అభిప్రాయం వినాలి.

    శ్రీపతి శాస్త్రిగారి ఉత్పలమాల చీకటి పారిపోయినది...
    ధార బాగుంది. ఆకస మంతటిన్ బదులుగా ఆకస మంతయున్ అని మార్చితే బాగుంటుంది. విష్ణుకున్ సరిగాదు. విష్ణునకున్ అనవలసి ఉంటుంది. అది ఇక్కడ గణసౌలభ్యం కుదరదు కాబట్టి శౌరికిన్ అనండి. చక్కని పద్యం. మంచి భావం.

    వసంతకిశోర్ గారి తేటగీతి కటికచీకటి తొలగెను...
    వెలసె బదులు విరిసె అంటే మరింత బాగుంటుందేమో? జాగ్రత్తగా నాలుగు పాదాల్లో క్లుప్తీకరించవచ్చునేమో చూడండి.

    లక్ష్మీదేవిగారి తేటగీతి చీకటిని జీల్చి ...
    చెక్కిటిలో కిటి ఉన్నదా? శంకరయ్యగారి అభిప్రాయం వినాలి. అన్వయం అవుతోంది కాని చివరిపదం కలవటంలే దనిపిస్తోంది. మరింత పరిశీలనగా చూడాలి.

    బొడ్డు శంకరయ్యగారి కందం చీకటి జీల్చుక...
    పద్యం అంతా ఒకే వాక్యంగా అన్వయం అవుతున్నప్పుడు సూర్యుడు అని కర్తను చేసి చెప్పి మరలా కమలాప్తుడు అని మరొకసారి కర్తగా చెబుతూ అనటం బాగుండదు. కొంచెం‌ మార్చవలసి ఉంటుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  11. శ్యామలీయం గారికి నమస్సులు, సవరణతో...

    చీకటి జీల్చుక సూర్యుడు
    ప్రాకటముగ సంద్ర తటిన ప్రవిభాసిలుచున్
    లోకపు వాకిటినిడ వెలు
    గాకాశముపై నటింప నరుదెంచెనయా!

    రిప్లయితొలగించండి
  12. చీకటి దుప్పటి తొలగన్
    వాకిటి తలుపుల స్పృశించె వర్ణుని కరముల్
    లోకంబంతటిఁ గాచెడు
    పాకుడు నటియించఁ గదిలె భళిర! త్రిమూర్తై!

    రిప్లయితొలగించండి
  13. నటియింప నర్కుతేజము
    కటి పర్యంతము నదులను కాల్వల మునుగన్
    తటి కొందరీయ నర్ఘ్యము
    కిటికీ సందులఁ జొరబడె కిల్బిష హరుడై

    కటి బట్టు సూర్య నుతి నటు ( సూర్య నమస్కారం)
    కిటినైననుఁ గొట్టగల్గి కేరును నెవడేన్
    తటి నర్ఘ్యమిడిన యప్పుడు
    నటియించెడి పాతకములు నయమున పోవే!

    కిటికీలాకుల సందుల
    నటియించుచు సూర్యుడాడు నాటకమిదియే
    కటికై నిద్దుర లేపడె
    తటి నటి తూరుపు దిశనవ తరణము నందెన్

    కటిక చీకటి భేదించి కాంతినింపు
    కిటియు నాదిగ జంతులు గెంతు చుండ
    తటిని తనకును నర్ఘ్యాలు తనరనివ్వ
    నటిగ తరగల సూర్యుడు నాట్యమాడె

    తటిని తూర్పున సూర్యుడు ధర్మ మొప్ప
    కిటికి లందూరి భవనాల కింపు గూర్ప
    కటిక చీకటి తొలగించి కాను పడెను
    నటిని బోలియు కిరణాల నమర లహరి

    రిప్లయితొలగించండి
  14. కటిక చీకటు లెల్ల గడగడ వడకుచు
    ..........పారిపోవగ జేయు ప్రబల శక్తి
    కిటికీల గుమ్మాల పటుతరమ్ముగ దూరి
    ..........మేల్కొల్పు పాడెడి మెరుపు తీవ
    తటినీ జలమ్ముల తరగల పై స్వర్ణ
    ..........రోచిస్సు లద్దు కాణాచికాపు
    నటియింప ప్రాగ్దిశన్ నగుమోముతో నుషా
    ..........బాలకు ఘల్లను కాలి యందె

    చూడరే శరత్ప్రాభాత సూర్య కిరణ
    పుంజ మంజుల కమనీయ మోహ జనిత
    వైభవమ్మును, ధాత్రిని శోభలీను
    తీరు ననునిత్యమున్ మీరు దివ్యమౌను.

    రిప్లయితొలగించండి
  15. 2:
    సూరుడు తోచి తూర్పుతటి శోభను గూర్చెను వేగు జామునన్
    ధారణి వీడి చీకటిని తామర పువ్వులు తేజరిల్లగన్
    నారులు చేరి వాకిటిని నాణెపుముగ్గులు వేసి చక్కగన్
    చేరిరి చిత్రసీమనటి చెన్నును గాంచగ నూరి పెండ్లిలో

    రిప్లయితొలగించండి
  16. శ్యామలీయంగారికి నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదాలు.
    చక్కటి: ఆర్జవము: చక్కన (శబ్దరత్నాకరము)

    గరిక పాటి నరసింహారావు గారి పూరణలు

    మారేజీ, బారేజీ, గారేజీ, కారేజీ

    ఆ/
    బ్బారే జీవనుడైన చందురుని గొప్పల్నిల్ప యోజింపుడీ

    ౨. లంచాలు/మంచాలు/కంచాలు/ చెంచాలు

    మీలో మీకం/
    చాలమ్మంచాలు మగల

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులుగురుదేవులు శంకరయ్యగారికి వందనములు
    చెనటి చీకటి యనెడి తటిని కిటి సతి
    నొడ్డుజేర్చగ నుదయభాను౦డు నిలిచె
    పూలు వికసించెవైదికుల్ పూజ సేయ
    వేచి యున్నారు మేలుకో వేంకటేశ

    రిప్లయితొలగించండి
  18. కె.యెస్.గురుమూర్తి అచ్చారి గారి పూరణ
    చీకటీ తటిల్లునజగతిని చెనటి జేయ
    లోకబా౦ధవుడైన సూర్యుండు పొడమి
    ఎల్లవారి వాకిటి ముందు నుల్లసిల్లె
    నా ప్రభాకరోదయమెగా హర్షదమ్ము

    రిప్లయితొలగించండి
  19. సహదేవుడుగారి కందపద్యం చీకటి దుప్పటి ...
    వర్ణుని కరముల్ అన్నచోట వర్ణుడు అని సూర్యుడిని సూచించటం బాగానే ఉంది కాని ప్రసిథ్థం కాని పదం కాబట్టి భానుకరంబుల్ అని మార్చెతే సుభగంగా ఉంటుంది. త్రిమూర్తై అనటం సరికాదు త్రిమూర్తియై అనవలసి ఉంటుంది. చివరిపాదం అర్థం కాలేదు కాబట్టి సవరణ సూచించటం‌ కష్టం.

    మల్లెల సోమనాథశాస్త్రిగారి పద్యాలు
    ఈ‌పద్యాలలో తటి అంటే ఏటి ఒడ్డు అనే అర్థంలో‌ తరచుగా వాడారు. నదీసూచకమైన పదానికి పరంగా అంటే గంగాతటి యమునాతటి వగైరా విధంగా కాకుండా వట్టినే తటి అన్న మాటకు ఇలా వాడుక ఉన్నదా అన్నది ప్రశ్న. ఒక చోట కటికై అన్నారు. కటికయై అనాలనుకుంటాను. నటిగ తరగల సూర్యుడు అన్నారు. నటి స్త్రీలింగసూచకం సూర్యుడు అన్నది పుల్లింగం కదా. ఇలాంటీ ప్రయోగం తరువాతి పద్యంలోనూ‌ కనవస్తుంది

    మిస్సన్న గారి సీసపద్యం కటిక చీకటులు....
    దోషం ఏమీ‌లేదు కాని, మేలుకొల్పులు పాడు అనండి మేల్కొల్పు పాడెడికి బదులుగా. కాణాచికాపు అంటే కాపలావాడు. కాని ఈ‌ భావానికి పాదంలో హెచ్చుగా ఊతం ఇవ్వలేదు. ఒక్కటే కాలి అందె ఏం సొగసు? సూర్యుడిని రెట్టించలేం కాబట్టి ఆభరణం మార్చండి. శరత్తుకు సూర్యుడిపరంగా ప్రత్యేకత ఏమీలేదు చంద్రుడి పరంగా ఉన్నట్లుగా. దివ్య మౌను కన్నా దివ్యమగుచు ఉచితమేమో‌పరిశీలించండి.

    సత్యనారాయణ రెడ్డిగారి రెండవపద్యం ఉత్పలమాల సూరుడు తోచి...
    వీడి చీకటిని బదులు వీడ చీకటిని అన్నా బాగుంటుంది. వీడ చీకటులు మరింత ప్రౌఢంగా ఉంటుంది. నారులు అన్నాక వాకిటిని అని ఏకవచనం చేయకూడదు కదా. అదీ‌కాక, నాణెపుముగ్గులు అన్నమాట బాగున్నా కొంచెం యతిప్రయాసలాగ ఉంది కాని తప్పేం‌లేదు. నారులు చేరి వాకిళుల నాణెపుముగ్గులు అని మార్చండి. చక్కగన్ తప్పించి వేడుకన్ అంటే సొగసుగా ఉంటుందనుకుంటాను పద్యభావస్ఫోరకంగా ఉండటం వలన.

    వారు ప్రస్తావించిన అంశాలు. చక్కటి అన్న మాట. అది తప్పు కాదు కాని దాని అంత్యంలో కటి అని విడిగా పదం చూడవచ్చునా అన్నది నా సందేహం. మీ కంచాలమ్మంచాలు అన్న చోట మీ‌ కంచాలు, అమ్మంచాలు అని కదా. అందులో అమ్మంచాలు అన్నది ఆ+మంచాలు అన్నదానికి త్రికసంధి కాబట్టి ఇబ్బందేమీ లేదు. అక్కటి చక్కటి వంటి వాటిలో‌ కటి అనే పరపదంతో ఆ పదాలకు విఛ్ఛేదం ఉందా అని చూడాలన్నది వేరే విషయం.

    తిమ్మాజీరావుగారి తేటగీతి చెనటి చీకటి ...
    సుప్రభాతగీతిక. చివరి రెండుపాదాలు అతిసులభం. తమాషాగా ఇచ్చిన నాలుగు పదాలూ మొదటిపాదంలోనే ఉంచి పూరించారు. చీకటి యనెడి తటిని కిటి సతి నొడ్డు జేర్పగ అన్నది అర్థం కాలేదు. ఉదయభానుడిని కిటితో పోల్చారో లేక కిటిసతి నొడ్డుజేర్పగ అన్నారో స్పష్టంగాలేదు. ఉభయపక్షాలుగా విచారించినా అన్వయం నాకు రావటం లేదు. కిటిసతి అన్నదీ భానుడిని కిటి అనటమూ‌ రెండు అనిదంపూర్వాలనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  20. చీకటి తెరలను దించుచు
    వేకువ కిటికీని తెరచి వెలుగులదొరయే
    ప్రాకటముగ నటియింపగ
    నాకస తటిలో మెరిసెను నార్తుల బ్రోవన్!!

    రిప్లయితొలగించండి
  21. శ్యామలీయం గారికి ధన్యవాదములు. మీ సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాను. సూర్యుని ఒక కిరణము ఉషాబాల కాలి అందెగా భాసిల్లుతోంది అని నాభావం. సూర్యుడు కాదు. మీ అభిప్రాయం చెప్పండి.
    శరత్కాలం లో ప్రభాత సమయాన చలిచలిగా నున్నపుడు నునువెచ్చని భాస్కర స్పర్శ హృదయంగమమే కదా అనుకొన్నాను.

    రిప్లయితొలగించండి
  22. మరియొకపూరణ
    తూరుపు వాకిటి నందున
    తీరుగ చీకటిని తరిమి తిగ్మా౦శుడు సొ౦
    పారగ నటియి౦ఛ భువిని
    దూరమ్మoతటి నవంగ దోసము లెల్లన్

    రిప్లయితొలగించండి
  23. శ్యామలీయం గారికి తమరి సవరణలకు, చూచనలకు ధన్యవాదాలు.
    గోల కొండ అనే పదాన్ని
    "గోల గగ్గోల కొండయై" అని కూడా ప్రయొగించారు గరికపాటి వారు.

    "నారులు చేరి వాకిళుల నాణెపుముగ్గులు అని మార్చండి." అని చూచించారు. "కిటి" కోసం వాకిటిన వాడాను.
    ఒకేయింట్లో ఉన్న నలుగురు కోడళ్ళ కథ చిన్నప్పుడు చదువుకున్నాను. సినిమా తారను చూడాలనే ఉత్సాహంతో కలిసి ముగ్గులు వేశారని నా అబిప్రాయము.

    మీ అభిప్రాయం ప్రకారం మారిస్తే "కటి" కోసం చివరలో యొక్కటిన్ అనే పదం వాడాలి

    నారులు చేరి వాకిళుల నాణెపుముగ్గులు వేసి యొక్కటిన్ (ఏకంగా)/
    చేరిరి చిత్రసీమనటి చెన్నును గాంచగ నూరి పెండ్లిలో

    కటి కోసం వేరే పదం ఉంటే దయచేసి చూచించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  24. శ్రీగురుభ్యోనమ:

    శ్రీ శ్యామలీయం గారికి నమస్సులు. గురువుగారూ మీరు సూచించిన సవరణ చాలా బాగున్నది. 3వ పాదములో "ఆకసమంతయున్" అని వ్రాయాలనుకున్నాను. కానీ "తటి" పదము కోసమై "ఆకసమంతటిన్" అన్నాను. దత్తపదులు లేకుండా సవరించిన పద్యము

    చీకటి పారిపోయినది చిన్మయమూర్తి దివాకరుండు ప్రా
    గ్వాకిటి లోన నిల్వ బలు వర్ణసుశోభలు వ్యాప్తి చెందగా
    నాకస మంతయున్ వెలుగు హారతి పళ్ళెమనంగ శౌరికిన్
    శ్రీకర కర్పురం బనగ జెల్లును నెన్నటికైన భానునిన్

    రిప్లయితొలగించండి
  25. శ్యామలరావు గారు, ధన్యవాదాలు.
    మీరన్నట్టు చెక్కిటి పద ప్రయోగం తప్పే. వచ్చినా చెక్కిటను రావాల.
    సవరణకు ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  26. శ్యామలీయం గారికి ధన్య వాదములు.
    తమరి సవరణ "భాను కరంబుల్" బాగుంది.
    చివరి పాదంలో పాకుడు అంటే సుర్యుడు ఉదయ,మధ్యహ్నసాయంత్రాల్లో
    బ్రమ్హ,విష్ణు మరియు మహేశ్వరులవలె త్రిమూర్తి గా కదిలాడను భావంతో
    వ్రాయడం జరిగింది.
    అన్వయం సరిపోదనిపిస్తే సవరించిన పద్యం పరిశీలించ ప్రార్థన:
    చీకటి దుప్పటి తొలగన్
    వాకిటి తలుపుల స్పృశించె భాను కరంబుల్
    లోకంబంతటిఁ గావగ
    పాకుడు నటియించె దివిని పరమేస్వరుడై!

    రిప్లయితొలగించండి
  27. చీకటిని ద్రోసి దినమణి చేరె, తూర్పు
    వాకిటిని జేసె సుందరపటము; తోచె
    గల్పన- తటిత్పతి తెఱల గడచి వెలి వ
    డెనన నర్తనమ్ము సలుపనెంచు నటిగ.

    రిప్లయితొలగించండి
  28. కె.ఈశ్వరప్ప గారి పూరణలు
    1.ఎంతటి గొప్పవారయిన యెచ్చట జీవన మాచరించినా
    చింతల దీర్చు సూర్యుడిల చిత్రముగా నటియించబోకనే
    న౦తటవెల్గు నాపు గద నర్కుడు చీకటీ పారద్రోలి నొ
    క్కింతయు నింటి వంట కిటికీ లను జూచిన లోకబంధువై
    2.కిటికీలందున సూర్యుడు
    నటియించుట గాంచి పూలు నవ్వుత గన నె౦
    తటి వింతో మది పెంజీ
    కటి సూర్యు నుదయకిరణము గమనించుట కై

    రిప్లయితొలగించండి
  29. మిత్రులందఱకు నమస్కారములు!

    కటిక చీఁకటి పొరలను ఖండములుగఁ
    జీల్చి, వాకిటి తలుపు ముంజేతితోడఁ
    ద్రోచి, వచ్చి, మేల్కొల్పు సద్రుచుల! నెం
    టి
    మొనగాండ్రపై నైన నటించును రవి!!

    రిప్లయితొలగించండి
  30. మదీయ ద్వితీయ పద్యము:

    నా మొదటి (తేటగీతి) పద్యభావమే కందపద్యమున...

    కూకటి వ్రేళులఁ జీఁకటి
    వేకువ జాముననుఁ గూల్తువే వాకిటిలోఁ
    దేఁకువ నిడి! నీ వెంతటి
    నాకాధీశు పయి నయిన నటియింతువయా!!

    రిప్లయితొలగించండి
  31. శ్యామలీయముగారికి గారికి ధన్యవాదములు
    చెనటి చీకటి యనిన తటిని=నది కిటి=వరాహావతారము సతి =భార్య అనగాభూదేవిని ఒద్దు=తీరము జేర్చగ
    ఉదయభానుడు నిలిచె. నాభావము క్రూరపుచీకటి నదిని తీరము జేరగా భూదేవికి ఉదయభానుడు నిలిచెనని
    క్రోడకాంత=కిటిసతి=భూదేవికి

    రిప్లయితొలగించండి
  32. నటియించెన్ గద బాల భాస్కరుఁడు విన్నాణంబుగాఁ దూర్పు వా
    కిటి రంగస్థలమందుఁ బేర్మిఁ గిరణాక్షీణ ప్రకాశమ్ము చీ
    కటి డంబమ్మును రూపు మాప - ఖగ సంఘాతమ్ములా రోదసీ
    తటినుత్సాహముతో నొనర్పఁగ క్వచిత్కమ్ర స్వరవ్యాప్తగాన్ !

    రిప్లయితొలగించండి
  33. కైలాసాధిపు సత్క్రుపాగరిమనాకాశమ్ముపైనన్ నటి
    త్జ్వాలాకాంతులతోడచీకటిని తాఁ భగ్నంబుగా జేయుచున్
    వాలాయంబుగవాకిటిన్ నిలచు సర్వజ్ఞాన సౌశీల్యుఁడై
    బాలార్కుండుదయించెతూర్పుతటిఁ తాపక్షాళనోద్దండుడై.

    నటిత్జ్వాలా= నాట్యమాడుతున్నట్లుగా ఉన్న కాంతికిరణాలు

    రిప్లయితొలగించండి
  34. గురువుగారు, విష్ణునందన్ గారు, పెద్దలు
    అత్యుత్సాహముతో చేసిన నా దుస్సాహసాన్ని మన్నించగలరని ఆశిస్తూ....

    విష్ణునందన్ గారి పద్యభావాన్ని వాక్యపు వరుస మార్చి ఉత్పలమాలలో వ్రాసే ప్రయత్నం చేసినాను.

    చీకటి డంబమున్ నుఱచ, చిత్తము సంతసమంద పక్షులున్
    వాకిటి రంగమందెగుర, ప్రాగ్దిశ కాంతుల నింగి వెల్గ, తా
    నీ కళయందు సిద్ధుడన, నీ తటి రోదసి లోన నుత్సుకం
    బే కతనన్ నటించెనొకొ హృద్యపు రీతుల నన్నినాళులన్.

    రిప్లయితొలగించండి
  35. కవిమిత్రులకు నమస్కృతులు.
    మా చెల్లెలి ఇంటిలో కేదారేశ్వరవ్రతం కోసం ఉదయం వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. నా దగ్గర ఉన్న ఫోన్‍లో మిత్రుల పూరణలను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాను. స్పందించాలంటే ఆ ఫోన్ ద్వారా వ్యాఖ్యలు పంపడానికి అవకాశం లేదు.
    కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు ఈరోజు శ్రీ తాడిగడప శ్యామలరావు (శ్యామలీయం) గారు తమకు తీరిక లేకున్నా, అస్వస్థగా ఉన్నా శ్రమ తీసికొని అందరి పూరణల గుణదోష సమీక్ష చేసి నాకు శ్రమ తగ్గించారు. అందుకు వారికి నా కృతజ్ఞుడను.
    పూరణలు చేసిన మిత్రులందరికీ పేరుపేరునా అభినందనలు, ధన్యవాదాలు.
    అలసిపోయి ఉన్నాను. నేనేమైనా వ్యాఖ్యానించాలంటే అది రేపు ఉదయమే. మన్నించండి.

    రిప్లయితొలగించండి


  36. కటిక చీకటు లెల్ల గడగడ వడకుచు
    ..........పారిపోవగ జేయు ప్రబల శక్తి
    కిటికీల ద్వారాల పటుతరమ్ముగ దూరి
    ..........మేలు కొల్పులు పాడు మెరుపు తీవ
    తటినీ జలమ్ముల తరగల పై స్వర్ణ
    ..........రోచిస్సు లద్దెటి కూచిక గన
    నటియింప ప్రాగ్దిశన్ నగుమోముతో నుషా
    ..........సుందరి నవ్వుకు స్ఫూర్తిదాత

    చూడరే శరత్ప్రాభాత సూర్య కిరణ
    పుంజ మంజుల కమనీయ మోహ జనిత
    వైభవమ్మును, ధాత్రిని శోభలీను
    తీరు ననునిత్యమున్ మీరు దివ్యమగును.

    రిప్లయితొలగించండి