18, నవంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 164

కైలాస పర్వతము
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

 1. పార్వతీదేవితో పరమేశ్వరుడు సదా
  ....వాసమ్మొనర్చు పావన నగమ్ము
  స్వర్గలోకమునుండి వసుధ కేతెంచుచు
  ....గంగ జేరిన యట్టి క్ష్మాధరమ్ము
  బ్రహ్మర్షి వర్యులు బ్రహ్మ నిష్ఠాపరుల్
  ....తప మాచరించు భూధరవరమ్ము
  భరత ఖండమున కుత్తర దిశలోన నెల్లయై
  ....భద్రత గూర్చెడు పర్వతమ్ము
  శైవ వైష్ణవ తీర్థ రాజములు చాల
  వెలసి నట్టి విశేష పవిత్ర సీమ
  భరత మాతకు మకుటమై పరగుచుండు
  నద్భుత మహీధరమ్ము హిమాలయమ్ము

  రిప్లయితొలగించండి
 2. చిన్న సవరణ:
  నా పద్యములో 4వ పాదములో 1వ భాగమును ఇలా మార్చి చదువుకొనెదము:

  "భరత ఖండమున కుత్తర దిశ నెల్లయై"

  రిప్లయితొలగించండి
 3. ఆకైలాసము జూడగ
  నాకాశమ్మున వెలుంగు నదియే దిగెనా
  మాకై, భువిపై స్వర్గపు
  మ్రాకై హిమమున నిలబడి మహిమను జూపెన్.

  రిప్లయితొలగించండి
 4. ఆదిశక్తిని గన్నట్టి యా హిమగిరి
  పుణ్యమెల్లను పండగా పుడమిపైన
  యాదిదంపతులకు పెండ్లి యద్భుతముగ
  చేసి తరియించె గాదొకో శ్రీకరముగ.

  రిప్లయితొలగించండి
 5. ధవళాంగునికి నివాసము
  భువి పై కైలాసమిద్ది పొడగన రారే
  దివిజాపగ పుట్టిల్లిది
  అవునది మన వెండికొండ యౌ హిమ గిరులన్.

  రిప్లయితొలగించండి
 6. సకలలోకైకనాథుడై శంకరుడగు
  భవుని ధామంబు కైలాసపర్వతంబు
  ధ్యానమును బూని దీక్షతో మౌనులైన
  మోక్షకాంక్షులకియ్యది ముక్తిదంబు.

  రిప్లయితొలగించండి
 7. కైలాసాచల శృంగము
  నీలోనాలోనగలదు నిక్కముగనినన్
  శూలినిభావించ శిరో
  నాళాగ్రమదియె!నిరతమునటియించునటన్!

  రిప్లయితొలగించండి
 8. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
  మంచి భావమును ప్రకటించేరు. కైలాస శృంగము ఎక్కడో దూరాన లేదు. సాధకుని శిరోభాగములోనే యున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. మిత్రులారా!
  కైలాస పర్వతము ప్రస్తావనకు వచ్చినది కనుక దానికి సంబంధించిన ఒక శ్లోకము శివానందలహరి నుండి యుదహరించుచున్నాను.

  కదావా కైలాసే కనకమణి సౌధే సహ గణైః
  వసన్ శంభో రగ్రే స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుటః
  విభో సాంబ స్వామిన్ పరమ శివ పాహీతి నిగదన్
  విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః

  తాత్పర్యము:
  ఓ విభూ! స్వామీ! పరమశివా! ఎప్పుడు నీవు కైలాసములో కనక మణి సౌధములో ప్రమథ గణములతో సేవింపబడు చుండగా నీ ముందు జేరి శిరసున చేతులు జేర్చి జోడించి వందనము సల్పుచు రక్షింపు మని వేడుకొనుచు ఆనందముతో బ్రహ్మ కల్పములను కూడా క్షణము వలె గడుపగలనో కదా!
  స్వస్తి

  రిప్లయితొలగించండి
 10. అంబర చుంబిత నగమది
  శంభుని పావన నిలయము శాంభవి మెచ్చన్ !
  అంబుజ నాధుని చందము
  సంబరమున గాంచు నట్టి సౌరిక హిమమే !

  సౌరిక = స్వర్గము

  రిప్లయితొలగించండి
 11. కైలాసంబున స్వర్ణమందిరమునన్ గైమోడ్చి నీ ముందఱన్
  “శూలీ! పన్నగభూషణా! స్మరహరా! శోకంబులన్ బాపి నన్
  పాలింపంగను నీవె ది”క్కనుచు సంప్రార్థించుచున్ నిల్వగా
  సౌలభ్యం బెటు లబ్బునో? దొరకునా సాన్నిధ్యభాగ్యం బికన్.

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమాని వారూ,
  ‘అద్భుత మహీధరము’ను గురించిన మీ సీసపద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
  ఈరోజు శివానంద లహరిలోని మరొక శ్లోకాన్ని వివరించినందుకు ధన్యవాదాలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ‘స్వర్గపు మ్రాకు’గా చెప్పడం బాగుంది. మంచి పద్యం. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  ‘ఆది దంపుతుల పెండ్లి యైన దివ్యస్థానం’గా చెప్పిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  ‘ధవళాంగుని నివాసాన్ని’ వర్ణించిన మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  ‘మోక్షదంబైన కైలాస భూధరంబు’ను గురించిన మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  వేదాంత ధోరణిలో మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  అంబర చుంబిత హిమనగాన్ని గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. అయ్యా శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము ఒక మంచి అనువాదముగా భాసించుచున్నది. అభినందనలు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. గురువుగారు,
  మీ పద్యాలు రెండూ ఎంతో మనోహరంగా ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 15. పండిత నేమాని వారూ,
  లక్ష్మీదేవి గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి