28, జూన్ 2014, శనివారం

సమస్యా పూరణం - 1457 (కైక పతిన్ రఘూత్తముని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.
(ఒకానొక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

  1. కైక పతిన్, రఘూత్తముని గానల కంపకు మంచు వేడెగా
    కైకను కోసలేశుడును గార్చుచు కన్నుల నీరు నార్తితో
    ''నాకిక నేమి చెప్పకుము నా యభిలాషను దీర్చివెంటనే
    నా కిడి నట్టి మాట నరనాధుడ!'' తప్పకు మంచు కోరె నా

    రిప్లయితొలగించండి
  2. ఆకఠినాత్మురాలి మది యాశలు సాగగనీకు దైవమా
    మాకను చూపు వీడు మరి మమ్ములవీడిన సైపలేమయా
    శ్రీకర యంచయోధ్యపురి చిన్నలు పెద్దలు బాధతోడ లో
    కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.

    రిప్లయితొలగించండి
  3. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    పద్యం వరకైతే చాలా బాగుంది. అభినందనలు.
    కాని సమస్య పరిష్కరింపబడినట్లు తోచడం లేదు. కొద్దిగా వివరిస్తే బాగుంటుందేమో?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వాహ్.. ఏమి విరుపు! లోకైకపతితో మీరు చెప్పిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. ఈ కమలాయతాక్షిని, మహీజను గూర్చి కఠోరనిందలన్
    లోకులు వేయ వింటి, పురిలోనిక నుంచగరాదు లక్ష్మణా!
    వేకువనే వనమ్మునకు వేగమె జేర్చు మనన్ జలించి లో
    కైక పతిన్ రఘూత్తముని గానల కంపకు మంచు వేడెగా

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    చాలా బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ​చీకటి మబ్బినట్లు పురసీమ మునింగెను దుఃఖవార్ధిలో
    కైకకు శాపమిచ్చినటు గార్హపతాగ్నుల నార్పెబాష్పముల్
    వ్యాకులచిత్తులై సకల పౌరజనుల్ మొరబెట్టి రాజునా
    కైకపతిన్, రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.​

    రిప్లయితొలగించండి
  7. చీకటి మబ్బినట్లు - అసాధువేమో. చీకటిగ్రమ్మినట్లు అని చదవ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    పైకొన దుర్నయమ్ము తన స్వంత కుమారుడురాజ్య మేలగా
    రాకొమరుండు రాముని కరణ్యనివాసమటంచు గోరగా
    కైకపతిన్, రఘూత్తముని కానలకంపకు మంచు వేడె గా
    వ్యాకుల మందుచున్ పురనివాసులు మంత్రులు దండనాయకుల్

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మల్లెలవారి పూరణ:కైకయు తాను మంధరయెగట్టిగ జెప్ప వరాలు గోరె గా
    పోకనురాము వన్యముల పొల్పుగ రాజు ,కుమారు జేయగా
    కైకపతిన్, రఘూత్తముని కానలకంపకు మంచు వేడె గా
    శోకము తో నతండతుల సోలుచు నామెను కోసలేశుడే

    రిప్లయితొలగించండి
  10. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు

    నాల్గవ పాదములోని '' తప్పకు మంచు కోరె నా ' అను వాక్యము మెదటి పాదములోని '' కైక పతిన్'' అను వాక్యమునకు అన్వయము చేశాను '' తప్పకుమంచు కోరె నా కైక పతిన్''
    నా అన్వయము సరిగానే ఉన్నదనుకొంటున్నాను
    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  11. యం. ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘స్వంతకుమారుడు’ ప్రయోగం ఆలోచించదగింది. సంస్కృతంలో స్వంతము లేదు. తెలుగులో సొంతమునకు పర్యాయపదంగా వాడుతున్నారు. దానితో సమాసం చేయడం కుదరదేమో?
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ వివరణతో నా సందేహం తీరిపోయింది. బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. నూకలు తిన్న మందర వినూత్నగతిన్ పురి కొల్పు చుండగా
    చేకొని రామచందురుని శీఘ్రమె కానలకంప వేడె నా
    కైక పతిన్; రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.
    నేకబిగిన్ సుమంతుడును! యెల్ల ప్రజల్ విడలేక నేడ్వగన్!

    రిప్లయితొలగించండి
  13. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘విడలేక యేడ్వగన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    పట్టి నయోధ్యకు రాజు సేయగా నంటేసరి పోతుందను కుంటాను

    రిప్లయితొలగించండి
  15. తిమ్మాజీ రావు గారూ,
    నేను కూడా ‘పట్టి’ శబ్దంతో మొదలుపెట్టి సవరణ సూచించాలనుకున్నాను. ఇప్పుడు బాగుంది. సంతోషం!

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  17. లోకములెల్ల సాక్షి- మదిలోపల సత్యము నమ్మియున్నచో
    సాకులఁ బల్కకుండ నిక జాగునుఁ జేయక యంపు; యట్లుకా
    కే కతమున్ నిజాత్మజుని యింటనె నిల్పగ నెంచియున్నచో
    కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా

    రిప్లయితొలగించండి
  18. అన్వయలోపం సరిదిద్దుతూ...

    లోకములెల్ల సాక్షి- మదిలోపల సత్యము నమ్మియున్నచో
    సాకులఁ బల్కకుండ నిక జాగునుఁ జేయక యంప మంచు;కా
    కే కతమున్ నిజాత్మజుని యింటనె నిల్పగ నెంచియున్నచో
    కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా

    రిప్లయితొలగించండి
  19. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ (గరికిపాటి వారి పూరణకు అనుకృతి...)

    కాకమనస్కురాల! సుతుఁ గానల కంపుచు నుంటి వయ్యయో
    చీకటి వేళలో మనసు చిందర వందర చేసినావుగా!
    శోకములో మునింగి పతి సుందరపుత్రుని నాదు ప్రాణలో
    కైకపతిన్ రఘూత్తముని కానల కంపకు మంచు వేడెగా.

    రిప్లయితొలగించండి
  20. లక్ష్మీదేవి గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. "శ్రీ కరుడంత లక్ష్మణుని, సీతను జేగొని సాగె నమ్రుడై
    కైక పతిన్ రఘూద్వహుని కానల కంప వరమ్ము వేడ" వా-
    ల్మీకులు జెప్ప నివ్విధిని మీ కెవరయ్య వచించి రాడగా
    'కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా'!

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. ప్రాకట మైనభక్తి పరిపాలన జేయగ శక్తియుక్తు డౌ
    లోకులు మెచ్చగా నితడు లోకహి తమ్మును గోరువాడన
    న్నాకము నుండి ధాత్రి దిగెమాధవు డంచు తలంచి నంత నే
    కైక పతిన్ రఘోత్తముని గానల కంపకు మంచు వేడె గా

    రిప్లయితొలగించండి
  24. మాస్టరుగారూ ! , మిస్సన్న గారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  25. అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. పెరియార్ రామసామి కీమాయణం:

    దూకుచు శయ్యనుండి పడ ద్రోయుచు గూనిది మంథరమ్మనున్
    కేకలు వేయుచున్ విరివి కెంపును వోలెడి ముక్కుచీదుచున్
    వాకిలి కడ్డుగా నిలిచి బావురు మంచును కళ్ళనీళ్ళతో
    కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా

    రిప్లయితొలగించండి