26, నవంబర్ 2012, సోమవారం

సమస్యా పూరణం - 888 (కోతిని పట్టి కట్టుమని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కోతిని పట్టి కట్టుమని కోరెను శంకరునిన్ వినమ్రుడై.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

42 కామెంట్‌లు:

  1. కోతియె వచ్చి లంక కిట గూల్చెను వీరుల చెట్ల చూడనా
    కోతియె శంకరుండనుచు కొంచెము తట్టగ లేదు భృత్యులన్
    కోతిని పట్టి కట్టుమని కోరెను, శంకరునిన్ వినమ్రుడై
    రీతిగ గొల్చు రావణుడు రెచ్చుచు కాలము దాపురించగా.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. (శివానందలహరి ఆధారముగా)

    నా తరమా! మహేశ్వర! మనమ్మును నిల్పుట స్వేఛ్ఛ మీర నీ
    కోతి చరించు మోహమను కోనల జేరుచు కామ భూధరాల్
    ప్రీతి యటంచు నీ వెనుక భిక్షుక వృత్తికి తోడు గాగ నీ
    కోతిని పట్టి కట్టుమని కోరెను శంకరునిన్ వినమ్రుడై

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ,
    మనస్సనే కోతిని కట్టివేయుమని శంకరుని కోరడం.. దానికి మూలమైన శివానంద లహరి శ్లోకం గుర్తుకు తెచ్చుకున్న మీ ధారణా శక్తి, ఆ భావాన్ని సమర్థవంతంగా ఛందోబద్ధం చేసే ప్రావీణ్యత అబ్బురపాటుకు గురిచేస్తున్నవి. మీకు నా అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! ధన్యవాదములు
    శ్రీ నేమని వారు చక్కని పూరణ చేశారు.

    రిప్లయితొలగించండి
  6. ఈనాటి సమస్యకు ఆధారము శివానందలహరిలోని ఈ క్రింది శ్లోకము:

    సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
    నటత్యాశా శాఖా స్వటతి ఝడితి స్వైర మభితః
    కపాలిన్! భిక్షో! మే హృదయ కపి మత్యంత చపలం
    దృఢం భక్త్యా బద్ధ్వా శివ! భవదధీనం కురు విభో!

    తాత్పర్యము:
    ఓ శివా! కపాలీ! ఆదిభిక్షూ!
    నా మనస్సు అనే కోతి ఎల్లప్పుడు మోహమనే అడవిలో తిరుగుతూ, కామము అనే కొండలపై విహరిస్తూ, ఆశలనే కొమ్మలపై ఆడుతూ ఉంటుంది. అత్యంత చపలమైన ఈ కోతిని భక్తి అనే త్రాటితో గట్టిగా కట్టి నీ అధీనములొ నుంచుకొనుము.
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  7. సామాన్య ఉద్యోగి ఆవేదన:
    వేతన జీవనమ్ము మురిపెమ్ములుమీరెనుసతీసుతాళకిన్!
    మూతులఁగట్టివేయకడుపోర్చదునాకలిమంటలార్పకన్!
    చేతనెగాదుకోర్కెలనుశ్రేణులఁదీర్చగ,మానసమ్మ నీ
    కోతినిపట్టికట్టుమనికోరెనుశంకరునిన్ వినమ్రుడై!

    రిప్లయితొలగించండి
  8. మొదటిపాద సవరణ: (టైపాటు)
    వేతనజీవనమ్ము !మురిపెమ్ములు మీరె సతీసుతాళికిన్!

    రిప్లయితొలగించండి
  9. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మీ ప్రశంసలకు సంతోషము. "సమర్థవంతము" అని మీరు వాడేరు. ఇది బాగుగనే యున్నది. అందరూ అటులనే వాడుచుందురు. మా గురువు గారు ఒకపరి చేసిన సూచన: సమర్థవంతము అన నక్కరలేదు -- సమర్థము అంటేనే సరిపోతుంది అని. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. హనుమచ్ఛాస్త్రి గారూ గురువుగారన్నట్లు మీ పద్యం అద్భుతంగా ఉంది.

    నేమాని పండితార్యా ! మీ పూరణ అతి మనోహరం! అనుపమానం!

    రిప్లయితొలగించండి
  11. ధాత విశాల ఫాలమున దాసుడు గమ్మని నెమ్మి వ్రాయగా
    నాతియు పుత్ర విత్తముల నైహిక వాంఛల బుధ్ధి నిత్యమున్
    బ్రీతి జరింప భక్తుడును బ్రేరణ లోబడి గెంతులేయు నా
    కోతిని పట్టి కట్టుమని కోరెను శంకరునిన్ వినమ్రుడై

    రిప్లయితొలగించండి
  12. ఘాతుక చర్యలన్ బ్రతుకు గాడిని దప్పెనటంచు భక్తుడా
    శీతనగాత్మజా పతిని చేతులు మోడ్చుచు వేడెనిట్లు- "నా
    పాతకమింతయున్ దరుగ భాగ్యము లేదొకొ?మానసమ్ము, నీ
    కోతిని పట్టి కట్టు"మని కోరెను శంకరునిన్ వినమ్రుడై.

    రిప్లయితొలగించండి
  13. మిత్రుల పూరణ లద్భుతము. అన్నయ్య గారి పూరణ అనన్యము !

    రిప్లయితొలగించండి
  14. నేమాని పండితార్యుని వెనుక............


    నే తిరుగాడు చుంటి గద నిత్యము దీనుడనై భవాటవిన్
    చేతము గెంతుచుండెడిని చివ్వున మోహపు చెట్టు కొమ్మలన్
    చూతువె నీ విభూతి చవి చూపి భవత్పద సీమ చిత్తమన్
    కోతిని పట్టి కట్టుమని కోరెను శంకరునిన్ వినమ్రుడై.

    రిప్లయితొలగించండి
  15. సమస్య పాదంలో "...కోరెను..." అని అన్యపురుష వాచకంలో (third person)ఉంది. కొందరు ప్రథమ పురుషలో మొదలుపెట్టి పూరించినపుడు, అన్వయ లోపం జరుగవచ్చునేమో.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా శ్రీ చంద్రశేఖర్ గారూ!శుభాశీస్సులు.
    అన్వయము మన చేతిలో నున్నది. ఒక భక్తుడు అలాగ కోరెను అని అన్వయించుకొంటే సరిపోతుంది. స్వస్తి.

    మిత్రులారా!
    ప్రశంసలను గుప్పించిన మీ అందరికీ శుభాశీస్సులు. ఇంతకీ సమస్యను ఇచ్చినది ఒక శంకరుడు, శివానందరి లహరి వ్రాసినది మరొక శంకరుడు కదా, వారికే చెందుతాయి ఈ ప్రశంసలు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  17. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘సమర్థవంతము’ శబ్దప్రయోగ విషయమై మీ సూచన శిరోధార్యం. ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీరు బుద్ధి అనే కోతిని పట్టుకున్నారు. బాగుంది పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    అయ్యా,
    ఈనాటి సమస్య నిచ్చింది ‘శంకరుడు’ కాదు. దానిని మిస్సన్న గారు పంపించారు.

    రిప్లయితొలగించండి
  18. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఒక పెంపుడు కోతికి జబ్బు చేసినప్పుడు :

    01)
    _________________________________________

    కోతిని బెంచు చుండె నొక - కోమలి , శంకర పత్ని, ప్రేమ నా
    కోతికి జబ్బు చేయ నొక - కోతుల వైద్యుని జేరె భర్తతో !
    కోతికి మందు పట్టుటకు - కోతుల వైద్యుని వీలు గాక యా
    కోతిని పట్టి కట్టుమని - కోరెను శంకరునిన్ వినమ్రుడై !
    _________________________________________
    కోతులవైద్యుడు = పశువైద్యుడే (గాని కోతుల చికిత్సా నిపుణుడు )

    రిప్లయితొలగించండి
  19. కోతిని బోలునట్టి మది కోరదు యీశ్వర పాదపద్మముల్
    భూతము వోలె దిర్గునది పోవును పోకడ లెన్నియో గదా !
    కాతర భక్తుడొక్కరుడు కావున బ్రోవుము నన్ను యంచు నా
    కోతిని పట్టి కట్టుమని కోరెను శంకరునిన్ వినమ్రుడై

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యము బాగున్నది - అభినందనలు. చిన్న సవరణలు 2 చేయవలెను.
    1. 1వ పాదములో :కోరదు + ఈశ్వర - అనే చోట యడాగమము చేయకూడదు. అందుచేత కోరదు శంకర అని మార్చాలి.
    2. 3వ పాదములో: నన్ను + అంచు - అనే చోట యడాగమము రాదు -- నన్ను నంచు లేక నన్నటంచు అని మార్చితే బాగుంటుంది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. వైరాగ్యముతోనొక భక్తుడు :

    02)
    _________________________________________

    కోతుల రీతి గెంతునిదె - కోమలి మోహ వికారమున్బడీ
    కూతల కంతులేదు ! నిను - గోరెద , భిక్షుక ! నన్నుగావగా !
    కీతుడనయ్య , దీని యెడ - కింకిరి జెందితి ! యిమ్మనమ్మనే
    కోతిని పట్టి కట్టుమని - కోరెను శంకరునిన్ వినమ్రుడై !
    _________________________________________
    కూతలు = (కోరికలనే ) అరుపులు
    కీత = అల్పము(కీతుడను = అల్పుడను)
    కింకిరి = ఏహ్యము

    రిప్లయితొలగించండి
  22. గురువర్యా ! మీ సూచనకు ధన్యవాదములు.

    కోతిని బోలునట్టి మది కోరదు శంకర పాదపద్మముల్
    భూతము వోలె దిర్గునది పోవును పోకడ లెన్నియో గదా !
    కాతర భక్తుడొక్కరుడు కావున బ్రోవుము నన్నటంచు నా
    కోతిని పట్టి కట్టుమని కోరెను శంకరునిన్ వినమ్రుడై



    రిప్లయితొలగించండి
  23. రాతిని నాతిగా మలచ రాముని మ్రొక్కె నహల్య వోలె నన్
    ఖాతరు జేయకుండ దిరుగాడెడు మానసమున్ మధించి నీ
    చేతన మందునన్ నిలిపి శ్రీకరమైన పదాబ్జ మందు యీ
    కోతిని బట్టి కట్టుమని కోరెను శంకరునిన్ వినమ్రు డై

    గురువులు క్షమించాలి ఎన్ని తప్పులున్నాయొ !

    రిప్లయితొలగించండి
  24. ఆతత భక్తి బూనిక శివాలయమేగిన భక్తుడొండు సం
    ప్రీతిగ శూలి గొల్చి పలు రీతుల సంస్తుతి సల్పి యీశ్వరా!
    పాతరలాడు నా మనసు వానరమై విషయేచ్ఛలందు నీ
    కోతిని పట్టి కట్టుమని కోరెను శంకరునిన్ వినమ్రుడై.

    రిప్లయితొలగించండి
  25. మంచి పూరణలు , ఆలశ్యం గా చూశాను . అందరికీ అభినందనలు . అదే భావపు ప్రేరణతో - మొన్నామధ్య కంచి లో స్వామివారికి విన్నవించిన నా పద్యమొకటి .

    అటమట జెంది సంసృతి మహాటవిలో దిరుగాడి , దోష సం
    పుటినొకదాని మోసికొని పుట్టకు జెట్టుకు బర్వులెత్తు మ
    ర్కటమిది నా మనస్సు , యతిరాట్ ! దయ పావన ధర్మదండమున్
    దిటవుగ నెత్తి దీని గరుణించి మరల్చవె సత్పథంబునన్ !

    రిప్లయితొలగించండి
  26. డా. విష్ణు నందనుల వారి పద్యాలద్భుతము.చాలా బాగున్నాయి.

    కిశోర్ జీ మీ పద్యానికి కోతి చికిత్స ( ఒకప్పుడు కోత వైద్యుడిని )

    కోతిని బెంచు చుండె నొక - కోమలి , శంకర పత్ని, ప్రేమ నా
    కోతికి జబ్బు చేయ నొక - కోతల వైద్యుని జేరె భర్తతో !
    కోతిని పట్టి కోయుటకు - కోతల వైద్యుని వీలు గాక యా
    కోతిని పట్టి కట్టుమని - కోరెను శంకరునిన్ వినమ్రుడై !

    రిప్లయితొలగించండి
  27. వసంత కిోర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    ‘కోతల వైద్యుని’ వ్యాఖ్య చూసారా?
    రెండవ పూరణలో ‘వికారమున్బడీ’ అన్నదానిని ‘వికారమందుటన్’ అందామా?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    నేమాని వారి సూచనలను గమనించారు కదా!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఖాతరు’ అని హిందీ పదాన్ని ప్రయోగించారు.
    *
    డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ, దాని వెన్నంటి ప్రస్తావించిన మీ పద్యం ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. డా.విష్ణునందనుల వారి పద్యం మనసుకి హత్తుకొనేట్లున్నది. "పాతరలాడు నా మనసు వానరమై..." ఆహా!

    రిప్లయితొలగించండి
  29. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
    నటత్యాశా శాఖా స్వటతి ఝడితి స్వైర మభితః
    కపాలిన్! భిక్షో! మే హృదయ కపి మత్యంత చపలం
    దృఢం భక్త్యా బద్ధ్వా శివ! భవదధీనం కురు విభో!


    ఆంధ్ర శివానందలహరి నుండి (కవిపేరు తెలియ రాలేదు):
    తిరుగు మోహాట వింబడి తీఁగె బో౦డ్ల
    కుచ గిరుల నాడు కోర్కులన్ కొమ్మలందు
    స్వేచ్ఛఁ జెరలాడు నామతి చెడ్డ కోఁతి
    భక్తిచేఁ గట్టి స్వాధీన పఱచి కొనుము
    పునుక దాలుప! భిక్షుకా! భువన జనక!

    రిప్లయితొలగించండి
  30. మూర్తిసత్తమా !
    మీ కోతవైద్యుని కోతి చికిత్స అద్భుతం !
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  31. విష్ణునందనా ! సుందరా !
    చాలా కాలాని కానందం కలిగించారు మీ పూరణలతో !

    రిప్లయితొలగించండి
  32. శంకరార్యా ! ధన్యవాదములు !

    నా ఉద్దేశం ఏమంటే

    వికారమున్+పడి +ఈ+కూతల

    ........................ కోమలి మోహ వికారమున్బడీ
    కూతల కంతులేదు

    కోమలి మోహ వికారమున పడినప్పుడు చెలరేగే
    ఈ కూతలకు(మనసు అరిచే అరుపులు = కోరికలు) అంతులేదని !

    రిప్లయితొలగించండి
  33. వసంత కిశోర్ గారూ,
    మీ ఉద్దేశ్యం అర్థమయింది. కానీ ‘క్త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు’ అని కదా సూత్రం. అందువల్ల ‘పడి + ఈ’ అన్నప్పుడు సంధి జరుగక ‘పడి యీ’ అని యడాగమం వస్తుంది. అందువల్లనే ఆ సవరణను సూచించాను.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. విష్ణునందన్ గారూ చాలా కాలానికి కనుపించి చాలా మంచి పద్యాలను చెప్పారు.

    మిత్రులందరి పద్యాలూ మనోఙ్ఞంగా ఉన్నాయి.
    చంద్ర శేఖరులు ప్రకటించిన అనువాద పద్యం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  35. శ్రీ చంద్రశేఖర్ గారు సూచించిన అనువాద పద్యము బాగుగనే యున్నది. అందులో చిన్న సందేహము. తీగె బోండ్ల కుచ గిరుల అనుట సమర్థనీయమా? తీగెవంటి సన్నని మేను కల చిన్నదానికి గిరులవంటి వక్షోజములను ఊహించగలమా? మూలములో లతాంగి అని వాడలేదు శంకరాచార్యుల వారు -- యువతీనాం అని వాడేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  36. పండిత నేమానిగారి సందేహం చూచి దీనిని వ్రాయాలనిపించింది. వారి సందేహం తీగెబోండ్లకు కుచగిరులుంటాయా అని. ఆవిధంగా చెప్పాలనుకుంటే తీగెబోండ్లకే కాదు వేరే ఏ విధమైన అమ్మాయిలకు కూడ కుచగిరులుండవు . వస్తుతః మన సాంప్రదాయిక కవిత్వంలో అంగాంగ వర్ణనమనేది ఆలంకారిక ప్రధానమైనదే కాని - అది ఇంత ఉంటే ఇది ఇంత ఉండాలనే కొలతలను బట్టి కాదు . అసలు 'కుచ గిరులుండాలంటే' ఆ అమ్మాయి ఎంత ఒడ్డూ పొడవూ ఉంటే వీలవుతుంది ? అదసలు సాధ్యమేనా? ఇక్కడ "గిరులకు" పర్వతాలు అనే వాచ్యార్థం కాకుండా , "ఉన్నతమైనవి" అనే వ్యంగ్యార్థం మాత్రమే వస్తుంది .అదే నిజమైన పద్ధతి . అసలే "అస్తి నాస్తి విచికిత్సా హేతు శాతోదరులు" ఉన్న కవిత్వం మనది. అంత చిన్న పద్యంలో అంత భావాన్ని ఇమిడ్చిన ఆ కవి ప్రశంసనీయుడు.

    రిప్లయితొలగించండి
  37. ఇంకొక విషయం కూడా విన్నవించాలి. తీగెబోడి అంటే విద్యార్థి కల్పతరువు ప్రకారమైనా , పండిత వ్యవహారమైనా స్త్రీ కి పర్యాయపదమే కాని , లతాంగికి మక్కికి మక్కి తెలుగు కాదు .చిగురాకుబోడి , అలరుబోడి , తలిరుబోడి కూడా అటువంటివే.

    రిప్లయితొలగించండి
  38. ఘాతుక శబ్దజాలముల ఘైయని పేర్చుచు విఱ్ఱవీగగన్
    భ్రాతల శంకరాభరణ ప్రాంగణ మందున చేరి కుల్కెడిన్
    నూతన హాస్య పూరణల నొల్లక నొవ్వెడి బుద్ధిశాలి యా
    కోతిని పట్టి కట్టుమని కోరెను శంకరునిన్ వినమ్రుడై😊

    రిప్లయితొలగించండి