20, నవంబర్ 2012, మంగళవారం

సమస్యా పూరణం - 883 (దిన ఫలముల వలన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దిన ఫలముల వలన మనకుఁ దృప్తి కలుఁగునే?
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

22 కామెంట్‌లు:

  1. ఘనముగ జెప్పెడి ఫలితము
    విని నంతనె మనసు కెంతొ వేడుక పుట్టున్ !
    అనుభవ మున కలమిగులగ
    దిన ఫలముల వలన మనకుఁ దృప్తి కలుఁ గునే ?

    రిప్లయితొలగించండి
  2. ఘనమగు కబంధ హస్తము
    లను జాచుచు గనుల వనరులను దోచుటయే
    మన నాయకులకు లక్ష్యము
    దిన ఫలముల వలన మనకు దృప్తి కలుగునే?

    రిప్లయితొలగించండి
  3. జనులను మోసము జేయుచు
    ఘన నాయకు లేమొ పెంచు గంపెడు యాశల్
    కన నరకొరగా మనకం
    దిన ఫలముల వలన మనకు దృప్తి కలుగునే?

    రిప్లయితొలగించండి
  4. వనజభవుడు విధివ్రాతల
    నెన లేమిడిని తలచుకొని యేడవ మనుచున్
    మన నుదుటన వ్రాయఁగ పొం
    దిన ఫలముల వలన మనకుఁ దృప్తి కలుఁగునే?

    రిప్లయితొలగించండి
  5. దినకార్యఫలముమాపటి
    కనుకూలించినమరింతయానందమిడున్!
    గనలేనియూహలల్లిన
    దినఫలములవలనమనకుతృప్తికలుగునే?

    రిప్లయితొలగించండి
  6. జనులెల్లరకును యోగము
    ననువుగ జెప్పెడు దినఫలమందరి దౌనే!
    మనకది జెల్లునొ లేదో?!
    దిన ఫలముల వలన మనకుఁ దృప్తి కలుఁగునే?

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    ధన్యవాదములు దెలుపుచు
    ======*=======
    మనమున కలుషిత మధికము
    ఘనముగ ధనపరుల తోడ కలిమియు ఘనమై
    వనమున నడయాడు నపుడు
    దిన ఫలముల వలన మనకు దృప్తి కలుగునే ?

    (వనము = అడ్డ దారి )
    =======*====
    మనమున కలుషిత మధికము ,మరులకై బరుగిడుచూ
    ఘనముగ ధనపరుల తోడ కలిమియు ఘనమగుట,దీ
    వెనలని బలికి జనకులను వీధి విడచి దిరిగి నా
    దిన ఫలముల వలన మనకు దృప్తి కలుగునే ?సతీ !
    ======*=====
    మనమున కలుషిత మధికము,మరులకై బరుగులు
    ధనపరుల జెలిమియు ధరణిలోన
    పొంకము గను ఖలులు బొందిన ఫలముల
    వలన మనకు దృప్తి కలుగునేడు ?

    చదువు సంధ్యలు లేక,నా చారములను
    వీడి ఖలుల జెంతను జేరి కాడి బట్ట ,
    వారు పొందిన ఫలముల వలన మనకు
    దృప్తి కలుగునే ?నీనాడు దేశమందు
    (కాడి బట్ట = పరిపాలన)

    రిప్లయితొలగించండి
  8. శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్య విన్యాసములు శ్లాఘనీయములు.
    (1) కందము (2) కందగర్భిత ఉత్సాహ (3) ఆటవెలది (4) తేటగీతులలో మీరు చేసిన కృషి చాల బాగున్నది. ఆటవెలది మొదటి పాదములో గణములు సరిపోలేదు. సరిచేయుటకు ప్రయత్నించండి. మీలో ఉత్సాహము ఉరకలు వేస్తున్నది. జయోస్తు.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా! చంద్రశేఖర్ గారూ!
    శుభాశీస్సులు. మీరు నిరుత్సాహకరమైన భావమును వ్యక్తము చేసేరు. ఉత్తేజము కలిగించేటట్లు వ్రాయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. అనయము రోగము గలిగిన
    మనుజున కుం మందు కాక మనుగడ కోసం
    మొనయగ క లు వ గ జోస్యుని
    దిన ఫలముల వలన మనకు దృప్తి గలుగునే ?

    రిప్లయితొలగించండి
  11. ధనలాభము నేడైన న
    గునో యనుచును కనినంత కులసతితోఁ బో
    రును రూఢిగఁ జెప్పినచోఁ
    దిన ఫలముల వలన మనకుఁ దృప్తి కలుఁగునే?

    రిప్లయితొలగించండి
  12. శ్రీ నేమాని గురు దేవులకు పాదాభి వందనము, ధన్యవాదములు
    ఈ శిష్యుని క్షమించగలరు ఉత్సాహములో గణములను జూడకుంటిని
    ఉత్తర ప్రదేశ్ నందు అక్రమ మధ్యమ వ్యాపారిని తమ్ముడు కాల్చి జంపెను కడకు,వారు బొందిన ఫలముల జూడ మనకు దృప్తి కలుగు నని
    ======*========
    మనమున కలుషితము,మరులకై బరుగులు
    ధనపరుల జెలిమియు ధరణిలోన
    పొంకముగను ఖలులు బొందిన ఫలముల,
    వలన మనకు దృప్తి కలుగునేడు ?

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! శ్రీ సుబ్బారావు గారూ!
    కోసం అనే ప్రయోగము బాగులేదు. కొరకున్ అని మార్చి చూడండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. జను లధికులు ఔనందురు
    దిన ఫలముల వలన మనకుఁ దృప్తి కలుఁగునే?
    యని యడిగిన ,కొందరు యే
    దిన ఫలముల లెక్కగొనరు తెలియుము గురువా !

    రిప్లయితొలగించండి
  15. అయ్యా శ్రీ లక్ష్మీ నారాయణ గారూ! అభినందనలు.
    మీ పద్యములో -- అధికులు + ఔనందురు -- అనే చోట ఉకార సంధి నిత్యము కదా. కాస్త పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. తినవలె తాజా ఫలములు
    దినమున కొకమారు కొన్ని ; తిక్తములై క్రు
    ళ్ళిన మరియు క్రిములన్ బొం
    దిన ఫలముల వలన మనకు దృప్తి కలుగునే ?

    రిప్లయితొలగించండి
  17. జను లధికు లందు రౌనని
    దిన ఫలముల వలన మనకుఁ దృప్తి కలుఁగునే?
    యని యడిగిన ,కొందరు యే
    దిన ఫలముల లెక్కగొనరు తెలియుము గురువా !

    రిప్లయితొలగించండి
  18. రాజేశ్వరి అక్కయ్యా,
    ఈరోజు మొదటి పూరణ మీదే. ఆనందంగానూ, కొద్దిగా ఆశ్చర్యంగానూ ఉంది.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘మనసుకెంతొ’ అనకుండా ‘మనసునకెంతొ’ అనాలికదా! ‘మనమున కది’ అని సవరిద్దాం.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘గంపెడు + ఆసల్’ అన్నపుడు యడాగమం రాదనుకుంటాను. ‘గంపెడు కాంక్షల్’ అందామా?
    *
    చంద్రశేఖర్ గారూ,
    విధివిలాసంపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    శారదా వరప్రసాదంగా పద్యరచనా కళ మీకు లభించింది. క్రమక్రమంగా పద్యరచనలో మీ పురోగమనం ఆనందాన్ని కలిగిస్తున్నది (కించిత్తు గర్వంగా ఉంది)
    వివిధ ప్రక్రియల్లో మీ నైపుణ్యం ముగ్ధుల్ని చేస్తున్నది. శుభమస్తు!
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    నేమాని వారి సవరణను గమనించారు కదా!
    *
    రామకృష్ణ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ (సవరించిన) పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    నిజానికి మిత్రులు పంపిన సమస్య ‘దిన ఫలముల భక్షణమున దృప్తి కలుగునే?’ దానిని కొద్దిగా మార్చినాను. మీ పూరణ దానికి పూర్తిగా సరిపోతుంది. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ నేమాని మహాశయులకు వందనములు. అన్నీ ఉన్నాగానీ ఎందరో ఎప్పుడూ బీదపలుకులు పలకటం అసంతృప్తి వ్యక్తం చేయటం చూస్తూనే ఉన్నాము. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేవుడు మనకు ఎంతో ఇచ్చినా ఏదో కొరత అనుకోవటం. ఇది అలాంటి వాళ్ళ మొహాన బ్రహ్మవ్రాసిన వ్రాతేనేమో. వ్యాసులవారి మాట మనసులో మెదిలి నిజాంశమే వ్రాశానను కొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  20. ధనమును కలహము వగలను
    ఘనముగ ఋణమును మినుముల కందల పంటన్
    అనువుగ నిచ్చుచు దోచెడి
    దిన ఫలముల వలన మనకుఁ దృప్తి కలుఁగునే?

    రిప్లయితొలగించండి
  21. వినుమా! బ్రాహ్మణ పుత్రా!
    దినదినమున తగ్గు తిండి దీనపు దుడ్డున్
    కనులను నీటినినిడు త
    ద్దిన ఫలముల వలన మనకుఁ దృప్తి కలుఁగునే?

    ఫలము = లాభము

    రిప్లయితొలగించండి