8, జూన్ 2014, ఆదివారం

సమస్యా పూరణం - 1438 (పులు లావులు గూడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్.
(వావిళ్ళ వారి ‘తెలుగు సమస్యలు’ గ్రంథం నుండి)

32 కామెంట్‌లు:

  1. అలనాటి మునుల తపసుకు
    పులులావులు గూడి యొక్క పొలమున మెలగెన్
    కలనైనను కలత పడక
    తులలేని మిత్ర తతిని తూగుచు నిలలో

    రిప్లయితొలగించండి
  2. వెలసిన ముని యాశ్రమమున
    పలు రకముల వన్య ప్రాణి, పశు, పక్షి సహా
    విలసిత ప్రేమాన్వితమున
    పులులావులు గూడి యొక్క పొలమున మెలగెన్

    రిప్లయితొలగించండి
  3. అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘తపసుకు’ అనడం దోషమే. ‘అలనాటి మునుల సంగతి’ అనండి. (సంగతి = సాంగత్యము)
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. పలువిధములైన వనములు
    సెలయేఱుల సవ్వడులును, చెన్నగు ప్రకృతిన్
    కలిగిన మున్యాశ్రమముల
    పులులావులు గూడి యొక్క పొలమున మెలగెన్

    రిప్లయితొలగించండి
  5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారి పూరణ....

    చిలికించు చిత్రకారుని
    విలువగు కుంచెలవి జేయు విన్యాసమునన్
    ఒలికించు జీవకళగన
    పులు లావులుగూడి యొక్క పొలమునమేసెన్

    రిప్లయితొలగించండి
  7. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది, బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. తొలి నాళ్ళను ముని వాకిట
    పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్.
    కలలోనైనను దలచని
    పులు లావుల పొంత మిపుడు పురహరు వశమే?

    రిప్లయితొలగించండి
  9. మల్లెల వారి పూరణ
    చెలగును సింహముపై,నుమ
    కులుకును నెద్దెక్కి శివుడు కొడుకులకగుగా
    నెలుకయు, కేకియు,నటులన్
    పులులావులు గూడియొక్క పొలమున మెలగెన్

    రిప్లయితొలగించండి
  10. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చక్కని భావంతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. అలకణ్వాశ్రమమందున
    కలసి మెలసి జీవనమును గడుపు సకల జీ
    వులగనె దుష్యంతుండట
    పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్

    రిప్లయితొలగించండి
  12. అల కణ్వుని యాశ్రమమున
    పులులావులు గూడి యొక్క పొలమున మెలగె
    న్నెలుకలు బిల్లులు గూడను
    గలగాదిది పచ్చి నిజము కాంతా !వినుమీ

    రిప్లయితొలగించండి
  13. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. మాస్టారూ! సుబ్బారావు గారి పూరణలో 'న్నె' ద్విరుక్తం రావచ్చునా ? నా అజ్ఞానానికి క్షమించి సందేహం తీర్చగలరు

    రిప్లయితొలగించండి
  15. పొలముగ మార్చుటకై జం
    గలమును మట్టముగ జేసె కర్షకు డొకడున్
    తలమని మరియును పొలమని
    పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్!

    రిప్లయితొలగించండి
  16. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    పాదాంతంలో ద్రుతం ఉండి, తర్వాతి పాదం అచ్చుతో మొదలైనప్పుడు ఆ ద్రుతం అచ్చుతో కలిసి ద్విత్వంగా మారడం కొందరు ప్రాచీన కవుల ప్రయోగాలలో కనిపిస్తుంది. ఇవి పోతన కవిత్వంలో ఎక్కువ. పద్యం మధ్య అచ్చు రావడం మన సంప్రదాయం కాదు కదా... వృద్ధాశ్రమానికి వస్తూ నా పుస్తకాలను తెచ్చుకోలేదు. అవి వెంట ఉంటే మీకు వ్యాకర్త లేమన్నారో ఉదాహరణలతో వివరించేవాణ్ణి.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది.
    ‘జంగలము’ పదప్రయోగం గురించి సందేహం వచ్చి ఆంధ్రభారతిలో చూసి మీ ప్రయోగం సరియైనదే అని నిర్ధారించుకున్నాను.

    రిప్లయితొలగించండి
  17. కులమదియొక్కటె దైత్య సు
    రులకుం కశ్యపుడె తండ్రి లోపము గుణమే
    కలహమె మానస వీధిన్
    పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్!

    రిప్లయితొలగించండి
  18. మల్లెల వారివే మరి రెండు

    గెలిచిన వారలు పులులుగ,
    పొలుపుగ గోవులవలెనయి పోడిమి సభలో
    గెలుపది తప్పిన పార్టీల్,
    పులులావులు గూడి యొక్క పొలమున మెలిగెన్

    సలలితమగు మునిసీమల
    నల వైరము లేక జంతు లలరుచు నొకటై
    చెలగెడు తపస్సు మహిమను
    పులులావులు గూడి యొక్క పొలమును మెలగెన్

    రిప్లయితొలగించండి
  19. యం. ఆర్. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. కలసి జనిరి సురలసురులు
    చిలుకగ సుధ గోరి తాము క్షీరార్ణవమున్
    తలపుల నించక వైరము
    పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్

    రిప్లయితొలగించండి
  21. నాగరాజు రవీందర్ గారూ,
    బలుపు, లావుల మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. నాగరాజు రవీందర్ గారి రెండవ పూరణ అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  23. తెలవారలు గొల్లలుగా
    పలురీతుల పిండినారు భారత గోవు
    న్నలనాడు, మేక రకపు
    పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్

    రిప్లయితొలగించండి
  24. ఈ మధ్య మిస్సన్న గారూ శుద్ధ శాకాహారి పూరణలే చేయుచున్నారు. కొంత రాజకీయం తీసుకొచ్చే ప్రయత్నంలో,
    అల మోడీ రాజయ్యెన్
    కల దీరగ చంద్రబాబు గద్దెయు నెక్కెన్
    ఫలితము చూచెద మెటులీ
    పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్?
    (ఇద్దరూ మేసేవాళ్ళే, ఒకరు గడ్డిని, ఇంకొ
    కరు ఆ మేసే ఆవునే మేయగల పులి!)

    రిప్లయితొలగించండి
  25. నాగరాజు రవీందర్ గారూ,
    మీ మూడవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘మేక రకపుం/ బులు లావులు..’ అందామా?
    *
    చంద్రశేఖర్ గారూ,
    బహుకాల దర్శనం.
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. గురువు గారికి ధన్యవాదాలు. పద్యాన్ని మరోలా సవరించాను దయతో పరిశీలించ ప్రార్థన

    తెలవారలు గొల్లలుగా
    పలురీతుల పిండినారు భారత గోవు
    న్నలనాడు, మేక వన్నెల
    పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్

    రిప్లయితొలగించండి
  27. చిలుకలు కిలకిల మనగా
    తొలకరి నేలను తడపగ తుమ్మెద పాడన్
    సెలయేరు తిరుగ పలు వం
    పులు,లావులు గూడి యొక్క పొలమును దున్నెన్ !!!

    రిప్లయితొలగించండి
  28. సహదేవుడు గారూ,
    మీ సవరణ బాగుంది.
    *
    మంద పీతాంబర్ గారూ,
    వంపులు, లావులతో మంచి ప్రయత్నమే చేశారు. కాని ‘పొలమున మెలఁగెన్’ అన్న సమస్యను ‘పొలమును దున్నెన్’ అని మార్చారు.

    రిప్లయితొలగించండి
  29. గురువుగారన్నట్లు చంద్రశేఖరులది బహుకాల దర్శనం. వారి పూరణ కమనీయం.

    రిప్లయితొలగించండి
  30. కలవుగ చదరంగములో
    చలించు తురగము గజమును సచివుడు రథమున్
    బలహీనుడు దాసుడిటులె
    పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్!

    రిప్లయితొలగించండి
  31. Huzurnagar Elections:

    బలుపౌ తెరాస నందున
    నలవోకగ కమ్యునిస్ట్లు హాయిగ జేరన్
    తలచితిగా నేనిట్టుల:
    పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్

    రిప్లయితొలగించండి