11, నవంబర్ 2014, మంగళవారం

దత్తపది - 53 (శవము-పాడె-కాడు-చితి)

కవిమిత్రులారా!
శవము - పాడె - కాడు - చితి
పైపదాలను ఉపయోగిస్తూ జన్మదినోత్సవాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

42 కామెంట్‌లు:

  1. శైశవములోనికి మరల చనిన రీతి
    పాడె బంధుగణంబులు పాటవోలె
    చంటి తనమని చెలికాడు చతురులాడె
    చూచితిని పుట్టిన దినము సొగసులలర!!

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యా !
    గజకర్ణుడంటే వినాయకుడనుకోవచ్చా ?
    ఆంధ్రభారతి-నిఘంటువులో కానరాలేదు !

    రిప్లయితొలగించండి
  3. శైశ వమున న గాంచితి శివుని గుడిని
    నాదు చెలికాడు గొంపోవ నాదు జన్మ
    దినము రోజున నంతలోన దెలివి తప్పి
    క్రింద బడగ, గా పా డె నన్మందు లిచ్చి

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఒక వృద్ధుని ఎదురు చూపు :

    01)
    ___________________________

    శైశవమున జన్మదినపు - సంతసమున
    పాడె ప్రియమైన చెలికాడు - పాట లెన్నొ !
    చితికి పోయెను వయసంత - బ్రతుకు మిగిలె
    నెపుడు తెలవారనున్నదొ - యేమొ గాని ?
    ___________________________
    వృద్ధుఁడు = ఎనుబడియేండ్లకు పైఁబడిన ముసలివాఁడు;

    రిప్లయితొలగించండి
  5. వివిధ వంటకములతో - మంత్రిగారి - జన్మదిన వేడుక (స్వార్థంలో) :
    (Menu:-మట్టన్ బిర్యాని-చికెన్ 65-పీకాక్ ప్రై-రేబిట్ కట్లెట్ )

    02)
    ___________________________

    కోడి శవముల వండగ - కూర కొఱకు
    పాడె గట్టిన మేకల - వంటకముల
    కాడు జేరగ వేపిన - కాంత పక్షి
    చితిని బెట్టగ కుందేలు - చిరుతలకును
    స్వాదు భరితముగా సాగె - జన్మదినము
    మంత్రిగారిది, జన్మలో - మరువ లేము !
    ___________________________
    మేకల వంటకము = మట్టన్ బిర్యాని
    కాడు = శ్మశానము

    రిప్లయితొలగించండి
  6. వసంత కిశోర్ గారూ,
    వినాయక ప్రార్ధన:
    సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక:
    లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:
    ధూమకేతు ర్గణాధ్యక్ష:, ఫాలచంద్రో గజానన:
    వక్రతుండ శ్శూర్పకర్ణో హేరమ్బ: స్కన్దపూరజ:
    షోడశైతాని నామాని య: పఠే చ్చ్రుణుయా దపి,
    విద్యారమ్బే విహహే చ ప్రవేశే నిర్గమే తథా,
    సజ్గ్రామే సర కార్యేషు విఘ్నస్తస్య నజాయతే.
    అభీప్సితార్ధసిద్ధ్యర్ధం పూజితో యస్సురైరపి,
    సర్వవిఘ్నచ్చిదే తస్మై గణాధిపతయే నమ: !!

    రిప్లయితొలగించండి
  7. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో యతి తప్పింది. ‘శర్వు గుడిని’ అంటే సరి!
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. సంత సించితి చిననాడు చింత లేక
    పాట పాడెను మిత్రులు బంధు జనము
    కేకు తినిపించి చెలికాడు గేలి జేసి
    జన్మదినమన్న ప్రీతగు శైశవమున!!

    రిప్లయితొలగించండి
  9. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ప్రీతి + అగు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘ప్రీతియె’ అనండి.

    రిప్లయితొలగించండి
  10. శైశవమున లేను యే ఉపవాసము !
    లేశమయిన నాకు లేదు భక్తి !
    మోస కాడు కూడ మ్రొక్క కాపాడెనా ?
    లేచితిట్ట బోకు లేదు ఋజువు !

    డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

    రిప్లయితొలగించండి
  11. డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో యతి తప్పింది. అంతే కాదు.. ‘లేను + ఏ’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. మొదటి పాదాన్ని సవరించండి.

    రిప్లయితొలగించండి
  12. జన్మ దినమును చెలికాడు జరిపె,యట్ట
    హాసమేచూచి తిని మది హాయి గాను
    ఆశవము నామె పాడెను ఆద మరచి
    మెచ్చిరికరతాళమ్ములే మిన్ను కెగర
    (ఆశవము : వాడి )

    రిప్లయితొలగించండి
  13. మల్లెలవారి పూరణలు
    1.హరియె కాపాడె గాదె తా హరువు నింత
    దనుక కేశవముఖ్యుని తానుపూజ
    నెలమి నంది౦చితిని గాచె నేమిలేక
    లచ్చి చెలికాడు కావగా రమ్యముగను
    2.కా౦చితి జన్మమౌ దినము కాలము నందున నొక్క యేడుతా
    న౦చిత రీతి పాడెలను నావిధి నెక్కెను పాపరాశియై
    కా౦చుగ రాదు జన్మవెనుకాడుట పాపపు యోచనంబులన్ మించిన పుణ్యకేశవము మేలగు వానిని పూజచేయుటన్

    రిప్లయితొలగించండి
  14. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    శైశవన౦దు పంచితి చాకి లేటు
    పాట పాడెనా చెలి కాడు పరవశించి
    యనుచు పూరించ ననుకొని యపశకున వ
    చనము నెటులు౦చ వలెనని జ౦కుచు౦టి

    రిప్లయితొలగించండి
  15. శైశవము వీడడంచును
    పాశమె యా తల్లి నోట పాడెను పాటై!
    యాశయ మెంచితి వేని మ
    హాశయు డౌచు వెనుకాడు యదురుండదనెన్!

    రిప్లయితొలగించండి
  16. చిన్న నాటి నేస్తములంత చేరి రచట
    ముఖ్య చెలికాడు వచ్చితా మురిసి పాడె
    నాడె, కాంచితి నానంద మాత్మ లోన
    శైశవము గుర్తు కున్ దెచ్చె జన్మ దినము

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులు గురుదేవులుశంకరయ్య గారికి వందనములు కాంచితి నేడు జన్మదిన కానుకగా చెలికాడు నాడు నా
    కంచిత ప్రీతి "శైశవము"కైతనుకమ్మగ పాడె నింక రా
    వ౦చును యీక్షణమ్ములిక నాస్మృతి మాత్రమె గుండెలోపలన్
    మించుగనుండి పోవుననిమృత్యువు తా కబళి౦చు దాకనున్

    రిప్లయితొలగించండి
  18. గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

    శైశవమునందు నొకసారి జన్మదినము
    జరుపు కొనుచుండ చెలికాడు సంబరముగ
    పాట పాడెను మధురంగ పరితమోలె
    సంత సించితి మనము నా సంజ వేళ.

    రిప్లయితొలగించండి
  19. మల్లెలవారి మరియొక పూరణ
    స్వచ్ఛ శవమున దేహంబు స్వచ్చ మగును
    ఇచ్చ దలచితి దైవంబు స్వచ్ఛ మతికి
    యుచ్చ మవ్వంగ కాపాడెనుత్తముండు
    జన్మదినమున చెలికాడు సర్వ మతడె

    రిప్లయితొలగించండి
  20. కె ఈశ్వరప్ప గారి పూరణలు
    1.శైశవమునందు జరిపెడి శైలి గాక
    నెంచి తినగలుగు వంటలు పంచు నామె
    జన్మదినమందు చెలికాడు జనులు మెచ్చ
    దయను కాపాడె శత్రువు దరికి జేర
    2.పుట్టిన రోజు శైశవము పూర్తిగ నింపిరి సంబరాలతో
    పట్టుగ పట్టువస్త్రములు పండుగ సందడి కాడు గాకనే
    చుట్టము లందు కొందరట జూచియు పాడెడి పాట నింపులో
    బట్టలుకొన్ని పంచి తిరుపమ్మున జన్మ దినమ్ము జేసిరే

    రిప్లయితొలగించండి
  21. పాడె నా చెలికాడు సంతోషమలర
    ఆలకించితి నా పాట, నాత్మలోన
    శైశవము గుర్తుదెచ్చె నీ జన్మ దినము
    ధన్యమాయె బాల్యసఖుని దర్శనమున

    రిప్లయితొలగించండి
  22. కేశవ! ముదమారగ వింటి ,కృష్ణగీతి
    పాడె నీదు మిత్రగణము నేడె చెలిమి
    కాడు పుట్టిన నాడంచు, కనుల నిండఁ
    గాంచితిని వేడుకలనెల్ల, కలిగె తృప్తి.

    రిప్లయితొలగించండి
  23. పాడె నా చెలి కాడు సంబరముతోడ
    నా లకించితి నా పాట, నాత్మలోన
    శైశవము గుర్తుదె చ్చెనీ జన్మ దినము
    ధన్యమాయె బాల్యసఖుని దర్శనమున

    రిప్లయితొలగించండి
  24. కవిమిత్రులందఱకు నమస్కారములు!

    కేశవ మురజి న్మాధవ కృష్ణ చక్రి
    యనుచు హరిభక్తి జలధిలో మునిఁగి పాడె
    నాదు చెలికాఁడు జన్మదినమ్మునాఁడు
    మురిసి హరిఁజూచి తిరునామమును ధరించి!

    రిప్లయితొలగించండి
  25. పాడె చెలికాడు దన శైశవ సఖి జన్మ
    దినము రోజున నచ్చటి దివ్వెనార్ప
    సంచితిగ దెచ్చి కానుక లుంచి చేత
    బంధు మిత్రులు వెళ్ళిరి వరుసగాను!

    రిప్లయితొలగించండి
  26. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పాడెను + ఆదమరచి’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘పాడిన దాదమరచి’ అనండి.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చిన్ననాటి మిత్రుల గుంపు... పాడె’ అంటే లక్ష్మీదేవి గారి అభ్యంతరం తొలగిపోతుంది.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మధురంగ పరితమోలె’ అన్నదానిని ‘మధురమౌ స్వరముతోడ’ అనండి.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ (సవరించిన) పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘శవము’ను మార్చరాదు.

    రిప్లయితొలగించండి
  27. సవరణతో...

    పాడె శైశవమున చెలికాడు జన్మ
    దినము రోజున చెలికత్తె దీపమార్ప
    సంచితిగ దెచ్చి కానుక లుంచి చేత
    బంధుమిత్రులు వెళ్ళిరి వరుసగాను!

    రిప్లయితొలగించండి
  28. నా ద్వితీయ పూరణము:

    కేశవ! ముకుంద! మధురిపు! శ్రీశ! చక్రి!
    నన్నుఁ గాపాడెదవటంచు సన్నుతింతు!
    కరుణ తొలుకాడునటుల నన్ గాంచ, విమల
    మతిని జన్మదినమున నెంచితిర నిన్ను!!

    రిప్లయితొలగించండి
  29. త్రుంచితి కోసిన కేకును
    పంచితి కేశవ మురారి మరి పదుగురికిన్
    దంచుచును పాడెనందరు
    మంచిగ చెలికాడు జెప్ప మరిమరి విష్షెస్.

    రిప్లయితొలగించండి
  30. కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారూ,

    మీ పూరణము బాగున్నది. అభినందనలు. కాని...శవము, కాడు...శబ్దములను మార్చితిరి. నియమభంగము కారాదు కదా!

    అటులనే ద్వితీయపాదమున "బంధుమిత్రులు"...బహువచనము. వారికి వాడిన క్రియాపదము "పాడెను" ఏకవచనమున నున్నది. "పాడిరి"యన్నచో నియమ భంగము కాఁగలదు. కావునఁ దగురీతిని సవరింపఁగలరు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  31. మిత్రులు గోలి హనుమచ్ఛాస్త్రిగారూ,

    మీ పూరణము బాగున్నది. అభినందనలు.

    మూఁడవ పాదమున...పాడెను+అందరు...అనుచోట...
    పాడెను...ఏకవచనము
    అందరు...బహువచనము.

    పాడిరి...అన్నచో నియమభంగము కాఁగలదు. కాన, తగువిధమున సవరింపఁగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  32. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. ముఖ్య స్నేహితు డొక్కడే ఆడి పాడాడు అని నాభావం. మిగిలిన స్నేహితులందరు శ్రోతలే.

    "ముఖ్య చెలికాడు వచ్చితా మురిసి పాడె/
    నాడె"

    రిప్లయితొలగించండి
  33. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘బంధుబృంద మదె పాడెను...’ అనండి.
    ****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పాడె బృందము’ అనండి.
    ****
    గుండు మధుసూదన్ గారూ,
    సూర్యనారాయణ గారి పూరణలో ‘శవము, కాడు’ శబ్దాలు సంధిగతమై మార్పు చెందినవి. అది దత్తపదిలో దోషం కాదని నా అభిప్రాయం. గతంలో ఒక అవధానంలో ‘పల్లవము, పలాశము, పలాలము, పల్వలము పదాలను భారతార్థంలో ప్రయోగించమన్నప్పుడు అవధాని పూరణ చూడండి...
    అల్ల ‘పలాల’భాగులయి యాదట ‘పల్వల’నీరపాయులై
    మెల్లఁ ‘బలాశ’వాటికల మేసి లసత్తృణ‘పల్లవంబు’లం...
    దత్తపదాల్లో ఇచ్చిన ముప్రత్యయం ఎక్కడా వాడబడలేదు.
    అలాగే ఆది, సోమ, మంగళ, బుధ దత్తపదాలనిచ్చినప్పుడు ‘బుధాళి’ అని పూరించారు.

    రిప్లయితొలగించండి
  34. గురువర్యులు గుండు మధుసూదన్ గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  35. అన్నపరెడ్డి వారూ,
    నిజమే! నేను గమనించలేదు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  36. మాష్టారు! సవరణకు ధన్యవాదములు. సవరించిన పద్యము
    చక్కని విందుతో జరిపె శైశవ మందున తల్లిదండ్రులా
    ప్రక్కన బంధుబృందమదె పాడెను తీయగ "హ్యాపి బర్తుడే"
    గ్రక్కున గుర్తు వచ్చె చెలికాడిపు డీదినమందు కేకుతో
    నిక్కడ జేయ జన్మదినమెంచితి రెంటిని సంతసంబుతో

    రిప్లయితొలగించండి
  37. చంద్ర మౌళి సూర్యనారాయణ గారు - మీ పద్యములో తేడా ఉందని పెద్దలు చెప్పినా దానిని పోష్టు నుండి తీసివేయవద్దు.అది యితరులకు మార్గదర్శకంగా ఉంటుంది. కొన్ని పర్యాయాలు అది దోషం కాదని తేల వచ్చు. మీ రుమార్చిన పద్యమును మళ్ళీ పెట్టండి.
    గరిక పాటి గారు పూరించిన దత్తపదులలొ
    ఆల్ - అనే దానికి ఆలిం అని
    ఫలము అనే దానికి - సత్ఫల మోహ అని
    పాటి - పాటీ రంబు అని
    దుగ్ధ- దుగ్ధాంబోది అని
    శృంగము - శృంగమె యాడి పాడినది
    మైసూరు - వ్యగ్రమ్మై సూర కిరణ అని

    ప్రయోగించారు.

    రిప్లయితొలగించండి
  38. A.Satyanarayana Reddy గారూ మీ సలహాను శిరసావహించెదను. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  39. మధుసూదన్ గారూ ధన్యవాదములు.
    మాస్టరు గారూ ! చక్కని సవరణ చూపారు..ధన్యవాదములు..
    రెండవపాదం లోని యతి దోషాన్ని కూడా సవరిస్తూ....

    త్రుంచితి కోసిన కేకును
    పంచితి కేశవ మురారి ప్రణతాదులకున్
    దంచుచును పాడె బృందము
    మంచిగ చెలికాడు జెప్ప మరిమరి విష్షెస్.

    రిప్లయితొలగించండి
  40. గురువు గారికి ధన్యవాదములు,మీరు సూచించిన ప్రకారం సవరణతో....

    శైశవము నందు నొకసారి జన్మదినము
    జరుపు కొనుచుండ చెలికాడు సంబరముగ
    పాట పాడెను మధురమౌ స్వరముతోడ
    సంత సించితి మనమునా సంజ వేళ.

    రిప్లయితొలగించండి