28, నవంబర్ 2012, బుధవారం

పద్య రచన - 174

ఎందరో మహానుభావులు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. ఎందరు నెందరో మహితు లెందరు నెందరొ కన్నుదోయికిన్
    విందొనరించు చుండిరిట వేల్పులు, విజ్ఞులు, సద్గురుల్, మహా
    నంద నిధాను లాదరమునన్ వినుతించుచు వారినెల్ల నే
    వందన మాచరింతును భవమ్మతి ధన్యమునై చెలంగగన్

    రిప్లయితొలగించండి
  2. ఒక్క చందమామ చక్కగా నింగిని
    వెలుగు, భూమి పైన వెలుగు నిచ్చు
    గురువరులును పెక్కు గుర్తించి మ్రొక్కుడు
    భరత భూమికున్న భాగ్య మిదియె.

    రిప్లయితొలగించండి
  3. నవవిధ భక్తులఁ దెల్సియు
    నవలీలగదైవమందునాశయమొందన్
    భువిఁ వెలసిన మహనీయులఁ
    జవ దాటక ననుసరించ జాడ్యములు విడున్!

    రిప్లయితొలగించండి
  4. వందనమందగా కదలి వచ్చితిరిచ్చటకింత భాగ్యమి
    ట్లందుకొనంగ నెక్కుడగు నచ్చెరువయ్యె, మహాత్ములార! మా
    యందర జూడుడీ, నుతుల నర్పణఁ జేయుచు నుంటిమెప్పుడున్.
    విందుల బోలు పద్యముల వెన్ననివేదనఁ బెట్టుచుంటిమే.

    రిప్లయితొలగించండి
  5. కొలువు దీరి రంత కోటి బ్రహ్మల వోలె
    జగతి మేలు కోరి జన్మ మెత్తి
    మహిని వెలసి నట్టి ,మహదేవులై వారు
    పూజ లందు కొనెడి పుణ్య ధనులు

    రిప్లయితొలగించండి

  6. హైందవ సంస్కృతిని మహా
    నందమున జగమ్మునందు వ్యాప్తి పఱచిరే
    యెందఱొ; మహానుభావుల
    కందఱకును వందనమ్ము లందును భక్తిన్.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మీ ఎందరో మహానుభావులలో ఒకచో యతిని నిరాదరించుట తగునా?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. ఆకాశంబున నుండి జారు యుదకమ్మయ్యబ్ధినిన్ జేరు న
    ట్లీ కల్యాణ గుణాఢ్యు లీసుజను లీ విజ్ఞుల్ మహా భావులీ
    లోకమ్మందలి సర్వ మానవులకున్ లోకేశునిన్ జేర సు-
    శ్లోకంబౌ పలు వేరు వేరు పథముల్ చూపించినా రొజ్జలై!

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారూ,
    ధన్యవాదములు.
    అత్యుత్సాహం, తొందరపాటు వలన జరిగిన పొరపాటు అది!
    ‘మహా/నందమున జగమ్మునందు నాటిన ఘనులే’ అని నా సవరణ.

    రిప్లయితొలగించండి
  10. ఇందరు మహానుభావుల నేవిధముల
    పొగడుదు నెటులఁ గొల్తును పుట్టిబుద్ధి
    నెరిగిన పిదప కాల మహిమన కర్మ
    విడచి కాసుల వెంటను బడితి నింక
    నాతని దరి జేర్చుమున న్మహాత్ములార!

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    ‘ఆనంద నిధాను’లైన మహానుభావులకు వందన మాచరించిన మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘భారత భాగ్య విధాత’లపై మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    నవవిధ భక్తులతో ‘మనోజాడ్యాన్ని’ పోగొట్టే గురువుల గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మహాత్ములకు మీ పద్యనివేదన బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    పుణ్యధనులను పూజించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    లోకేశుని చేరే పథాలను నిర్దేశించిన ఒజ్జలపై మీ పద్యం బాగుంది. అభినందనలు.
    పద్యాన్ని చూడగానే ‘ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండి శీతాద్రి...’ గుర్తుకు వచ్చింది.
    రెండవ పాదంలో యతి తప్పింది.
    *
    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి