2, అక్టోబర్ 2014, గురువారం

పద్యరచన - 694 (బతుకమ్మ పండుగ)

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. బతుకమ్మను బూజింతురు
    బతుకమ్మయె తమకు దిక్కు భావన తోడన్
    సతు లం దరుమూ కుమ్మడి
    నతులన్గావించి పెట్టు నైవేద్యములన్

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    బతుకమ్మ :

    01)
    ____________________________

    పువ్వులను బేర్చి గుండ్రము
    నవ్వులతో బూజ జేసి - నలుగురి తోడన్
    నవ్వలు బాడుచు దిరుగుచు
    దవ్వుల చెరువుల నిడెదరు - తానము సలుపన్ !
    ____________________________
    అవ్వ = స్త్రీ
    తానము = నిమజ్జనము

    రిప్లయితొలగించండి
  3. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. పేర్చిన పూవుల బొత్తిని
    తీర్చుచు బతుకమ్మరూపు తిరుగుచు పాటల్
    అర్చన జేసిన వనితలు
    చేర్చగ నవి నీటిలోన చెరువునకేగెన్.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘పాటల్ అర్చన’ అని విసంధిగా వ్రాశారు. ‘పాటల్/ గూర్చుచు కొలిచిన వనితలు...’ అందామా? పద్యం చివర ‘చెరువున దేలున్’ అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  6. మాస్టరుగారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.

    పేర్చిన పూవుల బొత్తిని
    తీర్చుచు బతుకమ్మరూపు తిరుగుచు పాటల్
    గూర్చుచు కొలిచిన వనితలు
    చేర్చగ నవి నీటిలోన చెరువున దేలున్.

    రిప్లయితొలగించండి
  7. వరుసగ పూవులు బేర్చుచు
    మురియుచు బతుకమ్మ జేసి ముదితలు గొలుచున్
    వరముల నిమ్మని వేడుచు
    చెరువులలో కలిపి వేసి చేడియ లాడున్

    రిప్లయితొలగించండి
  8. గునుగు తంగేడు పూలెన్నొ యినుమడించ
    గౌరి మాతను జేరిచి గౌరవమున
    భర్త, పిల్లల సేమము బడయ గోరి
    వనిత లెల్లరు బతుకమ్మ పండుగనుచు
    సంబరంబుగఁ జేసెద రంబ పూజ
    తాన మాడింత్రు చెరువులో తన్మయమున!

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నా సూచనలను ఆమోదించినందుకు సంతోషం!
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ‘ఎగిలివారంగ’ (గ్రామ్యమైనా మాండలిక జాతీయంగా గ్రాహ్యమే), ఎనుగు, గునుగు, కట్లపూల ప్రస్తావనతో తెలంగాణా పల్లెల్లోని బతుకమ్మ పండగను సాక్షాత్కరింపజేశారు. పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ముదితలు గొలువన్’ అనండి. ‘చెరువులలో విడుతు రపుడు చేడియ లెల్లన్’ అంటే బాగుంటుందేమో?
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    ‘తంగేడు’ పూల ప్రస్తావనతో మీ పద్యం సొగసును సంతరించుకుంది. పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. రంగు రంగుల పూలతో రాజితముగ
    భక్తితో బతుకమ్మల బలుతెరగుల
    తీర్చి చక్కగ నొకచోట పేర్చి కొలచి
    పాట పాడుచు బతుకమ్మ యాట లాడి
    మడుగులోన జేసేరు నిమజ్జనంబు

    రిప్లయితొలగించండి
  11. మిత్రులందఱకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, నమస్కారములు!

    ||సీ||
    తంగేడు పూవులఁ దాంబాలమునఁ గుండ్ర
    ....ముగ నందముగఁ బేర్చి, మురువు సూపు
    వివిధమ్ములగు రంగులవి గునుగులఁ బేర్చి,
    ....మందార, కట్ల, చేమంతుల నిడి,
    బంతిపూవులు పోకబంతిపూవులు వింత
    ....సొబగుల నీనఁగాఁ జూపరులకుఁ
    బ్రకృతి సోయగమంతఁ బండువు సేయంగ
    ....బ్రతుకమ్మ నడుమ గౌరమ్మనుంచి,

    ||గీ|
    ధగధగలతోడి పట్టుపీతాంబరములఁ
    గట్టుకొనియును మెఱయుచు ఘనముగాను
    కనకదుర్గకు లక్ష్మికిఁ గడు ముదమున
    వందనము సేసి, యర్చింత్రు పడతులంత!

    ||కం||
    బ్రతుకమ్మఁ బట్టుకొనియు వ
    నితలందఱు నూరిచివర నిక్కపు భక్త్యు
    న్నతిఁ బాడి పాట, లాడియు,
    నతులయి నీటను నిమజ్జనము సేతురయా!

    ||ఆ.వె.||
    ముత్తయిదువు లపుడు పూతురు పసుపును
    పుస్తెలకును గౌరి పూజసేసి!
    సన్నిహితులు హితులు సఖులంత కష్టసు
    ఖములఁ జెప్పికొనఁగఁ గలిసెద రట!

    ||తే.గీ.||
    ఇంటినుండియుఁ దెచ్చిన హితకరమగు
    తీపివస్తువులనుఁ బంచి, తినియు, మఱల
    సద్దులను మూటగట్టియు సంబరమున
    నిండ్లకుం జేరఁ బోదురా యింతులంత!

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    బ్రతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని కనులకు కట్టినట్టు వర్ణించిన మీ ఖండిక చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి