శ్రీరామ మానస పూజ
(సంక్షిప్త రామాయణ పారాయణమునకు అనుకూలము)
రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
శ్రీరామ! జయరామ! సీతా హృదారామ!
వారిధర శ్యామ! భవ విరామ!
కళ్యాణ గుణధామ! క్ష్మాజనస్తుత నామ!
క్షత్రియకుల సోమ! సమర భీమ!
అఖిలాండకోటి బ్రహ్మాండాధినాయకా!
బృందారకస్తుత్య విమల చరిత!
దుష్ట సంహారకా! శిష్ట సంరక్షకా!
ధర్మ సంస్థాపకా! ధర్మరూప!
అంతరంగ నివాస! వేదాంతవేద్య!
ఆది మధ్యాంత రహిత! దేవాదిదేవ!
సచ్చిదానంద మూర్తివి స్వామి! ధరణి
నరశరీరము దాల్చిన పరమపురుష!
ఆశ్రిత పోషక! ఆపదుద్ధారక!
భక్తజనానీక పారిజాత!
పూజింతు నిను మనః పుండరీక నివాసు
మానస పూజా విధాన మలర
బ్రహ్మాది దేవతల్ ప్రార్థింపగా భువి
నవతరించిన యట్టి యమర వినుత!
పరమాత్మ వీవంచు పరమ పూరుష! రామ!
ధ్యానింతు నీదు తత్త్వ ప్రశస్తి
కమలాప్త వంశాన కౌసల్య గర్భాన
దశరథ రాజ నందనుడ వగుచు
యజ్ఞఫలమ్ముగా నవతరించిన రామ!
ఆవాహనమ్మిదే ఆదిదేవ!
తాటకన్ బరిమార్చి తపసి యజ్ఞముగాచి
విజయహాసమ్ముతో వెలుగు చున్న
బహు పరాక్రమశాలి! పరమ పావనశీలి!
రత్నాసనమ్మిదే రామచంద్ర!
పాదరజమ్ముచే పాపమ్ములన్ బాపి
సాధ్వి అహల్య పూజలనుబొంది
తనరారుచుండిన ఘన యశోధన! రామ!
పాద్య జలమ్మిదే పద్మ నయన!
జనక మహీశు పూజలనంది యటనున్న
హరు చాపమును ద్రుంచి యవనిసుతను
హర్షమ్ముతో బెండ్లియాడిన శ్రీరామ!
అర్ఘ్యమియ్యదె సజలాబ్ద వర్ణ!
భార్గవరాముని భ్రమలను బోగొట్టి
వానిచేత నుతింప బడిన రామ!
వినయాద్యలంకార! వీర్య శౌర్య ధనాఢ్య!
ఆచమనీయ మియ్యదె మహీశ!
పినతల్లి కోర్కెపై పితృ నాజ్ఞనున్ గొని
కాంతతో ననుజుతో గహనములకు
జనినట్టి దుష్ట శిక్షక! సాధురక్షక!
స్నానమ్ము నీకిదే జ్ఞాన తేజ!
భక్తాగ్రగణ్యుండు భరతుండు రాజ్యంబు
పాలింపుమని సేయ ప్రార్థనమ్ము
వలదంచు వానికి పాదుక లిడినట్టి
ధర్మాత్మ! కొనుము
వస్త్రమ్ము లివియె!
దనుజుల గూల్చుచు మునుల రక్షించుచు
నభయ మొసంగుచు నడవులందె
వారలకండవై వాసమొనర్చిన
రామ! యీ
యజ్ఞసూత్రమును గొనుము
కామాతురాసుర కాంతను శిక్షించి
ఖరదూషణాది రాక్షసుల గూల్చి
బల పరాక్రమముల భాసిల్లు శ్రీరామ
ఆభరణములివే అభయ వరద!
మాయా మృగాకారు మారీచునిన్ గూల్చి
ఆశ్రమంబున సీత నరయలేక
అపహరింపబడిన దనుచు శోకించిన
స్వామి! గై
కొనుమయ్య చందనమ్ము
రామపత్నిని వేగ రథముపై గొనిపోవు
రాక్షసు నెదిరించి పక్షిరాజు
పడియుండ విలపించి వాన్కి సద్గతులిచ్చి
నట్టి స్వామీ!
కొను మక్షతలను
శబరి భక్తికి మెచ్చి సద్గతులనొసంగి
ఋశ్యమూకమున సుగ్రీవు జేరి
వాని సఖ్యమొనర్చి వాలిని బరిమార్చి
నట్టి
నీకిదియె పుష్పార్చనమ్ము
కిష్కింధ కంత సుగ్రీవు రాజును జేసి
వాని సాయమ్ముతో వానరతతి
ననిపి సీతాదేవి నరసిరండని నట్టి
స్వామి!
నీకిదియె ధూపమ్ము రామ!
ఆ వానరులలోన నతి సమర్థుండైన
ఆంజనేయుని బిల్చి యవనిసుతను
గాంచుమా యనుచు నుంగరమిచ్చి పంపిన
దేవదేవా!
యిదే దీపరాశి!
హనుమ వారిధి దాటె, నవనీసుతను జూచె,
దశకంధరునికి హితమ్ము దెలిపె,
రాక్షసులను గూల్చె, లంక గాల్చె నటంచు
వినిన
నీకిదియె నైవేద్య మయ్య!
వానర సేనతో వారిధి దరిజేరి
శరణు గోరిన విభీషణుని గాచి
సేతువు నిర్మించి శివలింగమును గొల్చి
నట్టి
నీకిదె విడియమ్ము రామ!
లంక లోనికి జొచ్చి రణరంగమున నిల్చి
పంక్తికంధరు గూల్చి ప్రాభవమున
బ్రోచి విభీషణు, భూమిజన్ బొందిన
రామ!
నీకిదియె నీరాజనమ్ము
పోయి పుష్పకముపై పురమయోధ్యను జేరి
బంధు మిత్రుల గూడి వైభవముగ
పట్టాభిషేకాన ప్రజల మన్నన గొన్న
రామ!
నీకిదియె మంత్ర సుమ రాజి
వందనమిదె రామ! వందారు మందార!
సుజన పాలక! జయ శుభ విలాస!
దనుజ గణ వినాశ! ధర్మ సంరక్షక!
రామ! భవవిరామ!
ప్రణతి నీకు
రామ తత్త్వము యోగిరాజ సంభావ్యమ్ము
ప్రజ్ఞాన విభవ ప్రభాకరమ్ము
రామ నామము మనోరంజకమ్ము సమస్త
దుఃఖ నాశకము సంతోషదమ్ము
రామ మంత్రము పవిత్రము సర్వ లోకైక
రక్షాకరాతి విరాజితమ్ము
రామ పాదాంభోజ రజము దోషహరమ్ము
భక్తి సౌభాగ్య సంపత్కరమ్ము
రామ హృదయమ్ము సజ్జనాశ్రయ వరమ్ము
రామ వచనమ్ము సత్య విభ్రాజితమ్ము
రామ! శ్రీరామ! జయ రామ! రామ! రామ!
రామ! శ్రీరామ! జయ రామ! రామ! రామ!
ఓం తత్ సత్!