21, మార్చి 2015, శనివారం

పద్య రచన - 855


కవిమిత్రులకు మన్మథ నామ సంవత్సర శుభాకాంక్షలు!
నేటి పద్యరచనకు అంశం...
“ఉగాది”

36 కామెంట్‌లు:

  1. నిన్న హైదరాబాదు, మియాపూర్‍లో కవికసమ్మేళనంలో చదివిన
    ఉగాది కవిత

    శ్రీకరమ్మును సకలశుభాకరమ్ము
    శిష్టజనమోదదాయియై చింత వంత
    లన్ని పోఁద్రోచి శాంతిసౌఖ్యమ్ము లిడఁగ
    వచ్చె మన్మథనామసంవత్సరమ్ము.

    సకలవిధ్వంసకరము హింసాప్రవృత్తి
    సర్వజనహితదాయిని శాంతిపథము
    జయము నెందు సాంధింతువో ‘జయ’ తెలిపెను
    మనముల మథించి యెఱుఁగుమా ‘మన్మథ’మున.

    జయనామవత్సరమ్మున
    వ్యయ మయ్యెను తెలుఁగువారి యైక్యత, రాష్ట్రం
    బయె రెండుముక్క లిప్పుడు
    భయ మయ్యెను భావికాలఫల మే మగునో?

    కూడు గుడ్డలు కొంప గోడల కారాట
    పడు దుర్దినమ్ములు వదలుఁ గాక!
    నల్లబజారులు కల్లల బేరాలు
    మోసంపు చర్యలు పోవుఁ గాక!
    కులమతప్రాంత సంకుచితజనులు కత్తి
    దూసెడి వర్తనల్ దొలఁగుఁ గాక!
    పదవిలోఁ బైపైకి ప్రాకులాడెడు నేత
    వేసెడి వేషము ల్వీడుఁ గాక!
    ఎల్లెడల నార్తనాదముల్ హింసలు ప్రతి
    హింస లాగ్రహమ్ము లిఁక శాంతించుఁ గాక!
    మన్మథాబ్దమ్ము వచ్చి మా మానసముల
    కలుషభావముల్ దొలఁగించి వెలుఁగుఁ గాక!

    గడచె జయాఖ్య వత్సరము, గాయము లెన్నియొ చేసి తీవ్రమౌ
    నిడుములఁ బెట్టె; నేడు హిత మియ్యఁగ వచ్చెను క్రొత్తసాలు మా
    యెడల నవానురాగము నహీనముగాఁ గనఁజేసి లేఁతమా
    మిడి చిగురొత్తి నట్టుల నమేయశుభంబులఁ గూర్చఁ గోరెదన్.

    రిప్లయితొలగించండి
  2. కం. మన్మధ నామయుగాదిది
    యున్మాదములన్నియాపియోప్పించునులే
    సన్మానముతోటిజనులు
    తన్మయమునుపొందువేళతధ్యముగురుడా .

    రిప్లయితొలగించండి
  3. శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
    21.03.2015
    బొమ్మ సృష్టిఁజే బట్టిన మొదటిరోజు
    పాడ్యమి దినమునన్ శుక్ల పక్షమందు
    వచ్చునీయుగాది ప్రతిసంవత్సరమును
    ఛైత్ర మాసమునందున సంతసమిడ
    పాత భావములను వెసఁ బారఁదోలి
    కలుష మైనట్టి మనసును కడిగి వేసి
    క్రొత్త మార్పును చేపట్ట చిత్తమందు
    సాగు మన్మథ నామ వత్సరము ప్రీతి
    ప్రతి వసంత ఋతువులోన ప్రాకటముగ
    పాదపములన్నియున్ నవ పల్లవముల
    తోడ, పూవులు కాయలఁ గూడియుండు
    మల్లె పూవుల గాలులు మనసు దోచు
    ఆమ్ర పల్లవమ్ముల తృప్తి నారగించి
    గండశైలము మధురమౌ గానసుధను
    కుహుకుహూరాగములతోడ కురియజేయ
    మనసు చేరును మిన్నుకు తనివితోడ
    ఈమన్మథ వత్సరమున
    క్షామమ్ములులేక రాష్ట్ర గ్రామమ్ములలో
    రామయ దయతో కావగ
    సామూహిక వృద్ధి నిప్డు సాధింపవలెన్

    రిప్లయితొలగించండి
  4. ఉగాది సంకల్పం ( ౨౦.౩.౨౦౧౫ మియాపూరు,హైదరాబాదు కవికసమ్మేళనంలో చదివిన
    ఉగాది కవిత)
    కం. శ్రీ మృత్యుంజయ శక్తిన్
    శ్రీ మేదావిని పలుకుగ స్నేహము తోడన్
    శ్రీమాతంగిని మ్రొక్కుచు
    శ్రీమన్మథు స్వాగతింతు శ్రీకారముతో

    ఆ.వె. వేప మిరప నుప్పు బెల్లమ్ము పులుపుతో
    ఆరు రుచులు కలిపి ఆర గించి
    ఈ యుగాది పండ గిష్టమ్ము తో నేను
    మంచి చెడ్డ లింట పంచు కొందు

    సీ. వాగ్దేవిచలువతో వరసిద్ధి యలవితో
    కవి ప్రసంగమ్ములు కావ్య గోష్టి
    సంగీత సాహిత్య సంవేదనమ్ములు
    పండిత ప్రావీణ్య ప్రవచనములు
    సత్కళా రాధన సంస్కృతారాధనల్
    భరత దేశమ్మున వాసి గాంచి
    విశ్వ సౌభ్రాత్రమ్మువికసిల్ల విరివితో
    ప్రార్ధింతు మనసార భక్తి తోడ

    తే.గీ.సాధు సద్బుద్ధి సన్మతిన్ సాగి జనులు
    కామ దోష క్రోధమ్ముల గతులు మాని
    స్నేహ సౌశీల్యభావమ్ముల్ చేర దీసి
    కలిసి మెలసియుండు బ్రతుకు కలలు కందు
    తే.గీ.సిగ్గు మాలిన నేతను చిదుము జేసి
    సంఘ చీడ పురుగులను తుంగ ద్రొక్కి
    వాస యోగ్య వ్యవస్థకు ఘోష పెట్టి
    శక్తి యుక్తుల సాధింతు సాహ సాన

    తే.గీ స్వీయ శుద్ధత శుభముగా స్వీకరించి
    దేశ సౌభాగ్య సంపదల్ దీటు జేసి
    అక్క చెళ్ళళ్ళ వస్థల కడ్డు పెట్టి
    శక్తి యుక్తుల సాధింతు సాహ సాన

    ఉ. మూటలు కట్టి నేతలు సమూలము నాశము జేయ బూనగా
    మాటలు మాత్రమే మిగిలె మారినవా ?నిరు పేదభాగ్యముల్
    కూటికి గుడ్డకున్ యలసి కొల్లలు పాల్పడ నాత్మహత్యకున్
    ఘాటుగ మంత్రులన్ గదుమ కట్టుడు చేతుల కంకణమ్ములన్

    రిప్లయితొలగించండి
  5. ఉగాది స్మరణము
    కెంబాయి తిమ్మాజీ రావు

    తే.గీ. ఆంధ్ర తెలగాణ విడిపోవ అమ్మ యైన
    తెలుగు భాషయే ఐక్యత కలుగ జేయు
    నారు రుచులను వేరుగా నమలు చుండి
    కలసి పచ్చడి వోలెనుగాది నాడు
    తే.గీ. తీపి బెల్లము పుల్లని తింత్రిణి యును
    వేప చేదు లవణము మావివగరు మిరి
    యంపు కారమ్ము వోలెన నాది నుండి
    వెలసి కలిసిరి తెలుగు కవీంద్రు లెల్ల
    ఉ. మన్మథనంబు జేయవలె మానవ దుఃఖ సముద్రమున్ వెసన్
    మన్మథ యేగు దెంచె యభి మానము మీరగ దెచ్చె నీ సుధన్
    తన్మయ మంది గ్రోలగను ధారుణి లోగల సర్వ జీవులున్
    సన్మతి శాంతి సౌఖ్యములు సంతత మొందగ స్వాగతింపుడీ

    రిప్లయితొలగించండి
  6. సోదర సోదరీ మణులకు సన్మానితులకు ఉగాది శుభా కాంక్షలు
    --------------------------------------
    వగరులు మేసిన కోయిల
    గగనపు గంధర్వ మంటి గానము చేయన్
    పొగరుగ వచ్చెను మన్మధ
    సొగసులు విరియంగ నెంచి సురభియె తానై

    సురభి =వసంత ఋతువు , చైత్ర మాసము

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. పూజ్య గురుదేవులకు, కవిమిత్రులందరికీ ..ఉగాది శుభాకాంక్షలు...

    చిన్మయుడా పరమేశుడు
    సన్మతి నీయంగ జగతి సంతోషముగన్
    తన్మయ మొంద నుగాదియె
    మన్మధ నామమున వచ్చె మహనీయముగన్!!!


    సకల జగతి లోన శాంతియె కరువాయె
    బతుకు భారమయ్యె వెతల తోడ
    మహిని గావు మమ్మ మన్మధ! నీవైన
    సంతసమ్ము నిడుమ సర్వులకును !!!

    రిప్లయితొలగించండి
  9. మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు
    మియపూర్ జయప్రకాష్ నారాయణ నగర్ లో ఉగాది కవిసమ్మేళనం
    నేను వ్రాసి,చదివిన పద్యములు
    భవ్యంబగు మనబ్రతుకులు
    ద్రవ్యంబగు వృద్ధి తనరు ధర్మంబిలలో
    సవ్యంబగు తలపులతో
    దివ్యంబగు వత్సరంబు దేవుని దయతో
    వెలుగులు నిండును బ్రతుకుల
    నలరారును సుఖముశాంతి నవవర్షములో
    ఫలియించును కలలన్నియు
    కలవరములు లేక జగతి కళకళలాడున్
    భక్తి బూజించి యా భగవంతు నేను
    క్రొత్త వత్సరమున కోరుకొనెదనిట్లు
    ప్రజలకే కష్టములు లేని బ్రతుకునిడుమ
    యిడుములకునోర్చుకొను శక్తినిడుము దేవ
    కోతలు లేని కరెంటును
    గోతులు లేనట్టి రోడ్లు కుటిలత్వముతో
    జాతినధోగతికీడ్వక
    నీతుల విలువలను తెలియు నేతల నిమ్మా!
    క్రూరమ్ముగ బాలలపై
    నేరమ్ములు జరుగకుండ నిత్యము నీవే
    వారల గాచి సమున్నత
    పౌరులుగా తీర్చిదిద్ద వలయును దేవా
    పెడదారిని పడకుండగ
    నడిపించుము యువతరమును నవ్యపథములో
    నడకువతో మెలగుచునీ
    పుడమిని స్వర్గంబుజేయు బుద్ధినొసగుమా
    అత్యాచారంబులకున
    కృత్యంబులకు నెలవైన క్షితిమండలమం
    దత్యంత జాగరూకత
    నిత్యము కాపాడు మయ్య నెలతల దేవా

    రిప్లయితొలగించండి
  10. స్వాగతమ్ము నూత్న సంవత్సరమునకు
    స్వాగతమ్ము చిలుక వాహనునకు
    ధర్మబద్ధమైన కర్మాచరణ జేయు
    త్రోవ జూపి తగిన చేవనిమ్ము !!!

    రిప్లయితొలగించండి
  11. సకల శుభముల నీయగ సర్వులకును
    జయను బోద్రోచి యీరోజు సాదరముగ
    వచ్చె మన్మధ నామసం వత్సరమ్ము
    అమ్మ ! మన్మధ !కాపాడు మమ్మ మమ్ము

    రిప్లయితొలగించండి
  12. అందరికీ శ్రీ " మన్మథ " నామ సంవత్సర శుభాకాంక్షలు.


    ఉత్పలమాల:
    పేరును నిల్పుకొమ్మనుచు పెద్దలు జెప్పుట సాజమే, నినున్
    పేరును నిల్పుకోకుమని వేడుక తోడను వేడుకొందుమీ
    తీరుగనేడు, మన్మథుని తీయని నామపు వత్సరమ్మ, ఈ
    దారుణ మానభంగముల ధారుణి మాపుము ' రేపు ' మాపులున్.

    రిప్లయితొలగించండి
  13. వేపపూవును మఱియును బెల్లము దగు
    నరటి పండును మామిడి చెరకు ముక్క
    లాది గకలిపి యీదిన మార్య !చేయు
    దురట పచ్చడి సుఖము బొం దుకొఱకునిల .

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. తే!గీ! పండుగల్ వచ్చు పోవును మెండు గాను!
    పేద ధనికుల బేధము పెంచు కొరకె!
    ధరణి దిగనట్టి ధరలును దైన్య మవగ!
    ఎన్ని పండుగ లొచ్చిన ఏమి ఫలము?
    తే!గీ!చీలె పచ్చని రాష్ట్రము చిప్ప దొరికె!
    ఆర్ధికంబుగ రాష్ట్రము అదురు చుండె
    చంద్ర బాబును, జగనని చర్చ లేల?
    ఎవరి బతుకుకు వారేను ఏలికయ్య!
    ఆ!వె! రాజ కీయ మంట రగలని రీతిగ
    నేత లేల వలయు నేల నేడు
    జనుల మేలు జేయు జననేత లేడొకొ!
    మరొక గాంధి తాత మరల రాడు!
    తే!గీ!రాశి ఫలముల నమ్మగ రాదు మార్పు!
    కష్ట పడుమయ్య భాగ్యము కలుగునయ్య
    సంఘ శ్రేయస్సు గాంక్షగ సాగు మయ్య!
    చిత్త శుద్ధికి తొలగేను చిక్కులెల్ల!
    తే!గీ! దేవ దేవుడు కరుణించి తేరి జూచి
    పాడి పంటల నియ్యగ బాగు పడును
    మనుజు లెల్లను యొక్కటె మాట మీద
    పాటు బడగను దేశము బాగు పడదె!

    రిప్లయితొలగించండి
  16. రమణీయంబగు చూతపత్రములఁ ద్వారాగ్రంబునన్ గూర్చియున్
    సుమమాలాంకృత శోభలన్ గృహము సంశోభిల్ల కైసేయుచున్
    కమనీయంబగు పంచభక్ష్యముల తత్కాలమ్ముగా వండుచున్
    మమకారంబున స్వాగతించెదను సన్మానంబుతో మన్మథా!

    రిప్లయితొలగించండి
  17. మన్మథలీల లాపి యవమానపు చేష్టలఁ రూపుమాపుచున్
    సన్మునులెందరో యిడిన సంస్కృతి బాటను పట్టునట్లుగా
    తన్మయమొందజేసి మము దారిన పెట్టుము భాగ్యదాతవై
    మన్మథ నామ వత్సరమ! మానవ జాతికి మేలు జేయుమా!

    రిప్లయితొలగించండి
  18. మెత్తని విరి నెత్తావుల మత్తుగొల్ప
    చిత్తమలరింప జేయుచు చింతనణచ
    విత్తమార్జించి పెట్టుచు వేడ్కనివ్వ
    క్రొత్త సంవత్సరము వచ్చె కోర్కెదీర్చ!

    రిప్లయితొలగించండి
  19. స్వాగత మిదియే మన్మథ
    రాగముతో బలుకుచుంటి రమ్మని నిన్నే
    బాగుగ వర్ధిల్లు నటుల
    సాగించుము మా బ్రతుకులు సంపదలిడుచున్!

    రిప్లయితొలగించండి
  20. కోకిలమ్మపాట వేకువ జామున
    మేలుకొలుపు పాడ మెలకువయ్యె
    లేతయాకు రంగు చూతపత్రమ్ముల
    జూడగా నుగాది వేడుకయ్యె!

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రుల కవితలు యుగాది శోభకు పట్టం కడుతున్నాయి. అభినందనలు.

    మన్మథ యుగాది వేడెద
    సన్మార్గము చూపు మాకు చాలును తెలుగుల్
    తన్మయతను తరతమముల్
    కన్మరు గౌ రీతి నెపుడు కలసి సుఖించన్.

    రిప్లయితొలగించండి
  22. గురువుగారి కవితాఖండిక వారి ప్రగతి శీల భావాలకు దర్పణం పడుతోంది.

    రిప్లయితొలగించండి
  23. గురుదేవులకు, బ్లాగు కవిమిత్రులకు మరియు ఇతర వీక్షకులకు ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు.

    చిగురుల్ మేసెడు కోయిల
    జగముల పులకింతఁ గూర్చి స్వరములఁ బాడన్
    దగు మీ యాశలుఁ దీరగ
    నుగాది శుభకామనలివె యోంకారమునన్!

    రిప్లయితొలగించండి
  24. పిలిచెనుకోయిలమ్మ తగుప్రీతినిబంచునుమామిడమ్మనిన్
    వలచెనుపూలరెమ్మ,పరివారపుసంతసమందుకొమ్మ,తా
    గొలిచెనువేపకొమ్మ,తమకోర్కెలుదీర్చగవేగరమ్మ|నా
    కవితలుబుచ్చుకొమ్మతగుకాన్కలుబంచగరమ్ముమన్మధా|
    ఆరుఋతువులకారోగ్యమమరునట్లు
    మూడుకాలాలుమురిపానమురియునట్లు
    పంటలింటింటవంటకుకంటబడగ
    ఆయురారోగ్యమందునీయందమందు

    రిప్లయితొలగించండి
  25. పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ ఉగాది కవిత బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ ఉగాది కవితా ఖండిక బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ ఖండకృతి బాగున్నది. అభినందనలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘మనుజు లెల్లను+ఒక్కటే’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మనుజు లందరు నొక్కటె’ అనండి.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    శబ్దాలంకారలతో మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. అందరికి ఉగాది శుభాకంక్షలు....
    క్రొమ్మావి కొమ్మన కోకిల కంఠమ్ము
    పంచమ రవముల పలుకరింప
    మాకంద పర్ణాల మాలికా తోరణా
    లంకృత గృహశోభలతిశయింప
    మల్లెలు జాజులు మరియు సంపెంగలు
    వాల్జెడన్ నెక్కొని పరిమళింప
    వేప తరువులందు వీతెంచు మందోష్ణ
    మలయానిల సుఖమ్ము మరులుగొల్ప

    మధుర మధుమాస రుతువులో మరుడు తనదు
    పుష్ప బాణమ్ము సంధింప, భువి పురుషుని
    కూడగను ప్రకృతి నెలత గుల్కుచు నడ
    యాడె, బలు కాంతుల వసంత పర్వ మలర

    శ్రీకర మన్మథ వత్సర
    మా! కలిమి న్నొసగుచునిట మత్త మతద్వే
    షా కల్మష వైరి దునిమి
    మాకిడు సౌభ్రాతృ ప్రేమ పరిఢవిల భువిన్!

    రిప్లయితొలగించండి
  27. స్వాగతము నీకు మన్మథ వత్సరమ్మ
    పాత గాయములను భువి పాతిపెట్టి
    సఖ్యత కలిగి ప్రజలంత సాగునటుల
    తెలుగు జాతికి నిడుమమ్మ దీవెనలను
    పాడి పంటల పల్లెలు పరిఢవిల్ల
    వర్షములనిమ్ము మన్మథ వత్సరమ్మ
    స్వీయ వృద్ధియే వారల ధ్యేయముగను
    సాగు నేతల యాటలు సాగకుండ
    భూబకాసురులకు చిక్కి పొగలకుండ
    కాచి కాపాడు రైతులన్ కరుణతోడ

    రిప్లయితొలగించండి
  28. పుష్ప వనమున విరిసిన పూలు మెరయ
    చివురుటాకుల చిరునవ్వు సిరులు దొరల
    మన్మధుడరుదెంచెనిలకు మనసు మురియ
    మాయమవుతున్న మనిషిలో మమత నింప

    పుష్ప శరముతో ఎదలన్ని పులకరింప
    కూనలమ్మ గళమునందు తేనె నింప
    మాధవుడరుదెంచవలెనీమన్మథమున
    మకరి విడిపించి కరికింక మోక్షమొసగ

    రిప్లయితొలగించండి
  29. గేయ కవిత
    ఉగాది ఊహలకూతం కాగా జగాలు మీరే గెలవండీ
    ఇగోల మరచీ నిజాలనరసీ సుఖాల తీరం చేరండీ
    గళాల విప్పీ వినోద గానం (ధారాళంగా)విరామమెరుగక పాడండీ
    ఇవాళ మనకే సుమూల ఘనకీర్తవాలనంటూ సాగండీ

    రిప్లయితొలగించండి
  30. శంకరయ్య మాస్టారూ. మీకు వందనాలు. మీరు అంతర్జాలమందు చేస్తున్న ఈ కృషి ప్రశంసనీయం. నేను పద్య రచనలో ఇప్పుడే ఓనమాలు దిద్దుతున్న చిన్నవాణ్ణి. పై పద్యాలలో తప్పులున్న క్షమించగలరు

    రిప్లయితొలగించండి
  31. సుమలత గారూ! మీ పద్య వర్ణనతో వసంతుడు పులకరించాడు.
    ఎత్తుగీతి నాల్గవ పాదం లోనూ, కందం ఆఖరి పాదం లోనూ యతిమైత్రి లోపించింది.
    సరిదిద్దండి.

    ******

    సత్యనారాయణ రెడ్డి గారూ! మీ పద్యాలు చాలా బాగున్నాయి.
    మొదటి పద్యం మూడవ పాదంలో ప్రజలంత కు బదులుగా ప్రజలెల్ల అంటే బాగుంటుంది.
    పద్యంలో నాలుగు కంటె ఎక్కువ పాదాలు వ్రాయడయం సాధారణంగా వృత్తాలలో మాత్రమే సంప్రదాయం.

    ******

    రవికాంత్ గారూ! మీ పద్యాలు బాగున్నాయి.
    మొదటి పద్యం నాల్గవ పాదంలో మాయమవుతున్నది మమత కాబట్టి మాయమవుతున్న మనిషి గా కనిపిస్తూ అన్వయం ఇబ్బందిగా ఉంది. సరిదిద్దితే బాగుంటుంది.
    రెండవ పద్యంలో నాల్గవ పాదం భావం కొంచెం పద్యంలో ఇమడడం లేదు.

    రిప్లయితొలగించండి
  32. మిస్సన్న గారు,
    ధన్యవాదాలు. నాకు కొంచెం యతి గురించి వివరంగా తెలుసుకోవలసిన అవసరం వుంది. నేను ఈ క్రింది పట్టిక చూస్తాను.

    1. అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః
    2. ఇ, ఈ, ఎ, ఏ, ఋ
    3. ఉ, ఊ, ఒ, ఓ
    4. క, ఖ, గ, ఘ, ఞ, క్ష
    5. చ, ఛ, జ, ఝ, శ, ష, స, ఙ
    6. ట, ఠ, డ, ఢ, ణ
    7. త, థ, ద, ధ, న
    8. ప, ఫ, బ, భ, మ, వ
    9. ణ, న
    10. ర, ఱ, ల, ళ

    మీరు కాని శంకరయ్య మాష్టారు కాని కొంచెం యతి ప్రాసల గురించి వివరించగలరు. ఇంతకు ముందే చెప్పివుంటే లింక్ ఇవ్వగలరు.

    రిప్లయితొలగించండి
  33. సుమలత గారూ నా దగ్గర శ్రీ చింతా రామకృష్ణారావు గారు చెప్పిన యతిని గురుంచిన పూర్తి పాఠం ఉంది. ఇక్కడ పెడదా మంటే హెచ్ టి యం యల్ అని ఒప్పుకోవడం లేదు. మీరు ప్రత్యామ్నాయం సూచిస్తే పంపగలను.

    రిప్లయితొలగించండి
  34. సుమలత గారూ మన బ్లాగులో కూడా ఛందస్సు శీర్షికన కొన్ని పాఠాలు కనుపిస్తున్నాయి. చూడండి. .

    రిప్లయితొలగించండి