26, నవంబర్ 2012, సోమవారం

పద్య శైలూషి

పద్య శైలూషి
రచన - సోమార్క

తేనియ లూటలూరు, తియతియ్యని దేశిపదాల సౌరు,స
ద్గాన గుణమ్ము,తెల్గు నుడికారగణమ్ముల నొప్పు, వాక్యవి
న్నాణములున్, మనోజ్ఞ కవనమ్ముకు పెట్టని సొమ్ములౌనుగా,
జానుతెనుంగు పద్యముల జాతికి సాటికవిత్వ మున్నదే?


పదముల్ పేర్చి,బిగించి కూర్చి,రసవద్భావమ్ములన్ పేర్చి, సొం
పొదవన్, శైలియు, వృత్తి, రీతి, రసవత్పాకాది, మేలౌ గుణా
భ్యుదయోల్లాస కవిత్వ రూప నిగమ ప్రోక్తార్ష విజ్ఞాన సం
పదయై భాసిలు తెల్గు భాషకు మహద్భాగ్యంబు! పద్యంబెగా!


నన్నయనాటి నుండి యధునాతన రీతులు నేర్చుకొంచు, నె
న్నెన్నొ కవిత్వ ప్రక్రియల నింపగు రూపుల దిద్దుకొంచు, న
భ్యున్నతి గొంచు, కావ్యవిభవోజ్వల మౌచును, తెల్గుసాహితిన్
యెన్నగ హృద్య పద్య మది యింపగు తెల్గు సమృద్ధినందగన్.


పద్యము ప్రాతవడ్డదని భావన సేయుటయేమొ గాని?! త
ద్విద్య సహస్ర రూపిణిగ, విస్తృత రూపము దాల్చి యొప్పె, న
య్యద్యతనాంధ్రసత్కవులు నాధునికత్వ  కవిత్వరూపమౌ
హృద్య కవిత్వ రీతులకు నింపగు మూలము గాదనందురే?


సరస పద ప్రహేళికల జల్లిన భావరజమ్ముతో నలం
కరణలనొప్పు వర్ణనల గప్పిన యక్షర రధ్యపైని మా
సరస కవీశు లందముగ చక్కని పద్య రధమ్ము గూర్చిరా
దరమున, త్రిప్పినారలు వధాన విధాన పధాన నెల్లెడన్.


నన్నయ సంస్కృతాంధ్ర సుగుణమ్ముల నొద్దిక దిద్ది తీర్చి, వి
ద్వన్నుతుడయ్యె; నూతన విధానము నేర్పెను సోమయాజి, రూ
పోన్నతిజేసె దేశికవితోద్యమసారధి సోముడున్ పదా
ర్వన్నెల శోభగూర్పగను! పద్యము జానగు శోభ నొప్పెడిన్.


చింతింపం బనిలేదు! పద్యకవు లక్షీణ ప్రభావోన్నతిన్,
గొంతుల్విప్పుడు! పూర్వ వైభవము సంకోచమ్ముగా బొంద, మీ
వంతున్ సత్కృషి సల్ప మేటి రసవత్పద్యమ్మనావద్యమై,
భ్రాంతుల్ దీర,రసజ్ఞశ్రోతృ జలధిన్ పర్వించు పద్యాపగల్.


“సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా? లేదా?” అనే అంశంపై నిర్వహించిన పోటీలో 
‘సోమార్క’ గారి పై ‘పద్యశైలూషి’ ఖండికకు ప్రధమ బహుమతి లభించింది. 
వారికి అభినందనలు.
(శ్రీ చింతా రామకృష్ణా రావు గారి ‘ఆంధ్రామృతము’ బ్లాగునుండి కృతజ్ఞతలతో స్వీకరింపబడింది)

4 కామెంట్‌లు:

  1. ఆణిముత్యాలు! శంకరాభరణానికి మరొక మణిపూస!
    గురువులు శ్రీ చింతా రామకృష్ణా రావు గార్కి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. "పద్యశైలూషి" చాలా బావుంది !
    సోమార్కగారికి అభినందనలు !
    శంకరార్యులకు ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    మన శంకరా భరణమునకు ఆభరణములుగా పండితోత్త ములు విరజిమ్ము తున్న తెలుగు వెలుగులు ,దశ దిశలా వెన్నెల వెలుగులై ప్రస రించాలని .కోరుతూ , పాండితీ స్రష్ట లందరికీ శిరసాభి వందనములు

    రిప్లయితొలగించండి