ఇ. ఉభయ యతులు
పరరూపసంధి వలన ‘వేద+అండ=వేదండ’ అవుతుంది. ఇక్కడ ఉత్తరపదంలోని అచ్చుకే (అకారానికే) యతి వేయాలి. కాని ఆ అచ్చుతో కూడిన హల్లుకు (దకారానికి)కూడ కవులు యతి చెల్లించారు. కనుక వేదండ వంటి పదాలలో అచ్చుకు, హల్లుకు యతి చెల్లించవచ్చని లాక్షణికులు అంగీకరించారు. అచ్చుకు, హల్లుకు (ఉభయానికి) యతి చెల్లడంవలన ఇటువంటివాటిని ‘ఉభయయతి’ అన్నారు.
1. అఖండయతి :- యతి చెల్లించాల్సిన చోట అచ్‍సంధి ఉన్నప్పుడు పరపదాది అచ్చుకే కాక, ఆ అచ్చుతో కూడిన హల్లుకు కూడా యతి చెల్లించడం అఖండయతి.
ఉదా-
*భాను సహస్రభాసి వృష*భాధిపుఁ డన్నటు లర్థయుక్తమై. [కవిజనాశ్రయం]
(ఈ యతిని అప్పకవి, అనంతుడు మొదలైన లాక్షణికులు అంగీకరించలేదు. దానివల్ల ఉభయయతుల సంఖ్య పెరిగిందని గమనించండి)
2. యుష్మదస్మచ్ఛబ్దయతి :- యుష్మత్, అస్మత్ పదాలకు అచ్చుతో కూడిన పదాలు పరమైనపుడు (యుష్మత్+ఆజ్ఞ) ఆ అచ్చునకు కాని, సంధిగత (యుష్మదాజ్ఞ) ‘ద’కారానికి కాని యతి కూర్చడం.
ఉదా-
*ధర్మతనయ యుష్మ*దాజ్ఞానిగళని... [అధర్వణ భారతము]
*త్రస్తాత్ములమైన యస్మ*దాదుల కెల్లన్. [భారత.ఆది. ౨.౨౧౯]
ఈ పద్ధతిలోనే త్వత్, భవత్ మొదలైనవాటికి యతి చెల్లించవచ్చు.
*తావక సేవకుండ భవ*దంఘ్రుల నేనిటఁ గొల్చి వచ్చెదన్. [భాస్క.రామా.అయోధ్య. ౧౪౩]
3. పరరూపయతి (శకంధుయతి) :- పరరూపసంధి రూపాలైన శకంధు మొదలైనవాటిలో అచ్చుతో కూడిన హల్లుకు యతి చెల్లుతుంది.(శక+అంధుః=శకంధుః, వేద+అండ=వేదండ, మనస్+ఈషా=మనీషా; పతత్+అంజలిః=పతంజలిః మొ.)
ఉదా-
వే|*దండముఖాంగము ల్తృణవి*తానముగాఁ గొని నిర్వికారులై. [భారత.భీష్మ. ౧.౨౩౪]
4. ప్రాది యతి :- ప్ర, పరా మొదలైన ఉపసర్గలతో అచ్చుతో మొదలయ్యే పదాలతో సంధి జరిగినపుడు అచ్చుకు, అచ్చుతో కూడిన హల్లుకు రెండింటికి యతి చెల్లుతుంది. (ప్ర, పరా, అప, సమ్, అను, అవ, నిస్, నిర్, దుస్, దుర్, వి, అజ్, ని, అధి, అపి, అతి, సు, ఉత్, అభి, ప్రతి, పరి, ఉప అనేవి ప్రాది ఉపసర్గలు).
ఉదా-
*ప్రమదాజనేక్షణ *ప్రార్థితసౌందర్య
*యాచకసంతతి*ప్రార్థనీయ
*పృథివీసురప్రజా*భీష్టసంధాయక
*యిభముఖ్యసైన్యకా*భీష్టయాత్ర.... [విక్ర.చరి. ౪.౨౧౦]
5. ఆదేశయతి (నసమాసయతి) :- ద్వి, ప్ర మొదలైనవాటికి పరమైన ‘ఆప’ అన్న పదానికి (పాణిని సూత్రం ప్రకారం) ఈప, ఊప అనేవి ఆదేశంగా వస్తాయి. ద్వి+ఆపః=ద్వి+ఈపః=ద్వీపః, ప్ర+ఆపః=ప్ర+ఈపః=ప్రేపః, న+ఆపః=న+ఊపః=అనూపః.... ఇటువంటి సంధిరూపాలలో ఆదేశంగా వచ్చిన ఈకార, ఊకారాలకు, వాటితో కూడిన హల్లులకు యతి చెల్లుతుంది.
ఉదా-
*ద్వీపులఁ జంపి విశ్వజగ*తీపతి యుత్తమశక్తి జాంబవ
*ద్వీపమునందు గోవులకు *నిమ్ముగఁ జేయుటకుం బ్రసన్నమై. [కా.చూ. ౭.౬౫]
6. నిత్యసమాసయతి :- పదాలను విభజించి విగ్రహవాక్యం చెప్పడానికి వీలుకానివి, ఇతర పదాల సాయంతో విగ్రహవాక్యం చెప్పబడేవి నిత్యసమాసాలు. అవి జనార్దన, రామాయణ, కర్ణాట మొదలైనవి. ఇటువంటి సమాసాలలో పరమైన అచ్చుకు కాని, దానితో కూడి ఉన్న హల్లుకు కాని యతి చెల్లించవచ్చు.
ఉదా-
*నగనగియేనియున్ విను జ*నార్దన యెన్నఁడు బొంకువల్క ను... [భారత.అరణ్య. ౪.౩౯౭]
7. దేశ్య నిత్యసమాసయతి (దేశీయయతి) :- రూపఱు (రూపు+అఱు), పెంపఱు (పెంపు+అఱు) మొదలైనవి నిత్యసమాసాలుగా భావింపబడ్డాయి. ఇటువంటి సమాసాలలో అచ్చుకు, హల్లు రెండింటికి యతి చెల్లించవచ్చు.
ఉదా-
చి|*చ్చఱ పిడుగుల్ వడిం దొఱఁగు *చాడ్పున నంబరవీధి నుగ్రమై. [భారత.విరాట. ౫.౧౪౩]
క్ర|*చ్చఱ మునివర్గవాహనుఁడ*వై చనుదెమ్మను మంతఁ దీరెడున్. [భారత.ఉద్యో. ౧.౧౭౬]
8. నిత్యయతి :- ‘ఏని’ అనేది ఒక పదంతో చేరినపుడు ‘ఏ’కే కాక, అది కలిసిన హల్లుకు కూడా యతి చెల్లించవచ్చు.
ఉదా-
ఎన్నడు|*న్నేని మోఘము గాదు దిగ్ధర*ణీరవీందు లెఱుంగఁగాన్. [భారత.ఆది. ౭.౧౪౨]
*ఎట్టి యపరాధ మొనరించె*నేని తల్లి [కాశీ. ౪.౨౬౯]
9. నిత్యసంధియతి :- ఉత్+లాసమ్=ఉల్లాసమ్, స్ఫురత్+లీలా=స్ఫురల్లీలా, సత్+చిత్=సచ్చిత్, ఉత్+జ్వలం=ఉజ్జ్వలమ్, తత్+టీకా=తట్టీకా మొదలైన సంధిరూపాలలో సంధికారణంగా ద్విత్వమైన హల్లుకే కాక, పూర్వపదాంత ‘త’వర్ణానికి కూడా యతి చెల్లుతుంది.
ఉదా-
వే|*ళ లతాంతాయుధు సంగరంబునకు ను*ల్లాసంబు కల్పించు ను... [పారి. ౧.౬౦]
విస్ఫుర|*ల్లీలన్ నివ్వరిముంటిచందమున నెం*తే పచ్చనై సూక్ష్మమై [కూ.తిమ్మకవి. భర్గశతకము]
10. రాగమసంధియతి :- జవరాలు (జవ+ఆలు), బీదరాలు (బీద+ఆలు) ఇట్టి రాగమసంధి రూపాలలో అచ్చుకు, రకారానికి రెంటికి యతి చెల్లుతుంది.
ఉదా-
జవ|*రాలో యచ్చరయొ కిన్న*రవధూమణియో [చారుధేష్ణ చరిత్ర]
ఏ|*కాంతమునందు నున్న జవ*రాండ్ర నెపం బిడి పల్కరించు లా.. [మనుచ. ౨.౪౧]
11. విభాగయతి :- పరిమాణార్థకమైన ‘ఏసి’ చేరగా ఏర్పడిన గంపెడేసి (గంపెడు+ఏసి), నాలుగేసి (నాలుగు + ఏసి) మొదలైన రూపాలలో అచ్చుకు, హల్లుకు యతి చెల్లుట.
ఉదా-
సంఘ|*టించినప్పుడు యతులు రెం*డేసి యగు, ను
*పేంద్రుఁ డిచ్చు నర్థము మోపె*డేసి యనఁగ. [అనం.ఛంద. ౧.౧౨౦]
12. నామాఖండయతి (ప్రభునామయతి, ప్రభునామాంతయతి, ప్రభునామాభంగయతి) :- అన్న, అయ్య, అమ్మ, అప్ప, ఆయి మొదలైనవి వ్యక్తినామాల చివర చేరుతాయి. కొమ్మన్న, రామయ్య, సీతమ్మ, వెంకప్ప, సీతాయి... అన్న, అమ్మ మొదలైనవాటిలోని ద్విత్వంలోని ఒక హల్లు లోపించి అన, అమ అనేవి రావచ్చును. కొమ్మన, రామయ, సీతమ. ఇటువంటి చోట్ల అచ్చుకు, హల్లుకు యతి చెల్లించవచ్చును.
ఉదా-
*మహి నయోధ్యకు రాజు రా*మన యనంగ
*నతని పట్టపుదేవి సీ*తమ యనంగ. [అనం.ఛంద. ౧.౧౧౯]
13. చతుర్థీవిభక్తియతి :- తెలుగులో చతుర్థీవిభక్తిలో ‘కై’ (కు+ఐ) అనునది చేరినప్పుడు ఐ అనే అచ్చుకే కాక, దానితో కూడిన హల్లు(క)కు కూడా యతి చెల్లును.
ఉదా-
వేదగుప్తి|*కై జనించె నెవ్వఁ *డవ్వసుదేవనం|దను... [భారత.శాంతి. ౨.౨౩]
*క్రాంతినిఁ బాపపుణ్యముల*కై వశమౌ నది నట్లుగాన నే. [బ్రహ్మోత్తరఖండము]
14. పంచమీవిభక్తియతి :- పంచమీవిభక్తిలో ‘అన్నన్, అంటెన్’ అనునవి చేరి ‘రామునికన్నన్, రామునికంటెన్’ అని ఉన్నప్పుడు అచ్చు(అ)కే కాక, దానితో కూడిన హ ల్లు(క)కు కూడా యతి చెల్లుతుంది.
ఉదా-
*కన్నన్ దోర్వీర్య మెక్కు*డగు భార్గవులీ...
*కన్నన్ శూరుండు ముజ్జ*గంబులఁ గలఁడే. [చమత్కార రామాయణము]
15. కాకుస్వరయతి :- శోకభయాదులవల్ల కలిగే ధ్వనివికారం కాకువు. పదాంతంలోని అచ్చును ఉచ్చరించే రీతిలో ఈ భయాదులు స్ఫురిస్తాయి. ఆ అచ్చు దీర్ఘంగా ఉండి ప్లుతోచ్చారణ కలిగి ఉంటుంది. అటువంటి అచ్చుకు, దానితో కూడిన హల్లుకు యతి చెల్లుతుంది.
ఉదా-
*మేలవించినవి సు*మ్మీ దీని మెట్లని....
*ఇది జపోచితము సు*మ్మీ జతనం బని... [పారి. ౫.౮౬]
16. ప్లుతయతి :- పదాంతంలోని అచ్చుయొక్క ప్లుతోచ్చారణం వల్ల పిలుపు, రోదనం, సంశయం స్ఫురించినపుడు, ఆ ప్లుతాచ్చునకు, దానితో కూడిన హల్లుకు యతి చెల్లుతుంది.
ఉదా-
*ఆయాచోటులఁ గల్గు వింతలు మహా*త్మా నా కెఱింగింపవే. [మనుచ. ౧.౬౮]
అధి|*పా కలిగినవారు పంక్తి*పావనులు గడున్. [భారత. అను. ౩.౧౮౦]
17. ప్లుతయుగయతి (స్వరయుగయతి) :- కాకుస్వర, ప్లుత యతులకు చెందిన పదాంతాచ్చులు పరస్పరం యతి చెల్లినా, అచ్చులతో కూడిన హల్లులు పరస్పరం యతి చెల్లినా ‘ప్లుతయుగయతి’ అవుతుంది.
ఉదా-
మాయరవి యేలఁ గ్రుంకడొ
*కో యను నిట్లేలఁ దడసె*నో యనుఁ గ్రుంకం... [భారత.విరాట. ౨.౩౧౨]
18. నఞ్‍సమాసయతి :- అనంత (న+అంత), అనేక (న+ఏక) మొదలైనవి నఞ్‍సమాసాలు. ఇటువంటి సమాసాలలో అచ్చుకు, దానితో కూడిన హల్లుకు యతి చెల్లుతుంది.
ఉదా-
వాజులుం| *డిగ్గి తొలంగు సైనికు ల*నేకులు కష్టపుపాటు చొప్పడన్. [భారత.కర్ణ. ౨.౩౫౫]
*ఆశ్రితపోషణంబున న*నంతవిలాసమునన్ మనీషి వి... [భారత.ఆది. ౧.౬]
19. ఘఞ్‍యతి :- ‘ఆలాప’ శబ్దంలోని లకారానికి, దానిమీది అచ్చుకు యతి చెల్లుతుంది.
ఉదా-
శ్రీ పరిఢవిల్ల సత్యా
*లాపవిలాసియగు కృష్ణు*నటువలె రంగ
క్ష్మాపతి శ్రీకరసత్యా
*లాపవిలాసములఁ బ్రజల *లాలనసేయున్. [రంగ.ఛంద. ౩.౨౩౩]
20. సౌభాగ్యయతి :- ఉభయయతులు చెల్లుటకు వీలైన పదాలలో ఒక పదానికి మరొక పదం యతి చెల్లడం.
ఉదా-
*ప్రాంచితామరవినుత వే*దండవరద. (ప్ర+అంచిత=ప్రాంచిత అనేది ఉపసర్గయతి ప్రకారం, వేద+అండ=వేదండ అనేది పరరూపయతి ప్రకారం ఉభయయతి చెల్లే పదాలు. ఈ రెండింటి ఉత్తరపదాద్యచ్చులకు యతి చెల్లింది).
*నాకరిపుశిక్ష శౌరి య*నంత యనఁగ. (‘నాక’ ఆదేశయతి ప్రకారం, ‘అనంత’ నఞ్‍సమాసయతి ప్రకారం ఉభయయతి చెల్లే పదాలు. ఈ రెండింటిలో హల్లులకు యతి చెల్లింది).
ఈ. ప్రాస యతి -
యతి చెల్లించవలసిన స్థానంలో ప్రాస చెల్లించడం ‘ప్రాసయతి’. యతిస్థానంలో ప్రాస చెల్లించినపుడు ప్రాసకు సంబంధించిన నియమాల నన్నింటిని పాటించాలి. తెలుగులో ‘ఉపజాతి’ పద్యాలలోనే ఈ ప్రాసయతి చెల్లుతుంది. (‘ప్రాసభేదాలు’ చూడండి)
ఉదా-
*నిన్ను నెన్నడు చూతునో *కన్నులార [శివరా.మాహా. ౨.౨౬]