7, మార్చి 2015, శనివారం

సమస్యా పూరణం - 1615 (అమ్మా యని పిలిచినంత నాగ్రహమందెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమ్మా యని పిలిచినంత నాగ్రహమందెన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. మమ్మీయని తనకూతురు
    కమ్మగ యాంగ్లమునపిలువ కాన్వెంట్ కంపన్
    దిమ్మతిరిగెనాతల్లికి
    యమ్మా యని పిలిచినంత నాగ్రహమందెన్

    రిప్లయితొలగించండి
  2. కం.అమ్మడి సేవల నందగ
    నెమ్మది గొనియువ కుడొకడు నీటరి గనియో
    యమ్మా మ్రొక్కెద నీకన
    యమ్మా యని పిలిచినంతనాగ్రహమందెన్.

    రిప్లయితొలగించండి
  3. నెమ్మిని కోరగ నూర్వసి
    అమ్మాయని పిలిచి నంత నాగ్రహ మందెన్
    అమ్మవని తెలిపె పార్ధుడు
    కమ్మని శపియించె పేడి గాసిలి మనమున్

    రిప్లయితొలగించండి
  4. బొమ్మలా ముద్దులొలుకు
    గుమ్మడు తనమదిని దోచి కోరిక పెంచన్
    కమ్మని సుఖముల నిమ్మన
    నమ్మా యని పిలిచినంత నాగ్రహమందెన్

    రిప్లయితొలగించండి
  5. అమ్మాయి వరూధినితో
    నమ్మాయను బడక ప్రవరు డప్పుడు నీకున్
    సుమ్మా కోరిక తగదని
    యమ్మా యని పిలిచినంత నాగ్రహమందెన్

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! ఇది 2014 అగస్టు నెల22వ తేదీన "అమ్మా
    యని పిలువగానె యాగ్రహమందెన్" అనే విధంగా గోలి హనుమచ్చాస్త్రి గారి పేరు మీదనే ఇచ్చారు, గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  7. గుమ్మడగు విజయు నూర్వశి
    కమ్మని కోర్కులను తీర్చ కాంక్షను తెలుపన్
    దిమ్మతిరుగునట్టుల తా
    నమ్మా యని పిలచినంత నాగ్రహమందెన్

    రిప్లయితొలగించండి
  8. నెమ్మనమున నాశిసు లిడు
    అమ్మా యని పిలిచి నంత నాగ్రహ మందె
    న్నమ్మను గాదని వేరొక
    యమ్మను నే బిలిచి నంత నఱచుచు నాపై

    రిప్లయితొలగించండి
  9. నెమ్మిని చిత్రాంగి దెలుప
    సమ్మతి నీయక వలదని సముచిత మతితో
    కమ్మగ సారంగధరుం
    డమ్మా యని పిలువగానె యాగ్రహ మందెన్ !!!

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈ సమస్య 22-8-2014 నాడు ఇచ్చినదే అని రెండుచింతలవారు జ్ఞాపకం చేశారు. వారికి ధన్యవాదాలు. ఈమధ్య మతిమరుపు ఎక్కువైపోతున్నది. వృద్ధాప్యం కారణం కావచ్చు. ఇప్పుడు ఇందరు పూరణలు చేశాక మార్చడం కుదరదు. ఈరోజుకిలా కానివ్వండి. జరిగిన పొరపాటుకు మన్నించండి.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కమ్మగ నాంగ్లమున...’ అనండి.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘బొమ్మవలె ముద్దు లొలికెడు’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. కమ్మగ పాటలు పాడ
    మ్మాయిని గాంచ యువకునికి యాశోద్భవమై
    తుమ్మెద వలె తిరుగుచు చిల
    కమ్మా యని పిలిచినంత నాగ్రహమందెన్.

    రిప్లయితొలగించండి
  12. కొమ్మను నొకతెను చేకొని
    పిమ్మట పెంటమ్మనియెడు పేరగు నామెన్
    యిమ్మగు ప్రేమను తా"పెం
    టమ్మా"!యని పిలిచినంత నాగ్రహమందెన్

    ఇమ్ముగ సోకులు దిద్దుచు
    నమ్మగు యీడగు నడివయసందున నున్నా
    కొమ్మను కనుగొని యందరు
    నమ్మా!యని పిలిచినంత నాగ్రహమందెన్

    అమ్మయు కాకను కుందుచు
    కిమ్మనకుండంగనున్న గేస్తగు వనితన్
    యిమ్ముగ నాడెడి పిల్లలు
    నమ్మా!యనిపిలిచినంత నాగ్రహమందెన్

    ఇమ్ముగ పాండవులయ్యెడ
    నమ్మను గాంధారి జేరి యనునయ మిడగా
    చెమ్మయు కనులను గ్రమ్మగ
    నమ్మా!యని పిలిచినంత నాగ్రహమందెన్

    ద్రిమ్మరి పావురమరయుచు
    నమ్మగు చిత్రాంగి యింట నాసారంగుం
    డమ్మను గారవమొప్పగ
    నమ్మా!యనిపిలిచినంత నాగ్రహమందెన్

    రిప్లయితొలగించండి
  13. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘అమ్మ+అగు= అమ్మయగు’ అవుతుంది. అక్కడ సంధి లేదు.

    రిప్లయితొలగించండి
  14. రమ్మును, సారా గ్రోలుచు
    నిమ్మహి వ్యసనమున జిక్కి(దోషముల జేసి)యిలలో తనకై
    తెమ్మని ధనమును సతి,నే
    దమ్మా!యనిపిలిచినంత నాగ్రహమందెన్.

    రిప్లయితొలగించండి
  15. శంకరయ్య గారు ఏదైనా ఒక సమస్య మావద్ద వుంటే మీకు post చేసి తద్వారా సభ్యులకు పూరణ నిమిత్తం ఇవ్వాలంటే ఈ బ్లాగ్ లో నే post చేయాలా ? లేదా మీకు వేరే email id ఏమైనా వున్నదా ? దయచేసి తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  16. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    నిరభ్యంతరంగా పంపవచ్చు. నిజానికి నేను క్రొత్త సమస్యలను సృష్టించలేక ఇబ్బంది పడుతున్నాను. మీ సమస్యలను సంతోషంగా స్వీకరిస్తాను. మీరు పంపే సమస్యలను shankarkandi@gmail.com కు మెయిల్ చేస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  17. తమ్ముని భరతని రాజుగ
    ముమ్మాటికిఁ జేయనెంచి పోరిన కైకన్
    నెమ్మనమున రఘు రాముం
    డమ్మా! యని పిలిచి నంత నాగ్రహమందెన్!

    రిప్లయితొలగించండి
  18. కమ్మని పదునారేళ్ళది
    కొమ్మయొకతె పనిమనిషిగ క్రొత్తగ చేరన్
    "చిమ్మవె త్వరగా గది చి
    న్నమ్మా!"యని పిలిచినంత నాగ్రహమందెన్

    రిప్లయితొలగించండి


  19. జామ్మంచు చెట్టపట్టాల్,
    జుమ్మంచు జిలేబులన్ సజుఘులకు నిడుచున్
    దమ్మున్న జిలేబిని నా
    నమ్మా యని పిలిచినంత నాగ్రహమందెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. కమ్మని పదహారేండ్లది
    గుమ్మయొకతె పనిమనిషిగ కుదురగ నింట్లో
    "గమ్మున గది చిమ్మవె శే
    షమ్మా!" యని పిలిచినంత నాగ్రహమందెన్

    రిప్లయితొలగించండి