7, నవంబర్ 2012, బుధవారం

శ్రీరామ మానస పూజ

శ్రీరామ మానస పూజ
(సంక్షిప్త రామాయణ పారాయణమునకు అనుకూలము) 
రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు


శ్రీరామ! జయరామ! సీతా హృదారామ!
          వారిధర శ్యామ! భవ విరామ!
కళ్యాణ గుణధామ! క్ష్మాజనస్తుత నామ!
          క్షత్రియకుల సోమ! సమర భీమ!
అఖిలాండకోటి బ్రహ్మాండాధినాయకా!
          బృందారకస్తుత్య విమల చరిత!
దుష్ట సంహారకా! శిష్ట సంరక్షకా!
          ధర్మ సంస్థాపకా! ధర్మరూప!
అంతరంగ నివాస! వేదాంతవేద్య!
ఆది మధ్యాంత రహిత! దేవాదిదేవ!
సచ్చిదానంద మూర్తివి స్వామి! ధరణి
నరశరీరము దాల్చిన పరమపురుష!

ఆశ్రిత పోషక! ఆపదుద్ధారక!
          భక్తజనానీక పారిజాత!
పూజింతు నిను మనః పుండరీక నివాసు
          మానస పూజా విధాన మలర
బ్రహ్మాది దేవతల్ ప్రార్థింపగా భువి
          నవతరించిన యట్టి యమర వినుత!
పరమాత్మ వీవంచు పరమ పూరుష! రామ!
          ధ్యానింతు నీదు తత్త్వ ప్రశస్తి
కమలాప్త వంశాన కౌసల్య గర్భాన
          దశరథ రాజ నందనుడ వగుచు
యజ్ఞఫలమ్ముగా నవతరించిన రామ!
          ఆవాహనమ్మిదే ఆదిదేవ!
తాటకన్ బరిమార్చి తపసి యజ్ఞముగాచి
          విజయహాసమ్ముతో వెలుగు చున్న
బహు పరాక్రమశాలి! పరమ పావనశీలి!
          రత్నాసనమ్మిదే రామచంద్ర!
పాదరజమ్ముచే పాపమ్ములన్ బాపి
          సాధ్వి అహల్య పూజలనుబొంది
తనరారుచుండిన ఘన యశోధన! రామ!
          పాద్య జలమ్మిదే పద్మ నయన!
జనక మహీశు పూజలనంది యటనున్న
          హరు చాపమును ద్రుంచి యవనిసుతను
హర్షమ్ముతో బెండ్లియాడిన శ్రీరామ!
          అర్ఘ్యమియ్యదె సజలాబ్ద వర్ణ!
భార్గవరాముని భ్రమలను బోగొట్టి
          వానిచేత నుతింప బడిన రామ!
వినయాద్యలంకార! వీర్య శౌర్య ధనాఢ్య!
          ఆచమనీయ మియ్యదె మహీశ!
పినతల్లి కోర్కెపై పితృ నాజ్ఞనున్ గొని
          కాంతతో ననుజుతో గహనములకు
జనినట్టి దుష్ట శిక్షక! సాధురక్షక!
          స్నానమ్ము నీకిదే జ్ఞాన తేజ!
భక్తాగ్రగణ్యుండు భరతుండు రాజ్యంబు
          పాలింపుమని సేయ ప్రార్థనమ్ము
వలదంచు వానికి పాదుక లిడినట్టి
          ధర్మాత్మ! కొనుము వస్త్రమ్ము లివియె!
దనుజుల గూల్చుచు మునుల రక్షించుచు
         నభయ మొసంగుచు నడవులందె
వారలకండవై వాసమొనర్చిన
         రామ! యీ యజ్ఞసూత్రమును గొనుము
కామాతురాసుర కాంతను శిక్షించి
         ఖరదూషణాది రాక్షసుల గూల్చి
బల పరాక్రమముల భాసిల్లు శ్రీరామ
         ఆభరణములివే అభయ వరద!
మాయా మృగాకారు మారీచునిన్ గూల్చి
         ఆశ్రమంబున సీత నరయలేక
అపహరింపబడిన దనుచు శోకించిన  
         స్వామి! గైకొనుమయ్య చందనమ్ము
రామపత్నిని వేగ రథముపై గొనిపోవు
          రాక్షసు నెదిరించి పక్షిరాజు
పడియుండ విలపించి వాన్కి సద్గతులిచ్చి
          నట్టి స్వామీ! కొను మక్షతలను
శబరి భక్తికి మెచ్చి సద్గతులనొసంగి
          ఋశ్యమూకమున సుగ్రీవు జేరి
వాని సఖ్యమొనర్చి వాలిని బరిమార్చి
          నట్టి నీకిదియె పుష్పార్చనమ్ము
కిష్కింధ కంత సుగ్రీవు రాజును జేసి
          వాని సాయమ్ముతో వానరతతి
ననిపి సీతాదేవి నరసిరండని నట్టి
          స్వామి! నీకిదియె ధూపమ్ము రామ!
ఆ వానరులలోన నతి సమర్థుండైన
          ఆంజనేయుని బిల్చి యవనిసుతను
గాంచుమా యనుచు నుంగరమిచ్చి పంపిన
          దేవదేవా! యిదే దీపరాశి!
హనుమ వారిధి దాటె, నవనీసుతను జూచె,
          దశకంధరునికి హితమ్ము దెలిపె,
రాక్షసులను గూల్చె, లంక గాల్చె నటంచు
          వినిన నీకిదియె నైవేద్య మయ్య!
వానర సేనతో వారిధి దరిజేరి
          శరణు గోరిన విభీషణుని గాచి
సేతువు నిర్మించి శివలింగమును గొల్చి
          నట్టి నీకిదె విడియమ్ము రామ!
లంక లోనికి జొచ్చి రణరంగమున నిల్చి
          పంక్తికంధరు గూల్చి ప్రాభవమున
బ్రోచి విభీషణు, భూమిజన్ బొందిన
          రామ! నీకిదియె నీరాజనమ్ము
పోయి పుష్పకముపై పురమయోధ్యను జేరి
          బంధు మిత్రుల గూడి వైభవముగ
పట్టాభిషేకాన ప్రజల మన్నన గొన్న
          రామ! నీకిదియె మంత్ర సుమ రాజి
వందనమిదె రామ! వందారు మందార!
          సుజన పాలక! జయ శుభ విలాస!
దనుజ గణ వినాశ! ధర్మ సంరక్షక!
          రామ! భవవిరామ! ప్రణతి నీకు
రామ తత్త్వము యోగిరాజ సంభావ్యమ్ము
          ప్రజ్ఞాన విభవ ప్రభాకరమ్ము
రామ నామము మనోరంజకమ్ము సమస్త
          దుఃఖ నాశకము సంతోషదమ్ము
రామ మంత్రము పవిత్రము సర్వ లోకైక
          రక్షాకరాతి విరాజితమ్ము
రామ పాదాంభోజ రజము దోషహరమ్ము
          భక్తి సౌభాగ్య సంపత్కరమ్ము
రామ హృదయమ్ము సజ్జనాశ్రయ వరమ్ము
రామ వచనమ్ము సత్య విభ్రాజితమ్ము
రామ! శ్రీరామ! జయ రామ! రామ! రామ!
రామ! శ్రీరామ! జయ రామ! రామ! రామ!

ఓం తత్ సత్!

16 కామెంట్‌లు:

  1. సుమధుర కవితా గానములో ఓల లాడితిమి. సుమధుర కవి శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి ధన్యవాదములు దెలుపుచు,
    శ్రీ రామ మానస పూజను నిత్యము పారాయణము తప్పక జేసేదము

    రిప్లయితొలగించండి
  2. శ్రీమాన్ పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారు రచించిన శ్రీ రామ మానస పూజ భక్తి పారవశ్యులమై పారాయణ చేయుటకు యోగ్యముగా ఉండుటయే కాక, ఏక క్రియా ద్వ్యర్థికరీ అన్నట్లుసంక్షిప్తముగా రామాయణ సార సంగ్రహమును పారాయణము చేయు చున్నందున శ్రీమద్రామయణ పారాయణ మహా ఫలప్రదము కూడా అగుచున్నది.

    మనమున రామునిం దలచి మానస పూజ యొనర్చు భాగ్యమున్,
    సునిశిత రామ తత్వమును సుందరమొప్ప పఠించు భాగ్యమున్,
    జనన మృతాదులన్ విడిచి శాశ్వితు రాముని చేరు భాగ్యమున్,
    గొనుఁడని యందఁ జేసె కవి కోవిద సన్యసి రావు సద్గురుల్.

    వారికి, శంకరయ్య గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. గురువు గారు శ్రీ నేమాని వారి శ్రీరామ మానస పూజ మా వంటి వారందిరికీ పారాయణకు యోగ్యముగాను, బహు హృద్యముగాను యున్నది.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ నేమాని వారికి నమస్కారములు. రామకథలో షోడశోపచారములు కలిపి చక్కగా చెప్పినారు.

    రిప్లయితొలగించండి
  5. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తిని షోడశోపచారములతో మన హృదయంలోనే పూజించుకొనే సరళమైన విధానమును మాకందించిన నేమాని పండితార్యా ! మీకు ప్రణామ శతము.
    గురువుగారు చింతా వారన్నట్లు ఉభయతారకంగా, మళ్ళా అడిగితే మూడు విధాల ప్రయోజనాన్ని అంటే వారి పద్యమాలికను చదివితే ఒకటి రామాయణ పారాయణ ఫలితం, రెండు శ్రీరామార్చన ఫలితం, మూడు తారకనామ స్మరణ ఫలితం కలిగేలా కూర్చి మాకందించారు. ఇది మా అదృష్టం.

    శ్రీ రఘురామ శ్రీ చరణ శ్రీకర యుగ్మము మానవాళికిన్
    నేరుగ ద్రోవ ముక్తికని నిత్యము మానసపూజ చేయగా
    తారకనామ మంత్ర పరతత్త్వము నింపిన పద్య మాలికన్
    నేరుపు మీర జేసిడిన నేమని పండితు నే నుతించెదన్.

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! చి. డా. మురళీధర రావు గారూ! శుభాశీస్సులు.
    మీరు శ్రీరామ మానస పూజకి చేసిన స్పందన హర్షణీయము. అందులొ 2వ పద్యములో (ఆనందావహ - అని మొదలైన పద్యము) 2వ పాదము ఒకమారు పరిశీలించండి. ఆ పాదము హ్రస్వ అక్షరముతో మొదలయినది. అది టైపు పొరపాటా? మిగిలిన పాదములు దీర్ఘముతో మొదలుపెట్ట బడినవి కదా! ప్రాస నియమము భంగము జరుగ కుండా మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. అన్నయ్యగారు శ్రీ రామచంద్రమూర్తి కృపకు విశేషముగా బాత్రు లయ్యారు. అందుచేతనే శ్రీవాణి వారి చేత శ్రీమదాధ్యాత్మక రామాయణమునే కాక యీ సంక్షిప్త రామాయణమును నిత్య పారాయణమున కనుకూలముగా బలికించినది. శ్రీ రామమానస పూజ అద్భుతము. అన్నగారికి మరో పర్యాయము పాదాభివందనములు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీరామ మానస పూజను చదివి చక్కగా మిత్రులెందరో స్పందించేరు. అందరికీ ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అండదండలు నిత్యము ఉంటాయి. అలా స్పందించిన మిత్రులు --

    1. శ్రీ వరప్రసాదు గారికి
    2. శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి
    3. శ్రీ మారెళ్ళ వామన కుమార్ గారికి
    4. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
    5. శ్రీ మిస్సన్న గారికి
    6. డా. ఏల్చూరి మురళీధర రావు గారికి
    7. తమ్ముడు డా. గన్నవరపు నరసింహ మూర్తికి

    అనేకానేక శుభాశీస్సులు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి

  9. రామ కథామృత యుక్తం
    బౌ మానసపూజ నొసఁగి యద్భుతరీతిన్
    మా మనము లెల్ల గెలిచిన
    నేమానికి వందనముల నే నొనరింతున్.

    రిప్లయితొలగించండి
  10. పూజ్యశ్రీ గురుదేవులకు
    నమోవాక్యపరశ్శతపురస్సరముగా,

    శ్రీరామాయణ సంగ్రహ
    పారాయణఫలము సత్కృపావృష్టిని సం
    సారాయణులకు మాదృశ
    ఘోరాయణుల కొసఁగితిరి కోమలకవితన్.

    ఆనందావహకావ్యా
    ధ్వానీతరసమయ మీ సుధామయపద్యా
    నూనం బగు మాధురికి శ
    తానేకాయుర్విభవముదాప్తి గలిగెడిన్.

    శ్రీరామా! శ్రీరామా!
    శ్రీరామా! రామ! రామ! శ్రీరఘురామా!
    నోరారఁగ నీ నామము
    పారాయణ చేయు కవి కభయవర మిమ్మా.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  11. ఆర్యా!
    నమస్కారములు,
    ఆలస్యంగా మీ "శ్రీరామ మానస పూజ" చదవడం జరిగింది.
    మహదానందముగా నున్నది.

    శ్రీరామ రామ యన్నను
    ఘోరాఘములెల్ల బాయు కువలయమందున్
    నోరారగ నారాముని
    మీ రోకవివర్య! దలచి మించిరి కవులన్.

    మీ "మానసపూజన"మిది
    నేమానిబుధాగ్రగణ్య! నిత్యస్తవమై
    భూమిని వెలుగును సత్యము
    శ్రీమన్! గురువర్య! మీకు చేతును ప్రణతుల్.

    రిప్లయితొలగించండి
  12. మా శ్రీరామ మానస పూజ గురించి ఆనందమను గొలుపు వ్యాఖ్యలను వ్రాసిన శ్రీ కంది శంకరయ్య గారికి శ్రి హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి శుభాశీస్సులు.

    శ్రీ హరి వారూ! మీరు విజయనగరము జిల్లాలో ఎక్కడ నుంటున్నారో మాకు తెలియజేయండి. నా విలాసములు:
    ఫోను: 0891 - 2565944 / 9440233175

    మీ ఫోను పిలుపుకై ఎదురు చూచుచుంటాను.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. నంస్కారములు
    శ్రీ రామ మానస పూజను నిత్య పారాయణకు అనుకూలముగా సులభ శైలిలో అందించిన పూజ్య గురువులు శ్రీ పండిత నేమాని వారి పాద పద్మ ములకు ప్రణామములు

    రిప్లయితొలగించండి