10, మార్చి 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1618 (అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్.

24 కామెంట్‌లు:

  1. చంద్రబాబు స్వగతం:-
    రయమున కేంద్రమిచ్చుమన రాష్ట్రమునాదుకొనంగరూకలే
    భయమునులేకనేను పరిపాలనచేయతలంచ కేంద్రమే
    దయయును చూపలేదుకద దక్కనులేదిసుమంతకూడ నే
    నయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  2. చం.రయమునపోయిమాయలమరాఠులుయత్నములెన్నిచేసినన్
    దయగలవారలెవ్వరుయదార్ధ మిదంచురవంతసాయమే
    దియును సమృద్ధిచేయరుయిదేమివిచిత్రవిరోధమోగదా!
    అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్.

    రిప్లయితొలగించండి
  3. వయినము తేలి పోవగను పార్ధుడు బల్కెను యాద వాంగనల్
    రయమున గోప కాంతలను రాణులు నందరు సౌఖ్య ముందగన్
    అయినను పోయి రావలెను హస్తినకున్ నిధులివ్వ గోరుచున్
    పయనము జేయ గోరుచును ప్రాపున దెల్పెను దారుకా యటన్

    రిప్లయితొలగించండి

  4. " చంద్ర బాబు " స్వగతం....
    భయమది పీకుచుండె మరి బాధ్యత లెట్టుల పూర్తి జేయుచున్
    రయమున సింగపూరు వలె రాజ్యపు కేంద్రము కట్టగావలెన్
    స్వయముగ రంగమందు దిగి సాగిల మోదికి మోదమందునా
    అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్.

    రిప్లయితొలగించండి
  5. నయమున జెప్పి చూచెదను, నమ్మిన మంత్రులకెల్ల మీరు మా
    పయి దయయుంచి మాకిడిన వాక్కును దప్పకు డంచు లేనిచో
    వియమములెన్నియో కలుగు, పిమ్మట నొక్కడినే స్వయమ్ముగా
    నయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  6. రయముగ దీర్చి దిద్దవలె రాష్ట్రము నంతయు నూత్న శోభతో
    నయముగ జేసి జూపెదను నల్గురు మెచ్చెడు సైరిభమ్ముగన్
    భయమును వీడి బీరముగ భావికి వేయగ బాటలిప్పు డే
    మయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వ గోరుచున్

    రిప్లయితొలగించండి
  7. నియమనిబంధనమ్ములను నీతిని వీడి ప్రలోభపెట్టినే
    జయమును పొందినాడను, వశంబగునాప్రజకోర్కెతీర్చగన్
    భయమగుచుండె సొమ్ములను పట్టెడుమార్గము కానకుంటి నే
    నయినను పోయిరావలెను హస్తినకున్ నిధులివ్వ గోరుచున్

    రిప్లయితొలగించండి
  8. స్వయముగ 'మోడి'గారు తను సాయముఁ జేయగ గద్దెనెక్కినన్,
    రయమున ముఖ్యమంత్రి పలు రాష్ట్ర యమాత్యులు విన్నవించినన్
    బ్రియమును గూర్చరారె? తిరు వేంకటనాథ! ప్రమోదమంద మీ
    రయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్!

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    పద్యం సలక్షణంగా ఉంది. కాని భావాన్వయం లోపించినట్లున్నది.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రాష్ట్ర+అమాత్యులు’ అన్నప్పుడు సవర్ణదీర్థసంధి, యడాగమం రాదు. అక్కడ ‘...ముఖ్యమంత్రి తన రాష్ట్రపు మంత్రులు...’ అందామా?

    రిప్లయితొలగించండి
  10. క్షయమగుచుండె నా బలము! కర్మము! వేరొక దిక్కు లేదుగా!
    "జయమగుగాక మోదికిని! జైట్లికి! నిర్మల! రాజనాధ! వెం-
    కయకు! సురేషు ముఖ్యులకు! కాంచరె నన్నని" నేను, భట్టురా-
    జయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారికి నమస్సులు. రెండవ పాదంలో ఏదోలోపం కనబడుతుంది. అందుకని యిలామార్చాను.
    జయమును పొందితిన్ ప్రజల జీవన బాధలఁదీర్చ సాధ్యమే?

    రిప్లయితొలగించండి
  12. గురువులకు ధన్య వాదములు
    యాదవులు అందరు మరణించాక బాలురను వృద్ధులను అందరినీ తీసుకుని హస్తినకు వెడితే అక్కడ అందరు సుఖంగా ఉంటారుకదా అందుకని రధములు ,పల్లకీలు సిద్ధము చేయమని దారకునితో అన్నమాటలు వివరంగా వ్రాయలేక పోయాను అంతే సెలవు

    రిప్లయితొలగించండి
  13. పయనపుముఖ్యమంత్రితన-ప్రాభవమొప్పెడికార్యసాధనా
    మయమునుగూర్పనెంచుటకు-మాదరిరొక్కముతక్కువాయెమా
    నియమములన్నినిందలుగనిల్చునుగాన?ప్రధానమంత్రికై
    అయిననుపోయిరావలెనుహస్తినకున్నిధులివ్వగోరుచున్

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులుకందిశంకరయ్యగారికివందనాలతో
    -----------
    తిమ్మరుసువంటిపెద్దన
    తిమ్మాజీరావుగారి-తెలుగునరచనల్
    కొమ్మనకుసుమ-సుగందపు
    సొమ్ముగమనకొసగినట్లుసూచనలున్నా
    ఆరోగ్యముతగ్గుటచే
    దారావాహికగవచ్చుతరుగనివరమై
    కోరినసమస్య?పూరణ
    తీరికగాచేయలేడు-తెలిసినదిదియే

    రిప్లయితొలగించండి
  15. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
    స్వయముగ 'మోడి'గారు తను సాయముఁ జేయగ గద్దెనెక్కినన్,
    రయమున ముఖ్యమంత్రియును రాష్ట్రపు మంత్రులు విన్నవించినన్
    బ్రియమును గూర్చరారె? తిరు వేంకటనాథ! ప్రమోదమంద మీ
    రయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్!

    రిప్లయితొలగించండి
  16. అయినవి సంధి మాటలవి యంతకు ముందునె,యాంధ్ర రాష్ట్రమున్
    రయమున వృద్ధి చేయుటకు,-రాగను గద్దెకు కేంద్రమిప్పుడున్
    నయమును దప్ప,మిత్రులగు నాయకులందురు రాష్ట్రమందునన్
    "నయినను పోయిరావలెను హస్తినకున్,నిధులివ్వగోరుచున్"

    భయమయె నేడు కేంద్రమది బాగుగ మాటను దప్పియుండగా
    ప్రియమగు మాటలే పలికి,పేలవమయ్యెడి చేత చేయరే!
    రయముగ రాజధానికటు,రాజిత పోలవరంబను మాటలే
    దయినను,పోయి రావలయు హస్తినకున్ నిధులివ్వగోరుచున్

    రిప్లయితొలగించండి
  17. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి వారూ,
    మీరు సవరించిన పాదంలో యతి తప్పింది. ‘జయమును పొందితిన్ ప్రజల సర్వసమస్యల దీర్చ సాధ్యమే’ అందామా?
    *****
    అక్కయ్యా,
    మీ భావం అవగతమయింది. కానీ అన్వయలోపం ఉంది.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కెంబాయి వారి ఆరోగ్యం త్వరగా బాగుబడాలని, పూర్వంలా మళ్ళీ పూరణలతో బ్లాగును అలంకరించాని ఆశిస్తున్నాను.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. పయనము జేసె నాంధ్రుల నవాబు విలంబము వీడి ఢిల్లికిన్
    నయమున కేంద్ర మంత్రు లకు నచ్చి న రీతి వచింప జూడగన్
    జయమగు చంద్రబాబునకు, సన్నుతి తోడ నుసిద్ధి సాధ్యమే
    అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  19. భయపడ! రాజధానికగు పైకము నిమ్మని కేంద్రమంత్రులన్
    పయనము జేసి వేడెదను పల్మరు నూతన రాష్ట్ర వృద్ధికై
    నయమున నచ్చజెప్పుచును నినాదము జేయుచు నేను నెన్ని మా
    ర్లయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్!

    రిప్లయితొలగించండి
  20. పి.యస్.ఆర్. మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘నచ్చజెప్పుచు నినాదము...’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  21. అటులనే గురువు గారూ! సవరణకు ధన్యవాదములు!

    రిప్లయితొలగించండి
  22. భయపడ! రాజధానికగు పైకము నిమ్మని కేంద్రమంత్రులన్
    పయనము జేసి వేడెదను పల్మరు నూతన రాష్ట్ర వృద్ధికై
    నయమున నచ్చజెప్పుచు నినాదము జేయుచు నేను నెన్ని మా
    ర్లయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్!

    రిప్లయితొలగించండి
  23. సయిచితి నాలుగేండ్లుగ నిశాచర పాలన కేంద్రరాట్టుదౌ
    భయమును వీడి త్రుంచితిని భాజప త్రాడులు ఛిన్నభిన్నమౌ
    పయనము వ్యర్థమౌనని కపాలపు వ్రాత పఠించ స్పష్టమే!
    అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  24. భయమును వీడి పోరగను భండన మందున మోడితోడనున్
    దయయది లేకయే ప్రజలు తన్నగ వీపున వోటులీయకే
    జయమును పొంద జాలకయె జాస్తిగ రాహులు కుందుచుండెనే!
    అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్

    రిప్లయితొలగించండి