21, నవంబర్ 2014, శుక్రవారం

న్యస్తాక్షరి - 15 (కం-స-వై-రి)

అంశం- శ్రీకృష్ణస్తుతి
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా ‘కం - స - వై - రి’ ఉండాలి.
గమనిక- పద్యంలో ఎక్కడా కంసుడు, వైరి అనే పదాలను ఉపయోగించకూడదు.

27 కామెంట్‌లు:

 1. కందువై చేరితివి నీవు నందునింట
  సకల గోకుల వాసుల చంటి పాప
  వై పెరిగి గోపికలఁ గొంటె పనులతో మ
  రిమరి మురిపించినట్టి హరి నినుగొలుతు

  రిప్లయితొలగించండి
 2. కంజ దళములు బోలిన కండ్లు కలిగి
  సమర మందు నర్జు నునకు సాయ పడుచు
  వైభ వంబును సమకూర్చి విభవ మున,ము
  రిపెము లనునీయు చుండు హ రినిల గొలుతు

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ధృతరాష్ట్రుని విశ్వరూప సందర్శనము :

  01)
  ______________________________

  కంటి ముందున్న నిను జూడ - కరుణ జూపి
  సహకరించుము పరమాత్మ - సద్గుణాఢ్య
  వైర భావన దొలగించు - వాసుదేవ
  రిక్తహస్తము బూజింతు - భక్తవరద !

  యనుచు వేడిన ధృతరాష్ట్రు - నార్తిగాంచి
  దృష్టి నిచ్చెను పరమాత్మ - స్పష్టముగను !
  తృప్తినొందితి పరమేశ - తీక్ష్ణ మైన
  నీదురూపము గాంచుట - నింక వలదు
  నాదు దృష్టిని తొలగించు - నన్ను గావు
  మనిన పరమాత్మ తొలగించె - నతని చూపు !
  ______________________________

  రిప్లయితొలగించండి
 4. ధృతరాష్ట్రుని ప్రార్థన :

  02)
  ______________________________

  కంజదళనేత్ర, శ్రీకృష్ణ - కంబుపాణి
  సర్వలోకేశ, శ్రీపతి - చక్రపాణి
  వైష్ణవవినుత, విక్రమ - పద్మనాభ
  రిపుగరువహరా, శౌరి, హ- రి, సిరివరుణ

  విశ్వరూపము గాంచితి - వేదవేద్య
  నిన్ను జూచిన కన్నుల - నీచమైన
  పాడులోకము నేనింక - జూడలేను
  నాదు దృష్టిని తొలగించు - యాదవాగ్ర !
  ______________________________

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘గోపికల కొంటెపనులు’ అన్నప్పుడు అరసున్నాతో పనిలేదు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘కంజదళములఁ బోలిన కనులు గలిగి.... ము|రిపెముల నొసంగుచుండు...’ అనండి.
  ****
  వసంత కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘గరువము’ తద్భవము. దానిని తత్సమమైన ‘హర’ శబ్దంతో సమాసం చేయరాదు. ‘రిపుమదవిదారి’ అనండి.

  రిప్లయితొలగించండి
 6. శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
  =============*==============
  కంది వంశము నందున కరుణ జూపి,
  సకల కవుల కెల్లను కడు సౌఖ్య మిచ్చి,
  వైభవమ్మును గూర్చుము వనజ నాభ !
  రిపు భయమ్మును ద్రుంచు హరి నిను గొలుతు .

  రిప్లయితొలగించండి
 7. కందుల వరప్రసాద్ గారూ,
  చాలారోజుల తర్వాత మీ పద్యం చూడడం ఆనందాన్ని కలిగించింది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. కంబు పాణివి! వనమాలి ! కైటభారి!
  సచ్చిదానంద! గోపాల! శైల ధరుడ!
  వైనమికచాలు గావుమ వాసుదేవ!
  రిపుల దండించు హరి!మురరిపుని గొలుతు!!!

  రిప్లయితొలగించండి
 9. శ్రీ వరప్రసాదు గారికి నమస్తే..చాలా రోజులతర్వాత మీ పద్యం బ్లాగులో కనువిందు చేసింది..

  రిప్లయితొలగించండి
 10. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. కందమూలాదుల బ్రతుకు ఘనమునులకు
  సతత కర్మబంధములో మసలు జనులకు
  వైరభక్తికి ఋజువుగా వరలు ప్రజకు
  రిత్త కరముఁ జూపని శ్రీహరీ! ప్రణతులు.

  రిప్లయితొలగించండి
 12. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. కంజనేత్రిని పాంచాలి కాచె,నతడె
  సభను నా శిశుపాలుని చంపెనతడె
  వైభవంబందు నందుని పట్టి యతడె
  రిపుల మాయల జంపడె లేతయైన

  కంజ నేత్రుల గోపికా కాంతు డగుచు
  సవన భోక్తగు కృష్ణుండు చల్ది గుడిచె
  వైదికంబగు సూక్తాల వరలు విభుడు
  రిక్ధమిడి తా కుచేలుని లేమిబాపె

  కంజదళ నేత్రు భక్తుల కాచువాడు
  సఖుడునౌ కుచేలునికిచ్చె సంపదెలమి
  వైళమా పార్ధునికిని జేసె పరమబోధ
  రిపుల నెల్లను హతమార్చె లేతనాడె

  కంఠ విషుడగు కాళీయు కాళ్ళతొక్కె
  సదయ గిరినెత్తి గోకుల చయము గాచె
  వైభవంబున జగముల వాయి జూపె
  రిత్తయై లేత వయసున రిపుల దునిమె

  కంబుకంఠుడు నీలపు కాయుడతడు
  సవ్యసాచికి హితుడును సత్య మగడు
  వైష్ణవంబగు మాయల బాగజూపి
  రిపుల కృష్ణుండు నణచెను లేతయైన

  రిప్లయితొలగించండి
 14. కంకుభట్టును, తమ్ములన్ కాచినట్టి
  సత్రజిత్తు సూనవిభుని సన్నుతింతు
  వైనతేయ వాహను సదా భక్తి గొలుతు
  రిపుల భారము బాపగన్ లీల తోడ

  రిప్లయితొలగించండి
 15. కంకుభట్టును, తమ్ములన్ కాచినట్టి
  సత్రజిత్తు సూనవిభుని సన్నుతింతు
  వైనతేయ వాహను సదా భక్తి గొలుతు
  రిపుల భారము బాపగన్ లీల తోడ

  రిప్లయితొలగించండి
 16. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

  సాదర వచనములకు శ్రీ శైలజ గారికి ధన్యవాదములు,

  క్రొత్త పదవి, చాలా సమస్యలు పట్టి వేదించు చున్నవి.కాలేజ్ లో పిల్లలకు డిప్లమో పరీక్షలు, గత రెండు వారముల నుండి ఉదయం 8 గంటల నుండి సాయంత్రము 7 గంటల వరకు బిజీ లైఫ్. ఈ రోజు ఎటులైనా పద్యము వ్రాయ వలెనని వ్రాసితి నండి.

  శ్రీ వసంత కిషోర్ గారు మంచి పద్యములతో బ్లాగును పరులు పెట్టించు చున్నారు. వారికి మరియు అందరికి నమస్కారములతో ...
  ==============*=============
  దనముపై నాశ గల్గగ దండి గాను
  రద్దు జేసితి ముందుగా హద్దులన్ను
  హద్దు మీరిన నా పాప పద్దు జూచి
  వరము లిచ్చుడి విభుడు నా కరముగాల్చె.

  రిప్లయితొలగించండి
 17. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  నమస్కారములతో,

  శ్రీ పోచిరాజు సుబ్బారావు గారి శ్రీకృష్ణస్తుతి కొద్దిపాటి మార్పుతో ఈ విధంగా ఉంటే యతిస్థానాలలో కూడా ‘కంసవైరి’ పదాంకనం అపురూపంగా అమరుతుంది. చిత్రకవితాశ్రేణిలో వినూత్నాలంకారమవుతుంది!

  కంజదళములఁ బోలిన కండ్లు గలిగి
  సమరమందు నర్జునునకు సహకరించి
  వైభవంబును సమకూర్చి వైళముగ ము
  రిపెముల నొసంగుచుండు హరి నిలఁ గొలుతు.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 18. కంకణము గట్టి బాపెను కష్టములను
  సభన శీలము కాపాడె సమయమునకు
  వైనముల దెల్పె వనమున పాండవులకు
  రిత్త జేసెను కౌరవ రీతి ననగ
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 19. కండ చక్కెర వలెతీపి గల్గు పేరు
  సకల గోపికలును మెచ్చు చక్కదనము
  వైణవికులకాదర్శమౌ వాసుదేవ
  రిపుల నడచికావుమము శౌరి యవిరతము

  రిప్లయితొలగించండి
 20. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘భోక్త + అగు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘సవనభు క్కగు..’ అనండి.
  మూడవ పూరణలో ‘సంపద + ఎలమి’ అన్నప్పుడు సంధి లేదు. ‘సంపదలను’ అనండి.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  వరప్రసాద్ గారూ,
  మీరు ‘చేయి కాల్చుకున్న’ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధ పడుతున్నాను. భగవత్కృపతో మీ సమస్యలన్నీ తీరాలను కోరుకుంటున్నాను.
  ****
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  సుబ్బారావు గారి పద్యానికి సొబగులు కూర్చుటే కాక చిత్రకవిత్వగౌరవాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
  ****
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సభను’ అనండి..

  రిప్లయితొలగించండి
 21. చందమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. నిన్నటి నా సమస్యాపూరణం పరిశీలనకు నోచుకోలేదు.దయతో పరిశీలించ ప్రార్థన :
  ఆదాయమొసఁగు భూములు!
  రాదారులు పట్ట నటుల లావాదేవీ
  లా! దిశను రాచవీడని
  పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!
  ( తరి = మాగాణి, తరులు = మాగాణులు )
  లేక ( తరువు = పతొందర, తరులు = తొందరలు)

  నేటి న్యస్తాక్షరి:
  కంటి పాపవై యట నందు నింట పెరిగి
  సకల సద్గుణ రాశుల సాక్షివౌచు!
  వైభవములంది చెలఁగిన బాలకృష్ణ
  రక్త హస్తంబులన్ మోడ్తు ముక్తి నీవె!

  రిప్లయితొలగించండి
 23. పూజ్యులుగురుదేవులు శ౦కరయ్య గారికి వ౦దనములు

  కంచి గోపాలకృష్ణ హే గాన లోల
  సరస నుండగ రుక్మిణీ సత్య భామ
  వైనతేయు వాహనుడయి వాడల విహ
  రించ త్యాగయ్య నిన్ను కీర్తిoచె గాదె

  రిప్లయితొలగించండి
 24. కంకణము గట్టి బాపెను కష్టములను
  సభను శీలము కాపాడె సమయమునకు
  వైనముల దెల్పె వనమున పాండవులకు
  రిత్త జేసెను కౌరవ రీతి ననగ
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు21/11/14

  రిప్లయితొలగించండి
 25. న్యస్తాక్షరి పద్య టైపాటు సవరణ:
  కంటి పాపవై యట నందు నింట పెరిగి
  సకల సద్గుణ రాశుల సాక్షివౌచు!
  వైభవములంది చెలఁగిన బాలకృష్ణ
  రిక్త హస్తంబులన్ మోడ్తు ముక్తి నీవె!

  రిప్లయితొలగించండి
 26. శంకరార్యా ! ధన్యవాదములు !
  వరప్రసాద్ గారూ ! బహుకాల దర్శనం !
  బావున్నారా !

  రిప్లయితొలగించండి
 27. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి