28, నవంబర్ 2012, బుధవారం

సమస్యా పూరణం - 890 (తలఁ దలంచి మిగుల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తలఁ దలంచి మిగులఁ గలత నొందె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

35 కామెంట్‌లు:


  1. పదవి కొఱకు పెక్కు వాగ్దానములఁ జేసి
    ప్రజల బాగు మఱచు స్వార్థపరుల
    నే మనంగలేక సామాన్యుఁ డొకఁడు నే
    తలఁ దలంచి మిగులఁ గలత నొందె.

    రిప్లయితొలగించండి
  2. తలల నాలుకలగు ధరణిదేవతలైన
    వనిత లెల్ల మిగుల బాధ పడుచు
    కుములుచుండి రిలను. గోపాలుడీ వని
    తలఁ దలంచి మిగులఁ గలత నొందె.

    రిప్లయితొలగించండి
  3. శుభోదయము. ఈ నాటి సమస్యకు పూరణను ఇద్దరు మహానుభావులు ప్రారంభించేరు. మన బ్లాగు నేత ప్రజా నేతలను ఉట్టంకించేరు; శ్రీ రామకృష్ణ రావు గారు గోపాలుని వనితలను మురిపింపచేసేరు. పూరణలు బాగుగనున్నవి. అభినందనలు. swasti

    రిప్లయితొలగించండి

  4. బడికిఁ బోయెద నని వాగు వంకల వెంటఁ
    దిరిగినట్టి సుతుఁడు తిరిగి యిల్లుఁ
    జేరఁ దండ్రి యొసఁగు చింతబెత్తంపు వా
    తలఁ దలంచి మిగులఁ గలత నొందె.

    రిప్లయితొలగించండి
  5. పెండ్లి వయసు వచ్చె పెద్ద వాడేం కాదు
    కన్నె లేమొ ప్రేమ కనగ రారు
    సిగ్గు బడుచు తాను ముగ్గు బుట్టను బోలు
    తలఁ దలంచి మిగులఁ గలత నొందె.

    రిప్లయితొలగించండి
  6. రామచంద్రుడు మును రాజ్యంబు వీడుచు
    నడవులన్ జరించి యిడుముల బడె
    ననుచు ధర్మ రాజు వినినంత నలువ వ్రా
    తల దలంచి మిగుల గలత నొందె

    రిప్లయితొలగించండి
  7. ఆహా! ఈ రోజు బ్లాగునకు నిజముగా పున్నమి.. ముగ్గురు గురువులు వరుసగా పూరణలు చేయటం..నే'తల '..చింతబెత్తపు వా'తల ' ..వని 'తల ' ..నలువ వ్రా'తల ' తో పూరణలు రసభరితముగా నున్నవి. ( మధ్యలో నేను " తల " పెట్టాను..పట్టించుకోవద్దని మనవి..)

    రిప్లయితొలగించండి
  8. కనులు కనులు కలిపి కలలందు తేలించి
    మనసు మనసు తోన మమత పెంచి
    మాయ జేసి మదిని గాయపరచు వని
    తలఁ దలంచి మిగులఁ గలత నొందె !

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారి స్ఫూర్తితో.....

    కృష్ణశాస్త్రిఁ బోలు గిరజాల జుట్టున్న
    వాఁ డటంచు వనిత వలచి చేరె,
    ‘విగ్గు’ తొలఁగిపోయె వెలువడ్డ యా బట్ట
    తలఁ దలంచి మిగులఁ గలత నొందె !

    రిప్లయితొలగించండి

  10. తండ్రిలేని పిల్ల తరుణవయస్కయౌ
    కన్య పెండ్లిసేయఁగా ధనమును
    గూర్చలే మటంచు గొణగుచున్నట్టి భ్రా
    తలఁ దలంచి మిగులఁ గలత నొందె !

    రిప్లయితొలగించండి
  11. అశ్వ మేధ యాగ మాచరించగ నెంచి
    రాముడందె నేమొ రమణి నంచు
    ధర్మ మూర్తి గూర్చి తప్పుగా సీతమ్మ
    తలఁ దలంచి మిగులఁ గలత నొందె!

    రిప్లయితొలగించండి


  12. భావపుష్టి గలుగ భాష నేర్పున బల్కి
    పద్య రీతు లందు పాడు కవియు
    వెఱ్ఱి జనులు పల్కు వెగటగు క్రొత్త కై
    తల దలంచి మిగుల గలత నొందె !

    రిప్లయితొలగించండి
  13. మాస్టారు గారు..ఇప్పటకి నాలుగు "తల"ల వారైనారు.(గురు బ్రహ్మ)

    రాజేశ్వరి గారి మాయ వని'తల' ఆలోచన బాగుంది.
    సహదేవుడు గారూ... మీ "తల"పు వైరుధ్యముగా నున్నది.
    మూర్తి గారూ..పాడు కవి 'పాడు' కై 'తల' పూరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  14. హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    ‘శంకరుడు’ పంచముఖుడు గదా! అందుకని మరొకటి....

    భావి భరత పౌరులా వీ రటంచుఁ గొం
    గ్రొత్త పోకడలను గోరి నడచు
    వింతలను గని గురువు విద్యార్థి గణపు చే
    తలఁ దలంచి మిగులఁ గలత నొందె!

    రిప్లయితొలగించండి
  15. పాపం నా తెల్లజాతి మిత్రుడొకడు అత్తపోరు గురించి వాపోయిన సంఘటన (పైగా ఇద్దరత్తలు వాడికి-ఒకటి మాజీ, రెండోది ప్రస్తుతం) గుర్తుకొచ్చి:

    అత్త పోరు యనగ యల్లునకుచిరాకు
    తెల్ల వారి యిండ్ల తేట తెల్ల
    మది తెలియక మిత్రు నడగంగ నాతడ
    త్తలఁ దలంచి మిగులఁ గలత నొందె.

    రిప్లయితొలగించండి
  16. హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘ముగ్గుబుట్టవంటి’ నా తలను చూసి కాదుకదా మీ పూరణ..!
    చమత్కారభరితమై అలరించింది. అభినందనలు.
    ‘ఏం కాదు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘పెద్దవాడా కాదు’ అంటే సరి!
    *
    చంద్రశేఖర్ గారూ,
    హాస్యోక్తితో వైవిధ్యంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘పోరు + అనగ + అల్లునకు’ అన్నప్పుడు యడాగమాలు రావు. ‘పోరనంగ నల్లునకు’ అందాం.

    రిప్లయితొలగించండి
  17. శక్తి, భక్తి తోడ సరిహద్దు గాచెడు
    సైన్యగణమదొక్క శ్రాంతవేళ
    తమను జూడలేక తల్లడిల్లు తమ మా
    తలఁ దలంచి మిగులఁ గలత నొందె.

    రిప్లయితొలగించండి
  18. గురువు గారి అన్ని పూరణలూ, పెద్దల , మిత్రుల పూరణలన్నీ విభిన్నంగా బాగున్నాయి.
    చంద్రశేఖర్ గారు,
    తరం మారిందేమో అని నన్ను వెనుకటి తరానికి నెట్టేస్తున్నారు.:))
    తరాలతో సంబంధం లేకుండా మీరు చెప్పిన వాళ్ళూ మేం (అక్కయ్యగారు, నేను) చెప్పినవాళ్ళూ కూడా ఎప్పుడూ ఉంటూనే ఉన్నారులెండి.

    రిప్లయితొలగించండి


  19. కోట్ల కోట్ల కుంభకోణములను గని
    భరత దేశ ప్రజల బ్రతుకు గాంచి
    భరత మాత నేర చరిత, దుర్నీతి నే
    తల దలంచి మిగుల గలత జెందె .

    రిప్లయితొలగించండి


  20. కోట్ల కోట్ల కుంభకోణములను గని
    భరత దేశ ప్రజల బ్రతుకు గాంచి
    భరత మాత నేర చరిత, దుర్నీతి నే
    తల దలంచి మిగుల గలత జెందె .

    రిప్లయితొలగించండి
  21. శ్రీ శంకరుని పంచమ ముఖమునుండి చిన్న అపశ్రుతి వినవచ్చినది. 3వ పాదములో ఒక లఘువు ఎక్కువ అయినది. "ను" ను తొలగించితే సరిపోతున్నది. టైపు పొరపాటే కావచ్చు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. నేమాని వారూ,
    క్షమించండి..
    అది టైపు పొరపాటు కాదు. నావల్లనే తప్పు జరిగింది.
    ‘వింతలఁ గని గురువు విద్యార్థి గణపు చే/తల...’
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. Bhanu taapamunaku pasime chedena poola
    thala dalamchi megula kalatha chemde
    tholakari chinukulatho palukarimchu vneela
    jalaDharamula kidiye jayamu jayamu

    రిప్లయితొలగించండి

  24. భాను తాపమునకు పసిమి చెడిన పూ ల
    తల దలంచి మిగుల కలత చెందె
    తొలకరి చినుకులతొ పలుకరించు వినీల
    జలధరముల కిదియె జయము జయము.

    రిప్లయితొలగించండి
  25. కురియు వృష్టిని గని గోపబాలుండు వ్రే
    తల దలంచి మిగుల కలత నొందె
    గొల్లపల్లె నరయ గోవర్ధన మనెడు
    పర్వతమ్ము నెత్తె పసుల గాచె

    రిప్లయితొలగించండి
  26. చింతా రామకృష్ణారావు గారూ,
    గోపాలుని వనితల గురించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    చమత్కారభరితమై అలరించింది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    రామాయణం నుండి భారతంలోకి దించి విధివ్రాతలపై మనోజ్ఞమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ఇదేదో పురుషుడు చేసిన పూరణలాగా ఉంది. :-)
    చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    వింత వింత ‘వాదాల’ పేర అర్థం కాని/లేని కవితల గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    హాస్యోక్తితో వైవిధ్యంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    తల్లులకు దూరమైన సైనికుల వేదనతో ఆర్ద్రంగా ఉంది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘చరిత’ తరువాత కామా పెట్టటంతో ‘భరతమాత నేర చరిత’ అవుతున్నది. కామా తొలగిస్తే అపార్థం తొలగిపోతుంది.
    *
    అజ్ఞాత గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు.

    రిప్లయితొలగించండి
  27. మంది మార్బలములు మంత్రుల పొత్తులు
    గలిగినట్టి తనకు గెలుపు లెస్స
    యనెడు నేత కొంప లంటుకొనె నను వా
    ర్తల దలంచి మిగుల గలత నొందె

    రిప్లయితొలగించండి
  28. శ్రీ శంకరయ్య గారి శంకరాభరణ రాగములో ఎన్ని స్వరములు పలికించుతారో అనుకుంటే 5 స్వరములే వినబడినవి.
    1. వాగ్దానముల మరచిన నేతలు
    2. చెడు దారి బట్టిన కుర్రవానికి తండ్రి వాతలు
    3. అందగాడనుకొనిన ప్రియుని బట్టతల సొగసు
    4. ఈడొచ్చిన కన్యకు నిస్సహాయులైన భ్రాతలు
    5. క్రొత్త పోకడల విద్యార్థి చేతలు
    భలా! భలా!
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  29. కర్షకుం డొకండు కష్టించి పొలమును
    దున్ని వేసె నారు తొలిచినుకుల
    పైరు పండె గాని వానలే గురియ కో
    తల దలంచి మిగుల కలత నొందె

    రిప్లయితొలగించండి
  30. పండిత నేమాని సన్యాసిరావుగారూ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  31. రోగికిక యమపురి కేగు కాలము వచ్చి
    నదని వైద్యుడొకడు బెదర గొట్టె
    ఱోల బంధువు లట నా రోగియె యమ దూ
    తల దలంచి మిగుల కలత నొందె

    రిప్లయితొలగించండి
  32. ఓ కోడలి ఆవేదన:
    పండు గైన పిదప పతివచ్చి గొంపోవు
    నత్త మాట జూడ నారడేను
    యింటి పోరు కంత మెపుడని యింతి చిం
    తలఁ దలంచి మిగులఁ గలత నొందె!

    రిప్లయితొలగించండి
  33. కన్య యొకతె క్రొత్త కాలేజిలో జేరె
    చదువు కొనగ; కాని బెదర నచటి
    కుర్రకారు వెనుక కూసిన వెఱ్ఱి కూ
    తల దలంచి మిగుల కలత నొందె

    రిప్లయితొలగించండి
  34. జీత మందిన రోజున నేత లనుచు
    మెదటి వారము పైకము మోజు తీర
    మిగులు దినములు గడవక దిగులు పడివె
    తలను దలంచి మిగుల గలత నొందె !

    రిప్లయితొలగించండి
  35. ఏ దనర్హ మయ్య మేదిని నేతలు
    మేయ? గనులు, పసులమేత, నేల,
    నింగి, నీరు, నిప్పు! రంగడు వారి మే-
    తల దలంచి మిగుల కలత నొందె.







    రిప్లయితొలగించండి