28, నవంబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం - 1555 (కలమున్ గని కవివరుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కలమున్ గని కవివరుండు కలవర మందెన్.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. కలమును యుంచెను తాఁ గా
    కలంబు పై నిదుర క్రమ్మ కన్నులు మూసెన్
    కలలో భీకరమౌ యే
    కలమున్ గని కవివరుండు కలవర మందెన్
    (కాకలము = కాగితము ఏకలము = అడవి పంది)

    రిప్లయితొలగించండి
  2. నలతగ నుంట యె కాకను
    నలతిగ నుజ్వరము కూడ నాలికి రాగా
    కలవర ము కలుగ కల నే
    కలము న్ గని కవివరుండు కలవర మందెన్

    రిప్లయితొలగించండి
  3. బలమగు సతి వంటింటన్
    వలమగు నొక బల్లి జూసి వాటము ద్రప్పెన్
    గిలగిల జారగ నా కల
    కలమున్ గని కవివరుండు కలవర మందెన్.

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కలమును + ఉంచెను’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కలమును పెట్టెను’ అనండి.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అలతిగను జ్వరము’ అన్నప్పుడు ‘ను’ గురువు కాదు. దానివల్ల గణదోషం. ‘అలతిగనే/ అలతియయిన’ అనండి.
    ****
    బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    కలకలముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఫలితంబులఁ మదినెంచక
    బలసామర్థ్యములఁజూపి పరిపరిగతులన్
    కలహించుకొనెడి యా కల
    కలమున్ గని కవివరుండు కలవరమందెన్.

    రిప్లయితొలగించండి
  6. అల వైకుంఠము పద్యము
    నిల వ్రాయగ పోతనప్పు డిటునటు తలపన్
    తలపకనే హరి వ్రాసిన
    కలమున్ గని కవివరుండు కల "వర" మందెన్.

    రిప్లయితొలగించండి
  7. పలు చందస్సుల లోనన్
    తెలుగున పద్యములనల్లి స్థిరపరుచంగా
    చలికిన్ బిగియుచు వ్రాయని
    కలమున్ గని కవివరుండు కలవరమందెన్

    వలలో లేఖిని వ్రాయగ
    నిలలో లేఖకుడు వ్రాయ నెన్న నేత
    త్ఫలమో వ్రాయుట మరువన్
    కలమున్ గని కవివరుండు కలవరమందెన్

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పోతన + అప్పుడు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘పోతన యపు డిటునటు...’ అనండి.
    ****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘స్థిరపరచగ నా| చలికిన్...’ అనండి.
    రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘వ్రాయ నెన్నగ’లో టైపాటువల్ల ‘గ’ తప్పిపోయినట్టుంది. ‘వ్రాయ నెన్నగ నేత|త్ఫలమో...’ సరియైనది.

    రిప్లయితొలగించండి
  9. పలువిధముల దారుణములు
    నలువైపుల జరుగుచున్న నాకేమనుచున్
    మెలగంగలేక నుర్విస
    కలమున్ గని కవివరుండు కలవరమందెన్!!!

    రిప్లయితొలగించండి
  10. ఇలఁబడు గ్రహశకలంబని
    పలు వార్తలు పత్రికలను ప్రకటిత మవ్వన్
    కలలో పైబడు గ్రహపు శ
    కలమున్ గని కవి వరుండు కలవర మందెన్

    రిప్లయితొలగించండి
  11. బలవంతుని యాగడముల
    వెలిబుచ్చగఁ గవితలోన వేదన జెందన్
    నిలదీయఁ జేరు జన కల
    కలమున్ గని కవివరుండు కలవర మందెన్!

    రిప్లయితొలగించండి
  12. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ప్రకటితమైనన్’ అనండి.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    తొలగెనుస్నేహము,వైరము
    చెలరేగెనహమ్ము దుష్ట దుర్మార్గుల స౦
    కుల సమరము, భీకర కల
    కలమున్ గని కవివరుండు కలవర మందెన్

    రిప్లయితొలగించండి
  14. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    2బలముగ శ్రీ కృష్ణు డులూ
    ఖలమీడ్చెను తరుల మధ్య కార్యముదీర్చన్
    ఫెళ ఫెళ మనివిరిగిన యా
    కలమున్ గని కవి వరుండు కలవర మందెన్
    3.తొలి రేయి ,మేలి మసుగున
    కలువ కనులు ముఖ కమలము కలయిక జూచెన్
    చెలిసొబగును తా నూహల
    కల-మున్ గని కవి-వరుండు కల-వరమ౦దెన్

    రిప్లయితొలగించండి
  16. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. కె .ఈశ్వరప్ప.గారిపూరణ

    విలువగు నీతులు తెలుపగ
    అలుగుచునొక స్వార్ధ పరుడు నలజడి జేయన్
    తులువల చేష్టలతో కల
    కలమున్ గని కవి వరుండు కలవర మందెన్

    రిప్లయితొలగించండి
  18. జలముల పంపకములలో
    కలహములు కలిగెనంత కలికారణమై ,
    కలి నెరుగక ఇలలో కల
    కలమున్ గని కవి వరుండు కలవర మందెన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  19. అలజడి లేని సమయమున
    కలమును బూని యొక గొప్ప కవితను వ్రాయన్
    తలవని తలపుగ నట కల
    కలమున్ గని కవివరుండు కలవరమందెన్!

    రిప్లయితొలగించండి
  20. మాస్టరు గారూ ! ధన్యవాదములు
    మీరు చూపిన సవరణతో.....


    ' అల వైకుంఠము ' పద్యము
    నిల వ్రాయగ పోతనయపు డిటునటు తలపన్
    తలపకనే హరి వ్రాసిన
    కలమున్ గని కవివరుండు కల "వర" మందెన్.

    రిప్లయితొలగించండి
  21. అల 'వైకుంఠపురి' వరకు
    కలమును సాగించి మీద,కదలక యుండన్
    తలపది,పోతన కప్పుడు,
    కలమున్ గని కవివరుండు కలవరమందెన్

    అల రామకృష్ణుడు సభను
    తెలిపిన గ్రంధము నెరుగమి ధీనిధి కవియే
    చెలగిన యాసభ లో కల
    కలమున్ గని కవివరుండు కలవరమందెన్

    కలమన లేఖిని,యోడగు,
    పలుగతి కైతల నలరగ వాడరె కలమున్
    చెలగుచు కవులే-యిట నే
    కలమున్ గని కవివరుండు కలవరమందెన్?

    అల నౌకాయానముచే
    వెలయింపగ నెంచి కవియు,పెద్దౌనోడన్
    కలయగ జూచియు,ఘనమగు
    కలమున్ గని కవివరుండు కలవరమందెన్

    కలమును గొని పద్యమలర
    వెలయింపగ నెంచి యొకడు,వేడ్కను నుండన్
    కలమే చెడగను,వ్రాయని
    కలమున్ గని కవివరుండు కలవరమందెన్

    రిప్లయితొలగించండి
  22. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. పలుగతి 'మేమే' యనుచును
    విలువగు తన పూలతోట వే తినుచుండన్
    నిలుపుము యని యరచుచు "మే
    కల, మున్" గని కవి వరుండు కలవరమందెన్.

    రిప్లయితొలగించండి
  24. తలతిరుగెడి తెలుగు చిత్ర
    ముల నుండెడి , తెలుగు జూసి , మ్రుక్కున్ మూసీ ,
    విలపించి, మూర్చవోయి , స
    కలమున్ గని , కవివరుండు కలవర మందెన్ !

    డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

    రిప్లయితొలగించండి
  25. రెండు చింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నిలుపుము + అని’ అన్నచోట సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘నిలుపు మనుచు నరచుచు’ అనండి.
    ****
    డా. పొన్నాడ కృష్ణ సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో ‘గుచిత్ర’ అని బేసిగణంగా జగణం వేశారు. ‘తల తిరుగు చలనచిత్ర|మ్ముల...’ అనండి.

    రిప్లయితొలగించండి
  26. విలువౌ సుద్దులు నుడువుచు
    కులుకుచు వ్రాసిన శతకపు కూరిమి నిడుచున్
    కలకాలపుదౌ బద్దెన
    కలమున్ గని కవివరుండు కలవర మందెన్

    రిప్లయితొలగించండి
  27. కులుకుచు గేయమ్ములనున్
    పొలతికి వ్రాయంగ సెల్లు ఫోనున నెపుడున్
    విలువది తాతది ఫౌంటెన్
    కలమున్ గని కవివరుండు కలవర మందెన్

    రిప్లయితొలగించండి