17, నవంబర్ 2012, శనివారం

సమస్యా పూరణం - 880 (మచ్చా! అది కాదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

28 కామెంట్‌లు:

  1. చెచ్చెర మ్రింగెను పశుపతి
    హెచ్చగు హాలహలమ్ము నెల్ల జగమ్ముల్
    మెచ్చగ శ్రీకంధరునకు
    మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే

    రిప్లయితొలగించండి
  2. స్వేచ్ఛా వాయువు లే మన
    కిచ్చుటకై జైలుకేగి ఇడుముల బడుటల్
    మెచ్చని విషయమ ? జైలన
    మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే.

    రిప్లయితొలగించండి
  3. కవిమిత్రులకు నమస్కృతులు.
    కొన్ని సంఘటనలు మనస్తాపాన్ని కలిగించడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల రెండు మూడు రోజులుగా మీ పూరణలను, పద్యాలను సమీక్షించలేకపోయాను. మరో రెండు మూడు రోజుల వరకు ఇదే పరిస్థితి.
    దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.
    అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    శుభాశీస్సులు. మీ పూరణ చాల బాగున్నది.
    అభినందనలు. జైలు అనే ఆంగ్ల పదము వాడేరు. చెర లేక చెరసాల అనే పదములను వాడితే ఇంకా బాగుండేది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. పండితార్యా ! నమస్సులు.మీ సూచనకు ధన్యవాదములు..సవరణతో..

    స్వేచ్ఛా వాయువు లే మన
    కిచ్చుటకై చెఱను బడుట నిడుముల బడుటల్
    మెచ్చని విషయమ ?చెఱయన
    మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురువుగారికి ,శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    ధన్యవాదములు దెలుపుచు

    మన ప్రదానమంత్రి గారి బలుకులు
    =====*=====
    పిచ్చిగ ప్రతి పక్షములును
    హెచ్చుగ నవినీతి యనిన,హీనుల తోడన్
    వెచ్చగ నుండగ మనలకు
    మచ్చా |అది కాదు కాదు మణి భూషణమే |
    ======*=====
    కుచ్చులు బెట్టెడి వారలు
    కచ్చితముగ నిండె నట్టి కంఠీరవ పై
    పిచ్చిగ పత్రిక వ్రాసిన
    మచ్చా |అది కాదు కాదు మణి భూషణమే |
    ======*=====
    ఇచ్చకము లేని వారలు
    పిచ్చిగ వ్రాసిన,జనులకు ప్రీతిగ జెప్పన్
    నుచ్చము నున్న మనలకున్
    మచ్చా |అది కాదు కాదు మణి భూషణమే |




    రిప్లయితొలగించండి
  7. లాలు ప్రసాద్ యాదవ్ గారి ప్రశ్న
    =====*======
    ఇచ్చముగ మన్ను దినగను
    మెచ్చిన భక్తులు,పశువుల మేతను దినగన్
    పిచ్చిగ గోలలు జేసిన
    మచ్చా |అది కాదు కాదు మణిభూషణమే |
    ======*=======
    ఇచ్చముగ మన్ను దినగను
    మెచ్చిన పురజనులు,బొగ్గు మ్రింగగనయ్యో
    కచ్చిన పిచ్చిగ నాకది
    మచ్చా |అది కాదు కాదు మణి భూషణమే |


    రిప్లయితొలగించండి
  8. నెచ్చెలి నాలో వలపుం-
    జిచ్చు రగుల్కొనును నీదు చెక్కిలిపై నా
    మచ్చను గనినంత నహో
    మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే!

    రిప్లయితొలగించండి
  9. పెద్దలకు నమస్కారములు.
    చిన్న సందేహము.
    మచ్చా! అది అనుట సరియేనా? మచ్చయే! నది అనుట సరియా?

    రిప్లయితొలగించండి
  10. మచ్చ యగునేమి? కాదు మణిభూషణమే అని అంటే భావము, కందలక్షణము మారకుండా వ్యావహారిక పదాలు కాకుండా ఉంటుందని నా అభిప్రాయము.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గురువుగారికి ,శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    ధన్యవాదములు దెలుపుచు
    =======*=======
    పిచ్చుక నని జెప్ప జనులు
    మెచ్చి పదవి కట్టబెట్ట మ్రింగుట నేర్వన్,
    కచ్చిక జేసిన చిత్రము
    మచ్చా |అది కాదు కాదు మణి భూషణమే |

    విచ్చల విడిగా దిరిగెడి
    ముచ్చును జూడగ జనులకు ముచ్చిరి యయ్యెన్ ,
    పిచ్చిగ గొట్టిన వానికి
    మచ్చా |అది కాదు కాదు మణి భూషణమే |
    (ముచ్చు= దొంగ,ముచ్చిరి= దుఃఖము )


    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీ దేవి గారికి నమస్కారములు
    "మచ్చ యగునేమి? కాదు మణిభూషణమే " యనిన
    కంద గణములు లేవు రెండవ గణముగా "జ" గణము వచ్చి యున్నది


    రిప్లయితొలగించండి
  13. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ సందేహము నకు సమాధానము:
    మచ్చా? అని వాడుట సరియైనదే.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. నా పద్యములో 2వ పాదములో హాలహలమ్మునకు బదులుగ హాలాహలమ్ము అని చదువుకొనవలెను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. పండితుల వారికి, వరప్రసాదు గారికి ధన్యవాదములు.

    శ్రీ వేంకటేశ్వరుని చుబుకము మీద కనుపించే మచ్చ ఆశ్రిత వత్సలతకు మచ్చుగా నిలిచిన వైనము.

    మెచ్చిన భక్తుడు విసరగ
    గుచ్చిన గునపంపు దెబ్బ గొప్పగ దాల్చెన్
    మచ్చయె నాశ్రిత రక్షకు.
    మచ్చా !అది కాదు కాదు మణి భూషణమే |

    రిప్లయితొలగించండి
  16. పచ్చని ప్రేయసి చెక్కిలి
    ఇచ్చగ నేమీట బోవ నెఱుపై యుండెన్ !
    అచ్చెరు వొందుచు బలికితి
    మచ్చా ! అది కాదు దాదు మణి భూషణమే !

    రిప్లయితొలగించండి
  17. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యకు ఆధారము: శ్రీ శంకరాచార్య విరచితమైన శివానందలహరిలోని ఈ క్రింది శ్లోకము:

    జ్వాలోగ్ర స్సకలామరాతి భయదః క్ష్వేళః కథంవా త్వయా
    దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వ జంబూఫలం?
    జిహ్వాయాం నిహితశ్చ సిద్ధ ఘుటికావా కంఠదేశే భృతః
    కిం తే నీలమణిర్విభూషణ మయం శంభో మహాత్మన్! వద

    తాత్పర్యము: ఓ శంభో మహాత్మా! ఉగ్రమైన జ్వాలలతో కూడి దేవతలందరను ఎక్కువ భయమునకు గురిచేసిన హాలాహలమును నీవు ఎట్లు చూడగలిగితివి? చేతితో ఎట్లు పట్టుకొంటివి -- అది ఒక నేరేడు పండా? గొంతు నందు ఎట్లు వేసికొంటివి -- అది యొక ఔషధ గుళికా? లేక అది నీకొక నీలమణి విభూషణమా? చెప్పుము. స్వస్తి

    రిప్లయితొలగించండి
  18. మచ్చలను గూర్చి మిత్రుండు ముచ్చటలుగ
    వ్రాసె పద్యాలు కందుల వరప్రసాదు
    ప్రస్తుత పరిస్థితుల దెల్పె బాగుగ నొక
    నిలువు టద్దమ్మునం జూపి బళిర! బళిర!

    రిప్లయితొలగించండి
  19. హెచ్చగు నమ్మక మునగౌరి
    ఇచ్చగ మ్రింగిన జగతికి నెంతయొ మేలౌ ! !
    మెచ్చిన శంభుని గళమున
    మచ్చా ! అది కాదు కాదు మణి భూషణమే !

    రిప్లయితొలగించండి
  20. అచ్చర ఊర్వశి కోరిన
    వెచ్చని కౌగిలి నొసగక వీడగ నర్జున్
    నొచ్చి బృహన్నల గమ్మన
    మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే

    రిప్లయితొలగించండి
  21. మిత్రులారా!
    ఈనాటి పూరణలు చాల బాగుగ నున్నవి. అందరికి అభినందనలు.
    శ్రీమతి రాజేశ్వరి గారి పద్యము తొలి పాదమును ఇలాగ మార్చుదాము:
    "హెచ్చుగ నమ్ముచు పార్వతి"

    శ్రీ సహదేవుడు గారి పద్యము 2వ పాదములో చివరన "వేడగ నర్జున్" కి బదులుగ "వేడగ క్రీడిన్" అని మార్చుదాము. శబ్దము అర్జునుడు మాత్రమే - అర్జుడు అని కాదు కదా.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మిత్రుల పూరణల గుణదోషాలను సమీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు.
    ‘శివానంద లహరి’ శ్లోకాన్ని వివరించినందుకు ధన్యలమయ్యాము.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సూచన ననుసరించి చేసిన సవరణ బాగుంది.
    అప్పుడు నాయకులై దేశంకోసం జైలుకెళ్ళారు. ఇప్పుడు స్వార్థంకోసం జైలుకెళ్ళి నాయకులౌతున్నారు.
    *
    వరప్రసాద్ గారూ,
    ప్రస్తుత పరిస్థితుల నన్వయిస్తూ పూరణలు చెప్పడం మొదటినుంచీ మీ ప్రత్యేకత. మీ ‘ఏడు’ పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణలో ‘కంఠీరవ పై’ అని ముప్రత్యయం లేకుండా ప్రయోగించారు. బహుశా ఇది కన్నడ సంప్రదాయమా? మీరు ఉండేది కన్నడదేశంలోనే కదా! దానిని ‘గజరిపువు పయిన్’ అని సరిచేద్దాం.
    మూడవ పూరణలో మూడవ పాదాన్ని ‘ఉచ్చస్థితి నున్న మనకు’ అని సవరిస్తే బాగుంటుంది.
    *
    మిస్సన్న గారూ,
    మీరు ‘బ్యూటీ స్పాట్’ను పట్టుకున్నారు. సరసంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    అది వైకల్పిక సంధి. ‘మచ్చ + ఆ (ప్రశ్నార్థకం)’ సంధి అయినపుడు ‘మచ్చా’, సంధి కానపుడు యడాగమం వచ్చి ‘మచ్చయా’ అవుతుంది.
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    మిస్సన్న గారి బాట పట్టినట్టున్నారే! మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘మ్రింగుమనె సర్వమంగళ/ మంగళసూత్రమ్ము నెంత మది నమ్మినదో’ అన్న భావాన్ని మీ రెండవ పూరణలో చక్కగా ఇమిడ్చారు. చాలా బాగుంది.
    మొదటి పాదంలో గణదోషం... ‘నమ్మకమున గౌరి’ అన్నచోట ‘నమ్మకమున నుమ’ అందాం.
    *
    సహదేవుడు గారూ,
    ఊర్వశి శాపం క్రీడికి మచ్చ కాదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. శంకరార్యా ధన్యవాదములు.

    అచ్చెరు వొందితి నేడీ
    "మచ్చా" యను పూరణములు మస్తుగ వచ్చెన్
    హెచ్చుగ ప్రసాదు గారలు
    మచ్చలనే పట్టినారు మహ బాగుండెన్.

    రిప్లయితొలగించండి
  24. హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘మహ బాగు’గా చెప్పిన మీ పద్యం ‘మస్తుగ’ నచ్చింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. గురువుగారికి వందనములు మరియు ధన్యవాదములు. తమరు సూచించిన సవరణతో:
    అచ్చర ఊర్వశి కోరిన
    వెచ్చని కౌగిలి నొసగక వీడగ క్రీడిన్
    నొచ్చి బృహన్నల గమ్మన
    మచ్చా? అది కాదు కాదు మణిభూషణమే!

    రిప్లయితొలగించండి
  26. నమస్కారములు
    చక్కని సవరణ చేసిన గురువులకు ధన్య వాదములు. " ఒకోసారి ఎంత నెత్తి కొట్టుకున్నా సరియైన పదాలు గుర్తుకు రావు " పార్వతి నమ్మకాన్ని అందంగా వ్రాయాలని ఊ...హూ .... ! అస్సలు గుర్తే రాలేదు." హెచ్చుగ నమ్ముచు పార్వతి " ఎంత బాగుందో .
    ఎంతైనా పండితులు పండితులే .ఆ సునిసితం నా వంటి పామరుల కెక్కడిది ? శ్రీ పండీతుల వారికి మరిన్ని ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  27. మెచ్చిన పాపడి మోమున
    వెచ్చని జలకమ్ము పిదప పేర్చగ ముద్దుల్
    ముచ్చట తీర్చిన తిలకము...
    మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే!

    రిప్లయితొలగించండి