10, నవంబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 873 (తనయునకును దండ్రికి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తనయునకును దండ్రి కొకతె దారగ నయ్యెన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

24 కామెంట్‌లు:


  1. తన నటనను చూపించగ
    జనులందరు మెచ్చు నట్లు శహభాషనగా
    కన నొక చిత్రము నందున
    తనయునకును దండ్రి కొకతె దారగ నయ్యెన్.

    రిప్లయితొలగించండి
  2. వనజాప్తుం డొకపరి నా
    తని సూనుడు శమనుడొక్క తరి కుంతికి కూ
    ర్మిని పుత్రుల నొసగి రటుల
    తనయునకును దండ్రి కొకతె దారగ నయ్యెన్

    రిప్లయితొలగించండి
  3. మనువాడక నుందు, సుతుల
    కనబోననుచును ప్రతినల కఠినత జేసెన్,
    ఘనమగు ప్రణతులు గంగా
    తనయునకును ; తండ్రికొకతె దారగనయ్యెన్.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ నేమాని మహాశయులకు, వందనములు. మీ పూరణలో సూర్యని, యమని అనుగ్రహంతో పుత్రులు కలిగారు గానీ, మరి కుంతిని వారికీ "దార" అనవచ్చా?

    రిప్లయితొలగించండి
  5. అయ్యా! చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
    కర్ణుని సూర్యపుత్రుడని, ధర్మరాజుని యమతనయుడని అనుచున్నాము కదా - అందుకే వాళ్ళ తల్లిని ఆ తండ్రులకి దార అనవచ్చును అని నా భావము. శాశ్వత దార కాకపోయినా తాత్కాలిక దార అయినది కదా. ఇది సమస్యా పూరణ వరకే పరిమితము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. వినుమిది పార్వతి శాపము
    తనయునకును దండ్రి కొకతె దారగ నయ్యెన్ !
    తన పతి తేజము పొందుట
    గని నంతనె ధరణి పైన కోపము నొందన్ !

    రిప్లయితొలగించండి
  7. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ శైలి పూర్వము కంటే ఇప్పుడు చాల మెరుగు అయినది. రాను రాను ఇంకా బాగు అవుతుంది. కృషితో నాస్తి దుర్భిక్షము అంటారు కదా. మంచి కృషి మీరు చేస్తున్నారు అని నా నమ్మకము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురువుగారికి ,శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    ధన్యవాదములు దెలుపుచు
    =====*====
    పందె మును గెల్వ మోదమున్ పాచికలను ,
    తన కుమార్తె లందరి నిచ్చె తనయునకును ,
    దండ్రి కొకతె దారగ నయ్యె ,దలచె నా వి
    వాహమును జూడ వచ్చిన వారు నాడు |

    " రాముడు మంచి భర్త కాడు" యని,చరిత్ర తెలియని రాంజట్మలాని వ్యాక్యలను కవులందరు ఖండించుగాక
    నేడు చాలా మంది రాముని విమర్శించు చున్నారు.
    స్వామికి నా విన్నపము
    =====*=======

    పరమ పురుషుడ వని వేడ వ్యధల నిచ్చి ,
    పర మతస్తు లెల్లరు జేరి బలువిధముల
    పరమ దుర్మార్గుడని బల్క భయము తోడ
    పరమ శాంతి స్వరూపుడై పైకమిచ్చి

    వైరి వర్గములకు నీవు వరము లివ్వ
    మారు జనులెల్ల రాక్షస మార్గమునకు
    వారిని వధియింప శతావతార ములకు
    జేరు నయ్య ,నిద్రను వీడి పోరు సలుపు |

    రిప్లయితొలగించండి
  9. వినుమీ వాక్యము శంకర !
    తనయునకును దండ్రి కొకతె దారగ నయ్యెన్
    విన గూడని వన్నియు నిట
    వినుటకు నే, నోయి భవుడ ! వెగటుగ నుండెన్ .

    రిప్లయితొలగించండి
  10. అయ్యా వరప్రసాదు గారూ! శుభాశీస్సులు.
    మీ ఆవేదనను చూచేను. వినాశ కాలే విపరీత బుద్ధిః అని ఆర్యోక్తి. రామ దూషణ గాని ఏ ఇతర దేవతా దూషణ గాని చేసిన వారు ఎవ్వరూ బాగుపడ లేదు. అటువంటి వారికి తగిన శాస్తిని ఆంజనేయ స్వామి చూసుకుంటాడు. స్వామీ! ఆంజనేయా! లేవయ్యా!
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. అయ్యా, ధన్యవాదములు.

    జననిని బాసిన దుఃఖము
    తనయునకును; తండ్రికొకతె దారగ నయ్యెన్,
    ధనదాహము తోడ మసలి
    చినవానిని వెడలనంపె, చిత్రము గనుమా!

    రిప్లయితొలగించండి
  12. ఘనముగ నాగార్జునునకు
    సినిమాలో సుందరాంగి శ్రీదేవి యిటుల్
    మునుపా నాగేశ్వరునకు
    తనయునకును దండ్రికొకతె దారగ నయ్యెన్.

    రిప్లయితొలగించండి
  13. మనసిచ్చె పొరుగు వారల
    తనయునకును దండ్రికొకతె, దారగనయ్యెన్
    వనజేక్షణ వేరొకనికి
    వనితల భావములు తెలియ వశమే వసుధన్?

    రిప్లయితొలగించండి
  14. వనజాక్షి వలచె నాతని
    మనువాడగ తాళి వేళ మామయె నిలచెన్ !
    మనసొక రిది మనువొకరికి
    తనయునకును దండ్రి కొకతె దారగ నయ్యెన్ !

    రిప్లయితొలగించండి
  15. మనమున పుత్రుని గోరుచు
    వినయముగ శివుని వరమును వేడన్ కృపచే
    వనితయె తల్లిగ నయ్యెన్
    తనయునకును ; తండ్రి కొకతె దారగ నయ్యెన్

    రిప్లయితొలగించండి
  16. జంగిడి రాజేందర్శనివారం, నవంబర్ 10, 2012 9:55:00 PM


    తనయుండు తండ్రి నిరువురు
    ఘనమగు సేద్యంబు చేయ గంగను కొలువా
    గుణములు మెచ్చిన గంగా
    తనయునకును తండ్రి కొకతే దారగ నయ్యెన్.

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    మొన్నమొన్ననే ‘తల్లికిఁ దనయకును ధవుఁ డొకండె’ అన్న సమస్యనిచ్చాము. దానిని అదే ఆటవెలదిలో ‘తండ్రికిఁ దనయునకు దార యొకతె’ అని మార్చవచ్చు. కాని ఈ రోజు సమస్య నిచ్చిన కవిమిత్రులు కందపాదంగా ఇచ్చారు.
    మంచి స్పందన నిచ్చిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ద్విపాత్రాభినయం చేసిన నటి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    తండ్రి అయిన సూర్యుని వలన కర్ణుని, కొడుకయిన యముని వలన ధర్మరాజును కన్న కుంతిని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘వనితల భావములు తెలియ వశమే వసుధన్?’ అన్న మీ రెండవ పూరణ చాలా బాగుంది.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని విరుపుతో రెండు మంచి పూరణలు చెప్పినారు. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ‘దార’ శబ్దానికి ‘భర్తను సోదరులనుండి వేరు చేసేది - భార్య’ అని వ్యుత్పత్త్యర్థం.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    కానీ ఈ పార్వతీ శాప వృత్తాంతమేదో నాకు గుర్తుకు రావడం లేదు.
    మీ రెండవ పూరణ సారంగధర కథను గుర్తుకు తెచ్చింది. బాగుంది.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. ముఖ్యంగా కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన విధం చక్కగా ఉంది. అభినందనలు.

    మన సంస్కృతీ సభ్యతల మీద, దేవుళ్ళ మీద అవాకులు చెవాకులు అనడం, వినడం సాధారణమైపోయింది. మీ ఆవేదనలో అర్థం ఉంది. నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.

    అల్పు లజ్ఞాను లన్యమతానుయాయు
    లధములును నాస్తికులు మొదలైనవారి
    కారుకూతల మదిని లెక్కకు గొనంగ
    వలదు; దేవుఁడు గద రామభద్రుఁ డెపుడు.
    *
    సుబ్బారావు గారూ,
    ఆక్షేపణగా మీరు పూరించిన విధానం బాగుంది. అభినందనలు.
    సమస్య అంటేనే విపరీతార్థం ఉంటుంది కదా!
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    శ్రీదేవి విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జంగిడి రాజేందర్ గారూ,
    మీ భావం అర్థం కాలేదు.
    ‘తండ్రియున్’ అనవలసింది కదా. అక్కడ ‘తండ్రి యిరువురు’ అందాం. కొలువగా అనే అర్థంలో కొలువా అన్నట్టున్నారు. కొలువన్ అంటే సరి.
    *
    వరప్రసాద్ గారి స్ఫూర్తితో నా పూరణ....

    విధురుఁ డొకఁడు తన సుతుని వెంటఁ జనియు
    పెండ్లి కొఱకు వెదకెనఁట వెలఁదుల; నొక
    తరుణి యర్ధాంగి యయ్యెను తనయునకును
    దండ్రి కొకతె దారగ నయ్యె నండ్రు జనులు.

    రిప్లయితొలగించండి
  18. గురువులకు నమస్కారములు .
    ఒకానొకప్పుడు శ్రీ మహా విష్ణువుకు ప్రియ మైన భూదేవి శివుని తేజస్సు స్వీక రించగా , ఆ సంగతి తెలిసిన పార్వతీ దేవి ఆగ్రహించి , నా భర్త తేజస్సును స్వీకరించావు గనుక " నీవు తండ్రికీ , తనయునకూ కుడా భార్యవే ! అని శపించిన దట. అందుకే " భూపతులు " అనగా ప్రభువుకీ భార్య , ఆ ప్రభువు మరణా నంతరం , రాజ్యాధి పతి ఐన కొడుకు భూపతే గావున అతడికీ భార్య. అవుతుంది. గనుక " తండ్రికీ తనయుడికీ , భూదేవి భార్య ఐంది. ఇద్దరూ భూపతులే .

    ఇది నేను శ్రీ చాగంటి వారి ప్రవచ నాల్లో విన్నది. " ప్రవచనం డాట్ కం. " ఆరణ్య పర్వం 24 ట్రాక్
    నేను సరిగా చెప్ప లేక పోయినందుకు మన్నించ గలరు

    రిప్లయితొలగించండి
  19. ప్రపంచ సుందరీమణి పోటీలలో,

    కనుచుండిరి గురు పుత్రులు
    జననుత సౌందర్యవతులఁ జపలాక్షులలో
    గణియింప మేలు పొలతిని
    తనయునకును తండ్రి కొకతె ' తార ' గ నయ్యెన్ !

    గురువు = తండ్రి

    రిప్లయితొలగించండి
  20. రాజేశ్వరి అక్కయ్యా,
    ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    వైవిధ్యమైన భావంతో మీ ప్రయత్నం ప్రశంసనీయం. బాగుంది.
    కానీ సమస్యలోని ‘దార’ను ‘తార’గా మార్చడం సంప్రదాయం కాదనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  21. నారోజు రాజమౌళి, హుస్నాబాద్ఆదివారం, నవంబర్ 11, 2012 6:22:00 PM

    వినగను విడ్డూరమ్మున్
    అనగను మరి నోరు రాదు అట్లన నెపుడున్
    కనగను పశువడి తీరున
    తనయునకును తండ్రి నొకతే దారగ నయ్యెన్

    రిప్లయితొలగించండి
  22. భారతీయ రైల్వే ఒక వంశపారంపర్యమైన ప్రభుత్వ సంస్థ:


    మునులకు నిద్దరు ముగ్గురు
    వనమాలికి వేన వేలు వనితలు కాగా
    మన రైల్వే సేవకులకు
    తనయునకును దండ్రి "కొకతె" దారగ నయ్యెన్

    రిప్లయితొలగించండి
  23. ఘనుడగు ముస్లిము వరుడా!
    కనుమా! మా కులమునందు కష్టమ్మిదియే!
    పిన ముత్తాతకు, తాతకు,
    తనయునకును, దండ్రి, "కొకతె" దారగ నయ్యెన్ 😢

    రిప్లయితొలగించండి