12, నవంబర్ 2012, సోమవారం

సమస్యా పూరణం - 875 (మమ్మీ సంస్కృతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మమ్మీ సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా!
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

12 కామెంట్‌లు:

  1. సమ్మాన్యుండగు సద్గురూత్తముడు ప్రజ్ఞానమ్ము బోధింప నా
    త్మమ్మే తానను నిశ్చయమ్మున సదా ధ్యానమ్ములో మున్గి సౌ
    ఖ్యమ్మున్ బొందు నుపాసకా! వినుమయా! యత్యంత చైతన్య ధా
    మమ్మీ సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా!

    రిప్లయితొలగించండి
  2. సమ్మానించుచు దుర్గ జేరి, భవ పాశమ్మింక తీయంగ రా
    వమ్మా శాంభవి పాహి పాహి యన దానాలించి పాలించునే,
    మమ్మీ భారతమందు నిల్పితివిదే మా భవ్య చారిత్ర్య ధా
    మమ్మీ సంస్కృతి; యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా!

    రిప్లయితొలగించండి
  3. అమ్మా! గావు మటంచు శుద్ధమతులై యత్యంతనమ్రాంగులై
    సమ్మోదంబున లోకపావని శివన్ సద్భక్తి బూజించుచున్
    నమ్మంగా గరుణించు, గూర్చును మహానందంబు చూడంగ సే
    మమ్మీ సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ముజూపున్ సదా.

    రిప్లయితొలగించండి
  4. మిమ్మీ లోకపు పోకడల్ నిజముగన్ మేల్లిచ్చి పాలించునే?
    సొమ్ముల్గిమ్ములులేక శ్వాస గమనంజూడంగ ధ్యానమ్మగున్!
    సమ్మోదంబొసగన్ సహాయమిది!మీ జన్మంబు ధన్యంబు! క్షే
    మమ్మీసంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా!

    రిప్లయితొలగించండి
  5. సమ్మోదమ్మున కంది శంకరులు సత్సౌందర్య పద్యావళిన్
    సమ్మాన్యంబుగ వ్రాయఁ జేయుటదియే సద్యోగమైయొప్పుచున్
    నెమ్మిన్ పద్య సుమంబులల్లనిలిపెన్ నేర్పెన్ కృపన్ జూచుచున్
    మమ్మీ సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా!

    రిప్లయితొలగించండి
  6. అమ్మానాన్నల భారతీయ ఘన సంస్కారమ్ము దీపింపగన్
    సమ్మోదించుచు పిల్లలెప్పుడు దురాచారమ్ములన్ వీడి హే
    మమ్మీ సంసృతి వేద సంస్మృతిని సమ్మానించగ న్నొందు క్షే
    మమ్మీ సంస్కృతి ; యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా !

    రిప్లయితొలగించండి
  7. మమ్మీ భారత మందు బుట్టునటులన్ మాయమ్మ భాగ్యంబిడెన్
    మమ్మీ సంస్కృతి డమ్మి సంస్కృతులకున్ మాయంగ బోదిద్ది హే
    మమ్మీ సంస్కృతి భోగ బంధములకున్ మార్గమ్ము తెంపేను సే
    మమ్మీ సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా!

    రిప్లయితొలగించండి
  8. కవిమిత్రులందరికీ
    ‘దీపావళీ శుభాకాంక్షలు’!
    *
    పండిత నేమాని వారూ,
    ‘ఈ సంస్కృతి చైతన్యధామ’మన్న మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ‘ఈ సంస్కృతి భవ్య చారిత్ర్య ధామ’మన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    ‘ఈ సంస్కృతి క్షేమదాయక’మన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘గావుము’... సంబోధన మీది సరళములకు గసడదవలు రావనుకుంటాను.
    *
    సహదేవుడు గారూ,
    ‘క్షేమకరమీ సంస్కృతి’ అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘మేల్లిచ్చి’ అన్నదాన్ని ‘మేళ్ళిచ్చి/మేల్గూర్చి’ అందాం.
    ‘శ్వాసగమనం జూడంగ’ అన్నదాన్ని ‘శ్వాస విధమున్ జూడంగ’ అందాం.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    పద్యరచనను యోగంగా భావించారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    పండుగ నాడు ఉదయమే మీ ప్రశంసను అందుకున్నాను. ధన్యోస్మి!
    ‘పద్యమ్ములు వ్రాయజేయుటే’ కాని ఈమధ్య స్వయంగా పద్యరచన చేయలేకపోతున్నాను.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘మమ్మీ డమ్మీలకు’ మాయంకాని సంస్కృతి మనదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. నెమ్మిన్ సాగుచు వేద మార్గమున నెంతే నిష్ఠతో దుష్ట కా-
    మమ్ముల్ జేరని రీతి తృప్తి గొనుచున్ ధర్మాను సంధాయులై
    సుమ్మీ సౌఖ్యములన్ గడింప తగు సర్వుల్ చూడుమా యార్ష నా-
    మమ్మీ సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా!

    రిప్లయితొలగించండి
  10. శ్రీపతిశాస్త్రిమంగళవారం, నవంబర్ 13, 2012 6:15:00 PM

    శ్రీగురుభ్యోనమ:
    గురువర్యులు శ్రీ శంకరయ్యగారికి, శ్రీ పండిత నేమానిగారికి,శ్రీ చింతా రామకృష్ణారావుగారికి,
    పండితలకు, కవులకు, మిత్రులకు బ్లాగు వీక్షకులకు దీపావళి పర్వదినశుభాకాంక్షలు.

    అమ్మా నీ కరుణాకటాక్షములు మాకానందముల్ కూర్చగా
    సమ్మోహమ్మున దుష్ట సంస్కృతుల నాస్వాదింపగా భావ్యమే
    నమ్మంగావలె శాస్త్రపద్ధతుల నెన్నంగా రక్షించున్ సదా
    మమ్మీ సంస్కృతి, యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా!

    (మమ్ము + ఈసంస్కృతి)

    రిప్లయితొలగించండి
  11. మిమ్మీ లోకపు పోకడల్ నిజముగన్మేల్గూర్చి పాలించునే?
    సొమ్ముల్గిమ్ములులేక శ్వాస విధమున్జూడంగ ధ్యానమ్మగున్!
    సమ్మోదంబొసగన్ సహాయమిది!మీ జన్మంబు ధన్యంబు! క్షే
    మమ్మీసంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా!

    రిప్లయితొలగించండి
  12. రమ్మున్ త్రాగక చీట్ల పేకలుగొనిన్ రమ్మీని క్రీడించకే
    దమ్మున్ బట్టుచు వీడుచున్ క్రమముగా ధైర్యమ్ము గోల్పోవకే
    సమ్మానించుచు బాబరాముని భళిన్ జంబంపు న్యూయార్కునన్
    మమ్మీ! సంస్కృతి యోగసాధకులకున్ మార్గమ్ము జూపున్ గదా!

    రిప్లయితొలగించండి