11, నవంబర్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 874 (కారాగారమ్ము లొసఁగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కారాగారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

30 కామెంట్‌లు:

  1. శ్రీపతిశాస్త్రిఆదివారం, నవంబర్ 11, 2012 7:27:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    శ్రీరామ నామ మంత్రము
    నోరారగ పలుకువాని నోముల ఫలమై
    చేరగ వచ్చును హరిపద
    కారాగారమ్ము, లొసఁగుఁ గైవల్యమ్మున్

    రిప్లయితొలగించండి
  2. గౌరీనాథుని కృప సం
    సారమ్మను శృంఖలముల మాయము చేయున్
    కూరిమి శంభు పదశ్రీ
    కారాగారమ్ము లొసగు గైవల్యమ్మున్

    రిప్లయితొలగించండి
  3. ఆ రామదాసు చూడగ
    శ్రీ రాముని నమ్మి పడెను చెరసాలను తా
    చేరెను రాముని ధామము
    కారాగారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్.

    రిప్లయితొలగించండి
  4. నేరాలు సేయ ఫలితము
    కారాగార మ్ము, లొసగు గై వల్య మ్ము
    న్నా రాముని సేవించగ
    శ్రీ రాముడె మనకు రక్ష సిరి సిరి మువ్వా !

    రిప్లయితొలగించండి
  5. కోరుచు సశరీరముగా
    చేరిరి కైవల్య పథము చిన్మయ మూర్తుల్.
    చేరిన వారలు ధన్యులు
    కారా! గారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్.

    రిప్లయితొలగించండి
  6. శౌరి వసుదేవ సుతుడై
    కారాగారమున బుట్టె కంసుని జంపన్
    ఆ రీతిగ కొందఱకున్
    కారాగారమ్ము లొసగు గైవల్యమ్మున్.

    రిప్లయితొలగించండి
  7. మారెడుపశ్చాత్తాపము
    కారాగారమునఁగూడిగర్వములడగన్
    దారులుజూపగదైవము
    కారాగారమ్ములొసగుకైవల్యమ్మున్!

    రిప్లయితొలగించండి
  8. భారత స్వాతంత్ర్యమునకు
    పోరాటము సల్పి చనిరి పుంస్త్వమ ధీరుల్ !
    నారాయణు జపియింపగఁ
    గారాగారమ్ములొసగుఁ గైవల్యమ్మున్ !!

    రిప్లయితొలగించండి
  9. పారక యుక్తులు జిత్తులు
    చేరిరి కాలమ్ము గాక శ్రీమంతులయిన్
    హారి యని హరుని తలపరె
    కారాగారమ్ము లొసగుఁ గైవల్యమ్మున్ !

    రిప్లయితొలగించండి
  10. ఆరాధ్యదైవమగు శ్రీ
    నారాయణుడే జనించి నారీమణికిన్
    హౌరా! పుణ్యమ్మదియే!
    కారాగారమ్ములొసగు గైవల్యమ్మున్.

    రామకృష్ణారావు గారి విరుపు అందంగా అమరినది.
    నరసింహమూర్తిగారు,
    స్వాతంత్ర్య సమరవీరుల గురించిన పూరణ బాగున్నది.




    రిప్లయితొలగించండి
  11. ఆరాధ్యదైవమగు శ్రీ
    నారాయణుడే జనించె నారీమణికిన్
    హౌరా! పుణ్యమ్మదియే!
    కారాగారమ్ములొసగు గైవల్యమ్మున్.

    రామకృష్ణారావు గారి విరుపు అందంగా అమరినది.
    నరసింహమూర్తిగారు,
    స్వాతంత్ర్య సమరవీరుల గురించిన పూరణ బాగున్నది.

    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీదేవి గారూ ధన్యవాదములు. భగవద్గీతకు భాష్యము వ్రాసిన బాలగంగాధర తిలక్ మనస్సున మెదిలారు. ఆరాధ్య దైవాలను స్మరించిన మనందరికీ కైవల్యము ప్రాప్తించాలి.

    రిప్లయితొలగించండి
  13. తమ్ముడు చి. డా. నరసింహమూర్తి పద్యములో 2వ పాదము మార్పు చేయాలి. ఇలా పద్యమును చదువుకొందాము:

    పారక యుక్తులు జిత్తులు
    చేరిరి శ్రీమంతులయ్యు చెరసాల కహో
    హారి యని హరుని తలపరె
    కారాగారమ్ము లొసగు కైవల్యమ్మున్

    రిప్లయితొలగించండి
  14. పేరాశ వలన నేతలు
    కూరిమితో రాత్రికి రాత్రి కుబేరులవగన్ !
    నేరము తెలిసిన పిమ్మట
    కారా గారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్ !

    రిప్లయితొలగించండి
  15. నేరము లెంచకు రామ
    భారముగా గడుపు చుంటి పాపిని నేనై !
    తీరని భవ బంధమ్ముల
    కారా గారమ్ము లొసఁగుఁ గైవల్య మ్మున్ !

    రిప్లయితొలగించండి
  16. గీరను బెంచెడు దురహం
    కారము లొసగును నరులకు కల్మష మనముల్
    శౌరిని గొల్చెడు నిరహం
    కారాగారమ్ము లొసగు గైవల్యమ్మున్

    అగారము = ఇల్లు , స్థానము

    రిప్లయితొలగించండి
  17. మారెనట ’గాలి’ వాటము
    కోరెనట విడుదల డబ్బుగుప్పించెనుబో
    కోరికలన్నియు తీరెడి
    కారాగారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్.

    రిప్లయితొలగించండి
  18. రాజేశ్వరక్కయ్యగారూ, మీరూ వేదాంతంలోకి దిగితేఎలా? అత్తగారి పెత్తనం చెలాయించాలి గానీ:-)

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘శ్రీకార + ఆగారమ్ము’ అన్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కైవల్యమ్మున్ + ఆ’ అన్నప్పుడు ద్విత్వంతో ‘కైవల్యమ్ము న్నా’ అనడం అంత ఆమోదయోగ్యం కాదు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘భారత స్వాతంత్ర్య’ అన్నప్పుడు ‘స్వా’కు ముందున్న ‘త’ గురువై గణదోషం. ఆ పాదాన్ని ‘భారత దేశ స్వేచ్ఛకు.../ భారత దాస్య విముక్తికి’ అందాం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ‘హౌరా!(?)’ ఎంత బాగా చేసారు పూరణను... హౌరా బ్రిడ్జి ఎక్కినట్లుంది! అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ రెండవ పాదంలో గణం, యతి రెండు తప్పాయి. ‘కూరిమి రాత్రికిని రాత్రి కోటీశ్వరులే!’ అందాం.
    రెండవ పూరణ ‘రామా’ అనబోయి ‘రామ’ అని టైపాటు చేసినట్టున్నారు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీరమణుడు వేంకటపతి
    ఘోరాఘము లణచివేసి కోరికలెల్లన్
    తీరగ వరమిడు, ద్రుంచును
    కారాగారమ్ము, లొసగు కైవల్యమ్మున్

    రిప్లయితొలగించండి
  21. నాగరాజు రవీందర్ గారూ,
    మీ లేటెస్ట్ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణా సామర్థ్యపు ‘గాలి’ వేగంగా తగిలింది మాకు. కొట్టుకుపోని అభినందనలు మీకు!

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతి శాస్త్రి గారూ,
    మన్నించాలి. హనుమచ్ఛాస్త్రి అనుకుని వారివి రెండు పూరణులుగా వ్యాఖ్యానించాను.
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    చక్కని పూరణ మీది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. గురువు గారూ ధన్యవాదములు. అన్నయ్య గారి సవరణకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  24. గురువులకు నంస్కారములు
    ఒకోసారి బుఱ్ర పని చేయదు. ప్చ్ ! అదంతె ~ సవరణకు ధన్య వాదములు
    సోదరులు చంద్ర శేఖర్ గారూ ! అత్త గార్లు పెత్తనం చేసే రోజులు పోయాయ్ .అందునా అమెరికాలొ ఇదీ.... కోడళ్ళ యుగం.." తస్మాత్ జాగ్రత జాగ్రత . "

    రిప్లయితొలగించండి
  25. జంగిడి రాజేందర్ఆదివారం, నవంబర్ 11, 2012 9:35:00 PM


    నేరా లెఱుగని గోపని
    కారాగారమున వేసి గడసరి రాజుల్
    రారా శ్రీరామా యన
    కారాగారమ్ము లొసగు గైవల్యంబున్.

    రిప్లయితొలగించండి
  26. గురువుగారికి నమస్సులు.
    మీమౌస్ నాపద్యాన్ని తప్పించిందనుకుంటాను.కామెంట్ లేదు.

    రిప్లయితొలగించండి
  27. సహదేవుడు గారూ,
    నిజమేనండోయ్... మీ పూరణ నా దృష్టికి రాలేదు. మన్నించాలి.
    కారాగారాలు నేర ప్రవృత్తిని మార్చుతాయన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. "ఇదం శరీరం వ్యాధి మందిరం"


    ఈ రోగపు నిలయములో
    నారూఢము మరణమన్న నారాటములో
    శ్రీరామ నామ వలపుల
    కారాగారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్

    రిప్లయితొలగించండి
  29. హారే! మాధురి దీక్షిత్!
    దేరే! ఫోటోను నీది దివ్యపు రూపున్
    గారాబున నీ స్మితముల
    కారాగారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్!

    రిప్లయితొలగించండి