24, నవంబర్ 2012, శనివారం

సమస్యా పూరణం - 886 (కాకి నృత్యమాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కాకి నృత్యమాడె కేకి వొగడె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

57 కామెంట్‌లు:

  1. తకధిమి తకిట తక తాతైయనుచు పిల్ల
    వాడొకడు నెమలిఁ గని వడలు మరచి
    బుడి బుడిగ నడుగుల ముద్దుగనా పిల్ల
    కాకి నృత్యమాడె కేకి వొగడె.
    పిల్లకాకి = చిన్నవాఁడు, అంతగా అనుభవము లేనివాఁడు.

    రిప్లయితొలగించండి
  2. పసయె లేని కవిత వ్రాసిన యధికారి
    యొకడు వినిచి నంత నొక్క సుకవి
    పొగడె వాని గూర్చి తగు వ్యంగ్య రీతిలో
    కాకి నృత్యమాడె కేకి వొగడె

    రిప్లయితొలగించండి
  3. చంద్ర శేఖర్ గారూ ! "పిల్లకాకి " నర్తన బాగుంది.
    శ్రీ నేమాని వారి వ్యంగ్యం బాగుంది

    రిప్లయితొలగించండి
  4. అయ్యా చంద్రశేఖర్ గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యము బాగున్నది. 2వ పాదములో 1 లఘువు ఎక్కువగా నున్నది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. ఈ సమస్యను పూర్వము నేను మా గురువుగారు కీ.శే. రావూరి వేంకటేశ్వరులు గారు కొవ్వూరులో అష్టావధానము చేసి నప్పుడు నేను ఇచ్చేను - మత్తేభ వృత్తములో: శిఖులన్ మించిన రీతి వాయసములే చేయుం గదా నృత్యముల్ అని. విఖనో గోత్రజు అని మొదలిడి వారు పూరించేరు మంత్రములు రాని వారు పూజారిగా ఉండే విధానమును ఉట్టంకించుచూ - స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. శ్రీనేమానిమహాశయుల సూచన ప్రకారం సవరణతో:
    తకధిమి తకిట తక తాతైయనుచు పిల్ల
    వాడొకడు శిఖిఁ గని వడలు మరచి
    బుడి బుడిగ నడుగుల ముద్దుగనా పిల్ల
    కాకి నృత్యమాడె కేకి వొగడె.
    పిల్లకాకి = చిన్నవాఁడు, అంతగా అనుభవము లేనివాఁడు.

    రిప్లయితొలగించండి
  7. గురుడు భీష్ము డాది కురువీర వరులను
    రణము నోర్తు ననుచు రభస జేయు
    నుత్తరుడుని నగుచు నూరించె గవ్వడి
    కాకి నృత్య మాడె కేకి వొగడె !

    రిప్లయితొలగించండి
  8. కాకి నాట్యమెటుల కేకికెదుట చేయు?
    కేకి యెటుల పొగడు కాకిని గని?
    శంకరార్య! కవిశుభంకరా! ఎచట యే
    కాకి నృత్యమాడె కేకి వొగడె.

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఒక్క కాలు , ఒక్క కన్ను గలిగిన యిరువురు స్నేహితులు :

    01)
    _______________________________

    కాలు లేని వాడు - గంతులు వైచిన
    కన్ను లేని వాడు - గాంచి మురిసి
    కాళ్ళు రెండు గలుగ - గలరె నీ సములనె !
    కాకి నృత్యమాడె ! - కేకి వొగడె !
    _______________________________

    రిప్లయితొలగించండి
  10. తమ్ముడు డా. చి.నరసింహమూర్తికి శుభాశీస్సులు.
    పద్యములో :ఉత్తరుడుని" అనే ప్రయోగము సరికాదు. ఉత్తరు గని అని సవరించితే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ చింతా రామకృష్ణ రావు గారూ! శుభాశీస్సులు.
    సమస్యను నింపడానికి బదులుగా ప్రశ్నలు వేస్తే ఎలా? ఇంతకీ తెలుసా? ఆ కాకి & కేకి పరస్పరము మిత్రులే అంటారు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. అన్నయ్య గారికి కృతజ్ఞతలు !

    గురుడు భీష్ము డాది కురువీర వరులను
    రణము నోర్తు ననుచు రభస జేయు
    నుత్తరు గని నగుచు నూరించె గవ్వడి
    కాకి నృత్య మాడె కేకి వొగడె !

    రిప్లయితొలగించండి
  13. మూర్తిగారి స్ఫూర్తితో :

    గోగ్రహణ సమయములో ఉత్తర కుమారుడు :

    02)
    _______________________________

    "కదన రంగ మందు - కత్తిని చే బట్టి
    కోతు కౌరవులకు - కుత్తుకలను"
    క్రీడి ముందు బీర - మాడె ! తుదకు పారె !
    కాకి నృత్యమాడె - కేకి వొగడె !
    _______________________________

    రిప్లయితొలగించండి
  14. బలిచక్రవర్తి ఘనుడే, కాని మరి యా పరమత్మతో సాటియా !

    దాన శీలు డనుచు దైత్యవేంద్రుని గని
    భువిని మెచ్చె గదర భువన కర్త
    దాన మెవరి సొత్తొ జ్ఞానులు నెఱుగంగ
    గాకి నృత్య మాడె ! కేకి వొగడె !!

    కిశోర్ జీ మిమ్ముల నీ దినము తలచుకొన్నాను. మీ దర్శన మానందము కలుగ జేసింది !

    రిప్లయితొలగించండి
  15. వాసు దేవుడెవడు పౌండ్రకు డుండగా
    నిర్వురెటుల నుందు రిపుడె వాని
    చంపుదు నన, మంత్రి శహభా షనె నహో
    కాకి నృత్యమాడె కేకి వొగడె.

    రిప్లయితొలగించండి
  16. కాకి నృత్య మాడె కేకి వొగ డె నట
    బాగు బాగు వినుము భ రత ! నీ వు
    పూ వు పెట్టు కొనుము పొసగంగ చెవిలోన
    వినగ రాని మాట వినుట వలన .

    ( క్షమించాలి )


    రిప్లయితొలగించండి
  17. తల్లి మరణ మొంద తనయుడొక్కండట
    దర్ప మెసగగను ప్రధాని పదవి
    నొందె, మేటి నేత యొగ్గి దారి విడువ-
    కాకి నృత్యమాడె కేకి వొగడె.

    రిప్లయితొలగించండి
  18. ఆకతాయి యొకడు బొమ్మల గీయుచు
    నుండి, జూపె నాకు నొక్కమారు.
    నగవుకొంటి నేను నాడు- "చిత్రముగన
    కాకి నృత్యమాడె కేకి వొగడె"

    రిప్లయితొలగించండి
  19. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము 1వ పాదములో యతిని గమనించ లేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. పొరబాటుకు మన్నించండి.
    బుద్ధి లేనివాడు అని వ్రాసి వేసిన యతి మార్చలేదు.

    చిన్నవాడొకండు చిత్రము గీయుచు
    నుండి, జూపె నాకు నొక్కమారు.
    నగవుకొంటి నేను నాడు- "చిత్రముగన
    కాకి నృత్యమాడె కేకి వొగడె"

    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  21. చేయవలయు నెవరు చేయవలసి నట్టి
    పనులు వారు కడగి బడయ సుఖము
    పరుల ధర్మములను పాటింప నిట్లగున్
    “ కాకి నృత్యమాడె కేకి వొగడె "


    అడవి జంతువుల స్వాభావికతలో మార్పు సంభవిస్తే
    పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకొనే దృశ్యం :

    చిరుత గడ్డి మేసె చియ్యను ముట్టక
    లేడి జంపె పులిని పాడి దప్పి
    అడవిలోని ప్రాణు లన్నియు నిటులనే -
    కాకి నృత్యమాడె కేకి వొగడె !

    రిప్లయితొలగించండి
  22. పెండ్లి కేగి చూడ పిల్ల కాకి యనగ
    వరుని గాంచి నంత బధిరు డనుచు
    సరస మాడు కొనగ సరదాగ నిరువురు
    కాకి నృత్య మాడె కేకి వొగడె !

    పిల్ల కాకి = పిల్ల కాకి నలుపు అని

    రిప్లయితొలగించండి
  23. అయ్యా! మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ ప్రయోగము -- దిక్కులేకను యుండ - అనే చోట యడాగమము రాదు కదా. పరిశీలించండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. జంతు సభను దీర్చె జాగిలములు మెండు
    పక్షి రాజు లంత వృక్ష మలరె
    నక్క బావ యొకడు చక్కగా దరిజేరె
    కాకి నృత్య మాడె కేకి వొగడె !

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    ఈ నాటి పూరణలను ప్రశంసించడం మంటే....

    భావ భంగిమల సుపద లాస్య శోభితం
    బైన పూరణముల నద్భుతముగఁ
    జేసినట్టి కవులఁ జేరి మెచ్చుకొనుట
    కేకి నాట్యమాడఁ గాకి వొగడె.

    రిప్లయితొలగించండి
  26. దేశమందు నీతి దిక్కు లేనట్లుండ
    సుపరి పాలనంచు సుద్దు లాడు
    ప్రముఖ నేత వంత పాడగ ననుచరుల్
    కాకి నృత్యమాడె కేకి వొగడె.

    రిప్లయితొలగించండి


  27. పర్ణశాల దరిని బగటి వేషము నూని
    సొగసు లొలుక బోయ శుర్పణఖయు
    చెలువతనము మెచ్చె సీత యించుక మది
    కాకి నృత్యమాడ కేకి వొగడె !

    రిప్లయితొలగించండి
  28. నేమాని పండితార్యా ధన్యవాదములు . సవరించాను.

    రిప్లయితొలగించండి
  29. కాకి కేకి జేసి కేకి కాకిని జేసి
    మంచి చెడుల నెంచు మాన్య మీరు
    తప్పు కొనగ తగునె తప్పదు చేయంగ
    గుణ విచారణమ్ము గురువులు గద.

    రిప్లయితొలగించండి
  30. చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అది ‘ఒడలు’ కదా. వడలు శబ్దానికి వాడిపోవు అని అర్థం (లేదా ఖాద్యపదార్థమైన ‘వడ’కు బహువచనరూపం).
    ‘వాడొకడు శిఖిఁ గని పరవశించి’ అందామా?
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు. ఈనాటి సమస్య ఆటవెలది కనుక అందరూ అలవోకగా ఆడుకున్నారు. ఎక్కువ పూరణలు వచ్చాయి. అదే మత్తేభమైతే ప్రావీణ్యమనే అంకుశం ధరించిన కొద్దిమంది మాత్రమే పూరణలు చేసేవారు.
    మిత్రుల పూరణముల గుణదోషాలను పరామర్శిస్తున్నందుకు కృతజ్ఞుడను.
    ఇక మీ పూరణము వాస్తవాన్ని చూపే దర్పణమై శోభిస్తున్నది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఉత్తరుడు విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మీ రెండవ పూరణ చక్కగా ఉంది. ‘దైత్యవేంద్రుడు’? ‘దైత్యవిభుని గాంచి’ అందామా?
    సీత సౌశీల్యాన్ని వివరించిన మీ మూడవ పూరణ కూడా బాగుంది.
    *
    చింతా రామకృష్ణా రావు గారూ,
    మీ ప్రశ్నాంబకాన్ని నాపైనే గురిపెట్టారు. ప్రశ్నార్థకమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ మొదటి పూరణ చదువుతుంటే ఏదో తత్త్వగీతం గుర్తొస్తున్నది. బాగుంది.
    గన్నవరపు వారి స్ఫూర్తితో వ్రాసిన మీ రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    పౌండ్రక వాసుదేవుడు విషయంగా మీ మొదటి పూరణ బాగుంది.
    మీ రెండవ పూరణ కూడా చక్కగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    చెవిలో పువ్వు పెట్టిన మీ పూరణ వ్యంగ్యోక్తితో చక్కగా ఉంది. అభినందనలు.
    *
    రామకృష్ణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    నిజమే నేపథ్యబలంతో కాకులు గద్దె నెక్కుతున్నాయి. నెమళ్ళు నాట్యమాడి వాటికి మనోల్లాసాన్ని కలిగిస్తున్నాయి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    యతి సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ‘దొందూ దొందే’ అన్నట్టున్న మీ పూరణ బాగుంది.
    మీ రెండవ పూరణ ‘జంతుసభ’ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. కౌర వాదుల నిల కడతేర్తు నేనంచు
    పలుక సాగె గొప్ప బలుని వోలె
    ఉత్తరుని నుడులకు నూ కొట్టె బ్రార్థుడు
    కాకి నృత్యమాడె కేకి వొగడె.

    రిప్లయితొలగించండి
  32. అడవిని మృగరాజు హాయిగా కొలువును
    దీర్చి పాట పాడె తీయగాను
    నక్క డోలు కొట్టె కుక్క సన్నాయూదె
    కాకి నృత్యమాడె కేకి వొగడె.

    రిప్లయితొలగించండి
  33. బట్టురా జొకండు నట్టువ పులుగగ
    బుట్టె; నాటవెలది బుట్టె వాయ
    సముగ; నవి తమ తమ స్వాభావికత చేత
    కాకి నృత్యమాడె కేకి వొగడె

    రిప్లయితొలగించండి
  34. మూర్తీజీ !
    నన్ను గుర్తు చేసు కున్నందుకు మహదానందముగా నున్నది !
    జాల(net)తదితర సమస్యల వలన మిత్రులకు అప్పుడప్పుడూ దూరమౌతున్నా గాని,
    మిమ్మల్నందరినీ తలచుకోని రోజే ఉండదు !

    రిప్లయితొలగించండి
  35. శంకరాభరణమున :

    03)
    _______________________________

    కాకి వంటి నేను - కవితలు వ్రాయంగ
    మిగుల వాని నెపుడు - మెచ్చుకొనుచు
    శంక దీర్చుచుండు - శంకరార్యుండిట !
    కాకి నృత్యమాడె - కేకి వొగడె !
    _______________________________

    రిప్లయితొలగించండి
  36. అండగోరివారికర్హతలేకున్న
    అందలంబునెక్కియాటలాడి
    విర్రవీగిదోచవెన్నుతట్టగనంద్రు
    కాకినృత్యమాడెకేకి వొగడె!

    రిప్లయితొలగించండి
  37. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘బలుని వోలె’... ‘బంటు వోలె’ అయితే...? ‘కొట్టెఁ బార్థుడు’ టైపాటు వల్ల ‘కొట్టె బ్రార్థుడు’ అయింది!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    జంతువుల కళాప్రదర్శన అలరించింది. అభినందనలు.
    *
    నాగరాలు రవీందర్ గారూ,
    పూర్వజన్మ వాసనలను వీడలేదన్నమాట! బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    ధన్యవాదములు.
    నిన్న రాత్రి ఏలూరు NNR గార్డెన్స్‌లో (వరసకు) మా బావమరది కుమారుని వివాహం జరిగింది. దానికి రావలనుకున్నాను కాని అంత దూరం ప్రయాణించడానికి ఆరోగ్యం సహకరించలేదు. వస్తే అక్కడి పరిసరాల్లో వున్న మిత్రులను కలిసేవాణ్ణి.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. గోలి వారి స్ఫూర్తితో :

    మృగరాజ పట్టాభిషేక సందర్భమున
    వెన్నెల వెలుగులో విందులు, చిందులు :

    04)
    _______________________________

    కలిసె మెకము లన్ని - కరిదారకము తోడ
    కాన, కలువ ఱేని - కాంతి యందు !
    కరటి పాట పాడ - కపులతో ధీటుగా
    కాకి నృత్యమాడె ! - కేకి వొగడె !
    _______________________________

    రిప్లయితొలగించండి
  39. అయ్యయ్యో ! శంకరార్యా ! ఎంత పని చేశారు !
    కొద్దిగా ఓపిక తెచ్చుకొని రావలసింది !
    ఒక సారి వీలు చేసుకొని వచ్చి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన !
    వీలైనంత త్వరలో మన్నిస్తారని ఆశిస్తా !

    రిప్లయితొలగించండి
  40. బావుంది వ్యాసం చక్కని కొటేషన్లతో. ధన్యవాదాలు
    Telugu Cinema News

    రిప్లయితొలగించండి

  41. Amazing, this is great as you want to learn more, I invite to This is my page.

    Vastu Shastra Consultation for Home & Industries

    రిప్లయితొలగించండి
  42. Hi, Nice information and please keep posting, and for best vastu tips hope you follow my Blog
    https://www.vasthusubramanyam.com/all-blog/

    రిప్లయితొలగించండి
  43. Very valuable information, it is not at all blogs that we find this, congratulations I was looking for something like that and found it here.

    The Leo News - this site also provide most trending and latest articles

    రిప్లయితొలగించండి
  44. Usually, I never comment on blogs but your article is so convincing that I never stop myself to say something about it. You’re doing a great job Man, Keep it up.

    idhatri news - this site also provide most trending and latest articles

    రిప్లయితొలగించండి
  45. Excellent read, Positive site, where did u come up with the information on this posting? I have read a few of the articles on your website now, and I really like your style. Thanks a million and please keep up the effective work

    idhatri - this site also provide most trending and latest articles

    రిప్లయితొలగించండి
  46. Very interesting,good job and thanks for sharing such a good blog.your article is so convincing that I never stop myself to say something about it.You’re doing a great job.Keep it up

    idhatri - this site also provide most trending and latest articles

    రిప్లయితొలగించండి