12, సెప్టెంబర్ 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 8

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరంచ వలసిన సమస్యను మిత్రులు, తెలుగు పండితులు గుండు మధుసూదన్ గారు సూచించారు.
రాముని వెంట రాముఁ గని రాముని సంఘము మోదమందఁగన్.

15 కామెంట్‌లు:

  1. కామ విరోధియౌ శివుని కార్ముకమున్ తెగవేసినంతటన్ -
    భూమియె కంపమొందునటు పొందియు క్రోధము భార్గవుండు, శ్రీ
    రాముని తోడ పోరుటకు రా, నత డాతని పీచ మాచె - ఆ
    రాముని వెంట రాము గని రాముని సంఘము మోదమందగన్!

    రిప్లయితొలగించండి
  2. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    చక్కని పద్యంతో సమస్యను పూరించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. రాముడు నూత్న యవ్వనము రాజిలు మిత్రుల సంఘ నేతయై
    గ్రామము బాగు చేయ, హిత కారక కార్యములెన్నొ సల్పుచున్,
    ' ఫేము 'ను పొంది, చేరె నిక - పెట్టగ పార్టిని ' నందమూరి '; ఆ
    రాముని వెంట రాము గని రాముని సంఘము మోదమందగన్!

    రిప్లయితొలగించండి
  4. రాముని దివ్య శక్తి మహరాజునకున్విశదీకరింపగా,
    తామసి యైన తాటకిని దానికుమారుల చంప కాన కున్
    రాముని బంపనొప్పుకొనె;రాక్షసనాశమ చేయవచ్చినా
    రా ముని వెంట;రాము గనిరా ముని సంఘము మోద మందగన్

    గౌరవనీయులైన కంది శంకరయ్యగారు,

    సమస్యా పూరణల శీర్షికన వెలవడు చక్కని మీ టపాలను ఎన్నో మార్లు చూసాను.పూరించటానికి మాత్రము ఇది నా తొలి ప్రయత్నము. తప్పులుంటే మన్నించి సరి దిద్ద గలరు.

    రిప్లయితొలగించండి
  5. భూమిని శాంతి సౌఖ్యముల పొందుగ నిల్పగ జేయు యాగమున్
    తామసులైన రాక్షసులు దాడుల భంగము సేయుచుండ శ్రీ
    రాముని యాగ రక్షణకు రమ్మని తాపసి వేడ వచ్చు నౌ
    రా! ముని వెంట రాము గనిరా మునిసంఘము మోదమందగన్!

    రిప్లయితొలగించండి
  6. పద్యం చూడగానే రాముడు, పరశురాముడు గుర్తొచ్చారు. పూరణలో మొదటిపద్యం ఆచార్యులవారు అద్భుతంగా పూరించారు. మరొకటి ఆలోచిస్తే, ఎన్టీయారు గుర్తొచ్చారు. అదీ తిరిగి ఆచార్యులు పూరించారు!

    రిప్లయితొలగించండి
  7. నేమముతోడ సేయు క్రతు నిర్వహణమ్మును వమ్ముసేయు మా
    యామతులైన రాక్షసుల అంతముజూడ ధనుర్ధరుండు నా
    భీమపరాక్రముండు రఘువీరుడు ధీరత రాగ కన్నులా
    రా మునివెంట రాము గని రా మునిసంఘము మోదమందగన్

    రిప్లయితొలగించండి
  8. ఆహా! ఏమీ నా భాగ్యము? ఈ సారి వారాంతపు సమస్యా పూరణానికి వస్తున్న స్పందన మహదానందకరంగా ఉంది.

    పద్యకళాప్రవీణులైన డా. ఆచార్య ఫణీంద్ర గారు రెండు పూరణలు పంపడం నా అదృష్టం.

    తెలుగుయాంకి గారూ,
    స్వాగతం. నిర్దోషంగా చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    మీ బ్లాగు చూసాను. కృష్ణుడి ప్రతిజ్ఞకు, "అదిగో ద్వారక" పద్యానికి మీ పేరడీలు చూసాను. చిన్న చిన్న దోషాలున్నాయి. తిరుపతి వేంకట కవులపై వ్యాసం చూసాను. బాగుంది.

    ఫణి ప్రసన్న కుమార్ గారూ,
    పూరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.

    రవి గారూ,
    ఒకే భావంతో ఎందరెన్ని పద్యాలైనా చెప్పవచ్చు. భావం ఒకటైనా శైలి, పదవిన్యాసంలో తేడాలు ఉంటాయి కదా.

    భైరవభట్ల కామేశ్వరరావు గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. 'రాముని లక్ష్మణున్ బనుపు! రాక్షస భంజన జేసి ధర్మ ర-
    క్షామఖమారభింతుర'న; క్ష్మాపతి బుత్రుల బంచె; నేగవా-
    రా ముని వెంట, రాము గనిరా ముని సంఘము; మోదమందగన్
    రామ శరణ్యులై నిలిచి, రాముని మూర్కొనిరప్రమత్తులై.

    శంకరయ్యగారూ, రెండవ పాదంలో క్షా-క్ష్మా ల మధ్య యతి..సరయినదేనా?

    రిప్లయితొలగించండి
  10. నారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "ఆరభింతురు" పదప్రయోగమే పానకంలో పుడకలా ఉంది.
    క్షా-క్ష్మా లకు యతి చెల్లుతుంది.

    రిప్లయితొలగించండి
  11. :)
    మరొక పూరణ, చిత్తగించండి:
    రాముని పాత్రధారి సురామును మెచ్చక పారిపోయె నా-
    డే ముని సంఘమందు 'ఇక దిక్కెవరో'యని చర్చ రేగగా
    "రాముని వెంట రాము; గనిరా, ముని సంఘము? మోదమందగన్
    భీముని రాము జేయుడ"ని బేర్కొనిరందరు ముక్తకంఠులై.

    రిప్లయితొలగించండి
  12. నారాయణ గారూ,
    మంచి భావన. బాగుంది.
    మొదటి పాదంలో "పాత్రధారి సురామును" అన్నచోట ఒక అక్షరం లోపించి గణదోషం వచ్చింది.
    రెండవ పాదంలో "ద-డ" యతి చెల్లదు. గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  13. 1. క్షమించాలి అచ్చుతప్పు.. మొదటి పాదంలో 'సుతరాము' అని ఉండాలి.
    2. యతిదగ్గర పప్పులో కాలు వేయటం నాకు మామూలైపోతున్నట్లుంది. రెండవ పాదాన్నీ సవరిస్తాను..

    రిప్లయితొలగించండి
  14. మరో ఆలోచన. చిత్తగింఛండి.

    ఆమను లెన్నొ పోవగ నహల్యకు దీఱును శాపమీ దఱిన్
    భామిని వేచె నట్టడవి పాపము రాయయి పెక్కు కాలమున్
    వేమఱు కృంగి వందుఱెను వేగము రండయ నంచు పిల్చి నా
    రా ముని వెంట రాము గని రాముని సంఘము మోద మందగన్.

    రిప్లయితొలగించండి
  15. మరో ఆలోచన. చిత్తగింఛండి.

    ఆమను లెన్నొ నిండగ నహల్యకు దీఱును శాపమీ దఱిన్
    భామిని వేచె నట్టడవి పాపము రాయయి పెక్కు కాలమున్
    వేమఱు కృంగి వందురెను వేగము రండయ నంచు పిల్చి నా
    రా ముని వెంట రాము గని రాముని సంఘము మోద మందగన్.

    రిప్లయితొలగించండి