4, నవంబర్ 2012, ఆదివారం

అభినందన సుమమాలిక

మిత్రులారా!
‘శంకరాభరణము’ అనే బ్లాగును నెలకొలిపి
నిత్య కార్య కలాపములతో విజయవంతముగా నిర్వహించుచున్న
సమర్థ సాహితీ వరివస్యాతత్పరులు
శ్రీ కంది శంకరయ్య  మహోదయులకు 
అభినందన సుమమాలికలు
సీ.
సంస్కృతాంధ్రాది భాషలలోన పాండిత్య
పటిమతో నెవ్వాడు వరలుచుండు
శంకరాభరణ సంజ్ఞాంచి తాంతర్జాల
వేది నెవ్వడు నడిపించుచుండు
సాహితీ ప్రియ ముఖ్య సరస ప్రక్రియలను
ప్రకటించు నెవ్వాడు ప్రతిదినమ్ము
ఔత్సాహికులయిన ఆంధ్ర పద్య కవిత్వ 
ప్రియుల నెవ్వా డాదరించు చుండు
తే.గీ.
నతడు శారదా మాతృ పాదార్చకుండు
సుకవి పండిత సౌహిత్య శోభితుండు
భద్రమతి సద్గుణానీక వైభవుండు
కందికుల శంకరయ్య ప్రజ్ఞాన్వితుండు.   
 కం.
ఆతనికి సుకవి పండిత
వ్రాతస్తుత సుగుణ శీల వైభవునకు నే
చేతోమోద మ్మలరెడు
రీతిన్ దీవెనల గూర్తు శ్రీరస్తనుచున్ 
 
 నేమాని రామజోగి సన్యాసి రావు

11 కామెంట్‌లు:

  1. శ్రీ నేమాని వారూ ! చక్కగా చెప్పారు.

    భోజుని చూచిన వారికి
    తేజముగా శ్లోక మందు తీరుగ నట్లే
    రోజూ "శంకర" బ్లాగును
    రాజా! మరి చూడ పద్య రాజము పలుకున్.

    రిప్లయితొలగించండి
  2. ఎట్టి పరిస్థితులెదురయినా ఎప్పుడూ భాషాసేవను విస్మరించని గురువుగారికి కృతజ్ఞతాంజలి.

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    అల్పుడను నేను. మీ వంటి పెద్దల సహకారం,. మిత్రుల భాగస్వామ్యంతో బ్లాగు నిర్వహణ నిరాటకంగా కొనసాగిస్తున్నాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. గురువుగారూ అల్పుడనని చెప్పుకోవడం మీ వినయాన్ని ప్రకటిస్తోంది. నేమాని వారి ప్రశంసకు మీరు పాత్రులు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ నేమాని పండితులవారి ప్రసంసలను అందుకున్న సోదరులు శ్రీ శంకరయ్యగారు ధన్యులు .నా వంటి అజ్ఞానికి , ఎంతో ఓర్పుతో జ్ఞాన బిక్ష పెడుతున్న గురువులు .పండితోత్తములు . సాహితీ కృషీ వలులు..గురు ముఖతా వారికి పాదాభి వందనములు సోదరులుగా హృదయ పూర్వక శుభాభి నందనలు ఇందలి పాండితీ స్రష్టల గురించి ఎంత చెప్పినా కొంత మిగులు తూనే ఉంటుంది. నాది ఒక చిన్న కలం .దానికి లేదంత బలం. కృత్జతలతో
    సె.......ల....వు ....మీ ....సో....దరి .

    రిప్లయితొలగించండి
  6. గురువు గారిపై అన్నయ్య గారి ప్రశంస శ్లాఘనీయము !

    రిప్లయితొలగించండి
  7. పలువురి మన్ననల్ గనిన పండిత సత్తమ! శంకరయ్య! నీ
    వలన ననేక సోదరులు పద్య కవిత్వము నభ్యసించుచున్
    నిలిచిరి నేడు సంఘమున స్నిగ్ధ రసాఢ్య కవిత్వ దీప్తితో
    సలలిత శంకారభరణ సద్గురు! నీకు శుభాభినందనల్

    రిప్లయితొలగించండి
  8. శ్రీ నేమాని వారి ప్రసంసలను అందుకున్న గురువర్యులు శ్రీ శంకరయ్యగారు ధన్యులు .మా వంటి అజ్ఞానులకు ,ఎంతో ఓర్పుతో జ్ఞాన బిక్ష పెడుతున్న పండితోత్తములు, సాహితీ కృషీ వలులు, వారికి పాదాభి వందనములు . శ్రీ నేమాని వారికి కృత్జతలతో

    వరప్రసాదు

    రిప్లయితొలగించండి
  9. నేమానివారు చక్కగా శలవిచ్చారు !
    వారు చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజం !

    శంకరార్యా !

    అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటే
    ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట !

    మీరే అల్పులైతే మా సంగతేమిటి ?
    భూగోళం ప్రక్కన ఆవగింజలం !

    రిప్లయితొలగించండి
  10. సహజ సద్గుణ సంపన్న శంకరార్య
    శంకరాభరణంబగు శంకరార్య.
    జ్ఞాన తేజో విలాసుండు శంకరార్య.
    సరస గీర్వాణి పుత్రుండు శంకరార్య.

    రిప్లయితొలగించండి