25, అక్టోబర్ 2014, శనివారం

సమస్యా పూరణం – 1538 (హరి హరికిన్ హరిని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్.

52 కామెంట్‌లు:

 1. సరియగు పూరణ కొరకై
  సరసపు మాటలు దొరకక శ్రమంబయ్యెన్
  తరమగునా పూరింపగ
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్
  (ఉదయాన్నే ప్రయత్నిస్తాను --- శుభరాత్రి )

  రిప్లయితొలగించు
 2. హరి పేరు గలుగు నిద్దరు
  నరిగిరి వేటాడ సింహ మనదగు మృగమున్
  దరినే నటవిని గనబడ
  హరి హరికిన్ హరిని జూపి హరియింపుమనెన్

  రిప్లయితొలగించు
 3. హరి యింటి పారిజాతము
  ధరకున్ గొని వెడలదలచి దరికిన్ వచ్చెన్
  సరసముగ కృష్ణుని మనో
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్!!


  హరి యింటి పారిజాతము = ఇంద్రుని యింటి పారిజాతము
  కృష్ణుని మనో హరి = సత్యభామ
  హరికిన్ = శ్రీ కృష్ణునికి
  హరినిఁ జూపి = పచ్చనైన దానిని (పారిజాతమును) జూపి

  రిప్లయితొలగించు
 4. హరి మద్యతోడ నాహరి
  హరిలోకమ్మునకుఁబోవ, నానందముతో
  హరిణేక్షణ కృష్ణ మనో
  హరి హరికిన్ హరిని జూపి హరియింపుమనెన్

  రిప్లయితొలగించు
 5. నరహరి పాముకు కప్పను చూపించి తినమని అనడం :

  జరజర ప్రాకుచు వచ్చెడి
  యురగము నొకదానిని గని యుక్తియె తోచన్
  వెరగందక త్వరపడి నర
  హరి హరికిన్ హరిని జూపి హరియింపు మనెన్ !

  రిప్లయితొలగించు
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  పద్యం బాగుంది. రాత్రంతా పూరణ గురించి ఆలోచించి ఉంటారు. మీనుండి చక్కని పూరణకోసం ఎదురుచూస్తాను. శుభం! శుభోదయం!
  ‘శ్రమం బయ్యెన్’ అన్నచోట గణదోషం. ‘శ్రమ మయ్యెను నా/ తరమా...’ అనండి.
  *
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘దరినే యటవిని...’ అనండి.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీరు జిగురు వారి బాట పట్టినా మీ పూరణకూడా బాగున్నది. అభినందనలు.
  ‘హరిమధ్య’ ... టైపాటువల్ల ‘హరిమద్య’ అయింది.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 7. మిత్రులకు నమస్కారము!

  హరి మురహరియను చోరులు
  హరియింపఁగ నొకరియింట నడుగిడ, నచటన్
  హరివర్ణహారముం గని,
  హరి హరికిన్ హరినిఁ జూపి "హరియింపు" మనెన్!
  (హరినిన్=హరివర్ణహారమును)

  రిప్లయితొలగించు
 8. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మురహరి హరికిన్’ అంటే అన్వయం బాగా కుదురుతుంది కదా! అందుకని అక్కడ ‘హరివర్ణపు నగఁ గని ముర/ హరి హరికిన్...’ అంటే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించు
 9. హరియే సీతాపతి యని
  యెరుగని మారీచు డొక్క యిఱ్ఱిగ మారన్
  ఎరిగిన సీతమ్మ - మనో
  హరి, హరికిన్ హరిని జూపి హరియింపుమనెన్

  రిప్లయితొలగించు
 10. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మారీచుని విషయం సీతకు తెలియదు కదా! ‘ఎఱుగని సీతమ్మ’ అనాలనుకుంటాను.

  రిప్లయితొలగించు
 11. గురువు గారికి వందనములు. రాము డెవరో మారీచునకు తెలియదు. కాని సీతకు తెలుసు అని నా ఉద్దేశ్యం.

  రిప్లయితొలగించు
 12. మిత్రులు శంకరయ్యగారికి ధన్యవాదములు. నే నేవిధమునఁ బూరింపవలెనని యనుకొంటినో యటులనే మీరు సవరించుట ముదావహము. నేను టైపు చేయునపు డిది మఱచి పైవిధముగ టైపుచేసితిని. మఱలం జూచుకొననైతి. చక్కని సవరణమును సూచించినందుల కభినందనలు...ధన్యవాదములు. నా సవరించిన పూరణము:

  హరి మురహరియను చోరులు
  హరియింపఁగ నొకరియింట నడుగిడ, నచటన్
  హరివర్ణపు నగఁ గని, ముర
  హరి హరికిన్ హరినిఁ జూపి "హరియింపు" మనెన్!
  (హరినిన్=హరివర్ణహారమును)

  రిప్లయితొలగించు
 13. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  సుగ్రీవుడు రామునితో :

  01)
  ________________________________

  హరియించె నాదు రాజ్యము
  హరియించెను నాదు వధువు, - నాస్తిని సర్వమ్
  హరియించ దలచు నన్నని
  హరి హరికిన్ హరిని జూపి - హరియించు మనెన్ !
  ________________________________
  వధువు = భార్య
  హరి =కోతి, విష్ణువు ( సుగ్రీవుడు, రాముడు, వాలి)

  రిప్లయితొలగించు
 14. అరుదౌ బంగరు లేడిని
  కరమాశ్చర్యము కలుగగ కాంచియు వెసగన్
  హరియౌ రామున్నికి మనో
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్
  ( సీత రామునికి బంగారు రంగు గల దానిని చూపి)

  కరముల నింపగు సూర్యుని
  వరమగు ఫలముగఁ దలచియు బాగుగ మింగన్
  పరుగిడ పవనజు, డయ్యెడ
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్
  (సూర్యుడు, ఇంద్రునికి కోతిని చూపి)

  హరి నీట బయట మెలగును
  హరి యేటికి గట్టు పైన హరువుగ మెలగున్
  వరమగు తిండిగఁ జేయడె
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్
  ( విష్ణువు, పాముకు కప్పను చూపి)

  భరమగు విసమే పుట్టగ
  భరియించెను తాను శివుడు. పావన మశ్వం
  బరయగ పుట్టగ, నాపుర
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్
  ( శివుడు, ఇంద్రునికి ఉచ్చైశ్రమము ను చూపి)

  రిప్లయితొలగించు
 15. తరుముతు వచ్చెడి పాముకి
  దొరకక తప్పించుకొనుచు దుఃఖ్ఖము తోడన్
  సరసకు ఙేరిన కపిగని
  హరి హరికిన్ హరిని ఙూపి హరియించమనెన్!!!

  రిప్లయితొలగించు
 16. వసంత కిశోర్ గారూ,
  నేను ఎదురుచూస్తున్న భావంతో చక్కని పూరణ చెప్పారు. (నిజానికి వాలిసుగ్రీవుల ప్రస్తావనతో నేను పూరణ వ్రాయాలనుకున్నాను.) అభినందనలు.
  ‘సర్వమ్’ అని హలంతంగా చెప్పరాదు కదా... అక్కడ ‘ఆస్తుల నెల్లన్’ అనండి.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘వెసగన్’ అనరాదు కదా.. అక్కడ ‘వెసఁ దా’ అనండి. ‘రామున్నికి’ అని టైపాటు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తరుముచు వచ్చెడి పాముకు...’ అనండి.

  రిప్లయితొలగించు
 17. సుబ్బారావు గారి బాటలోనే - కాని కొంచెం వేరుగా :

  నరహరి హరియను వారలు
  కరమున విల్లంబులు గొని కానకు వెడలన్
  శరమును సంధించుచు నర
  హరి హరికిన్ హరిని జూపి హరియింపుమనెన్

  రిప్లయితొలగించు
 18. హరివర్ణముతో నటునిటు
  చరియించుచు విందుఙేయు చతురను గనుచున్
  మురియుచు రాఘవుని మనో
  హరి హరికిన్ హరినిఙూపి హరియించమనెన్!!!

  రిప్లయితొలగించు
 19. నాగరాజు రవీందర్ గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 20. శైలజ గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 21. గుండు మధుసూదన్ గారి రెండవ పూరణ....
  (2)
  హరియింతు నను కశిపునకు
  హరి నా ప్రహ్లాదుఁ డపుడు "హరి హరి"యనుచున్
  బరగంగఁ బిలిచి మదమో
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్!
  (మదమోహరి హరికిన్=మదమును, మోహమునుం గలవాఁడును, దివిజపురాపహారియునగు హిరణ్యకశిపునకు)

  రిప్లయితొలగించు
 22. గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  అయితే ప్రహ్లాదుడు హిరణ్యకశిపునకు హరిని చూపించి చంపు మన్నాడు. ఇక్కడ ‘కుమారా! నాకు హరిని చూపించు. చంపుతా” నన్న తండ్రికి ప్రహ్లాదుడు హరిని చూపించి ‘చంపుతాను అనావు కదా! ఏదీ చంపు చూద్దాం’ అన్నట్టు అర్థం చేసికొనవలసి ఉంటుందన్నమాట!

  రిప్లయితొలగించు
 23. విరినొకదానిని కృష్ణుఁడు
  సరసత నొసగె సవతికన సాత్రాజితి యా
  తరువునె కోరె ,హరిమనో
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్.

  రిప్లయితొలగించు
 24. గుండు మధుసూదన్ గారి మూడవ పూరణ.....
  (3)
  హరి హరి! సర్పము కప్పను
  హరియింప వెనుఁ దవులఁ గని "హా హా"యనఁగన్
  బరగు నిది తిండిగానని
  హరి, హరికిన్ హరినిఁ జూపి, హరియింపు మనెన్!

  రిప్లయితొలగించు
 25. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 26. రాజుగా రాముడు సీతతో వేటకు వెడలిన సందర్భము :

  హరు లరుగగ నోహరి సా
  హరి, హరికిన్ హరిని జూపి హరియింపు మనెన్
  హరిణేక్షణ సీత యపుడు ;
  ’సరె !' యని రాముడు విలుగొని శరమును వేసెన్

  రిప్లయితొలగించు
 27. నాగరాజు రవీందర్ గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సాహరి’ అన్నదాన్ని ఏ అర్థంలో ప్రయోగించారు. ‘సాహరి = నేనే సమర్థుఁడను-నేనే సమర్థుఁడను అని ఒకరికొకరు చూపునట్టి అహంకారము.’ అని నిఘంటువు అర్థం చెపుతున్నది.

  రిప్లయితొలగించు
 28. సిరి పెనిమిటి యెవరయ్యా?
  సరి యా శశ మేమి జేసె సరగున బావిన్
  దరి జని మంచి యుపాయము
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్.

  రిప్లయితొలగించు
 29. మిస్సన్న గారూ,
  వాహ్! చిన్నప్రశ్నకు చిన్న జవాబు... పెద్ద ప్రశ్నకు పెద్ద జవాబు.. మీ క్రమాలంకార పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 30. పూజ్యులు గురుదేవులుశకరయ్య గారికీ వందనములు
  అరయక నాచే జరిగె న
  పరాధ మని ఎంచక నను పరిమార్చంగా
  తరిమెను వాలి యటంచును
  హరి, హరికిన్ హరినిఁ జూపి, హరియింపు మనెన్

  రిప్లయితొలగించు
 31. గురువు గారూ ! నేను వాడిన పదం ‘ ఓహరి సాహరి ' - అంటే గుంపులు గుంపులుగా ( అని శబ్దరత్నాకరం ).
  మిస్సన్న గారి పూరణ చాలా బాగుంది.

  రిప్లయితొలగించు
 32. ధన్యవాదములు శంకరయ్యగారూ! నాకుం గంప్యూట రందుఁబాటున లేనందున మీకు మెయిలుఁ బంపఁగా, నా మఱిరెండు పూరణములను బ్లాగున నుంచినందులకుం గృతజ్ఞుఁడను.

  రిప్లయితొలగించు
 33. నా నాల్గవ పూరణము:

  (దీనికిం గవిమిత్రులు జిగురువారు మార్గదర్శకులు)

  హరిణాక్షి వెంట రాఁగా,
  హరి హరిపురి కరుగుఁదెంచ, హరితవనమునన్
  విరి తావిఁ గొని హరిమనో
  హరి, హరికిన్ హరినిఁ జూపి, "హరియింపు" మనెన్!
  (హరినిన్+చూపి=హరితవనమున విరి తావినిం బ్రసరింపఁజేసెడు పారిజాతమనియెడు దేవతావృక్షమునుం జూపించి)

  రిప్లయితొలగించు
 34. నాగరాజు రవీందర్ గారూ,
  ధన్యవాదాలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ నాలుగవ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 35. కె .యెస్ .గురుమూర్తి ఆచారి గారి పూరణ
  హరి,గోపీలకు ద్వేష౦
  బురగిలె,హరి పైకి గోపి పురికొల్పె గదా
  హరియను హంతకునిన్,హరి
  హరి, హరికిన్ హరినిఁ జూపి, హరియింపు మనెన్

  రిప్లయితొలగించు
 36. కె.ఈశ్వరప్ప గారిపూరణలు
  1.హరితో చెలగాటంబా
  హరి హరికిన్ హరిని జ౦పి హరియింపు మనెన్
  పరుగెత్తును లేకున్నచొ
  కరుణను జూపించ కయ్య కాటేయు సుమా
  2. హరితము నాశన పరచకు
  పరిహారము భయము గూర్చు పచ్చని చెట్లే
  హరి. నందున గల దొక్కటె
  హరి, హరికిన్ హరినిఁ జ౦పి, హరియింపు మనెన్

  రిప్లయితొలగించు
 37. శ్రీ గురుభ్యోనమ:

  కురుమిత్రుఁడు రాధేయుని
  సరిపోల్చుచెను కోతితోడ సమరమునందున్
  మరిపార్థుఁడు కేసరి యగు
  హరిహరికిన్ హరినిఁ జూపి హరియింపుమనెన్.

  రిప్లయితొలగించు
 38. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండు పూరణలలోను ‘హరినిఁ జూపి’ని మీరు ‘హరిని జంపి’ అని టైపు చేశారు.
  మొదటి పూరణలో ‘లేకున్నచొ’ అని విభక్తిప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘లేకున్నన్’ అంటే సరి.
  రెండవ పూరణ చివరి రెండు పాదాలలో అన్వయం కుదరనట్టుంది.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 39. విరహిణి యాకృష్ణమనో
  హరి హరికిన్ హరిని జూపి హరియించమనెన్
  కరుణను శశి కలిగించెడు
  విరహపు తాపంపు బాధ వెన్నెల యందున్((హరికిని=చంద్రుని)్
  ి

  రిప్లయితొలగించు
 40. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 41. హరియన విష్ణువు జిష్ణువు
  హరి భక్తుడు హరియెతాను హరి కీర్తన తో ,
  హరి నరసింహుడు వెలువడ
  హరి హరియే హరిని( జూపి హరి యింపుమనెన్
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించు
 42. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు 43. శ్రీ కంది శంకరయ్యగారు మీరునాపద్యాన్ని గమనించక పోవదమునిరుత్సహాన్ని కలిగి౦చి౦ది అందుకు నాధన్యవాదములు
  రిప్లయితొలగించు
 44. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మన్నించాలి. మౌస్‍ను క్రిందికి పైకి త్రిప్పడంలో మీ పూరణను గమనించలేదు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 45. హరియన కోతియె మరియొక
  హరియన పామౌను నొక్క హరియన కప్పౌ
  వరుసగ కనుగొనుడర్ధము
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్

  రిప్లయితొలగించు
 46. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 47. హరియన కోతియె మరియొక
  హరియన పామౌను నొక్క హరి కప్పగుటన్
  సరియర్ధ వంతమేయిది
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్

  రిప్లయితొలగించు


 48. అందరిలోకి, జిగురు.సత్యనారాయణగారి పూరణ ఉచితంగాను,ఉత్తమంగాను ఉన్నది.

  రిప్లయితొలగించు
 49. దురుసుగ నా సతిఁ గైకొని
  పరుషమ్ముగ నన్ను వాలి బాధించె! ప్రభూ!
  దరిజేర్చ తోడవుదునని
  హరి హరికిన్ హరిని జూపి హరియింపు మనెన్!

  రిప్లయితొలగించు
 50. కమనీయం గారూ,
  ధన్యవాదాలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 51. అరయగ వానరమోయన
  పరుగిడు మానసము హరిని ప్రార్ధించంగన్
  కరుణారస హృదయుండగు
  హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్

  వరుసగా:
  హరి = విష్ణువు, విష్ణువు, యముడు, కోతి

  రిప్లయితొలగించు