18, మార్చి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1625 (భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్. 
ఈ సమస్యను పంపిన పిరాట్ల వేంకట శివరామకృష్ఝ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

 1. (నాటకములొ కృష్ణుని పాత్ర వేయమని మిత్రుని కోరుతూ..)
  ముదముగ కృష్ణుని వేషము
  వదలక ధరియించు గొల్ల "భామను వేధిం
  ప దగును పదుగురు మెచ్చన్"
  కుదరదు వేరెవరు వేయ గోపాలునిగన్

  రిప్లయితొలగించండి
 2. లేమను గాంచిన యువకులు
  ప్రేమను ప్రకటించి వెంట ప్రీతిగ పలుకన్
  మేమని జెప్పుచు ధీటుగ
  భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చ్

  రిప్లయితొలగించండి
 3. తులాభార సమయం లో శ్రీకృష్ణుని మనోగతం....


  ప్రేమను సంపదకొన నను
  ఈ ముని కే దానమిచ్చి యిట్టుల జేసెన్
  తా మనసు మార్చు కొనగను
  భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 4. రాముని వలపున వచ్చిన
  కామిని యా శూర్పణఖను కానలలోనన్
  సౌమిత్రి గదిరి,దానవ
  భామను వేదింపఁ దగును పదుగురు మెచ్చన్!

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  టైపాటును సవరించాను. ధన్యవాదాలు.
  సమస్య పాదాన్ని స్థానభ్రంశం చేసి చెప్పిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కాకుంటే కొంచెం తికమకగా ఉంది.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  కాని చదువుకోసం సరస్వతిని ఆరాధించాలా? వేధించాలా?
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘న| న్నీమునికే...’ అనండి.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. మామా ! పాపము కలుగును
  భామను వేధింప ,దగును పదుగురు మెచ్చన్
  భామల నిడుమలు దీర్చగ
  నేమముతో గృషిని జేయ నెమ్మది తోడన్

  రిప్లయితొలగించండి
 7. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. దామోదరుడా హరినే
  గోముగ తన వశము జేయు కోరిక తోడన్
  నీమముగా దానమొసగు
  భామను వేధింప దగును పదుగురు మెచ్చన్!!!

  రిప్లయితొలగించండి
 9. శైలజ గారూ,
  కృష్ణ తులాభార ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. కం. నామమునకెనాపతియని
  ధీమగ పతిధారబోసిధిక్కారముతో
  శ్యాముని తూకిన గడుసరి
  భామను వేధింపతగును పదుగురు మెచ్చన్.

  రిప్లయితొలగించండి
 12. నోములు నోచు సమయమున
  నేమము తోడగృహపు పతి నిశ్చల భక్తిన్
  ధామమున నతిథికై నిజ
  భామను వేధింప దగును పదుగురు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 13. ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో సుయోధనుడు

  ఏమిది తాతా వలదా
  తామే తల వంచ పతులు? తగులే యిది యీ
  కామినికి, బానిసలకౌ
  భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్.

  రిప్లయితొలగించండి
 14. నేమము విడి సంసారము
  నే,మది తలపక,పెనిమిటి నిసుగుల విడియే
  కామితయై పరుగులిడెడు
  భామను వేధింప నగును పదుగురు మెచ్చన్

  వేమరు ధర్మము వీడెడు,
  భామను వేధింపదగును,-పదుగురు మెచ్చ
  న్నామెను తీరిచి దిద్దిన
  కోమలమగు చర్య యదియ,గొప్పగ నెంచన్

  రిప్లయితొలగించండి
 15. ధీమంతుండగు భర్తను
  ప్రేమముగా జూచుకొనక బింకము జూపే
  కోమల మెరుగని గడుసరి
  భామను వేధింప దగును పదుగురు మెచ్చన్!

  రిప్లయితొలగించండి
 16. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మొదట టైపాటు వల్ల ‘వేదింప’ అన్నాను. దానికి తగినట్లుగా ఉంది మీ పూరణ. బాగుంది. అభినందనలు.
  ‘భామలు+ఇద్దురు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘భామ లిరువురును నీకా’ అనండి.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ధీమా’ అన్న పదం ఉంది కాని ‘ధీమ’ లేదు. ‘ధీమాగా పతి నొసంగి’ అందామా?
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. రామాయణమునతిప్పడు
  సామాన్యుడ?వాడుభార్య సరసనజేరన్
  ప్రామాణికనాటకమున
  భామనువేదింపదగును|పదుగురుమెచ్చన్.


  రిప్లయితొలగించండి
 19. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. మాస్టరు గారూ ! ధన్యవాదాలు....మీరు చూపిన సవరణ తో...

  ప్రేమను సంపదకొన న
  న్నీ ముని కే దానమిచ్చి యిట్టుల జేసెన్
  తా మనసు మార్చు కొనగను
  భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్

  రిప్లయితొలగించండి


 21. భామలు యిరువురునీకా
  వామమ్మున నొకతె నెత్తి పైనొక్కతె యున్
  నీమమ్మున శిరమునకల
  భామను వే, దింప దగును పదుగురు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 22. కం.నామమునకెనాపతియని
  ధీమాగాపతినొసంగి ధిక్కారముతో
  శ్యాముని తూకిన గడుసరి
  భామను వేధింపతగును పదుగురు మెచ్చన్.
  (శంకరయ్యగారు మీరిచ్చిన సవరణ తో )

  రిప్లయితొలగించండి
 23. నీమముగా ఫ్లిట్ కొట్టుచు
  నా మురికివి కాల్వలందు నాగయలంకా
  గ్రామ మలేరియ దోమల
  భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్

  "Female mosquitoes only bite...but not male mosquitoes"

  రిప్లయితొలగించండి
 24. దోమగ నింటిని జేరుచు
  గోముగ తలలన్ తినుచును గొప్పగ బలుపౌ
  సామజ రీతిగ మారిన
  భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్

  రిప్లయితొలగించండి