14, నవంబర్ 2012, బుధవారం

పద్య రచన - 160

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
గన్నవరపు నరసింహ మూర్తి గారికి ధన్యవాదములతో...

17 కామెంట్‌లు:

  1. ఎఱుపును పసుపుల నిట్టుల
    విరివిగ దా మేళవించి పేరిమి నింగిన్
    మరువక నలంకరించెడు
    సరసుండెవడో! ప్రణతుల సాదరమిడుదున్.

    రిప్లయితొలగించండి
  2. అస్తమించె దివాకరుం డాకసమ్ము
    వివిధ వర్ణాత్మకంబయి వెలుగులొందె
    ప్రకృతి కనువిందు గొలుపుచు పరవశింప
    జేసె రసవినోదనులను చిత్రలీల

    రిప్లయితొలగించండి
  3. ఇనుడు పశ్చిమోదధి నస్తమించు వేళ
    నరుణకాంతులతో నిండె నాకసంబు
    బహువిధంబుల రమ్యమౌ ప్రకృతినిందు
    కాంచ వచ్చును నిత్యంబు కాంక్ష దీర.

    రిప్లయితొలగించండి
  4. లక్ష్మీదేవి గారి పద్యం అత్యంత హృద్యంగా ఉంది.
    ఆమెకు నా అభినందనలు!
    ఆ పద్యం చదివాక నాలో కలిగిన భావన ...

    నింగి పళ్ళెరమున నింపి తా గొనితెచ్చె
    పసుపు కుంకుమలను ప్రకృతి కాంత!
    పిలిచె రండు! మిమ్ము పేరంటమున కిదే -
    వనితలార! కొనుడు వాయనమ్ము!!

    రిప్లయితొలగించండి
  5. గాఢతిమిరంబులనుబాపిగగనమందు
    భాస్కరుడుజాతికొసగెను భాస్వరంబు
    జ్ఞానవైరాగ్యదీపంబు కలుగవలయు
    జీవితంబున వెలుగులఁ జెదరనీక

    రిప్లయితొలగించండి
  6. గురువు గారికి సోదర సోదరీమణులకు కృతజ్ఞతలు.

    రంగు లెన్నొ దెచ్చి రంగలించుచు మేలు
    కుంచె తోడ నలమి కూర్మి మిగుల
    ప్రభలు దీటుగ గొని పటమందుఁ జేర్చెరా
    చిత్రకారుఁ డనరె మిత్రవరుఁడు !!!

    మిత్రుఁడు = సూర్యుఁడు

    రిప్లయితొలగించండి
  7. మనోహరమైన భావ సౌందర్యానికి ప్రతీకలు మీ పద్యాలు.
    అందరికీ అభినందనలు. నాదొక చిన్న యూహ:

    పడమటి కొండపై నలసి భాస్కరుడల్లదె విశ్రమించగా
    తడయక నెఱ్ఱ దామరల దట్టల దోడుత దెచ్చి తారకల్
    వడివడి నర్చనల్ సలిపి వందనముల్ పచరించినట్లు దో-
    చెడిని మనమ్మునందున విశేష విభూతులు చూడజూడగా.

    రిప్లయితొలగించండి
  8. సంధ్య వెలుగులు విరజిమ్ము సౌరు లనగ
    పంచ వన్నెల నింగిని యెంచ తరమె
    విరహ వేదన నొందుచు వీడు కోలు
    పద్మ బాంధవు డేగెను బరువు గాను

    రిప్లయితొలగించండి
  9. ఫణీంద్ర గారు,
    మీ మెప్పు పొంద గలగడం సంతోషాన్ని కలిగించింది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  10. దీపావళి మందులతో
    పాపమ్మును తలచకుండ పడి పడి కాల్చెన్
    నే పారి పోదు ననియెను
    కోపమ్మున నిశికి ముఖము క్రొత్తగ మారెన్.

    రిప్లయితొలగించండి
  11. సూర్యచంద్రులనెడుచూపులవిరమించి
    ధ్యానముద్రదాల్చతల్లిప్రకృతి
    భృకుటినడుమతొలుతబిందువైపొడజూపి
    విచ్చుకొనెడిసంధ్యవెలుగదేమొ?

    రిప్లయితొలగించండి
  12. పడమరన గ్రుంకులిడె పద్మబాంధవుడు
    ఆలమందలు యింటికి నరుగుదెంచె
    నింగి కాన్వాసు తెరపైన నివ్వటిల్లి
    కేకిసలు గొట్ట చిత్రము గీసె నెవడు ?!

    రిప్లయితొలగించండి
  13. ఆత డే చిత్రకారుడు? యన్నిరంగు
    లనెటు తీర్చిదిద్దె? యతని లాఘవంబు
    మనకెటులనబ్బు? ఔర బల్మాయఁజేయు
    నతడు మనకు రంగులఁజూపి ఆతడతడె!

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మీదేవి గారూ,
    నింగి నలంకరించిన సరసునకు ప్రణమిల్లిన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు. ఆచార్య ఫణీంద్రుల మెచ్చుకోలును పొందినందుకు ఆనందంగా ఉంది.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పద్యం రసవినోదులను పరవశింప జేసేదిగా ఉంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    సాయంసంధ్యలో ఆకాశాన్ని రమ్యంగా వర్ణించారు. బాగుంది. అభినందనలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    అద్భుతమూ, మనోహరమూ అయిన శబ్దచిత్రాన్ని ఆవిష్కరించారు మీ పద్యంలో. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    సూర్యుణ్ణి చిత్రకారుణ్ణి చేసారు. బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ఇంతకీ అది మీరు తీసిన ఛాయాచిత్రమేనా?
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యంలోని ‘భావ విభూతి’ అలరించింది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    దీపావళీ నేపథ్యంతో చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘చిత్రకారుడు + అన్ని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చిత్రకారుడొ యన్ని’ అందాం.

    రిప్లయితొలగించండి
  15. గురువుగారూ, ధన్యవాదములు.నేను వసించే హ్యూగో నగరములో సంధ్యాసమయములు చాలా రమ్యముగా నుంటాయి. ఈ సాయం సంధ్యా దృశ్యఛ్ఛాయా చిత్రమును కణసంభాషిణిలో( cell phone ) ఒకసారి పట్టగలిగాను. ఇటువంటి దృశ్యము అంబరవీధులలో రెండు,మూడు నిముషాలు మాత్రమే ఉంటాయి. కనిపించ గానే వాహనము ప్రక్కన నిలిపి చిత్రాన్ని గ్రహించ గలిగాను. ఈ దినము ఉదయం నాలుగున్నరకి మెలకువ వస్తే శంకరాభరణం బ్లాగులొ ఆ చిత్రాన్ని చూచి ఆశ్చర్య పడి నా పూరణ పూర్తి చేసి మరల నిద్రలోనికి జారుకొన్నాను. చక్కని పద్యాల నందించిన మిత్రు లందఱికీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. /కణసంభాషిణిలో/ :))
    కలహాసిని లా పేరు బాగుంది. 'సం' తీసేసి 'కణభాషిణి' అంటే బాగుంటుందేమో. :)

    రిప్లయితొలగించండి
  17. ' కణభాషిణి ' బాగుంది.SNKR గారూ యికపై అలాగే యుపయోగిస్తాను.

    రిప్లయితొలగించండి